నవగ్రహాల పట్టాభిషేకం రెండవ భాగము
నవరత్నాల అద్భుత కాంతులతో అందరికీ నేత్రపర్వం చేసిన త్రినేత్రుడిని విష్ణువూ , బ్రహ్మా తమ చూపులతో ప్రశంసించారు. తమ సింహాసనం చుట్టూ వర్షించి , రకరకాల రంగుల వెలుగుల్ని చిమ్ముతున్న నవరత్నాల రాసుల మధ్య నవగ్రహాలు వెలిగి పోతున్నారు.
“శ్రీహరీ ! నవగ్రహబృందానికి నాయకుణ్ణి నిర్ణయించండి !” పరమశివుడు విష్ణువుతో అన్నాడు. “ఒకరికి మించి సభ్యులున్నప్పుడు నాయకుడు ఉండాలి !”
మహావిష్ణువు సాభిప్రాయంగా తలపంకించాడు. “పరమశివుని సూచన ప్రకారం నవగ్రహాలకు అధిపతిగా ”గ్రహరాజు” పదవిని సంకల్పించాను. ఆ ఉన్నత పదవిని అధిష్టించే గ్రహదేవతను ఈ సుముహూర్తంలో నిర్ణయిస్తున్నాను…” విష్ణువు నవగ్రహాలను చూస్తూ అన్నాడు.
నవగ్రహదేవతలు ఆసక్తిగా చూశారు. రాహువూ , కేతువూ తలలు వాల్చి , చెవులు రిక్కించారు.
శ్రీమహావిష్ణువు కంఠం మేఘగర్జనలా ధ్వనించింది. “నవగ్రహాల మీద ఆధిపత్యం కలిగి ఉండే గ్రహరాజుగా సూర్యుణ్ణి నియమిస్తున్నాను !”
సభలో ఉన్న వారి కరతాళ ధ్వనుల మధ్య సూర్యుడు లేచి త్రిమూర్తులకు నమస్కరించాడు. ఎనిమిది మంది గ్రహ దేవతలలో రాహువూ , కేతువూ తప్పించి , మిగిలిన ఆరుగురూ ఆనందోత్సాహాలతో హర్షధ్వానాలు చేస్తున్నారు.
“గ్రహరాజు సూర్యుడికి జయోస్తు !” చంద్రుడు గొంతెత్తి అన్నాడు.
“విజయోస్తు ! జయోస్తు ! విజయోస్తు !” సహస్రాధిక కంఠాల ధ్వనులు ! అంతరాళంలో సుళ్ళు తిరిగాయి.
రాహువు , కేతువూ ఆ నినాదాలను వినలేకపోతున్నట్టు చెవులు మూసుకున్నారు.
“ఆపండి !” తన ఆసనం మీద నుండి లేచి , త్రిమూర్తుల ముందుకు నడుస్తూ , బిగ్గరగా అరిచాడు రాహువు. “ఆపండి , మీ హర్షధ్వానాలు !”
ఆగ్రహంతో ఊగిపోతూ వేదికను సమీపిస్తున్న రాహువు వెంట నిప్పులు కక్కుతూ నడుస్తున్నాడు కేతువు.
“రాహూ ! ఏమిటిది ? నీ ప్రవర్తనకు అర్థముందా ?” పరమేశ్వరుడు ప్రశ్నించాడు.
“ఎందుకు లేదు , పరమేశ్వరా ? ఉంది !” రాహువు ఆగ్రహంతో అన్నాడు. “నా ప్రవర్తన విష్ణువు పక్షపాత బుద్ధిని వెల్లడిచేస్తోంది.”
“రాహూ…” విష్ణువు ఆశ్చర్యంగా అన్నాడు.
“నటించకు విష్ణూ ! సూర్యుడు నీ అంశతో జన్మించాడనేగా నువ్వు అతగాడిని గ్రహరాజుగా పేర్కొన్నావు ?”
“అది నీ అపోహ , రాహూ !” బ్రహ్మ కల్పించుకుంటూ అన్నాడు. “గ్రహరాజు పదవికి ప్రాతిపదిక – శక్తీ , సామర్థ్యం ; పక్షపాతం కాదు !”
కేతువు బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వులో హేళన ధ్వనించింది. “ఆ విష్ణువు మీ తండ్రి ! తండ్రిని తనయుడు సమర్ధించడంలో ఆశ్చర్యం ఏముంది ?”
“అదితి పెద్దమ్మ గర్భాన పుట్టి ఉంటే మాకు ఈ అన్యాయాలు జరిగేవి కావు !” రాహువు కసిగా అన్నాడు.
రాహుకేతువుల ధిక్కార ధోరణి సభలో కలకలం సృష్టించింది. శ్రీమహావిష్ణువు లేచి నిలబడి , చెయ్యెత్తి కలకలాన్ని నియంత్రించాడు.
“రాహూ ! నీ ఆరోపణ అర్థరహితం. సకల లోక హితాన్ని కాంక్షించే అనురక్తినీ , కారకశక్తినీ పరిగణనలోనికి తీసుకుని సూర్యుడిని గ్రహరాజుగా నిర్ణయించాను. సూర్యుడు మీ గ్రహ దేవతలకు కేంద్ర శక్తి. సకల ప్రాణులకూ ఆహారాన్ని సమకూర్చే ‘ఆహారదాన ”శక్తి, ప్రాణశక్తి” ఆ సూర్యుడు !”
“ఈ రాహుకేతువులు కూడా శక్తి సంపన్నులే , శ్రీహరీ !” కేతువు ఆగ్రహంతో కల్పించుకున్నాడు. “సూర్య చంద్రులతో సమానమైన శక్తి సామర్థ్యాలను , స్థానమానాలనూ పరమేశ్వరులు ప్రసాదించారు మాకు !”
“కేతూ !”శివుడు పైకి లేస్తూ అన్నాడు. “మీ శక్తి సామర్థ్యాలనూ , స్థానాన్నీ మీరే కించపరుచుకుంటున్నారు ! ప్రాణుల దృష్టిలో , మా దృష్టిలో మీరందరూ సమాన దైవస్వరూపాలే , సుమా !”
“అది మీ మాట ! మీ మాటను అధఃకరిస్తూ , సూర్యుడికి పెద్దపీట వేస్తున్నాడు విష్ణువు !” కేతువు హుంకరించాడు.
“శ్రీహరి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ; నిరాకరిస్తున్నాను ! సూర్యుడిని మా రాజుగా అంగీకరించను. అతగాడే గ్రహరాజుగా వెలిగిపోవాలని మీరనుకుంటే – అతడి శక్తిని నిరూపించండి ! లేదా మా శక్తి హీనతను నిరూపించండి !”రాహువు సగర్వంగా అన్నాడు.
“రాహు సోదరుడి ప్రతిపాదన నాకు సమ్మతమే !” కేతువు గర్వంగా అన్నాడు. “నిరూపించండి సూర్యుడి ప్రతాపాన్ని !”
“నిరూపించండి ! మా ధాటికి బెదిరిపోయి , అంగవికలుడైన అనూరుడిని తన ముందు కవచంలా ఉంచుకుని , అతగాడి చాటున నక్కిదాక్కున్న సూర్యుడి మహాశక్తిని ఇప్పుడే ఇక్కడే నిరూపించండి !” రాహువు వికటంగా నవ్వాడు.
“సూర్యుడు ఆహార దాన శక్తి ! ప్రాణ దాన శక్తి ! అహ్హహ్హ ! ఆ మాత్రం శక్తి మాకూ ఉంది ! ఆహార శక్తిని కబళించే శక్తి మాది ! అహ్హహ్హ” కేతువు ఎగతాళిగా నవ్వసాగాడు. రాహువు అతడితో శృతి కలిపాడు.
రాహుకేతువుల అహంకార ప్రవర్తన కశ్యప ప్రజాపతి మనస్సును కలచివేసింది. ఆ ఇద్దర్నీ వారించే ప్రయత్నంలో ఆయన కూర్చున్న చోటు నుండి లేవబోయాడు. అదితి తన చేతితో ఆయన చేతిని నొక్కుతూ వారించింది.
“రాహూ ! నీ ప్రతిపాదన మాకు అంగీకారమే !” శ్రీమహావిష్ణువు రాహువునే చూస్తూ అన్నాడు.
“అది ప్రతిపాదన కాదు , విష్ణూ ! పంతం !”రాహువు కంఠంలో గర్వం గర్జించింది.
“మంచిది ! ఇప్పుడే , ఇక్కడే మీ శక్తుల్ని నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నాను !” అంటూ విష్ణువు బ్రహ్మ వైపు చూశాడు. “చతుర్ముఖా ! రాహుకేతువుల ముందు ఒక లేత మొక్కను సృష్టించు !”
శ్రీమహావిష్ణువు ఆజ్ఞను శిరోధార్యంగా స్వీకరించిన బ్రహ్మ , హస్తాన్ని చాచి , ఏదో సంకల్పించాడు. క్షణంలో స్వర్ణ కలశంలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. పాలకడలి తరంగాల గాలికి మొక్క ఆకులు కదులుతున్నాయి.
“రాహుకేతువులారా ! ఆ మొక్కను చూశారుగా ! ప్రాణదాన శక్తీ , ఆహారధాన శక్తీ మీకూ ఉన్నాయన్నారుగా ! మీ దృష్టిని ప్రసరించండి ! ఆ అంకురాన్ని పెంపొందించండి ! మీ పంతానికి పరీక్ష ఇదే !” విష్ణువు గంభీరంగా అన్నాడు.
కేతువు నిర్లక్ష్యంగా నవ్వాడు. “ఆ మాత్రం మహత్కార్యానికి ఈ రాహుకేతువులు ఇద్దరు దేనికి , హరీ ! సోదరుడూ , మహాశక్తి సంపన్నుడూ అయిన రాహువు చాలు !”
రాహువు మెప్పుగా కేతువు భుజం మీద చేతితో తట్టాడు , సగర్వంగా వికట్టాహాసం చేస్తూ.
“అన్నా ! ప్రసరించు నీ దృష్టికిరణాల్ని ! నిరూపించు నీ శక్తిని !” అని కేతువు అన్నాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹