రాహుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
“జగన్మోహనాకారంతో నువ్వెవరో మా కోసమే వచ్చినట్టున్నది ! మేమంతా కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వీరాధివీరులం ! ఇదిగో , ఈ ”అమృతం” సాధించాం ! మాలో మాకు భాగ పరిష్కారం కుదరకపోవడం వల్ల గొడవపడుతున్నాం ! నీ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నీ సహాయం కోరాలనిపిస్తోంది. మా అందరికీ ఈ అమృతాన్ని పంచిపెట్టి , సహాయం చేయి !” అంటూ అభ్యర్థించాడు.
మోహిని ”అవునా” అన్నట్టు సమ్మోహనకరంగా రాక్షసులందర్నీ కలియజూసింది.. ఆమె మనోహర దృష్టి , ఏదో కోరికతో పదునెక్కి తన మీద పడుతోందని ప్రతి రాక్షసుడూ అనుకున్నాడు.
“ఔను ! మనకు అమృతాన్ని ఆ సుందరాంగే పంచాలి !” అంటూ బిగ్గరగా అరుస్తూ అందరూ ఆమెను సమీపించారు.
మోహిని అందర్నీ చిరునవ్వుతో చూసింది. “నేను స్త్రీని ! వడ్డనలో పక్షపాతం చూపడం స్త్రీలకు చేతకాదు కదా ! మీరందరూ – అంటే – కాశ్యపేయులైన మీరందరూ నాకు సమానమే ! రెండు బృందాలుగా ఉండి ”సుధ”ను సాధించిన మీ కాశ్యపేయులందరికీ పంచుతాను ! పంక్తిలో కూర్చోండి !”
రాక్షసులు దేవతలను రమ్మంటూ చేతులతో సంజ్ఞలు చేశారు. అందరూ ఆతృతగా పంక్తిలో కూర్చున్నారు. దేవతలందరూ ఒక పంక్తి , రాక్షసులు మరో పంక్తి !
మోహిని జారిపోతున్న పైటను గమనించకుండా , రాక్షస వీరుడి చేతుల్లోంచి అమృతకలశం తీసుకుంది చొరవగా. అమృతం పంచడానికి సిద్ధపడిన మోహిని గాలికి ఎగిరెగిరిపడుతున్న పైటను నడుములో దోపుకోవడం ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయింది !
దేవతల పంక్తి వైపు తిరిగి , అమృతం పంచడం ప్రారంభించిన మోహిని నిర్లక్ష్యంగా తన వయ్యారాన్ని వొలికిస్తోంది. దేవతలు అమృతాన్ని పానం చేస్తున్నారు. రాక్షసులు మోహిని అందాలను ఆవురావురుమంటూ చూస్తున్నారు.
చిరునవ్వులు చిందిస్తూ , నడకలో నాట్యాన్ని జతచేస్తూ మోహిని పంచుతోంది , దేవతలకు సాగరామృతాన్నీ , రాక్షసులకు సౌందర్యామృతాన్నీ !
రాహువు , కేతువూ – ఇద్దరూ మోహిని ఆడుతున్న నాటకాన్ని కనిపెట్టేశారు. రాహువు తలవాల్చి , పక్కనే కూర్చున్న కేతువు చెవిలో ఏదో చెప్పాడు. మరుక్షణం ఇద్దరూ దేవతలుగా మారిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా దేవతల పంక్తిలోకి జరిగి , వాళ్ళల్లో ఇమిడిపోయారు !
రాహు కేతువులు చేసిన మాయాజాలాన్ని ఇటు రాక్షసులుగానీ , అటు దేవతలు గానీ , చివరికి మోహిని రూపంలో ఉన్న విష్ణువు గానీ కనిపెట్టలేకపోయారు. అయితే సూర్యుడూ , చంద్రుడూ ఇద్దరూ రాహుకేతువుల నాటకాన్ని కనిపెట్టేశారు. వెంటనే చేతులతో సైగలు చేస్తూ మోహినికి తెలియజేశారు. అయితే ఆ సరికే మోహిని రాహువుకూ , కేతువుకూ అమృతం పంచేసింది.
సూర్యచంద్రుల నుండి వర్తమానం అందగానే మోహిని విష్ణువుగా మారి పోయింది. విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం లిప్తపాటులో రాహుకేతువుల శిరస్సుల్ని ఒక్కసారిగా ఖండించింది ! వాళ్ళ మొండేలు నిర్జీవంగా పడిపోయాయి. గొంతు దాకా అమృతం దిగిన కారణంగా రాహుకేతువుల తలలు జీవంగా ఉండిపోయాయి…
దేవతలు అమృతకలశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో దేవదానవుల మధ్య భీకర సమరం సాగింది. చాలా మంది రాక్షసులు మరణించారు. దేవతలు సాగర మథనంలో తమకు లభించిన సంపదలతో , అమృతంతో స్వర్గానికి వెళ్ళిపోయారు.
మరణించిన రాక్షసులను శుక్రుడు మృతసంజీవనితో పునరుజ్జీవితులను చేశాడు. పరాజయ భారంతో , ప్రతీకార దాహంతో రాక్షసులు బలిచక్రవర్తి నేతృత్వంలో వెనుదిరిగారు.
రాహువు , కేతువూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. మొండేలు లేకుండా , కేవలం తలలు మాత్రమే కనిపించడంతో కశ్యపుడూ , ఆయన పత్నులూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రాహుకేతువులు ఏదో మాయాజాలంతో తమను అబ్బురపరుస్తున్నారనుకున్నారందరూ !
రాహువు జరిగిందంతా వివరించాడు. రాహువు తల్లి సింహికా , కేతువు పెంపుడు తల్లి దనూదేవీ , రాహువు భార్య సింపీ , కేతువు పత్ని చిత్రలేఖా తీరని వేదనకు లోనయ్యారు. కశ్యపుడూ , అదితి , దితీ మొదలైన సోదరీమణులూ వాళ్ళను ఓదార్చారు. రాహు పుత్రుడు మేఘహాసుడు ఆగ్రహంతో రగిలిపోయాడు.
“అంతా దైవేచ్ఛ ! ఏం జరిగినా ఆ శ్రీమహావిష్ణువు సంకల్పాన్ని అనుసరించే జరుగుతుంది. అమృతం కోసం ఎదురు చూస్తూ కూర్చున్న తమ వారిలాగే న్యాయంగా , ధర్మంగా రాహుకేతువులు ప్రవర్తించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు కద !” కశ్యపుడు ఓదార్చే ఉద్దేశంతో విశ్లేషించాడు.
దితి కశ్యపుడిని గుడ్లురుముతూ చూసింది. “మీరు… అదితి బిడ్డలకే తండ్రి అయినట్టు మాట్లాడుతారు ! ఆ విష్ణువు అండ చూసుకుని అదితేయులు నా బిడ్డల్నీ , దను బిడ్డలైన దానవుల్నీ , ఇంకా మా చెల్లెళ్ళ సంతానాన్నీ చంపుకుంటూ వెళ్తున్నారు ! రాహువూ , కేతువూ తన పినతల్లుల బిడ్డలే కద ! సూర్యుడు వాళ్ళ మీద పగపట్టవచ్చా ?”.
“ఆ సూర్యచంద్రుల మూలంగానే సింహిక బిడ్డకూ , నేను పెంచుకున్న బిడ్డకూ శరీరాలు లేకుండా పోయాయి !” దనూదేవి ఆవేశంగా అంది.
“రాహుకేతువుల భార్యలకు ఇంక దిక్కెవరు ?” సింహిక అంది. “భర్తల శిరస్సులతో వాళ్ళు కాపురాలు చేయాలా ?”
అప్పటి దాకా మౌనంగా ఏడుస్తున్న రాహువు భార్య సింహిదేవీ , కేతువు పత్ని చిత్రలేఖా ఒక్కసారిగా బావురుమన్నారు.
“ఏడవకండి ! బాధపడకండి !” రాహువు పుత్రుడు , మేఘహాసుడు ఓదార్చుతూ. అన్నాడు. తన తల్లి సింహదేవి ముందు నిలుచుని , ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాడు. “ఈ రాహు పుత్రుడు ఇంకా జీవించే ఉన్నాడమ్మా ! ఈ మేఘహాసుడి శిరస్సూ , శరీరమూ ఇంకా కలిసే ఉన్నాయి ! నా తండ్రి రాహువుకీ , పినతండ్రి కేతువుకీ యథాప్రకారం శరీరాలు వచ్చేదాకా నేను విశ్రమించను !”.
“మేఘహాసా…” అంది రాహువు శిరస్సు. అతని కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి.
“మేఘా ! నీ మాటలు కొండంత ధైర్యాన్నిస్తున్నాయి, నాయనా !” కేతువు గాద్గదికంగా అన్నాడు.
“వెండికొండ మీద కొలువైన ఆ పరమశివుణ్ణి తపస్సుతో మెప్పిస్తాను ! మీకు దేహభిక్ష పెట్టమని ఆయనను అర్థిస్తాను ! విజయం సాధించాకే ఆశ్రమానికి తిరిగి వస్తాను !” అంటూ మేఘహాసుడు ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
గాలిలో తేలుతున్నట్టు కదలాడుతున్న రాహువు తలను సింహికా , కేతువు తలను దనూదేవీ రెండు చేతుల్తో పట్టుకున్నారు. ఆప్యాయంగా ఆ శిరస్సులను తమ హృదయాలకు దగ్గరగా తీసుకున్నారు.
మేఘహాసుడి తపస్సు ప్రారంభమైంది. నారదుడి ద్వారా ఆ విషయం తెలిసి , దేవేంద్రుడు ఆందోళన చెందాడు. బృహస్పతితో సమాలోచన చేశాడు.
“గురుదేవా ! అమృతం కోసం దేవతలలాగా వేషాలు వేసిన రాహుకేతువులు మొండేలు ఖండించి – శ్రీమహావిష్ణువు తగిన శిక్ష విధించాడు…”
“ఔను…” బృహస్పతి అన్నాడు.
“ఇప్పుడు ఆ శిక్ష నుండి వాళ్ళను విముక్తుల్ని చేయడానికి రాహువు పుత్రుడు మేఘహాసుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు ! అతని తపస్సు భగ్నం చేయకపోతే…”
“నీకు గానీ , దేవతలకు గానీ ప్రమాదం ఏమీ లేదు , మహేంద్రా ! అసురులందరూ మీకు ఆగర్భశత్రువులే ! అందరికీ దేహాలున్నాయి కద ! రాహుకేతువులకూ యథాపూర్వంగా దేహాలు లభిస్తే కలిగే నష్టం గానీ , కష్టం గానీ ఉండవు !” బృహస్పతి నవ్వుతూ అన్నాడు.
“అయితే ఆ రాహుపుత్రుడి తపస్సు సాగనిస్తాను !” అన్నాడు ఇంద్రుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹