రాహుగ్రహ చరిత్ర రెండవ భాగము
“ఇంద్రా ! మృతసంజీవనితో సరితూగే మహా శక్తి ఒక్కటే. అది అమృతం ! క్షీరసాగరాన్ని చిలికి ఆ అమృతాన్ని మీరు హస్తగతం చేసుకోవాలి. అమృతంతో బాటు అదృశ్యమైన మీ ఐశ్వర్యాలన్నీ మీకు అందుతాయి. అమృతపానంతో శరీరం గట్టిపడుతుంది ! మృత్యువు జయించబడుతుంది…”
“ధన్యోస్మి దేవా ! క్షీరసాగర మధనానికి తగిన ఏర్పాట్లు చేస్తాను !” ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు.
“పాలకడలిని చిలికే శక్తి మీ దేవతలకు లేదు !” శ్రీహరి నవ్వుతూ అన్నాడు. “అది. మహా ప్రయత్నం సుమా ! దేవతల శక్తికి , అసుర శక్తి తోడైతే గానీ ఆ పని సాధ్యం కాదు. కవ్వంగా మందరగిరిని ఉపయోగించాలి. మందర పర్వతం భూమిపైన పదకొండువేల యోజనాల పొడవుతో ఉంది. భూమి లోపల అంతే లోతులో పడి ఉంది. ఇరవై రెండు వేల యోజనాల పొడవుతో ఉన్న ఆ మహా పర్వతాన్ని పెకలించి క్షీరసాగర తీరానికి చేరవేయాలి. సురాసురులు కలిస్తే గానీ అది సాధ్యం కాదు కదా ! సర్పరాజు వాసుకిని కవ్వపు త్రాడుగా ఉపయోగించి , చిలకాలి. ముందుగా సాగరంలో ఓషధులు , మూలికలు , లతలూ వేయాలి…”
“క్షీరసాగర మథనం మహాగగనమైన కార్యమే !” బృహస్పతి సాలోచనగా అన్నాడు. విష్ణువు తలపంకించాడు. “మహేంద్రా ! బలి చక్రవర్తి నాయకత్వంలో ఉన్న నీ దాయాదులు – అసురులతో సంప్రదించు ఒడంబడిక చేసుకో. అమృతంలో సగభాగం ఇస్తానని మాట ఇచ్చి వాళ్ళను కార్యోన్ముఖుల్ని చేయి. వెళ్ళిరండి !”
“దేవా ! ఇప్పటికే రాక్షసుల ఆయుధాగారంలో మృతసంజీవని ఉంది. ఇంక అమృతం కూడా లభిస్తే , వాళ్ళ శక్తికి అంతు ఉండదు కదా !” ఇంద్రుడు సందేహం. వెలిబుచ్చాడు.
విష్ణువు చిన్నగా నవ్వాడు. “పాలకడలిని చిలికి అమృతాన్ని వెలికి తీయడం మీ దాయాదుల పని ! ఆ అమృతాన్ని అర్హులకు అందజేయడం నా పని ! వెళ్ళు , ఇంద్రా ! బలిని కలుసుకో !”
బ్రహ్మా , ఇంద్రుడూ , బృహస్పతి శ్రీమహావిష్ణువుకు నమస్కరించి , నిష్క్రమించారు.
తన ఆస్థానానికి వచ్చిన ఇంద్రుడికీ , బృహస్పతికీ బలి చక్రవర్తి సాదరంగా స్వాగతం పలికాడు.
“మృత్యువును జయించడం కోసం , ”అమృతం” అనే దివ్య పానీయాన్ని సాధించాలని తలపెట్టాం. దాని కోసం క్షీరసాగరాన్ని మందరగిరితో చిలకాలి. దాయాదులమైన మనందరం ఏకమైతే గానీ ఆ బృహత్కార్యాన్ని నిర్వర్తించడం సాధ్యం కాదు. మాతో చేతులు కలపండి. అందుకోబోయే అమృతాన్ని అందరం సమానంగా పంచుకుందాం !” ఇంద్రుడు బలి చక్రవర్తితో అన్నాడు.
బలి చక్రవర్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంద్రుడు మళ్ళీ ఇలా అన్నాడు. “మీరూ , మేమూ – కేవలం అక్కాచెల్లెళ్ళ సంతతికి చెందిన వాళ్ళం. పరులం కాము ! సర్వవేళలా , సర్వ విషయాలలోనూ , సమరం సమర్ధనీయం కాదు కదా ! అదితేయులూ , దైత్యులూ , దానవులూ , కాలకేయులూ అయిన మనం కలిసి ఒకే కుటుంబంగా జీవించలేకపోవచ్చు. కలిసి కార్యాలను సాధించుకోవచ్చు గదా !”
“పరస్పర ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంలో కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన మీరూ , మీరూ ఏకోన్ముఖంగా ఉద్యమించడం సర్వదా అభిలషణీయం , రాక్షసేంద్రా !” బృహస్పతి ప్రోత్సహిస్తూ అని శుక్రుడి వైపు చిరునవ్వుతో చూశాడు.
“ఆచార్య శుక్రులు నాతో ఏకీభవిస్తారనుకుంటాను ! ఏమంటారు మహాశయా ?” శుక్రుడు చిరునవ్వు నవ్వాడు. “మహాబలీ , మహేంద్రుని ప్రతిపాదన ఆమోద యోగ్యంగానే ఉంది. అమృతంలో సమభాగం తీసుకునే నిబంధనతో మీరు వారితో చేతులు కలపవచ్చు. మృతసంజీవనికి అమృతం తోడు కావడం మంచిదే !”
“సురాసుర గురుదేవులిద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు సురాసురులైన మేం కూడా ఒక్కటిగానే ఉంటాం !” బలిచక్రవర్తి నవ్వుతూ అన్నాడు.
“శుభం ! విజయోస్తు !” అన్నాడు బృహస్పతి.
“తథాస్తు !” అన్నాడు శుక్రుడు.
శుక్రుడూ , బృహస్పతీ , బలీ , ఇంద్రుడూ – ఒకర్నొకరు ఆలింగనం చేసుకుని , వీడ్కొన్నారు. ఇంద్ర, బృహస్పతులు నిష్క్రమించగానే ఇద్దరు వృద్ధ రాక్షస వీరులు బలి దగ్గరగా వచ్చారు.
“అమృతం ఎలా సాధించాలో తెలిసిపోయింది కద ! మనమే పాలకడలిని చిలికేసి , అమృతాన్ని సొంతం చేసుకుందాం !” ఒక వృద్ధుడు తెలివిగా అన్నాడు.
“ఆలోచించు నాయనా , మహాబలీ ! మృతసంజీవనికి తోడు అమృతం పూర్తిగా మన వశమైతే – ఇక అడ్డేముంటుంది ? దేవతలను సర్వనాశనం చేసేసి , ముల్లోకాలూ అల్లకల్లోలం చేసి మనమే ఏలుకోవచ్చు !” మరొక వృద్ధ దానవుడు అన్నాడు.
బలి చక్రవర్తి చిన్నగా నవ్వాడు. “మీరు వృద్ధులు. మీ బుద్దులు వయసుకు తగినట్టుగా లేవు. సహాయం అర్థించిన వాళ్ళను సంహరించడం అధర్మం. అమృత సాధనలో సమానంగా శ్రమిస్తాం. సమానంగా పంచుకుందాం ! అంతే !”
క్షీరసాగర మథనానికి ప్రయత్నాలు నిర్విఘ్నంగా జరిగాయి. దేవతలూ , రాక్షసులూ , కలిసికట్టుగా ఉద్యమిస్తున్నారు. ఆదిశేషుడు మందర పర్వతాన్ని పెకలించి , సాగర తీరానికి చేర్చాడు.
ఇంద్రుడూ , బలిచక్రవర్తీ , బృహస్పతీ , శుక్రుడూ – సర్పరాజు వాసుకిని కలుసు కున్నారు. కవ్వపు త్రాడుగా సహాయం చేయమని అర్థించారు. అమృతంలో భాగం ఇస్తామన్నారు.
“నేను ఎవరిని ? మీ పినతల్లి కద్రువ జ్యేష్ఠ పుత్రుడిని. మీకు సోదరుణ్ణి ! బలి నాకు మనుమడే కదా ! మీ కోసం నా సహాయం అందిస్తాను !” అన్నాడు వాసుకి..
కశ్యప ప్రజాపతి ఆతృతగా ఆశ్రమం వైపు పరిగెట్టుకు వస్తున్న రాహువునీ , కేతువునీ ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరూ ఆయన ముందు ఆగారు. ఇద్దరి ముఖాల్లోనూ ఏదో ఉత్సాహం.
“నాన్నా ! శుభవార్త నాన్నా ! దేవతలూ , రాక్షసులూ కలిసి , అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకడానికి ఒడంబడిక కుదిరింది…”
“క్షీరసాగర మథనమా ? అమృతం కోసమా ?” కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు.
“ఔను ! ఇంద్రుడు బలి చక్రవర్తిని కలిసి అభ్యర్థించాడట ! మందర పర్వతాన్ని కవ్వంగా చేసి , పాలకడలిని చిలికేస్తారు , అమృతం కోసం ! ”అమృతం” అనేది ”మరణం లేని మందట” నాన్నా !” కేతువు ఉత్సాహంగా అన్నాడు.
“రాక్షస బలగంతో పాటు మేమిద్దరమూ వెళ్తున్నాం !” రాహువు అన్నాడు.
“ఆ అమృతాలూ , అవీ మీకెందుకు ? హాయిగా ఉండండి !” కశ్యపుడు అన్నాడు.
“నా బిడ్డ అమృతం తాగి , చిరంజీవిగా ఉండిపోవడం ఇష్టం లేదా మీకు ?” అంది. కశ్యపుడితో, అప్పుడే అక్కడికి వచ్చిన సింహిక.
“రాహువు , కేతువూ ! మీరు వెళ్ళండి ! అమృతం త్రాగడానికి అనుమతి అవసరం లేదు !” అంది దనూదేవి , దగ్గరగా వస్తూ , రాహుకేతువులు ఆనందంగా నవ్వారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹