కేతుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
తన ప్రయాణం ముగించిన కేతువు చంద్రుడికి సమీపంలో ఉన్న ఒక తెల్ల మబ్బు చాటుకు నక్కాడు. దొంగచాటుగా , చంద్రుణ్ణి గమనిస్తున్నాడు.
చంద్రుడు లోపల నుంచి ఉబికి వస్తున్న ఆందోళనను , త్రిమూర్తులు ఆదుకుంటారన్న ఆలోచనతో అణగద్రొక్కుతూ , గగనయానం సాగిస్తున్నాడు. క్రిందటి రాత్రి చవిచూసిన బీభత్సానుభవం ఎంత మరిచిపోవాలనుకున్నా , ఆయనకు గుర్తు వస్తూనే ఉంది !
“నిర్భయంగా నీ నిశావిహారాన్ని కొనసాగించు ! ”కేతువు నీ సమీపానికి రాకుండా త్రిమూర్తులు…” చంద్రుడు చెవులలో ప్రతిధ్వనిస్తున్న నారదుడి ధైర్య వచనాలను మ్రింగివేస్తూ , కేతువు భీకరాట్టహాసం దిక్కుల్ని కుదిపివేస్తూ వినిపించింది.
చంద్రుడు భయం భయంగా చూశాడు. తెల్లటి మేఘం చాటు నుండి వికృతంగా కనిపిస్తోంది కేతువు ముఖం , నివురు చాటున నిప్పులా !
మబ్బుల చాటు నుండి వెలికి వచ్చి , చంద్రుడి వైపు దూసుకు వెళ్ళబోయిన కేతువు – తటాలున ఆగాడు. తన ఎదురుగా , ఉన్నతమైన , విశాలమైన , అలంఘ్యమైన గోడలా నిలుచున్నారు. త్రిమూర్తులు ! ముగ్గురి ముఖాల మీదా వెన్నెలను వెక్కిరిస్తున్న దివ్యమందహాసాలు !
“కేతూ ! నీ జన్మ రహస్యం నీకు తెలీదు ! రాక్షసాంశతో , మృత్యుపుత్రుడిగా జన్మించిన దేవతామూర్తివి నీవు ! సూర్య చంద్రులతో , ఇతరులతో బాటు గ్రహదేవతగా వెలుగొందే వేలుపుగా నిన్ను అభిషేకిస్తాం !” కేతువు ఆవిర్భావానికి కారకుడైన బ్రహ్మ ఉపోద్ఘాతంగా అన్నాడు.
“మేఘహాసుడి ద్వారా నేను ప్రసాదించిన వరాలనూ , శక్తులనూ సూర్య చంద్రులను కబళించే అవాంఛనీయ చర్యతో వృధా చేయవద్దు , కేతూ !” శివుడు మందలిస్తున్నట్టు అన్నాడు.
“నా సుదర్శన చక్రధారతో నీకు శిరచ్ఛేదం కావడం యాదృచ్ఛికం ! పరమేశ్వరుల వరం ఆ నష్టాన్ని రూపు మాపి , నీకు రూపాన్ని ప్రసాదించింది ! పగతో , ప్రతీకార జ్వాలతో రగిలిపోవడం నీ భవిష్య పదవికి తగదు ! నిరంతరాయంగా సూర్యచంద్రులను కబళించే ఆలోచనను విరమించు…”
“మాట మాటకు అడ్డు వస్తున్నందుకు మన్నించండి !” కేతువు వినయంగా అన్నాడు. “సూర్యచంద్రుల మీద ప్రతీకారం చేస్తూనే ఉండిపోతామంటూ చేసిన ప్రతిజ్ఞ ఏం కావాలి ? నా తల్లికీ ధర్మపత్నికి ఇచ్చిన మాట ఏం కావాలి ?”
“నీ ప్రతిన నెరవేరేలా , వెసులుబాటు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం ! నీ అన్న రాహువు అభ్యర్థించి , అనుమతి పొందిన ప్రకారం నిర్ణీత కాల వ్యవధితో , నియమిత సమయాలలో – లోకాలకు కీడు వాటిల్లని విధానంలో నువ్వు సూర్యచంద్రులను కబళిస్తూ తృప్తి చెందవచ్చు !” శ్రీమహావిష్ణువు అన్నాడు.
“సంధి పూర్వకమైన ఈ విధానం మా ముగ్గురికీ ఆమోదమే కేతూ !” పరమేశ్వరుడు నవ్వుతూ అన్నాడు.
“అంగీకరించు , ఆనందించు !” బ్రహ్మ నచ్చచెప్తున్నట్టు అన్నాడు.
“మీ ఆజ్ఞను శిరోధార్యంగా స్వీకరిస్తున్నాను. అమావాస్య దినాన సూర్యుడినీ , పౌర్ణమి రాత్రులలో చంద్రుడినీ – వంతుల ప్రకారం మేమిద్దరమూ గ్రహణం చేసే ప్రాతిపదికతో ముందుకు సాగుతాము !” కేతువు వినయంగా అన్నాడు.
“తథాస్తు !” త్రిమూర్తులు ఏక కంఠంతో అన్నారు.
కేతువు ముగ్గురికీ భక్తితో ప్రణామాలు చేశాడు. చంద్రుడి వైపు ఒకసారి చిరునవ్వు నవ్వి , విజయ గర్వంతో వెనుదిరిగాడు. త్రిమూర్తులు అంతర్థానమయ్యారు. చంద్రుడు నూతనోత్సాహంతో వెన్నెల వెదజల్లసాగాడు.
ఆశ్రమం ముందు నిలుచున్న రాహువూ , మేఘహాసుడూ , సింహికా , దనూదేవీ , సింహిదేవీ , కేతువు పత్ని చిత్రలేఖా కేతువుకు ఆప్యాయంగా స్వాగతం చెప్పారు. చిరునవ్వులతో.
దగ్గరగా వచ్చిన కేతువును ఆలింగనం చేసుకుంటూ బిగ్గరగా నవ్వసాగాడు రాహువు , కేతువు తన విజయ వికట – అట్టహాసంతో అతనితో శ్రుతి కలిపాడు ! ఇద్దరి నవ్వులూ జంట కారుమేఘాల రాపిడితో పుట్టిన భీకరమైన ఉరుముల ధ్వనుల్ని మరిపించాయి. కేతువు నవ్వులో అతని విజయగాథ ధ్వనిస్తోంది ! రాహువు స్వరంలో అభినందన ప్రతిధ్వనిస్తోంది !
రాహువు కేతువుల నవ్వులు అక్కడున్న వాళ్ళందరినీ అంటు వ్యాధిలా ఆవహించాయి. క్షణంలో కశ్యపాశ్రమ ప్రాంగణం ఆ ఏడుగురి నవ్వుల బృందగానంతో దద్దరిల్లిపోయింది !
కశ్యప ప్రజాపతీ , అదితీ , వినతా , కద్రువా , దితీ , ఇతర పత్నులూ లోగిలిలోకి పరుగు పరుగున వచ్చారు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా పగలబడి నవ్వుతున్న రాహువూ , కేతువూ , మేఘహాసుడూ , దనూదేవీ , సింహికా , రాహుపత్ని సింహిదేవీ , కేతుపత్ని చిత్రలేఖా వాళ్ళను గమనించే స్థితిలో లేరు !
“దనూ…సింహికా !” అదితి చెల్లెళ్ళను పిలిచింది.
దనూదేవీ , సింహికా నవ్వులు ఆపి , చూశారు. ఒకరి తరువాత ఒకరుగా – అందరూ నవ్వు ఆపేశారు. కశ్యపప్రజాపతికి అంతా అయోమయంగా ఉంది. చంద్రుడిని కబళించడానికి వెళ్ళిన కేతువు ఇక్కడే ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ! వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ?
“పితామహా…” మేఘహాసుడు వినయంగా అంటూ కశ్యప ప్రజాపతి సమీపానికి వచ్చాడు. నవ్వు తెప్పించిన కన్నీళ్ళతో అతడి చెంపలు మెరుస్తున్నాయి.
“ఎందుకు నాయనా అలా నవ్వుతున్నారు ?”
“నా తండ్రి గారిలాగే , పినతండ్రిగారు , కూడా త్రిమూర్తుల నుండి వరాలు మూటగట్టుకుని వచ్చారు , పితామహా !” మేఘహాసుడు చిరునవ్వుతో అన్నాడు.
“నిజమా ! ఏయే వరాలు సొంతం చేసుకున్నావు , కేతూ ?” కశ్యపుడు అడిగాడు. కేతువు తన విజయగర్వానికీ , ఆనందానికీ , వినయం జత చేస్తూ తనకూ త్రిమూర్తులకూ మధ్య జరిగిన ఒడంబడిక గురించి వివరించాడు.
“అంటే , చాలా తక్కువ పర్యాయాలు , తక్కువ వ్యవధానం పాటు మీరిద్దరూ సూర్యచంద్రులను గ్రహణం చేస్తారన్నమాట !” అదితి అంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹