Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నూట ఐదవ అధ్యాయం

రాహుగ్రహ చరిత్ర మొదటి భాగము

దుర్వాస మహర్షి అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. వేగంగా. చల్లటి గాలి ఆయన శ్రమను ఉపశమింపజేస్తోంది. దుర్వాస మహర్షి నడకలో వేగం తగ్గింది. అద్భుతమైన , మహా మధురమైన సువాసన ఏదో , గాలిలో తేలుతూ వస్తోంది. ఆ సువానసతో ఆయన శరీరం పరవశిస్తోంది. అలౌకిక పుష్ప సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ దుర్వాసుడు నిలబడి పోయాడు. ఆయన చూపులు సువాసన వస్తున్న వైపే కేంద్రీకరించబడ్డాయి.

కొన్ని క్షణాల్లో అద్భుతమైన ఆ సుగంధాన్ని మోసి , తెస్తున్న సుందరాంగి ఆయన ముందు సాక్షాత్కరించింది. ఆమె నడక , నడక కాదు , నాట్యం ! ఆ సుందరాంగి ఎవరో కాదు మేనక !

ఎదురుగా నిలుచున్న దుర్వాస మహర్షిని చూడగానే మేనక నడకలో వినయం కలిసింది.

“మహర్షులకు ప్రణామాలు !” అంది నమస్కరిస్తూ మేనక. ఆమె చేతిలో అందమైన పుష్పహారం ఉంది. ఆ హారం మహాసౌరభాన్ని వెదజల్లుతోంది.

“సుఖీభవ !” దుర్వాస మహర్షి దీవించాడు. “మేనకా ! ఆ మాలిక మా మనసు దోచుకుంది. అది మాకు కావాలి !” అది. అభ్యర్ధన కాదు , ఆజ్ఞ !

“నేను అల్లిన మాలిక మీకు నచ్చడం నా అదృష్టం ! స్వీకరించండి !” మేనక వినయంగా రెండు చేతులతోటీ దండను దుర్వాస మహర్షికి అందించింది.

“వెళ్ళిరా , మేనకా ! శుభం భూయాత్ !” దుర్వాస మహర్షి చిరునవ్వుతో అన్నాడు. మేనక నమస్కరించి , ఆయనకు దూరంగా , తొలగి తన దారిన వెళ్ళింది. దుర్వాస మహర్షి తన ప్రయాణాన్ని కొనసాగించాడు , పూలదండను చేతిలో పట్టుకుని…..

”అమరావతి” వీధులలో ఐరావతం గంభీరంగా నడుస్తోంది. నాలుగు దంతాల గజరాజు మీద ఇంద్రుడు ఠీవీగా కూర్చున్నాడు. గజరాజు ముందు , మదగజగమనలైన అప్సరసలు సమ్మోహనకరంగా నాట్యం చేస్తున్నారు. ఊరేగింపు ఇరువైపులా నిలుచున్న దేవతలు జయజయధ్వానాలు చేస్తున్నారు.

బారులు తీరి నిలుచున్న దేవతలను తప్పించుకుంటూ , దుర్వాస మహర్షి కొంచెం ముందుకు జరిగి నిలుచున్నాడు. ఆయన చూపులు ఐరావతం మీద ఆసీనుడైన మహేంద్రుడి మీదే ఉన్నాయి. ఇంద్రుడి చూపులు దుర్వాస మహర్షి మీద వాలాయి. అతని చే సైగతో ఐరావతం ఆగింది.

ఇంద్రుడు దుర్వాసుడికి నమస్కరించాడు. దుర్వాసుడు చిరునవ్వు నవ్వుతూ చేతిలోని మాలను ఇంద్రుడి వైపు విసిరాడు. ఇంద్రుడు మాలను అందుకుని , ఒక్కసారి వాసన చూసి , ఐరావతం కుంభస్థలం మీద పడవేశాడు. తక్షణం ఆ గజరాజు స్పందించింది. తొండంతో దండను అందుకుంది. నేలకేసి విసిరి కొట్టింది. కాలితో దండను రుద్దివేస్తూ , ముందుకు సాగింది..

జరిగిందంతా చూస్తున్న దుర్వాసుడి కళ్ళు ఎర్రబడ్డాయి.

“ఇంద్రా ! ఆగు !” దుర్వాస మహర్షి కంఠం మేఘగర్జనలా ధ్వనించింది. ఇంద్రడి సైగతో ఐరావతం ఆగింది. ఆయన తల తిప్పి దుర్వాస మహర్షి వైపు చూశాడు.

“మహేంద్రా ! నువ్వు గర్వాంధుడివి ! అధికార గర్వం నీ తలకెక్కింది. అందుకే మేము దీవించి బహూకరించిన మాలను కించపరిచావు. తద్వారా మా యోగ్యతను అవమానించావు. అవధి మీరిన అహంకారానికి ఫలితం అనుభవించు. నీ స్వర్గ సామ్రాజ్య వైభవం సర్వనాశనం అయిపోతుంది. నీ సర్వస్వమూ నీటిలో మునిగిపోతుంది !” ఆగ్రహావేశాలతో శపించిన దుర్వాస మహర్షి చరచరా వెళ్ళిపోసాగాడు..

క్షణంలో ఐరావతం మీద నుంచి దిగిన ఇంద్రుడు పరుగు పరుగున వచ్చి , దుర్వాసుడి ముందు మోకరిల్లాడు.

“అపరాధం చేశాను ! తపోధనులైన మిమ్మల్ని కించపరిచే ఉద్దేశ్యంతో చేసిన తప్పు కాదది. అది… అది… క్షణికావేశం ! క్షమించండి ! మీ శాపాన్ని ఉపసంహరించండి !”

“మా శాపం అప్రతిహతం ! అనుభవించాల్సిందే ! ఉపసంహరణ అనేది మాకు తెలియని విద్య మహేంద్రా !” దుర్వాసుడు గంభీరంగా అన్నాడు. “ఇంద్రుడు ! దేవేంద్రుడు ! మహేంద్రుడు !”

ఇంద్రుడి గజవాహనోత్సవం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతిని విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. దుర్వాస మహర్షి శాపం తన దుష్ప్రభావాన్ని ఆలస్యం లేకుండా చూపించడం ప్రారంభించింది.

విచిత్రంగా , విస్మయం కలిగిస్తూ దేవతల ఐశ్వర్యం అంతర్థానమైంది. ఉచ్ఛైశ్రవం , ఐరావతం , ఇతర సంపదలూ మాయమైపోయాయి. అప్సరసలు అంతర్థానమైపోయారు. స్వర్గ సామ్రాజ్యం మీద రాక్షసరాజు ”బలిచక్రవర్తి” తన ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాడు.

నిర్వికల్పానంద ఆగాడు. శిష్యులు అందరూ ఆయన వైపు సందేహంగా చూస్తున్నారు. “గురువు గారూ ! రాక్షసరాజు వృషపర్వుడు కదా ? బలిచక్రవర్తి అంటున్నారే !” విమలానందుడు ప్రశ్నించాడు.

నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “మనం చెప్పుకుంటున్న కథలో చాలా కాలం గడిచిపోయింది. వృషపర్వుడి కాలం నుండి నవగ్రహ చరిత్ర బలిచక్రవర్తి కాలానికి చేరింది. ఇద్దరూ కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వాళ్ళే. వృషపర్వుడు ఎవరు ? కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకతె అయిన దనూదేవి కుమారుడు. మరొక పత్ని ”దితి” మీకు గుర్తుంది కదా ! ఆమె కుమారుడు హిరణ్య కశ్యపుడు. అతని పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఆ విరోచనుడి కుమారుడే బలి !”

“తరతరాల రాక్షస రాజులకు గురువుగా కొనసాగిన మహానుభావుడు శుక్రుడు ! రాహు గ్రహ చరిత్రకు సంబంధించిన కాలంలో బలి రాక్షసుల రాజుగా ఉన్నాడు ! అంతే ! కథలోకి వెళితే – దుర్వాసుడి శాపం దేవతలను నిర్దనులను చేసి వేసింది ! రాక్షసులు ఆధిపత్యం చెలరేగింది. దిక్కుతోచని పరిస్థితిలో ఇంద్రుడూ , బృహస్పతీ – సహాయం కోరడానికి బ్రహ్మ సన్నిధికి చేరుకున్నారు. జరిగిందంతా ఆయనకు విన్నవించి , తమ గత వైభవాన్ని పునరుద్ధరించమని అభ్యర్థించారు…” నిర్వికల్పానంద కథనం. కొనసాగించాడు.

ఇంద్రుడు , బృహస్పతీ విన్నవించిన దానిని సానుభూతితో విని , బ్రహ్మ నిస్సహాయంగా నిట్టూర్చాడు.

“దుర్వాసుడి శాపం ప్రచండాగ్ని ! దానిని చల్లార్చే బలం నా వద్ద లేదు. మీ దేవతలకు పూర్వ వైభవం దక్కాలంటే – మనం మా జనకులు శ్రీమహావిష్ణువును ఆశ్రయించాలి ! పదండి , వెళ్తాం !” అంటూ కమలాసనం మీద నుంచి దిగాడు.

ఇంద్రుడూ , బృహస్పతీ చెప్పిదంతా మౌనంగా ఆలకించాడు శ్రీమహావిష్ణువు. “జనకా ! అదితేయులు అతి దీనావస్థలో ఉన్నారు. పూర్వ వైభవాన్ని మీరే దక్కించాలి !” బ్రహ్మ వినయంగా అన్నాడు.

“దుర్వాసుడి శాపం వల్ల అమరావతిలో అదృశ్యమైనవన్నీ సముద్రం పాలైపోయి ఉన్నాయి. మీరు వాటిని తిరిగి పొందినప్పటికీ , రాక్షసులు కొల్లగొట్టుకుపోతారు. వాళ్ళను జయించే శక్తి ప్రస్తుతం దేవతలకు లేదు. అసురులకు బాసటగా శుక్రుడు సాధించి తెచ్చిన మృతసంజీవని ఉంది !” అంటూ ఆయన ఇంద్రుడి వైపు చూశాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment