నవగ్రహాల పట్టాభిషేకం దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.
క్షీరసాగర తీరం – మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి !
శ్రీమహావిష్ణువు లక్ష్మీ ఉన్నతాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మా , సరస్వతీ , పరమేశ్వరుడూ , పార్వతీ కూర్చున్నారు. ఇంద్రాదిదేవతలూ పత్నీ సమేతంగా ఒక వైపున కూర్చున్నారు. బ్రహ్మ మానస పుత్రులూ , వాళ్ళ ధర్మపత్నులూ ఒకవైపునా , మహర్షులందరూ ఒకవైపునా ఉన్నారు.
ఆనాటి మహత్కార్యక్రమానికి నాయకులైన సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , బృహస్పతీ , శుక్రుడూ , శనీ , రాహువు , కేతువూ ప్రత్యేమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదీరి ఉన్నారు. ఆ ”నవ నాయకుల” పత్నులు – సంజ్ఞ , అశ్విని మొదలు ఇరవై ఏడుగురు చంద్ర పత్నులూ , శక్తి దేవీ , ఇలా , తారా , ఊర్జస్వతీ , జ్యేష్ఠాదేవీ , సింహిదేవీ , చిత్రలేఖా – ఒక బృందంగా కూర్చుని తమ భర్తలను ఆనందంగా చూస్తున్నారు. త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ సింహాసనాలున్నాయి… ఎవరి కోసమో ఎదురుచూస్తూ !
క్షణం సేపు ధ్యాన ముద్రలో మునిగి , బ్రహ్మ కళ్ళు తెరిచి తన ప్రక్కనే ఉన్న శ్రీమహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు.
“జనకా ! సుముహూర్తం ఆగమించింది ! ప్రారంభించండి !”
శ్రీమహావిష్ణువు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు. పాలకడలి కెరటాల హోరును అణచి వేస్తూ , ఆయన గంభీర కంఠధ్వని సభాసదుల కర్ణపుటాలను కమనీయంగా తాకింది.
“కల్పకల్పానికీ ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహాసృష్టి విన్యాసంలో ”నవగ్రహాల” సశరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం ! లోకాలలోని ప్రాణులు ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ – సూక్ష్మ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో సశరీరంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలో నేను సంకల్పించాను ! ఆ సంకల్పం సాకారమై , నవ్యమైన నవ రూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది !” అంటూ శ్రీమహావిష్ణువు తన దక్షిణ హస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు. దేవతల మానస పుత్రుల , మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాయి. ఆ దేవతల , దేవతా పురంధ్రుల దృష్టి కిరణాలు వాళ్ళను మౌనంగా అభినందిస్తున్నాయి. సూర్యుడు , చంద్రుడూ మొదలైన తొమ్మండుగురూ చేతులు జోడించి సభకు నమస్కరించారు.
శ్రీ మహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినదాన్ని అవలీలగా అణచి వేసింది.
“పరమేష్ఠీ , పరమేశ్వరుల సూచనలను అనుసరించి , నవగ్రహదేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రహాల ప్రాధాన్యతా నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జరిగింది. ఆయా గ్రహాల శక్తి సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని – ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ మేము ముగ్గురమూ నిర్ణయించాం ! నవగ్రహ బృందంలో వాళ్ళ స్థానమానాలను నిర్దేశించే వరుస క్రమంలో ఆహ్వానం పలుకుతాను ! ఆహ్వానాన్ని అనుసరిస్తూ గ్రహ దేవతలు వరుసగా ఆగమించి , స్వర్ణాసనాలను అలంకరిస్తారు !”
ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి కలయజూసి , విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు.
“నవగ్రహాలలో ప్రథమ గ్రహదేవత సూర్యుడు !”
మహాసభ సమధికోత్సాహంతో చేస్తున్న హర్షధ్వానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు. ప్రథమ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు.
“ద్వితీయ గ్రహం చంద్రుడు !” శ్రీమహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది.
“తృతీయ గ్రహం కుజుడు !”
“చతుర్థ గ్రహం బుధుడు !”
“పంచమ గ్రహం బృహస్పతి !”
“షష్ట గ్రహం శుక్రుడు !”
“సప్తమ గ్రహం శనైశ్చరుడు !”
“అష్టమ గ్రహం రాహువు !”
“నవమ గ్రహం కేతువు !”
విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుండి , కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనాల మీద ఆసీనులయ్యారు. నవరత్న సింహాసనాల మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులూ కేంద్రీకరించబడ్డాయి.
“నవగ్రహాలలో ఒక్కడైన బృహస్పతి దేవతలకు గురువైన కారణం చేతా , మహాజ్ఞాని అయిన కారణం చేతా – తన నిజ నామధేయంతో కాకుండా ”గురువు” అనే సార్థకనామధేయంతో సుప్రసిద్ధుడవుతాడు !” శ్రీమహావిష్ణువు హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
“సృష్టిలో నవధాన్యాలకూ , నవరత్నాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. నవగ్రహ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యం మీదా , ఒక్కొక్క రత్నం మీదా ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది. నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ , రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడూ వెల్లడిస్తారు !” పరమేష్టి , పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శ్రీమహావిష్ణువు.
బ్రహ్మ ఆయనకు నమస్కరించి , ప్రారంభించాడు.
“సూర్యుడికి గోధుమలూ , చంద్రుడికి వడ్లూ , కుజుడుకి కందులూ , బుధుడికి పెసలూ , గురువుకు శనగలూ , శుక్రుడికి అలసందలూ , శనైశ్చరుడికి నువ్వులూ , రాహుకేతువులకు మినుములూ , ఉలవలూ ఇష్టధాన్యాలుగా ఉంటాయి. ఇష్ట ధాన్యాల మీద వాళ్ళ ఆధిపత్యాలుంటాయి. ఇది త్రిమూర్తుల అనుశాసనం !”
నవగ్రహ దేవతలు వినయంతో , కృతజ్ఞతతో నమస్కరించారు.
“నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను…” అంటూ పరమశివుడు ప్రారంభించాడు.
“సూర్యుడు – మాణిక్యం , చంద్రుడు – ముత్యం , కుజుడు – పగడం , బుధుడు – మరకతం , గురువు – పుష్యరాగం , శుక్రుడు – వజ్రం , శనైశ్చరుడు – నీలం , రాహువు – గోమేధికం , కేతువు – వైడూర్యం !” నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు.
పరమేశ్వరుడి అనుశాసనం వెలువడిన మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ముంచివేసింది.
సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి ! చంద్రుడి మీద ముత్యాలూ , కుజుడి మీద పగడాలూ , బుధుడి మీద మరకతాలూ , గురువు మీద పుష్యరాగాలూ , శుక్రుడి మీద వజ్రాలూ , శనైశ్చరుడి మీద నీలాలూ , రాహువు మీద గోమేధికాలూ , కేతువు మీద వైడూర్యాలూ వర్షిస్తూ , అందరికీ కనువిందు చేస్తున్నాయి. హర్షధ్వానాలు అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹