నిత్యపూజా ద్రవ్యసేకరణ
భగవంతుని పూజకై ద్రవ్యాలనన్నింటినీ ముందుగానే సిద్ధం చేసికొని, పూజను మొదలు పెట్టాలి తప్ప ఆయా వస్తువులకోసం మాటిమాటికీ లేస్తూ ఉండడం పద్ధతి కాదు. షోడశోపచారాలకు కావలసిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎటువంటి ద్రవ్యమైనా పర్వాలే దనుకోకుండా ద్రవ్యశుద్ధికి ప్రాధాన్యమివ్వాలి. అన్యాయార్జితంతో భగవంతుని అర్చించడం తగదు.
షోడశోపచారాలలో కీలకమైనవి పంచోపచారాలు. అవి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు. మంచి గంధపు చెక్కని అరగదీసి తీసిన గంధం శ్రేష్ఠం. బజార్లలో అమ్మే గంధం శ్రేష్ఠం కాదు. అది మనం ఒంటికి పూసుకోడానికి కూడా అర్హం కాదని చెబుతారు. విధిలేక దైవకార్యంలో వినియోగించడమవుతుంది తప్ప అది ఉత్తమ ద్రవ్యం కానేకాదు. పుష్పసేకరణ విషయంలో గ్రహింపదగిన అంశాలు చాలా ఉన్నాయి. క్రిందటిరోజున తీసికొని వచ్చిన పూలతో పూజించడం కన్నా ఆరోజున తీసికొని వచ్చి పూజించడం తగినది. కొని తీసికొని వచ్చిన పూలకన్నా, ఇతరుల తోటలోని పూలతో పూజించడంకన్నా స్వయంగా ఏర్పరచుకున్న వనంలోని పూలతో పూజించడం శ్రేష్ఠం. దానిని కూడా శుభ్రమైన పాత్రలో లేదా బుట్టలోకి కోసికొని తెచ్చుకోవాలి.
కరానీతం పటానీతం తత్పుష్పం పరివర్జయేత్
అని శాస్త్ర వాక్యం.
చేతిలోకి తీసికొని వచ్చిన పూలు, గుడ్డలోకి కోసికొని వచ్చిన పూలు దేవుని పూజకు పనికి రావని శాస్త్రం చెప్పింది.ఎడమ చేయి పవిత్రద్రవ్యాన్ని స్వీకరించడానికి అనర్హమైనది. కుడిచేతితో కోసినప్పుడు ఎడమ చేతిలో వేసుకోవలసి వస్తుంది. అందుకే చేతిలో ఆకుని వేసుకుని దానిలోకి కోయాలి. కొందరు వట్టి చేతిలోకి పూలు కోయకూడదని, శాస్త్రార్థం చేతిలో ఆకు వేసుకోవాలని వేపాకంత ఆకుని చేతిలో వేసికొని కోస్తే అది పద్ధతి కాదు.
పూలు కోయటంలో మొదట అస్త్రాయఫట్ అంటూ తూర్పుముఖంగా మొదటి పూవు కోయాలి. కొందరు దేవతలకు కొన్ని పుష్పాలు ఇష్టమైనవి. కావున వారిని ఆ పూలతో పూజించడం మంచిది. అలాగే కొందరు దేవతలకు కొన్ని పూలు ఇష్టం లేనివి. కాబట్టి వారిని ఆ పూలతో పూజింపకూడదు. గణపతికి గరిక, ఆంజనేయస్వామికి తమలపాకు, శివునికి మారేడు, విష్ణువుకు తులసి అనేవి పత్రి విషయంలో ఇష్టమైనవి. పుష్పాల విషయంలో హనుమంతునికి పారిజాతం, శివునికి తుమ్మిపూలు, లక్ష్మీదేవికి పద్మాలు, సూర్యునికి జిల్లేడు పూలు, సరస్వతికి తెల్లని పూలు, విష్ణువుకు నీలం పూలు, అమ్మవారికి ఎర్రని పూలు ఇష్టం. కాగా విష్ణువును గన్నేరు, జిల్లేడు పూలతో పూజింపరాదు. దుర్గాదేవిని గరికతో, సూర్యుని మారేడుతో, భైరవుని ఉమ్మెత్త, జిల్లేడులతో, గణపతిని తులసితో, సరస్వతిని తమాలపుష్పాలతో, శ్రీదేవిని గన్నేరు, జిల్లేడు పూలతో, శివుని మొగలి, దాసాని, వసంతమల్లె, దిరిసెన, అడవిమల్లి, సన్నజాజులతో, శ్రీకృష్ణుని మారేడుతో పూజింపరాదు. అలాగే
”నాక్షతై రర్చయే ద్విష్ణుం”
అనుటవలన విష్ణుమూర్తిని అక్షతలతో పూజింపరాదు. కొన్ని కొన్ని రోజులలో కొన్నింటిని కోయకూడదనే నియమం కూడా ఉంది . ఉదాహరణకు తులసి విషయంలో
“శుక్రవారే, వ్యతీపాతే – ద్వాదశ్యాం శ్రవణే తథా |
నిత్యార్చనా తత్పరోపి – తులసీం న హరే ద్బుధః ||”
అని చెప్పారు. అంటే శుక్రవారంనాడు, వ్యతీపాత యోగం రోజున, ద్వాదశితిథి రోజున, శ్రవణా నక్షత్రం రోజున నిత్యార్చనలో వాడేవారు కూడా తులసీదళాలు కోయకూడదు. నిత్యార్చనాతత్పరులైనవారికి ఆ నిత్యనియమం నెరవేరే దెలా అనేది ప్రశ్న. సహజంగా పత్రపుష్పాలు ఈరోజున తెచ్చినవి రేపటికి
”పర్యుషిత దోషం”
అంటే చద్దిదోషం పొందుతాయి. కాబట్టి పూజకు పనికిరావు. కానీ….
“పలాశం దినమేకం తు – పంకజం చ దినత్రయం |
పంచాహం బిల్వపత్రం చ – దశాహం తులసీదళమ్ ||”
అని కూడా శాస్త్రం చెప్పింది. కాబట్టి మోదుగ పుష్పం ఒకరోజు, పద్మం మూడు రోజులు, మారేడుదళం ఐదు రోజులు, తులసీదళం పదిరోజులు నిల్వ ఉన్నా పర్యుషిత దోషం, అనగా చద్దిదోషం లేదు. మాలాకారుని గృహంలో ఉన్నవాటికి కూడా పర్యుషిత దోషం లేదు. పూలవాడు ఆ పూలు ఎప్పుడు తెచ్చినా వానినుండి మనం తీసుకుని వచ్చినప్పటినుండే పర్యుషిత దోషం వర్తిస్తుంది. అసలు మనం భగవంతునికి అర్పింపవలసినవి ఎనిమిది పూలట.
“అహింసా ప్రథమం పుష్పం – పుష్ప మింద్రియనిగ్రహః
తృతీయం తు దయాపుష్పం – క్షమాపుష్పం చతుర్థకం
ధ్యానపుష్పం తపఃపుష్పం – జ్ఞానపుష్పం తు సప్తమం
సత్యం చై వాష్టమం పుష్పం – ఏభి స్తుష్యంతి దేవతాః ॥
అంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, దయ, ఓర్పు, ధ్యానం, తపస్సు, జ్ఞానం, సత్యం అనే పుష్పాలచేతనే భగవంతుడు తృప్తిపడతాడట. కాన ఈ ఎనిమిది లక్షణాలు సాధించడమే భగవంతునికి గొప్పపూజ చేసినట్లు.
”దైవాధీనం జగత్సర్వం”
అంటే జగత్తంతా భగవంతునికధీనమై ఉంది. ఆ భగవంతుని ప్రసన్నం చేసుకుని జీవితాన్ని సుఖశాంతులతో వెళ్లదీసుకోవడం మన కర్తవ్యం. రోజుకి 24 గంటల సమయాన్ని ప్రసాదించిన ఆ స్వామికోసం ఏ కొంతో సమయం వెచ్చించకపోతే కృతఘ్నులమవుతాం. కాబట్టి నిత్యం యథావకాశంగా కొంత సమయాన్ని భగవత్సేవలో గడపాలి. ఆ సేవ అనేక రూపాలలో ఉంటుంది. అన్ని విధానాలను గానీ, కొన్ని విధానాలను గానీ పాటించవచ్చు. ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం, గురుముఖతః స్వీకరించిన మంత్రాలను జపించడం, ధ్యానం, పారాయణలు, హెూమాలు వంటివే ఆ విధానాలు.
భక్తిని క్రియారూపంగా ప్రకటించే విధానమే పూజ. త్రికరణశుద్ధిగా జరిగేది పూజ. మనసులో భగవంతుని నింపుకుని నామాలను వాగ్రూపంగా ఉచ్చరిస్తూ, కర్మణా పూజను ఆచరించడం జరుగుతుంది. అలా పూజకు ప్రాధాన్యం ఇవ్వబడింది. పూజావిధానమనేది పరంపరకు కూడా మార్గదర్శక మవుతుంది. ఇంట్లో ఒక పూజా మందిరం, దేవుళ్లు, పూజాసామగ్రి ఉంటే తమ తండ్రి పూజచేయడాన్ని వారు చూసి ఉంటారు కాబట్టి, ”మా నాన్నగారు చక్కగా పూజ చేసే వారు. మేం మానితే ఎలా?” అని వారుకూడా ఆ సన్మార్గంలో నడిచే ఆస్కారం ఏర్పడుతుంది. దానిని అర్థం చేసుకునే ప్రయత్నంలో మానసిక పూజ, ధ్యానం ఎలాగూ వంటబడతాయి. కాబట్టి పరంపరయొక్క శ్రేయస్సు కోసమైనా ఇంట్లో చక్కగా పూజా కార్యక్రమాలను నిర్వహించాలి. దేవుని కంటె మనం ఉన్నతాసనంపై కూర్చోకూడదు. పూజకు ముందుగా కావలసిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకోవాలి. మాటిమాటికీ లేచి వెళ్లి వస్తువులను తెచ్చుకోవడం పద్ధతి కాదు. అవన్నీ పూజ మధ్యలో ఆటంకాల క్రిందికే వస్తాయి. అది తగదు. ముందుగా నిర్మాల్యం తొలగించాలి. నిర్మాల్యం ధరింపరాదని, అంతా కూపంలో వదలాలని, మోహవశాన స్వీకరిస్తే రౌరవాది నరకప్రాప్తియని దత్తాత్రేయులవారు తెల్పారు. దేవునికి నిర్మాల్యం శిరోభారం. నిర్మాల్యమంటే క్రితం రోజున పూజించిన పుష్పాదులు. “చక్కగా అందంగా ఉన్నాయండీ! అస్సలు వాడినట్లే లేదు” అంటూ కొందరు నిర్మాల్యాన్ని అలాగే ఉంచుతారు. అది తగదు. మరికొందరు పూలను తీసి, ప్రక్కన పెట్టి, అభిషేకం వంటివి చేసి, ఆ తీసిన వాటినే బాగున్నాయని అంటూ తిరిగి అలంకరిస్తారు. అది మరీ దోషం. నిర్మాల్యంతో పూజించిన పాపం వెంటబడుతుంది. నిర్మాల్యాన్ని తీసి ఎవరూ తొక్కని చోట పారవేయాలి.
ఇక శుభాశుభ కార్యాలన్నింట్లోనూ దీపారాధన ముఖ్యం. తద్దినాలలో, చనిపోయినవారి తలదగ్గర పెట్టే దానికి ఒక్క వత్తినే వేయాలి. శుభకార్యాలలో, దైవకార్యాలలో ఒక్క వత్తి వేసి వెలిగించకూడదు. రెండు వత్తులను తప్పక వెలిగించాలి. మరో వత్తిని వేసి, వెలిగించకుండా ఉంచాలి. దానిని మోహినీవత్తి అంటారు. దీపారాధన ప్రమిద మధ్యలో కుంభవత్తి వేసి, అడ్డవత్తులు రెండు వేసి, కుంభవత్తిని, ఒక అడ్డవత్తిని వెలిగించాలి. ప్రతిష్ఠాత్మకమైన క్రతువులలో వెలిగించే అఖండాన్ని మాత్రం ఒక్కవత్తిగానే వేయాలి. ఇటీవల మధ్య రంధ్రం కల కుందులు వస్తున్నాయి. దానిలోనైనా రెండు వత్తులు కలిపి మాత్రమే వేయాలి. ఆర్పవలసినప్పుడు
”దీప ప్రలోపనం పుంసాం కూష్మాండ భేదనం స్త్రియః”
అంటూ స్మృతి సంగ్రహం మగవారు దీపం ఆర్పరాదని, ఆడువారు గుమ్మడికాయ కొట్టరాదని చెప్పింది. ఆడువారయినా చీరె చెంగులోను, నోటితో ఊది కూడా ఆర్పక వత్తిని, క్రిందికి లాగి ఆపివేయాలి.
వెండి కుందిని వాడుట శ్రేష్ఠము, ఆరోగ్యము. కంచు కుంది దేవతాప్రీతిపాత్రము. రాగికుంది మోక్షప్రదము. లోహపు కుందిని కానీ, మట్టి ప్రమిదను కానీ దీపారాధనకు వాడవచ్చు. లోహాలలో ఇనుము కాకఇతరమైనవి ఎంచుకోవడం శ్రేయస్కరం. ఆ కుందులకు ఒకటి నుంచి ఐదు దాకా ముఖాలు ఉండవచ్చు. ముఖాలంటే వత్తిని ఉంచే గాడులు. రెండు ముఖాలు ఉండేది ఐక్యానికి, మూడు ముఖాలు ఉండేది సంతానానికి, నాలుగు ముఖాలు కలది పశు, ధన సంపదలకు, ఐదు ముఖాలది మంగళాలకు సూచకాలుగా చెబుతారు.
దీపారాధన వత్తిని 3 పోగులతో లేదా 5 లేదా 7 లేదా 9.. ఇలా బేసి సంఖ్యలోని పోగులతో చేయాలి. వత్తులను కొస పైకి ఉండేటట్లు దీపారాధన కుందిలో వేయాలి. ముందుగా కొద్ది నూనె వేసి వత్తిని తడపాలి. ఆచమనం చేసిన తరువాతనే వెలిగించాలి. దీపం ముఖం తూర్పుగా నుంచుట ఆయుర్వృద్ధి. ఉత్తరంగా ఉంచుట ధనధాన్యవృద్ధి. పశ్చిమదక్షిణాలు తగదు. నాల్గుదిక్కులా ఉన్న శుభమే. నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకుండా విడి వత్తిని నూనెతో తడిపి అంటించి, దానితో దీపం వెలిగించాలి. వెలిగించిన పిదప చెయ్యి కడుక్కుని తప్పక నూనె సమర్పించాలి. ముందుగా ఎంత నూనె పోసినా దీపాన్ని వెలిగించాక నూనెను తప్పక వడ్డించాలి.
దీపదేవి ! మహాదేవి ! శుభం భవతు మే సదా |
యావత్పూజా సమాప్తి స్స్యాత్ – తావత్ ప్రజ్ఞ్వల సుస్థిరా ॥
అని నమస్కరించాలి. అనంతరం కుందికి కుంకుమతో అలంకారం చేసి, అక్షతలు, పుష్పాలు సమర్పించి నమస్కరించాలి. అప్పుడే అది దీపారాధన అవుతుంది. దానికి నివేదన పెట్టే పద్ధతిని కూడా కొందరు ఆచరిస్తారు. పూజ పూర్తి అయ్యే లోపల పొరపాటున ఆరిపోతే ప్రాయశ్చిత్తార్థం 108 పర్యాయాలు మూలమంత్రాన్ని జపించి, తిరిగి వెలిగించాలి.
ఇలా పూజా కార్యక్రమాలలో దీపారాధన కీలకాంశంగా గ్రహించాలి. ఆవునేతి దీపారాధన జ్ఞానవృద్ధి, మోక్షప్రాప్తి కల్గిస్తుందని, నువ్వునూనె సంపదలను వృద్ధి చేస్తుంది, కీర్తినిస్తుంది అని మేరుతంత్రం చెప్తోంది. ఆవునేతితో చేసిన దీపారాధన ఆయా దేవతలకు కుడివైపున, నువ్వులనూనెదయితే ఎడమవైపున ఉంచాలి.
తెల్లవారుజామున దీపారాధన కుటుంబశ్రేయస్సు, సంపదలనిస్తుంది. ఉద్యోగం, జీవితభాగస్వామి, సంతతి కోరేవారు సాయంసంధ్యవేళ దీపాలు వెలిగించాలి. తామరపూలకాడలతో చేసిన వత్తులవలన వంశంలోని పూర్వజుల దోషాలు పోతాయి. అరటి దూటతో తయారుచేసిన పోగుల దీపంచే పుత్రసంతతి, దైవకటాక్షం, పూర్వుల శాపవిమోచన జరుగుతాయి. తెల్లజిల్లేడు బెరడునుండి చేసిన వత్తులచే దేవీకటాక్షం చేకూరుతుంది. జఠర వ్యాధులు తొలగగలవు. నువ్వులనూనె దీపం పొగకు అణుశక్తి బాధను తగ్గించే గుణముందని రష్యన్ వైజ్ఞానికులు చెప్పారు.
‘అఖండ దీపహీనా యా సా పూజా నిష్పలా భవేత్”
దీపారాధన లేని పూజ వ్యర్థం. ఆ దీపానికి క్రింద ధాన్యం పోసి ఉంచాలి. నిత్యపూజలో ఒక ఆకు కానీ, పళ్లెం కానీ కుంది క్రింద ఉంచాలి. అంతే తప్ప నేలమీద పెట్టకూడదు.
ఘంటానాదం
పూజ ఆరంభించే ముందు ఘంటానాదం చేయాలి. ఇంట్లో ఉండే ఘంట చేగంట. దేవాలయాలలో వాయించేది పెద్ద ఘంట. చేఘంట అంటే చేతితో వాయించే ఘంట అని కాదు. పెద్ద ఘంటని కూడా చేతితోనే వాయిస్తాము. మరి చేఘంట అంటే ఏమిటి? అంటే, చేతితో పట్టుకుని వాయించేది అని. ముందుగా ఘంట వాయించడం ఎందుకనే విషయంలో అది దేవతలకు ఆహ్వానం చేయడమని శాస్త్రం చెప్పింది.
“ఆగమార్థం తు దేవానాం – గమనార్థం తు రక్షసాం |
కురు ఘంటారవం తత్ర – దేవతాహ్వాన లక్షణమ్ ||”
అనేది ప్రమాణ శ్లోకం. అంటే దేవతలు వచ్చుటకొరకు స్వాగతంగాను, రాక్షస శక్తులు ఆ పరిసరాలనుండి తొలగిపోవుటకును దేవతాహ్వాన లక్షణంగా ఘంటానాదం చేయాలని భావం. మంగళ వాద్యంతో ఆరంభించడం శుభకరం. విశేష కార్యక్రమాలలో మంగళ వాద్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతాము కానీ, నిత్యపూజకు ఏర్పాటు చేసుకోలేము. కాబట్టి ఆ స్థానంలో కూడా ఘంటానాదం వినియోగమవుతుంది.
ఘంటానాదం చేసే ఘంట విషయంలో కూడా నియమా లున్నాయి. ఘంటకు కంచులోహం శ్రేష్ఠం.
”కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?”
అన్నాడు వేమన. ఘంట కొడితే దానినుండి ఓంకార నాదం రావాలి. ఐతే దీనిని పెద్ద ఘంటలలోనే గమనించగలం. అలాగే ఘంటానాదంలో అనురణన ధ్వని అంటే ఖం….గుమనటం వినిపించాలి. ఘంటను పవిత్రంగా చూడాలి. దేవునికి సంబంధించిన ఘంట, ఏకహారతి వంటివాటిని నేలపై పెట్టకూడదు. దేవాలయాలలో వినియోగించే ఘంటలనైతే ప్రతిష్ఠా సమయంలో సంప్రోక్షణ జరిపే వినియోగిస్తారు. ఇంట్లో వినియోగించుకునే దానిని, కొత్తగా కొన్నదానిని అలాగే వాడేయకుండా పాలతో శుద్ధి చేసి, అనంతరం వినియోగించాలి. తాపతాడనాది దోషాలు పోవడానికి అది కనీసావసరం. వాటిపై నంది, హనుమంతుడు, సుదర్శనచక్రం వంటి బొమ్మలుంటాయి. శైవులు నందిమూర్తి గల గంటను, రామభక్తులు హనుమన్ మూర్తి గల గంటను, వైష్ణవులు సుదర్శన చక్రం కలదాన్ని ప్రీతితో వినియోగిస్తారు. స్మార్తులు హరిహర అభేదతత్వం కలవారు కనుక దేనినైనా ప్రీతితోనే వినియోగిస్తారు.
కొందరు ఘంట లేని కారణంగా ఉద్దరిణనో లేదా చెంబు గరిటెలనో మ్రోగిస్తూ ఉంటారు. అది ఏమాత్రం తగదు. అటువంటి శబ్దాలు దుష్టశక్తులకు ఆహ్వానమవుతాయి. అలా మ్రోగించడంకంటే మిన్నకుండటం మేలు. కొందరు ఆ సమయంలో శంఖనాదం వంటివికూడా చేస్తూ ఉంటారు అదీ మంచిదే. ఘంటయే కదా అని పశువుల మెడలో కట్టే ఘంటలను పూజలో వినియోగించరాదు. ఘంటానాదం ధ్వనికాలుష్య దోషాన్ని తొలగిస్తుంది. పవిత్ర శబ్దం అయినందున అది పరిసర వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. మనలను కూడా పవిత్రులను చేస్తుంది. అన్యచిత్తమునుండి మరల్చి భగవంతునియెడ సుముఖులను చేస్తుంది. ఘంటను శాస్త్రం దైవస్వరూపంగా చెప్పింది.
“శబ్ద బ్రహ్మమయీ ఘంటా – సర్వరక్షో వినాశినీ బ్రహ్మాండ గోళకాకారం – శుద్ధ కాంస్య వినిర్మితా॥
ఘంటాయాం బ్రహ్మదైవత్వం – ముకులం శక్రదైవతం సూత్రాణాం తు మహానాగః – తజ్జిహ్వాయాం షడాననః ॥
ఘంటా నాదే మహాదేవః ఇతి ధ్యాత్వా సమర్చయేత్||”
ఈ రీతిగా ధ్యానం చేసి ఘంటను పూజించి అనంతరం వినియోగించుమని శాస్త్రం చెబుతోంది. దాని భావం ఘంట అనేది శబ్దబ్రహ్మమయమైనది. అది సమస్త రాక్షస శక్తులను తొలగించగలది. బ్రహ్మాండం ఆకారంలో ఉండేది, మంచి కంచుతో తయారు చేసినది అయిన ఘంటలో బ్రహ్మదేవుని భావన చేయాలి. దాని మొగ్గ వంటి భాగానికి ఇంద్రుడు అధిదేవత. దానికి కట్టిన తాడుకు మహానాగం అధిదేవత. ఘంటలోపల నున్న జిహ్వ (కాయ)కు కుమారస్వామి అధిదేవత. ఘంట నాళానికి మహాదేవుడైన శివుడు అధిపతి. ఆయా భాగాలలో ఆయా దేవతలను భావనచేస్తూ ధ్యానం చేయాలి. అలాగే ఘంటకు వాసుదేవుడు, లోపలి నాలుకకు సరస్వతి, మ్రోగించుటకు అగ్ని, పిడికిలికి సూర్యుడు, మ్రోతకు ఈశ్వరుడు అధిదైవతాలుగా నారద సంహిత చెప్తోంది.
“ఆదౌ మధ్యే భిషేకాంతే – ధూపే దీపే తథైవ చ నీరాజనే చ శయనే – ఘంటానాదం సమాచరేత్ ॥
ఘంటానాద విహీనా యా – సా పూజా నిష్పలా భవేత్”
పూజ ఆరంభంలో, అభిషేక ఆరంభంలో, మధ్య, చివర, ధూపం చూపించేటప్పుడు, దీపం చూపించేటప్పుడు, కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు, శయనానికి ముందు ఘంటానాదం చేయాలి. ఆలయం తెరిచేటప్పుడు, అర్ఘ్యము, భూతబలి, కల్యాణ సమయములందు కూడా ఘంటానాదం చేయాలి. ఘంటానాదం చేయని పూజ నిష్ఫలం అని కూడా ఈ శ్లోకం చెప్పింది. దీనిని బట్టి పూజ సఫలం కావడానికి తప్పక ఘంటానాదం చేయాలని గ్రహించాలి. కాబట్టి పూజామందిరంలో ఘంటను తప్పక సిద్ధం చేసికొని ఉంచాలి.
ఘంట కొట్టే పద్ధతి కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. ఎలా పడితే అలా ఘంట కొట్టకూడదు. పూజ చేయని సమయంలో ఊరకే ఘంట కొట్టడం కూడా దోషం. పిల్లలు మోగించడానికి ఆటవస్తువుగా ఇవ్వడం పాపం. దేవుని స్నానసమయంలో, ధూపం ఇచ్చే సమయంలో, దీపం చూపించేటప్పుడు ఘంటని ఏకపార్శ్వంగానే కొట్టాలి. అంటే ఒక పక్కనే తగిలేటట్లు మోగించాలి. రెండు పార్శ్వాలకూ కొట్టినట్లైతే అది మేక మెడగంట వంటిది అవుతుంది తప్ప దేవుని గంట కాదు. ఇతర సమయాలలో అంటే పూజ ఆరంభ, మధ్య, పూజాంత నీరాజన సమయాలలో రెండు వైపులా తాకేటట్లు కొట్టాలి. అంతే కాదు. కొన్ని సమయాలలో అసలు గంట కొట్టకూడదని చెప్పబడింది. నైవేద్య సమయంలో ఘంటానాదం, వాద్యఘోష, నృత్యగీతాదులు చేస్తే రౌరవాది నరకం ప్రాప్తిస్తుందని శైవాగమం చెబుతోంది. ఘంటానాదం చేయాల్సిన సమయాలలో నైవేద్య సమయం చెప్పలేదు. దీనిని పాటించకుండా చాలామంది గుడులలో సైతం భక్తులు దేవుని నైవేద్య సమయంలో ఘంటలను గణగణా మోగిస్తుంటారు. అది చాలా తప్పు, హారతి ఇచ్చే సమయంలో ఘంటను ఆ విధంగా గణగణా మోగించవచ్చు.
గుడిలో ప్రవేశించగానే ఘంటకొట్టి, దేవునికి ఎదుటినుండి నమస్కరించాలి. గుడిలో ఘంటానాదం చేస్తే వంద జన్మల పాపంనుండి విముక్తులవుతారని స్కాందపురాణం చెప్పింది. ఆలయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భంగం కలిగేటట్లుగా ఘంటకొట్టడం, వినోదంగా ఘంటకొట్టడం, గుడి మూసిన తరువాత రాత్రి వేళలో ఘంట కొట్టడం పాపహేతువు. తగని పని. విధి నిషేధాలను తెలిసికొని, పాటిస్తూ, నిత్యార్చనలో తగిన రీతిగా ఘంటానాదం చేయడం ద్వారా పూజ పరిపూర్ణమవుతుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹