శనిగ్రహ చరిత్ర నాల్గవ భాగం
సన్నగా , నల్లగా బలహీనంగా ఉన్న వ్యక్తి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు. దూరం నుండి అతన్ని చూస్తూ జ్యేష్ఠ నవ్వుకుంది. తనను దగ్గర నుండి చూడగానే అతని మందగమనం పరుగుగా మారిపోతోంది.
ఆ పురుషుడిని దాటి ముందుకు వెళ్ళబోతూ , అప్రయత్నంగా ఆగింది జ్యేష్ఠ , నడక ఆపి నిలుచున్న ఆ పురుషుడు ఆమె వైపు సూటిగా చూస్తున్నాడు. జ్యేష్ఠ ఆశ్చర్యపోయింది. అతని కళ్ళు భయం గొలిపే విచిత్రమైన గోళాల్లా ఉన్నాయి ! ఆ కళ్ళల్లో భయం లేదు.
ఆ పురుషుడు మంత్రముగ్ధుడిలా జ్యేష్ఠ వైపు చూస్తున్నాడు. బలిష్టంగా , సౌష్టవంగా అందంగా ఉన్న నిండైన శరీరం ! బైటికి ఉబ్బినట్టున్న ఎర్రటి కనుగుడ్లు ! ముఖ్యంగా తన కళ్ళల్లోకి తీక్షణంగా , సూటిగా , ధైర్యంగా , లోతుగా చూస్తున్నాయి ఆ విలక్షణ విలోచనాలు !
“సుందరీ ! ఎవరు నువ్వు ?” ఆమెనే చూస్తూ ప్రశ్నించాడు ఆ పురుషుడు.
జ్యేష్ఠ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తన కళ్ళల్లోకి నిదానించి చూడడమే కాదు , ధైర్యంగా తనను పలకరిస్తున్నాడతను ! నారదుడు చెప్పిన పురుషుడా ?!
“నువ్వెవరో చెప్పు , ముందు !” జ్యేష్ఠ నిర్లక్ష్యంగా అంది.
“నేను ఛాయాదేవీ సూర్య దంపతుల పుత్రుణ్ణి ! నా పేరు శనైశ్చరుడు !”
“నా పేరు జ్యేష్టాదేవి ! నీ కోసమే అన్వేషిస్తూ ఇటు వైపు వచ్చాను ! నన్ను వివాహం చేసుకుంటావా ?” జ్యేష్ఠ ఆశగా అడిగింది.
“మా జనకుల అనుమతి తీసుకోవాలి ముందుగా ! రా , వెళ్లాం !” శనైశ్చరుడు చేతిని చాపుతూ అన్నాడు. జ్యేష్టాదేవి తన చేతిని అతనికి అందించింది. ఇద్దరూ జంటగా సూర్యమందిరం వైపు నడుస్తున్నారు.
“నాన్నగారూ , ఈమె జ్యేష్ఠ ! ధైర్యంగా తన ముఖంలోకి , ముఖ్యంగా తన నేత్రాలలోకి చూడగలిగే పురుషుడి కోసం అన్వేషిస్తూ నాకు తారసిల్లింది ! నా ముఖంలోకి ధైర్యంగా చూడగలిగే వధువు కోసం నేను కూడా వేచి ఉన్నానని మీకు తెలుసు ! మీరు అనుమతిస్తే…” శనైశ్చరుడు చెప్పుకు పోతున్నాడు.
“ఆశీర్వదిస్తున్నాను , శనైశ్చరా ! ఉభయులూ దంపతులు కండి ! శుభముహూర్తంలో మీ వివాహం జరుగుతుంది !” సూర్యుడు చిరునవ్వుతో దీవించాడు.
ఒక శుభముహూర్తాన జ్యేష్టాదేవీ శనైశ్చరులు భార్యాభర్తలయ్యారు. కశ్యప దంపతులూ , విశ్వకర్మ దంపతులూ , నారదుడూ , నూతన దంపతులను ఆశీర్వదించారు.
” జ్యేష్ఠతో శనైశ్చరుడి సాంసారిక , దాంపత్య జీవితం ప్రారంభమైంది.
“శనిగ్రహ చరిత్ర విన్నారు… ఇక రాహుగ్రహ చరిత్ర !” నిర్వికల్పానంద అన్నాడు.
“సింహికకు జన్మించిన రాహువూ , మృత్యు దేవత నిట్టూర్పులోంచి ఆవిర్భవించి , కశ్యప ప్రజాపతి ఆశ్రమం చేరి , ఆయన పత్ని దనూదేవి పోషణలో పెరిగిన కేతువు…కశ్యపాశ్రమంలోనే పెద్దవాళ్ళయ్యారు… అని మనకు తెలుసు. క్షీరసాగరమథన సమయంలో రాహుకేతువులు మళ్ళీ రంగ ప్రవేశం చేశారు. ముందుగా క్షీరసాగర మథనం ఎందుకు జరిగిందో తెలుసుకోవడం అవసరం. సాగరాన్ని చిలికే అవసరాన్ని కలిగించిన వ్యక్తి దుర్వాసమహర్షి..” నిర్వికల్పానంద వివరించాడు.
“గురువు గారూ ! పరమశివుడి అంశతో సతీ అనసూయకు జన్మించిన దుర్వాసమహర్షి గురించేనా , మీరు చెప్తోంది ?” చిదానందుడు అడిగాడు.
“ఔను ! ఆ దుర్వాసుడే ! వేరొక దుర్వాసుడంటూ ఎవ్వరూ లేరు ! ఆయన మహా కోపిష్టి ! ఆగ్రహించి ఎవరినైనా శపిస్తే , ఇక శాంతించి , ఆ శాపాన్ని ఉపసంహరించే ప్రసక్తే ఉండదు. ఆ దుర్వాస మహర్షి ఒకసారి అరణ్య మార్గంలో వెళ్తున్నాడు…” నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు.
రేపటి నుండి రాహుగ్రహ చరిత్ర ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹