Skip to content Skip to footer

నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట పదవ అధ్యాయం

రాహుగ్రహ చరిత్ర ఆరవ భాగము

దినమంతా రాహువు వదనగహ్వరంలో ఇరుక్కుని ఉండిపోయినందుకు అలసటా , అతని ముందు ఓడిపోయినందుకు అవమానం సూర్యుణ్ణి ఆవేదనలో , ఆగ్రహంలో మునకలు వేయిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా తనకు అలసట చాలా తీవ్రంగా ఉంది. శరీరం నలిగిపోయిన అనుభూతి ! దేహంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో సూర్యుడికి అర్థమై పోయింది. రాహువు నోటిలోని లాలాజలం , ఎంగిలి !

నీరసంగా మందిరంలోకి అడుగుపెట్టిన సూర్యుడి వైపు సంజ్ఞ పరుగెట్టుకు వచ్చింది. “స్వామీ ! ఏం జరిగింది ? మీకేమైంది ? రోజంతా చీకటి ఎందుకు అలుముకుంది ?” సంజ్ఞ ఆత్రుతగా అడిగింది.

సూర్యుడు తనను రాహువు కబళించిన విషయం చెప్పాడు.

“అమృత పాన సమయంలో రాహుకేతువుల నాటకాన్ని బట్టబయలు చేశాను కదా ! పగబట్టారు !! శాశ్వతంగా , ప్రతీరోజూ ఇలాగే కబళిస్తూనే ఉంటామంటూ హెచ్చరించి వెళ్ళారు !” సూర్యుడు నిరుత్సాహంగా నవ్వుతూ అన్నాడు.

“ఆ రాహుకేతువులకు అంత శక్తి ఉందా , స్వామీ ?” సంజ్ఞ అడిగింది.

“ఉంది ! లేకపోతే రాహువు ఈ సూర్యుణ్ణి కబళించగలడా ?” సూర్యుడు అన్నాడు.

“ఈ రాహుకేతువుల పీడ శాశ్వతంగా ఉంటే ఎలా స్వామీ ?”

“ఉండదు ! నేడు రాహువు తన శక్తిని ప్రదర్శించాడు ! రేపు ఈ సూర్యుడు తన ప్రతాపం ప్రదర్శిస్తాడు !”

సూర్యుడు ఉదయించాడు. మేఘాల చాటున నక్కి దాక్కున్న రాహువు వెలికి వచ్చి వికటంగా నవ్వాడు. గుహలాంటి నోరు , రక్తం పులిమినట్టున్న నాలుక వికారంగా అవుపిస్తున్న దంతాలు…

“సూర్యా ! సుప్రభాతం ! రా ! నా వదన కుహరంలో హాయిగా విశ్రమించు !” అంటూ రాహువు సూర్యుణ్ణి సమీపిస్తున్నాడు.

ఉన్నట్టుండి సూర్యబింబం రంగు మారింది. క్షణంలో సూర్యుడు అగ్నిగోళంలా మారిపోయాడు. నిప్పు ముద్దలా అయిపోయిన సూర్యబింబం సెగలు చిమ్మడం ప్రారంభించింది. క్షణంలో తూర్పు దిక్కు అగ్నిసముద్రంలా మారిపోయింది.

సూర్యుడి వైపు దూసుకు వస్తున్న రాహువు తటాలున ఆగాడు. భరింపరాని ఉష్ణ తరంగాలు తనను తాకుతున్నట్టు గ్రహించాడతను. ఆ ఉష్ణ తరంగ ప్రతాపానికి రాహువు దేహం మీది రోమాలు మాడిపోయాయి. శిరోజాలు కాలుతున్న వాసన రాహువును నిర్ఘాంతపరిచింది. అతను నమ్మలేనట్టు సూర్యుడి వైపు చూశాడు.

క్షణక్షణానికీ సూర్యబింబం రంగు భయానకంగా ఎర్రబారుతోంది. సూర్యుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు భరింపరాని వేడి కెరటాలను నలువైపులా చిమ్ముతోంది. కంటికి కనిపించని ఉష్ణ సముద్రం తనని చుట్టుముట్టుతూ ముంచివేస్తున్నట్టు అనిపిస్తోంది రాహువుకు.

అక్కడే ఉంటే తన రోమాలలాగా శరీరం కూడా భస్మమైపోతుందన్న భయం ఆవరించింది రాహువును. మరొకసారి సూర్యుడి వైపు చూసే ప్రయత్నం చేశాడతను. సూర్యబింబాన్ని చూసే శక్తి కూడా లేదని గ్రహించాడు రాహువు. వెంటనే వెనుదిరిగి సూర్యుడికి దూరంగా , సుదూరంగా వెళ్ళిపోసాగాడు !

“రా ! రాహూ ! రా ! కబళించు ! ప్రతీకారం తీర్చుకో !” సూర్యుడు నవ్వుతూ అన్నాడు. సూర్యుడి మాటలూ , నవ్వూ రాహువును వెంటాడుతూ తరుముతున్నాయి.

రాహువు తన వైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకునే అత్యుష్ణ కవచాన్ని ధరించిన చండభానుడు తన విహారాన్ని విజయవంతంగా కొనసాగించాడు.

రాహువును పరుగులు పెట్టించిన సూర్యుడి ప్రచండ తాపం తన దుష్ప్రభావాన్ని లోకాల మీద కూడా చూపింది. భయంకరమైన ఆ వేడిమికి సాగరాలూ , నదులూ ఆవిరైపోయాయి. చెవులు పగిలే భీకర ధ్వనులతో రాళ్ళు పగిలిపోయాయి. ఆదిత్యుడి అత్యుష్టం అన్ని లోకాలనూ అతలాకుతలం చేసి వేసింది.

సూర్యుడు ఒకరోజు అంతర్ధానం కావడం , మరునాడు అధికమైన ఉష్ణాన్ని వెదజల్లడం – ఈ రెండూ ఇంద్రుడినీ , బృహస్పతినీ ఆశ్చర్యంలో పడవేశాయి.

ఏం జరిగిందో అర్థం కాక సతమతమవుతున్న దేవేంద్రుడికి నారదుడి రాక కొంత ఉపశమనం ఇచ్చింది.

“అమృత మథనం నాటి పగతో రాహువు నిన్న మన సూర్యుణ్ణి గ్రహణం చేశాడు ! రోజంతా రాహువు నోట చిక్కుకుని ఉక్కిరిబిక్కిరైన సూర్యుడు. ఇప్పుడు రాహువు తనను సమీపించకుండా ప్రచండాగ్నిగోళం అయిపోయాడు !” అన్నాడు నారదుడు.

“అయితే , లోకాల గతి ఏమిటి ? లోకాలలోని ప్రాణులు ఏమైపోవాలి ?” ఇంద్రుడు ఆందోళనగా అన్నాడు.

“నారాయణ ! ఆ ప్రశ్న నా జనకుల వారిని అడగాలి , మీరు !” నారదుడు నవ్వాడు.

“గురుదేవా ! పదండి !” అంటూ ఉన్న పాటున లేచాడు ఇంద్రుడు.

లోకాలకు దాపురించిన ఉపద్రవం గురించి బ్రహ్మకు వివరించాడు ఇంద్రుడు.

“చతుర్ముఖుల సహాయం అర్ధించమని మన నారదులు సూచించారు !” బృహస్పతి విన్నవించాడు.

“ఈ సమస్య ద్విముఖం ! సూర్యుడు తన ఉష్ణోగ్రతను నియంత్రిస్తే వెంటనే రాహువు కబళిస్తాడు ! నియంత్రించకపోతే ప్రాణులు అల్లాడిపోతాయి ! శ్రీమహావిష్ణువును ఆశ్రయించి , తరుణోపాయం పొందాలి , అంతే ! నేను చేయగలిగింది ఏమీ లేదు !” బ్రహ్మ నిట్టూర్చాడు.

“అయితే , శ్రీహరి సన్నిధికి వెళ్తాం ! సెలవు !”

“ప్రస్తుత సమస్య బహు జటిలమైంది. మహేంద్రా ! ఆయన సన్నిధికి నేనూ వస్తాను !” అన్నాడు బ్రహ్మ.

అందరూ విన్నవించింది విని విష్ణువు చిరునవ్వు నవ్వాడు.

“సూర్యుడు తన తాపాన్ని తగ్గించకపోతే ప్రాణులకూ , లోకాలకు ముప్పు ! తగ్గిస్తే రాహువు వల్ల అతనికి ముప్పు ! ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే ! సూర్యుడి ప్రచండ తాపం అలాగే ఉండాలి , రాహువును దూరంగా ఉంచుతూ ! అదే సమయంలో ఆ అధికోష్ణం తగ్గి , లోకాలకు తగినంత పరిమాణంలో ప్రసరించాలి ! అంటే సూర్యుడి నుండి వెలువడే ప్రచండమైన వేడిమిని తగ్గించి ఆవలికి పంపే శక్తి సూర్యుడి ముందు ఉండాలి !”

“ఆ శక్తి ఎక్కడుందో మీరే చెప్పాలి !” బ్రహ్మ వినయంగా అన్నాడు.

“ఇంతకూ ఆ శక్తి ఏది స్వామీ ?” ఇంద్రుడు అడిగాడు.

విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు. “ఆ శక్తి ఏది” అని కాదు ఇంద్రా ? “ఎవరు ?” అని అడుగు !”

బ్రహ్మా , ఇంద్రుడూ , బృహస్పతీ , నారదుడూ ఆయన వైపు కుతూహలంగా చూశారు.

“ఆ ”ఎవరు” ఎవరో తెలుసా ? అనూరుడైన అరుణుడు !”

“అరుణుడా !” బ్రహ్మ ఆశ్చర్యంగా అన్నాడు.

“ఔను ! కశ్యప పత్ని వినత కుమారుడు ! సూర్యుడి వేడిమిని నియంత్రించే శక్తి అరుణుడి శరీరానికి ఉంది. అతడు సూర్యుడి ముందు ఉండే వ్యవస్థ చేయి ! ఆ బాధ్యత నువ్వే స్వీకరించు , చతుర్ముఖా !” విష్ణువు ఆజ్ఞాపించాడు.

బ్రహ్మ వినయంగా నమస్కరించాడు. ఇంద్రాదులు కూడా శ్రీమహావిష్ణువుకు ప్రణామాలు చేసి , సెలవు తీసుకున్నారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment