తిలకధారణ
వస్త్రధారణ కాగానే చేయదగినది తిలకధారణ. అలెగ్జాండర్ కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త మన కళ్ల మధ్య ఉండే భృకుటి ధన విద్యుత్ కేంద్రమనీ, మెడ వెనుక భాగం ఋణ విద్యుత్ కేంద్రమనీ చెప్పాడు. అట్టి మానవ ధన విద్యుత్ కేంద్రాన్ని ప్రభావితం చేయగలది తిలకధారణ. అది పీయూష గ్రంథి స్థానం. అదే జ్ఞానగ్రంది. తిలకధారణవల్ల అది ప్రభావితమవుతుంది. దానికి చురుకుదనం కలిగితే మేధావి అవుతాడు. దూరదృష్టి, దివ్యదృష్టి వంటివి చేకూరుతాయి. ముద్రణావకాశాలు, ప్రచారావకాశాలు లేని కాలంలో అన్నీ వివరించడం కష్టం కాబట్టి తమకు తెలిసినా అన్నీ వివరించలేకపోయారు.
కర్తవ్యాలను పుణ్యమనీ, అకర్తవ్యాలను అనగా చేయకూడని వాటిని పాపమనీ చెప్పారు. భౌతిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక దృక్పథం ముఖ్యమైనదిగా పరిగణన పొందిన కాలం కాబట్టి ఆ కాలంలో ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రయోజనాలనే వివరించారు. అట్టి రెండువిధాలా ప్రయోజనం కలిగినది తిలకధారణ.
“కుర్యాత్ తిలకవాన్ కర్మ – వస్త్రద్వయ యుత స్తథా |
దానం ప్రతిగ్రహోూ హోమః – భోజనం బలిరేవ చ” ||
దానం చేయడం, దానం స్వీకరించడం, హెూమం, భోజనం, బలిసమర్పణ అనేవి చేసే సమయంలో తప్పక వస్త్ర ద్వయం – అనగా పైకండువా కూడా ఉండడం, నుదుటన తిలకం ధరించటం తప్పనిసరి అని ధర్మశాస్త్రం చెబుతోంది. అందుకే శుభకార్యాలలో బట్టలు పెట్టేటప్పుడు తనకు కండువా లేని పక్షంలో, అప్పటికప్పుడు ప్రక్కవాని ఉత్తరీయాన్ని తీసుకునో, లేదా, జేబు గుడ్డనో భుజాన వేసుకొని ఆ పని పూర్తిచేయడాన్ని చూస్తుంటాము. బొట్టు లేని పక్షంలో, దానిని కూడా అప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటారు.
బొట్టువల్ల లౌకిక, అలౌకిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బాహ్యాభ్యంతర సౌందర్యాలున్నాయి. బొట్టు లక్ష్మీకరం. చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడాలనీ, బొట్టుపెట్టుకో అనీ సూచిస్తారు. దైవకార్యాలకు బొట్టు తప్పక ఉండాలి కాబట్టే దేవాలయాలలో బొట్టుని అందరికీ అందుబాటులో ఉంచుతారు. బొట్టు పరాక్రమ చిహ్నం. బొట్టు విజయచిహ్నం కూడా. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో వారికి వీరతిలకం దిద్దడాన్ని చూస్తాము.
బొట్టు అందాన్నిస్తుంది. బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుని, తిరిగి బొట్టు లేకుండా అద్దంలో చూసుకుంటే తేడా తెలుస్తుంది. బొట్టు పెట్టుకున్న ముఖానికి ఉన్న అందం, బొట్టు పెట్టుకోని ముఖానికి ఉండదు.
బొట్టు మంగళకరం. చిత్తశుద్ధి నిస్తుంది. పవిత్రతను కూరుస్తుంది. దృష్టిదోషాన్ని పోగొడుతుంది. ఆధ్యాత్మికతకు దోహదం చేస్తుంది. బొట్టు ఆరోగ్యప్రదం కూడా. జ్ఞానసిద్ధి తిలకధారణ చేసే స్థానంలోనే జరుగుతుందని యోగినీ తంత్రం చెబుతోంది. తిలకధారణ చేయవలసిన స్థాన మేది? అంటే
”భ్రువోః ఘ్రాణస్య యత్సంధిః స ఏషః”
అని చెప్పబడింది. కనుబొమలను కలుపుతూ గీత గీసి, దానిని ఖండిస్తూ ముక్కుకు సూటిగా గీత గీస్తే ఆ రెండు రేఖలు కలిసే చోటే మనం తిలకధారణ చేయవలసిన స్థానం. అదే ఆజ్ఞాచక్ర స్థానం. బ్రహ్మ దర్శన స్థానం. అవిముక్త స్థానం. అవిముక్త స్థానంగా వారణాసిని చెప్పారు.
ఆ స్థానాన్నే హరిద్వారమూ,బ్రహ్మ దర్శన స్థానమని కూడా అంటారు. బొట్టు పెట్టుకొనే చోట పంచనాడులు కలుస్తాయి. అక్కడ సూర్యకిరణాలు తగలటం మంచిది కాదు. కాబట్టి ఆ కేంద్రంలో రక్షణ కోసం తిలకధారణ పెద్దదిగా చేయాలి. చూడగానే దృష్టిలో ఏది పడుతుందో దానికి దృష్టిదోషం తగులుతుంది. ముఖాన స్పష్టంగా బొట్టు ఉంటే దృష్టిదోషం దానికి తగిలిపోతుంది.
దృష్టిదోషాలతో ఉంటుంది కాబట్టి స్నానంతో బొట్టు పోయేట్లు చూడాలి. బొట్టుబిళ్ళలు బొట్టుఫలితాన్ని పూర్తిగా ఈయవు. దానికి తోడు ముఖం కడుగుకొంటూ బిళ్ళను గోడకు తగిలించి మరల దానినే ధరిస్తే దోషాలు ఎలా తొలగుతాయి?
స్నానానంతరం తిలకధారణ అంటే బొట్టు పెట్టుకొనటం కర్తవ్యం. తిలక శబ్దానికి రెండు నిర్వచనాలను చెప్పారు.
”తిలతీతి తిలకం”
అంటే మెరుగై ఉండేది అని ఒక అర్థం.
“తిల ఇవ తిష్ఠతీతి తిలకం”
అంటే నువ్వు గింజలా ఉండేది అని. అంటే ఆ ఆకారంగా ఉండేదని. అంతే తప్ప అంత చిన్నదిగా కనబడీ కనబడనట్లుగా ఉండేదని కాదు. దాని ఆకారాన్ని గురించి చెప్పిన శ్లోకం.
”వర్తి దీపాకృతిం వాపి – వేణు పత్రాదికం తథా |
పద్మస్య ముకుళాకారం తథైవ కుముదస్య వా ॥”
అంటే.. దీపారాధన చేసినప్పుడు వెలిగే దీపం ఆకారంగా కానీ, వెదురు ఆకులా కానీ, ముడుచుకుని ఉన్న పద్మం, లేదా కలువ ఆకారంగా కానీ తిలకం ఉండాలని అర్థం. యోగశాస్త్రం ప్రకారం శరీరంలో వేల సంఖ్యలో నాడు లుంటాయి. ప్రాణశక్తిని ప్రవహింపజేసే ఈ అదృశ్య నాడులకు కేంద్రస్థానం భ్రూమధ్య ప్రదేశం. అక్కడ తిలకాన్ని ధరించడంవల్ల ఆ నాడులన్నీ ప్రభావితమవుతాయి. తిలకంలో వినియోగించే ద్రవ్యాలు మృత్తిక, జలం, చందనం, భస్మం, పసుపు వంటివి వాటిని ప్రభావితం చేస్తాయి. శ్రీ గంధం దేహాన్ని చల్లబరచగా, కుంకుమ తేజస్సును పెంచుతుంది. విభూది పీడలను దరిజేరనీయదు.
ఊర్థ్వపుండ్ర ధారణ
ఊర్థ్వపుండ్ర ధారణలో వినియోగించే నల్లటి మన్ను శాంతికరం. రక్తమృత్తిక వశ్యకరం. గోపీచందనం (పచ్చని మన్ను) లక్ష్మీప్రదం. తెల్లటి మన్ను మోక్షప్రదం. తెల్లటి రేఖలు మహావిష్ణు పాదాలకు సూచకంగా, మధ్య ఎర్రని రేఖను లక్ష్మీకళగా గ్రహించాలి. రెండు తెల్లరేఖలను కలిపే భాగం ఆ భగవంతుడిని ఆశ్రయించిన జీవునికి సూచకం. సంధినుండి కిందకు పాదం ఏర్పరచడమూ, ఏర్పరచకపోవడమూ రెండు విధానాలున్నాయి. పాదం వచ్చేది తెంగళ్ అనీ, లేనిది వడగళ్ అనీ చెప్పబడతాయి.
గోపీ చందన! పాపఘ్న! విష్ణులోక సముద్భవ! |
చక్రాంకిత! నమస్తుభ్యం ధారణా న్ముక్తిదో భవ ॥
అంటూ శ్వేతమృత్తికను స్వీకరించాలి.
“ఇమం మే గంగే యమునే సరస్వతి”
అనే మంత్రం చెబుతూ జలా లను స్వీకరించాలి.
“విష్ణోర్నుకం వీర్యాణి”
అనే మంత్రం చెబుతూ మృత్తికను జలంతో కలపాలి. ఆ మర్దించిన మృత్తికను
“అతో దేవా అవన్తునో యతో విష్ణు ర్విచక్రమే”
అనే మంత్రంతో మూడు సార్లు అభిమంత్రించాలి. విష్ణుగాయత్రీ మంత్రంతో కానీ, కేశవాది నామాలతో కానీ గృహస్థులు పన్నెండు చోట్ల ఊర్థ్వపుండ్రం ధరించాలి. లలాటం, ఉదరం, హృదయం, కంఠం, కుడి ఉదరం, కుడి బాహుమధ్యం, ఎడమ ఉదరం, ఎడమ బాహుమధ్యం, కుడి ఎడమ స్కంధభాగాలు, వీపు, కంఠ పశ్చిమభాగం అనేవి ధారణ స్థానాలు. బ్రహ్మచారి, వానప్రస్థుడు మాత్రం లలాటం, కంఠం, హృదయం, రెండు బాహువులలో మాత్రం విష్ణుగాయత్రి, లేదా కేశవాది నామపంచకం పఠిస్తూ ధరించాలి. ధారణం అయాక హస్త ప్రక్షాళన జలాన్ని శిరస్సున ప్రోక్షించుకోవాలి. బృహన్నార దీయంలో…
“స్నానం దానం జపో హెూమః – సంధ్యా స్వాధ్యాయ కర్మసు ।
ఊర్థ్వపుండ్ర విహీనశ్చేత్ – తత్సర్వం నిష్ఫలం భవేత్ “||
అని చెప్పబడింది. స్నానం, దానం, జపం, హెూమం, సంధ్యావందనం, వేదపఠనం మున్నగు కర్మలను ఊర్ధ్వపుండ్రం లేకుండా చేస్తే అవన్నీ వ్యర్థమని దాని భావం. శుక్లపక్షంలో కేశవాది నామాలతో, కృష్ణపక్షంలో – సంకర్షణాది నామాలతో 12 చోట్ల ధరించాలని చెప్పబడింది. పద్మపురాణంలో ఊర్థ్వపుండ్ర ధారణ విధానం ఇలా చెప్పబడింది.
“లలాటే కేశవం వింద్యాత్ కంఠే శ్రీ పురుషోత్తమం |
నాభౌ నారాయణం దేవం – వైకుంఠం హృదయే తథా ॥
దామోదరం వామపార్శ్వే – దక్షిణే చ త్రివిక్రమం |
మూర్త్ని చైవ హృషీకేశం – పద్మనాభం చ పృష్ఠతః॥
కర్ణయో ర్యమునాం గంగాం బాహ్వెః కృష్ణం హరిం తథా ॥
యథా స్థానేషు తుష్యన్తి – దేవతాః ద్వాదశ స్మృతాః “||
అని ఉచ్చరిస్తూ ఆయాస్థానాలలో ధరించాలి. అదంతా సాధ్యం కాదనుకుంటే
“శంఖచక్ర గదాపాణే! ద్వారకానిలయాచ్యుత! |
గోవింద! పుండరీకాక్ష! రక్ష మాం శరణాగతమ్ ||
అంటూ ధరించాలి. ఊర్థ్వపుండ్ర ధారణ భాగవతులకు ప్రణవధారణగానే చెప్పబడింది. పై విధానమంతా మంత్రాలతో, స్వరాలతో చేయలేనివారికి ఈ క్రింది విధానం తెలుపబడింది. ఇది శ్రీ చూర్ణం ధరించే విధానం.
“అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః”
అంటూ మూడుసార్లు జలం స్వీకరించి (అనగా ఆచమనం చేసి) వాసుదేవునికి నమస్కరించి..
“అచ్యుతానంత గోవింద – నామోచ్చారణ భేషజాత్ ।
నశ్యంతి సకలా రోగాః – సత్యం సత్యం వదామ్యహమ్” ||
అనిన పిదప, పైన చెప్పిన శంఖచక్రగదాపాణే శ్లోకం చదువుతూ ధరించాలి. భగవద్రామానుజులవారు కులమత భేదాలు లేకుండా సమస్త జాతులవారికీ మంత్రోపదేశం చేశారు. ఆ నామం స్వీకరించినవారందరికీ ఈ నామం అవసరమైనదే. విధానం తెలుసుకుని ధరించడం శ్రేయోదాయకం.
తిర్యకుండ్రం
అడ్డంగా పెట్టే బొట్టును తిర్యక్పుండ్రం అంటారు అంటే మూడు విభూది రేఖలు ధరించడం. శివపూజ చేసేవారు తిర్యక్పుండ్రాన్ని తప్పక ధరించాలి. అంతమాత్రమే కాదు.
“సత్యం శౌచం జపో హెూమః – తీర్ధం దేవాదిసేవనం |
తస్య సర్వ మిదం వ్యర్థం యస్క్రిపుండ్రం న ధారయేత్ ||
అంటూ భవిష్యత్ పురాణం విభూది ధరించకపోతే ఎంత నష్టమో చెప్పింది. సత్యం పలకడం, శౌచ మాచరించడం, జపహోమాలు చేయడం, తీర్థం స్వీకరించడం, దేవతలను సేవించడం అన్నీ వృథా అవుతాయని తెలిపింది. శ్రాద్ధ, యజ్ఞ, జప, హెూమ, వైశ్వదేవ, దేవతార్చనలను విధిగా విభూది ధరించే చేయాలనీ, అలా చేయడంవలన మృత్యుంజయుడవుతాడనీ ధర్మసింధువు తెలిపింది.
త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, త్రిలోకాలు, వేదత్రయం, అగ్నిత్రయాలకు ప్రతీకలుగా మూడు విభూది రేఖలను చెప్పారు.
”భూత్యైన ప్రమదితవ్యం”
విభూదిని ధరించే విషయంలో ఏమరుపాటు వద్దు. అన్న తైత్తిరీయ వాక్యం విభూది ధారణ విషయంలో వేదాదేశమని చెబుతారు.
”విభూతి ర్భూతి రైశ్వర్యం”
అని అదే సంపదగా లౌకికంగానూ, అదే బూడిద వైరాగ్య చిహ్నంగా అలౌకికంగానూ వివరించారు. విభూదిని గురించి కాలాగ్నిరుద్రోపనిషత్తు, భస్మ జాబాల్యుపనిషత్తు, బృహజ్జాబాల్యుపనిషత్తు, అధర్వ శిఖోపనిషత్తు, బహుపురాణాలు ఎంతగానో చెప్పాయి.
విభూదిని ఏ అవయవానికి ధరిస్తే ఆ అవయవపు పాపం తొలగిపోతుందని యాజ్ఞవల్క్య మహర్షి తెలిపారు. నొసట మూడు భస్మరేఖలు ధరించిన నరుడు శుద్ధాత్ముడై మృత్యువును జయిస్తాడని కాత్యాయనుడు తెల్పాడు. విభూది ధారణలో రేణువులు క్రిందపడనీయరాదు. విభూది ధరించినవాడు వేదాధ్యయనం చేసిన ఫలం, త్రిసంధ్యలలో త్రేతాగ్నులను అంటే ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులను అర్చించిన ఫలం పొందుతాడు. విభూదికి మంత్రశక్తిని ధరించే గుణం ఉంది. కాబట్టి జ్వర, భయాది దోషాలలో విభూదిని మంత్రించి ఇస్తారు. వైద్యశాస్త్రంలో కూడా
“పుణ్యం గోమయ భస్మ భాగ్యజనకం శ్లేష్మాణ మున్మీలయత్”
అంటూ ఆవు పేడతో చేసిన భస్మం శ్లేష్మాన్ని, వాతాన్ని, రక్తపు వేగాన్ని తగ్గించేదిగా, శాంతిప్రదమైనదిగా, శీతపైత్యాన్ని తొలగించేదిగా చరకుడు చెప్పాడు. నిత్య నిరంజన నిరాకార పరబ్రహ్మ చిహ్నం విభూది దానిని కాల్చినా ఏ మార్పూ లేక అదే మిగులుతుంది. దీనిని ధరించే విధానమే కాక తయారు చేసే విధానాన్ని కూడా ధర్మజ్ఞులైన మహర్షులు విశేషంగా తెలిపారు.
గృహస్థులు విభూదిని తడిపే మూడు సంధ్యలలో ధరించాలి. యతులు, బ్రహ్మచారులు, భర్తృహీనలు తడపకుండా పొడిగానే ధరించాలి.
“సద్యోజాతం ప్రపద్యామి, వామదేవాయనమో, అఘోరేభ్యో, తత్పురుషాయ, ఈశాన
మంత్రాలు పలుకుతూ భస్మాన్ని గ్రహించాలి.
”అగ్నిరితి భస్మ”
అనే మంత్రంతో మర్దించాలి.
”త్రాయుషం జమదగ్నేః”
”త్ర్యంబకం యజామహే”,
”యే తే సహస్ర మయుతం”
అనే మూడు మంత్రాలు చెబుతూ 15 చోట్ల విభూదిని ధరించాలి. నుదుట, నొసట, చెవులు, కంఠము, రెండు బాహువులు, వక్షస్థలం,నాభి, వీపు, మూపు, రెండు మణికట్లు, రెండు భుజాలలో ధరించాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు – ఈ రెంటితో రెండు రేఖలు ఎడమనుండి, కుడికి పెట్టి, వాటి మధ్యలో మూడవ రేఖను బొటనవ్రేలితో కుడినుండి ఎడమకు పెట్టాలి. బ్రహ్మచారులు హెూమభస్మం ‘మానస్తోక మంత్రం’తో గ్రహించి, ‘మేధావీ భూయాసం’ అని లలాటాన, ‘తేజస్వీ భూయాసం’ అని దక్షిణ బాహువున, వర్చస్వీ భూయాసం’ అని వామ బాహువున, ‘బ్రహ్మవర్చస్వీ భూయాసం’ అని హృదయాన, ‘ఆయుష్మాన్ భూయాసం’ అని కంఠాన ధరించాలి. ఈ స్థలాలన్నీ నాడులు అందే చోట్లు, ఇంజక్షన్ చేయడం, తీవ్రమయిన జ్వరం వచ్చినప్పుడు తడిగుడ్డ వేయడం, గుండె మోత వినడం వంటివి జరిగే చోట్లు. వానియందు ధరించడంవల్ల రక్తంలోని వేడి, మాలిన్యం తొలగిపోతాయి. సాధారణంగా ధరించదలచినవారు ‘ఓం నమశ్శివాయ” అని స్మరిస్తూ నొసట, హృదయాన, చేతులందు ధరిస్తే చాలు.
విభూదిని సిద్ధం చేసుకునే విధానాన్ని కూడా శాస్త్రం చెప్పింది. రావి, మోదుగ వంటి సమిధలను హుతం చేయగా వచ్చే హెూమభస్మాన్ని స్వీకరించడం మేలు. ఆవుపేడతో తయారుచేసేవారు ఉండలు చేసి పుటం పెట్టి చేసుకోవాలి. గోమయం లక్ష్మీస్థానం, లక్ష్మీప్రదం.
విభూతి అంటే నంద అనే కపిలగోవు గోమయంతో చేసినది. దీనిని నిత్యం వాడాలి. సకల ప్రయోజనాలూ చేకూర్చగలది. భసితం అంటే భద్ర అనే నల్లని ఆవు వేసిన పేడతో చేసినది. నైమిత్తికాలలో దీనిని వాడాలి. ఇది అష్టసిద్ధులనూ ప్రసాదింపగలది. భస్మం అంటే సురభి అనే తెల్లని ఆవు వేసిన పేడతో చేసినది. ప్రాయశ్చిత్త కర్మలలో దీనిని వాడాలి. ఇది సమస్త పాపాలనూ భస్మం చేస్తుంది. క్షారం అంటే సుశీల అనే ధూమ్రవర్ణపు గోవు వేసిన పేడతో చేసినది. కామ్యకర్మలలో దీనిని వాడాలి. ఆపదలనుంచి రక్షించగలది. రక్ష అంటే ”సుమన” అనే ఎరుపు రంగు ఆవు వేసిన పేడతో చేసినది. మోక్షప్రదమైన కర్మలలో దీనిని వాడాలి. భూతప్రేతాదులనుండిరక్షించేది.
”ధి గృస్మరహితం ఫాలం”
అంటే విభూది లేని ముఖం వ్యర్ధమని చెప్పారు.
”భర్త్సనం భస్మ లక్షణం”
అని పాపాలను నశింపజేయడం విభూది లక్షణం. దీనిని మారేడు కాయలో పదిలపరచుకుని వాడడం శ్రేయస్కరం. త్రిపథ గంగవలె మూడు రేఖల విభూది జ్ఞానగంగగా తెలుపబడింది. త్రిసంధ్యలలో విభూది ధరించడంవలన సర్వపాపాలనుండి విముక్తులై, శివుని దయకు పాత్రులవుతారని భవిష్యత్పురాణం చెబుతోంది.
విష్ణుస్మృతిలో కూడా బొట్టు లేకుండా చేసే యాగ, దాన, జప, హోమ, విద్యాభ్యాస, పితృతర్పణాదులన్నీ నిష్ఫలాలవుతాయని చెప్పబడింది. గంధం పురుష స్వరూపు డగు భగవంతునకు, కుంకుమ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి సూచకం అంటారు. భగవంతుని వ్యాపకతను సూచిస్తూ గంధము పూసుకొనుట, ప్రకృతియొక్క మిధ్యాత్వం సూచిస్తూ బొట్టు పెట్టుకొనుట ప్రకృతిపురుషుల నిత్యసంభావనము.
మధ్వమతంలో గోపీచందనంతో నిలువుబొట్టు పెడతారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి దీపపువత్తిలా ధరించాలని వారు సూచింపగా, కొందరు శాక్తేయులు కేవలం కుంకుమనే అడ్డంగా దిద్దుకొని అంతా శక్తిమయంగా వారి భావన సూచిస్తారు. ఇలా తిలకాలు ఆయా తత్వాల సూచకాలుకూడా ఔతాయి.
కృష్ణునకు కస్తూరీతిలకం, శివునకు విభూది, విష్ణువునకు తిరునామం, శక్తికి కుంకుమ, హనుమంతునకు సింధూరం, శుభమునకు కళ్యాణం బొట్టు, అశౌచానికి నల్లనిబొట్టు ఇలా అయా సంబంధం బట్టి ఆయా తిలకాలు తెలుప బడినాయి. అటువంటి తిలకములు ధరించేవారికేకాక చూచేవారికికూడా దైవభావ ప్రేరకా లౌతాయి.
”నేను హిందువును” అని స్వాభిమానంతో చెప్పుకొనదలచినవారల్లా బొట్టు పెట్టుకుతీరాలి. సగర్వంగా హిందువుగా ప్రకటించుకొనవలసినవారు నేడు హిందువుగా ప్రకటించుకొనటానికి వెనకాడుతున్నారు. దీనికి కారణం ఒక బలహీనత. లోపల హిందుత్వం కలిగి ఉండికూడా బయటకు అలా కన్పడటానికి వెనుకాడే పరిస్థితి చాలామందిలో ఉంది. ఆ కారణంవల్ల ఒకరినిచూచి ఒకరు బొట్టు లేకుండానే ఉంటున్నారు. దాన్ని సమర్థించుకొనటం కోసం ”మన మతభావాలు బయటకు కన్పించాలా? అది నా కిష్టంఉండ” దంటూ ఏదో వివరణిస్తారు. అలా అనటంద్వారా వారిని పెద్దలుగా గ్రహించేవారంతా అదేబాటలో పోతున్నారు.
”యద్య దాచరతి శ్రేష్ఠః”
అనేది అంద రెరిగినదేకదా! మన మనసులో దాచుకొంటే మన తరువాతతరాలకు అది తెలియదుకదా! వారు మనసులోకూడా లేకుండా శూన్యత పొందుతారు. తదుపరితరం మా కలాంటివి ఆనవాయితీ లేదంటే, పిదపవచ్చేవారు వీనికి వ్యతిరేకులే అవుతారు. ఇతరులెవ్వరూ వారి విధానాలు వీడరు. హిందువు అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మశక్తిని పెంపొందించే ప్రయోజనకరమైన బొట్టు పెట్టుకోవటానికి భయపడతాడు. అర్ధంలేని పిరికితనం, అసమర్థత ఇది. దీనికి ఏదో వివరణ లిచ్చుకొని తాను, తనను చూచి పరంపర నష్టపోయేట్లు చేయటంకంటే తాను బొట్టు పెట్టుకొంటూ అలా పెట్టుకొనటానికి వివరణలిచ్చుకొంటూ తోటివారిలోనూ మార్పు తేవటం మంచిది. పిల్లల శ్రేయస్సు కోరితే తప్పక తమ పిల్లలకు బొట్టుపెట్టే బయటకు పంపాలి. చిన్ననాటినుండి ఆరంభమయితే ఆ సదాచారం ఇక పోదు. బొట్టు విలువ వివరించి చెప్తే ఏదశలోనూ ఎవ్వరూ మానరు. అందరూ బొట్టు పెట్టుకొనే రీతి కల్పించి హిందువు సగర్వంగా ధైర్యంగా బ్రతికే స్థితికి తెద్దాం. అందరూ బొట్టుపెట్టుకొనటం ఆరంభిస్తే వచ్చే హిందూచైతన్యం అత్యద్భుతమైనది. అలా నాగరికత అనుకోనందున సదాచారమైనా బొట్టు పెట్టుకొనటానికి వెనుకాడుతున్నారు. దీనినే నాగరికతగా తేగల్గిననాడు ప్రతివాడూ ధరించితీరుతాడు. ఆ సన్మార్గ ప్రయాణంలో మనమే ముందు నడుద్దాం. తోటివారినీ ఆ బాటలో నడిపిద్దాం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹