రాహుగ్రహ చరిత్ర తొమ్మిదవ భాగము
“జననీ జనకుల పాదపద్మాలకు ప్రణామాలు !” నారదుడు సరస్వతీ బ్రహ్మలకు చేతులెత్తి నమస్కరించాడు.
సరస్వతి చిరునవ్వు నవ్వింది. “మీ జనకుల కర్ణపుటాలలో వేయడానికి ఏమి తెచ్చావు , నారద కుమారా ?”
“నారాయణ ! నారాయణ ! ఏదో మోసి తెచ్చానని ఎందుకనుకుంటున్నావు , మాతా ?” నారదుడు ప్రశ్నించాడు.
బ్రహ్మ దేవుడు నవ్వాడు. “ఏదో అనడానికో , ఏదో వినడానికో అయితే గానీ నువ్వు ఎవరి సన్నిధికీ వెళ్ళవుగా , కుమారా ! వాగ్దేవి ఆ మాత్రం ఊహించలేదా ? వచ్చిన పని ఏమిటో చెప్పు ! వింటావా ? వినిపిస్తావా ?”
“జనకా ! మీరు వినిపించాలని సంకల్పిస్తే గానీ నేను వినలేను కదా ! విన్నదీ , కన్నదీ వినిపించి , తరిస్తాను !” నారదుడు నవ్వుతూ అన్నాడు. “శ్రీమహావిష్ణుదేవుల సూచన ప్రకారం సూర్యుడి ముందు అరుణుడిని ప్రతిష్ఠించి లోకాలలో విస్తరించే సూర్యతాపాన్ని నియంత్రించారు. అయితే – ఆ రాహువుని నియంత్రించే ఉపాయం ఆలోచించలేకపోయారు !”
బ్రహ్మ నారదుడి మాటలను అవగాహన చేసుకుంటూ , శిరస్సులు పంకించాడు.
“అరుణుడు అడ్డులేనప్పుడు , సూర్యుడి మహాతాపం ఆ రాహువును దూరంగా ఉంచింది. ఇప్పుడు… ఆ పరిస్థితి లేదు…” నారదుడు వివరించాడు.
సరస్వతి నవ్వు మధుర మోహనంగా ధ్వనించింది. “తండ్రీ కొడుకులు ఇద్దరూ సమాలోచనలు జరిపి ఒక సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఒక సమస్య గురించి మరిచి పోయారు. సూర్య తాపాన్ని నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించారు. రాహువును నియంత్రించడం గురించి విస్మరించారు !”
“అది విస్మరించడం కాదు , వాణీ ! స్మరణలో ఉంచుకోకపోవడం !” బ్రహ్మ తెలివిగా అన్నాడు. “రాహువును నియంత్రించే కార్యం బ్రహ్మ విష్ణువుల హస్తాలలో మాత్రమే లేదు ! ఎందుకంటే , రాహుకేతువులకు ఆ పరమేశ్వరుడు ”వరదానం” చేసేసాడు కద !”
“అది కొత్త విషయం కాదు కద , స్వామీ !” సరస్వతి మళ్ళీ నవ్వింది. “ముగ్గురు మూర్తులూ ఒక్కచోట చేరి , ఒక పరిష్కారం ఆలోచించండి. లేకపోతే , సూర్యుడికి రాహువు పీడ తప్పదు !”
“అందులో సందేహం లేదు. నేనిప్పుడు కశ్యపాశ్రమం నుండి తిన్నగా తమ సన్నిధికి వచ్చాను. అదితీకశ్యపుల అభిప్రాయమూ , ఆరాటమూ అదే ! అరుణుడు ఉన్నా , లేకున్నా రాహువు సూర్యుడిని వదలడనీ , రాహువును నియంత్రించడం అత్యవసరమనీ ఆ దంపతులు అన్నారు !”.
“మీ జనయిత్రి సూచన చక్కగా ఉంది , నారదా ? శివ కేశవులతో సమాలోచన జరుపుతాను. తగిన చర్య తీసుకునే దాకా రాహువును కనిపెట్టి ఉండాలి , నువ్వు !” బ్రహ్మ నారదుడికి సూచించాడు.
“ఆజ్ఞ ! త్రిమూర్తులు త్వరపడాలి !” అంటూ నారదుడు నమస్కరించి , నిష్క్రమించాడు.
రాహువు తూర్పు దిశ వైపు చూస్తూ , ఆకాశయానం ప్రారంభించాడు. అతనిలో ఆలోచనలు సాగుతున్నాయి. ఉదయ సమయం నుండి అస్తమయం దాకా , ఈ రోజు సూర్యుడిని తన నోటిలో బంధించి ఉంచాలి. అరుణుడి ఉనికి తనకు తోడ్పడుతుంది. తాను సూర్యుడి సమీపానికి వెళ్ళగలడు ! సూర్యుడిని అవలీలగా తన నోటితో ఆక్రమించుకోగలడు !
అరుణుడు తనకు అడ్డంకి కాదు , కాలేడు ! రథికుడిని ముప్పతిప్పలు పెట్టే తనకు సారథి ఒక లెక్క కాదు ! సంపూర్ణ శరీరుడితో సమరం చేసే తనకు అంగవికలుడు ఆటంకం కాదు !
మేఘాల మీదా , మేఘాల క్రిందా సాగుతూ , మేఘాల మధ్య దాగుతూ – తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహువు. సూర్యుడి దయనీయ స్థితిని తలుచుకుని , బిగ్గరగా , విజయగర్వంతో – మేఘాలు చెదిరిపోయేలా నోరారా అట్టహాసం చేయాలనిపిస్తోంది , రాహువుకి.
మంచు తెరలాంటి మేఘాల్లోంచి వెలుపలికి శరవేగంతో దూసుకు వచ్చిన రాహువు తటాలున ఆగాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యమూ , సందేహమూ కలగాపులగంగా ప్రత్యక్షమయ్యాయి.
ఎదురుగా త్రిమూర్తులు ! తన శిరస్సును ఖండించిన విష్ణువు , తనకు అద్భుతశక్తులు ప్రసాదించిన పరమేశ్వరుడు , తన పితామహుడికి జనకుడైన బ్రహ్మ !
“పరమేశ్వరుల చరణాలకు ప్రణామాలు !” రాహువు శివుడికి నమస్కరిస్తూ అన్నాడు.
“సుఖీభవ ! రాహూ , పంక్తిభేదం తగదు సుమా ! పరమేష్టికి , పరంధాముడైన విష్ణువుకీ ప్రణామాలు అర్పించు !” శివుడు నవ్వుతూ అన్నాడు.
“పంక్తి భేదం చూపుతూ , దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతూ , పంక్తి మారిన నన్నూ , నా సోదరుడినీ ఆయన శిరచ్ఛేదం చేశాడు కద !” రాహువు విష్ణుమూర్తిని చూపుతూ , అన్నాడు. అతని కంఠంలో ఉక్రోషం , ఆవేశం పలికాయి.
విష్ణువు చిరునవ్వు నవ్వాడు. “పంపకం పూర్తి కాక ముందే మీ రాక్షస బృందానికి అమృతం లభించదేమో అన్న అనుమానంతో నువ్వు రూపం మార్చి , అపరాధం చేశావు ! అపరాధానికి శిక్ష తప్పదు కదా !”
“అయినప్పటికీ , మీ చర్య అక్రమం !” రాహువు గద్దించాడు.
“ధన్వంతరి అమృతకలశంతో ఆవిర్భవించగానే , ఆ కలశాన్ని స్వాధీనం చేసుకుని , మీరందరూ పారిపోయారు. ఆది అక్రమం కాదా ? ఆ అక్రమాన్ని అప్పుడు నువ్వు ఖండించలేదేం ?” విష్ణువు చిరునవ్వుతో అడిగాడు.
రాహువు మౌనాన్ని ఆశ్రయించి , ప్రక్క చూపులు చూశాడు.
“రాహూ ! అదంతా గతం ! ఆ గతాన్ని మర్చిపో ! నువ్వు సూర్యుడి మీద పగబట్టి , అతడిని కబళించే ప్రతీకారం చేయడానికి నిర్ణయించుకున్నావు. నీ ప్రతీకార చర్య నీ శత్రువు ఒక్కడికే కష్టం కలిగిస్తే అది సమర్థనీయమే. అయితే నీ గ్రహణం వల్ల చీకటిలో లోకాలు తల్లడిల్లుతున్నాయి. ప్రాణులకు మహానష్టమూ , మహా కష్టమూ కలిగించే బహుముఖ చర్య నీ ప్రతీకారం. దానికి నువ్వు స్వస్తి చెప్పాలి !” పరమేశ్వరుడు రాహువును తీక్షణంగా చూస్తూ అన్నాడు.
“స్వామి…”
“నీ పుత్రుడు కోరిన వరాలు కటాక్షించాను కదా ! అవి , నీ స్థానాన్నీ , గౌరవాన్నీ పెంపొందించేవే కద ! మరొక సత్యం ఉంది ! సూర్య చంద్రులు నిన్ను చూపించారు. వాళ్ళు చేసిన నేరం అంతే ! శ్రీమహావిష్ణువు నీ శిరస్సును ఖండించి వేశాడు. ఆయన మీద నీకు ప్రతీకారవాంఛ లేదు. విచిత్రంగా లేదూ !” పరమశివుడు నవ్వాడు.
“అవును రాహూ ! నీ ప్రతీకారేచ్ఛ ఆవేశంలోంచి పుట్టింది ; ఆలోచనలోంచి ఆవిర్భవించింది కాదు. నీకు నష్టం కలిగించిన వ్యక్తికి నువ్వు కష్టం కలిగించవచ్చు ; నష్టమూ కలిగించవచ్చు. అయితే అది ఇతరులను బాధించరాదు ! పరమశివుడు చెప్పింది నిజమే కద !” బ్రహ్మ అనునయంగా అన్నాడు.
“రాహూ ! నువ్వు నా సంకల్పాన్ని అనుసరించి , కశ్యప పుత్రుడిగా జన్మించావు ! నువ్వు కారణజన్ముడివి ! సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోవడానికి నువ్వు అవతరించలేదు. త్వరలో నిన్ను ఒక విశిష్ట దేవ బృందంలో ఒకడుగా అభిషేకించబోతున్నాము. ఆ పదవితో పరమశివుడు ప్రసాదించిన వరం కార్యరూపం ధరిస్తుంది. లోకాలు నిన్ను ఆరాధిస్తాయి. సూర్యచంద్రులను పీడించే ఆలోచనను శాశ్వతంగా విరమించుకో !” శ్రీమహావిష్ణువు అన్నాడు.
“మా త్రిమూర్తుల ఆశయం అదే సింహికేయా !” బ్రహ్మ అనునయంగా అన్నాడు. రాహువు మౌనంగా శివుడి వైపు చూశాడు. “మా ప్రతిపాదనను అంగీకరించు రాహూ ! అంతరిక్షంలో నీకో ఆవాస స్థానం , నీకు కొన్ని ఆధిపత్యాలూ , అధికారాలూ లభిస్తాయి !” పరమేశ్వరుడు చిరునవ్వుతో అన్నాడు.
రాహువు త్రిమూర్తుల వైపు చూస్తూ , వినయంగా చేతులు జోడించాడు. “సూర్యచంద్రుల మీద పగ తీర్చుకుంటానని నేను శపథం చేశాను ; సతీసుతులకు వాగ్దానం చేశాను. నా ప్రతిజ్ఞనూ పాలిస్తాను , మీ త్రిమూర్తుల ఆజ్ఞనూ పాలిస్తాను…” త్రిమూర్తులు రాహువు ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశారు.
“నేను సంకల్పించినట్టు అను నిత్యమూ కాకుండా , సంవత్సరంలో కొన్ని పర్యాయాలు మాత్రం సూర్యుడినీ , చంద్రుడినీ కబళిస్తాను. నేను సంకల్పించుకున్నట్టు పూర్తి పగలూ , పూర్తి రాత్రీ కాకుండా నియమితమైన , పరిమితమైన సమయం మాత్రం ఆ ఇద్దర్నీ పట్టి ఉంచి , వదిలేస్తాను. దీనికి మీరు అంగీకరించి , అనుగ్రహించాలి !” రాహువు త్రిమూర్తుల సందేహాన్ని నివృత్తి చేస్తూ అన్నాడు.
“నియమిత సంఖ్యలో , పరిమిత సమయం పాటు నీ ప్రతీకార ఉద్యమం సాగుతుందన్నమాట !” పరమశివుడు విశ్లేషిస్తూ అన్నాడు. “నీ ప్రతిపాదన కూడా ఆమోదయోగ్యమే ! అంగీకరించి , అందుకు అనుమతిస్తున్నాం ! అస్తు !”
“తథాస్తు !” శ్రీమహావిష్ణువూ , బ్రహ్మా ఒకేసారి అన్నారు.
రాహువు త్రిమూర్తులకు ప్రదక్షిణం చేసి , నమస్కరించి వాళ్ళ ముందు ఆగాడు.
“వెను దిరిగి వెళ్ళు , రాహు !” విష్ణువు నవ్వుతూ అన్నాడు.
“దీనితో రాహు గ్రహ చరిత్ర పరిపూర్తి అయ్యింది…” నిర్వికల్పానంద అన్నాడు. “సందేహాలున్నాయా ? ఉంటే , అడగండి !”
“గురువు గారూ ! రాహువు త్రిమూర్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా ?” సదానందుడు అడిగాడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹