స్నానము
మన మహర్షులు
నిత్యం స్నానం నరః కుర్యాత్ నిశాపాయే ప్రయత్నతః
అన్నారు. అనగా రాత్రియొక్క చివర అంటే తెల్లవారుతూనే మనం తప్పక స్నానం చేయాలి అని అర్థం. శాస్త్రవిధిని పాటించడం ధర్మం. దానిని పాటించకపోవడం అధర్మం. ఎందుకు స్నానం చేయాలనే విషయంలో వ్యాసభగవానుడు.
అస్నాత్వా నాచరేత్ కర్మ జపహోమాది కించన
అని చెప్పడం జరిగింది. అంటే జపహెూమాది కర్మ లేవీకూడా స్నానం చేయకుండా ఆచరించకూడదు అని. వేదం చెప్పినవి, ధర్మశాస్త్రాలు చెప్పినవి అయిన కర్మలన్నింటికీ మొదట స్నానం చేయాలి. స్నానం చేయకుండా ఆధ్యాత్మిక ఆధిదైవిక కార్యాలేవీ చేయడం తగదు.
కొందరు శరీరశుద్ధి ప్రధానం కాదనీ, అంతశ్శుద్ది కావాలనీ, మనః శ్శుద్ధి ప్రధానమని అంటారు. వారు స్నానం చేయకుండానే జపతపాదులు చేస్తుంటారు. మనః శ్శుద్ధి ముఖ్యమనడంలో సందేహం లేదు. కానీ స్నానాదికంతో శరీరాన్ని పరిశుద్ధం చేసుకునితీరాలనేదికూడా ముఖ్యంగా చూడదగినదే. శరీరశుద్ధి, స్నానం అవసరం లేదన్న వ్యక్తిని భోజనానికి పిలిచి, పక్షుల రెట్టలతో మలినమై ఉన్న ఆకుని కడగకుండా పరచి, దాని మీద భోజనాన్ని వడ్డిస్తే భుజిస్తాడా? ఆకు ఎలా ఉంటేనేం, తినేది పదార్థాలనుకదా, అవి షడ్రసోపేతంగా ఉన్నాయికదా అని సరిపెట్టు కుంటాడా? ఆకు అశుచి కారణంగా పదార్థాలన్నింటినీ వదిలేయడా? అలాగే శరీరాన్ని స్నానంతో శుచిగా చేయకపోతే మనం చేసే సత్కర్మలను భగవంతుడు స్వీకరించడు. కాబట్టి స్నానం చేసి మాత్రమే పుణ్యకార్యాలను, దైవకార్యాలను నిర్వహించాలి.
స్నానం చేయకుండా దేవాలయంలోకి, దేవుడి గదిలోకి రావడం కూడా తగదు. అలా నిషేధించడంలో ఎంతో ఔచిత్యం ఉంది. ఒక వ్యక్తి స్నానం చేయని ప్రభావం అతనిమీదే కాక ఆ పరిసరాలమీద కూడా పడుతుంది. 11-12-1978 నాటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక విషయం వచ్చింది. కె.ఎస్.గోపాల్ గారి యోగాభ్యాసంలో తమ అన్వేషణలో చేసిన పాలీగ్రాఫ్ సరిగా రాలేదు. దానికి కారణాన్ని ఆలోచించి తన దగ్గరున్న అనుచరులలో కొందరు స్నానం చేయకుండా వచ్చారని గ్రహించి, వారిని పంపివేసి యోగాభ్యాసం చేయించి, పూర్తి ఫలితాన్ని సాధించగలిగారట. స్నానం చేయని ప్రభావం పరిసరాలపైన కూడా పడుతుందనే విషయాన్ని ఆ సంఘటన వలన గ్రహించగలుగుతాము. కేవలం స్నానం అలౌకిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలకోసమే అని అనుకోకూడదు.
శ్రీపుష్ట్యారోగ్య వర్ధనమ్
అని స్నానం లక్ష్మీకరం, ఆనందదాయకం, శరీర పుష్టిని పెంచుతుంది, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది అని మహర్షులు తెలిపారు. స్నాన, సంధ్య, జప, హెూమ, బ్రహ్మయజ్ఞ, దేవతార్చన, వైశ్వదేవ, అతిథిపూజలనే నిత్యకర్మలు ఎనిమిదింటిలో మొదటిదైన స్నానం చేసి తీరాలి.
శరీరం అపారంగా ఉన్న రోమకూపాల ద్వారా మలినాన్ని విసర్జిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాతఃస్నానంతో ఆ శరీరాన్ని శుభ్రం చేయాలి. దానివలన శుచి, శుభ్రతే కాక జఠర దీప్తి, ధాతు పుష్టి, ఆయువు, కాంతి, బలం కలుగుతాయి. మురికి, దురద, అలసట సోమరితనం, దప్పి తొలగుతాయి. పాపపరిహారం జరుగుతుంది అని వైద్యశాస్త్రం చెప్తోంది. స్నానంచే దుస్స్వప్నములు తొలగుతాయి. ఆకలి పుడుతుంది. చర్మాన్ని ఆశ్రయించే భాజకమనే పిత్తం లోపల ప్రవేశించి వేడిని పుట్టిస్తుంది. స్నానంవలన రోమకూపాలను మూసివేసే మాలిన్యం తొలగి చర్మానికి ఆరోగ్యం చేకూరుతుంది. నీటికి విద్యుత్ ప్రేరణశక్తి ఉందనేది, నీరు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ యాక్టివిటీని అధికం చేస్తుందనేది స్నానంలోని వైజ్ఞానిక రహస్యం. విద్యుచ్ఛక్తి కేంద్రమైన మానవదేహం నిద్రాసమయంలో దానిపనిని కొరవడి ఉంటుంది. అందుకే నిద్రలేవగానే జడత్వం ఆవరించి ఉంటుంది. స్నానం చేయటంవలన ఆ జడత్వం పూర్తిగా తొలగి విద్యుదయస్కాంత శక్తి పునరుద్ధరింపబడుతుంది. అలా శరీరం సర్వసన్నద్ధమవుతుంది.
ధర్మాలన్నింటికీ మూలమైనది, పరమప్రమాణమైనది వేదం. ఆ వేదం
అప్స్వంత రమృతం
అంటే నీటిలో అమృతశక్తి ఉందని,
అప్సు భేషజం
అంటే నీటిలో ఔషధం ఉందని,
“శ్రద్ధా వా ఆపః”
జలం శ్రద్దను పెంపొందించేదని చెబుతోంది. ఇలా వేదశాస్త్రాలన్నీ స్నానమహిమను చెబుతున్నాయి. వైద్యశాస్త్రాలు భౌతిక శరీరానికి మార్గదర్శనం చేస్తే ధర్మశాస్త్రాలు ఆధ్యాత్మిక శరీరానికి మార్గదర్శనం చేశాయి. అనాదిగా చెప్పబడే వేదకాలంనుండి హిందూ జాతికి స్నానమహిమ తెలుసు. చారిత్రిక ఆధారాలకు పోతే మొహంజోదారో, హరప్పాలలో బయల్పడిన దానినిబట్టి ఆనాడు ప్రతి ఇంటా స్నానాలకు ప్రత్యేకమైన గది ఉన్నట్లు పరిశోధకులచే తెలుపబడింది. విదేశీ మత వ్యామోహంవల్ల కొందరు ఆంగ్లేయులు వచ్చాకే మనం నాగరికత నేర్చుకున్నామని అంటారు. యథార్థం ఆలోచిస్తే పాశ్చాత్యులలో, మరి కొన్ని దేశాలలో కూడా ఇప్పటికీ నిత్యస్నాన నియమం లేదు. ఇంగ్లండ్ ప్రధానమంత్రి నివాసంలో ప్రప్రథమంగా స్నానాగార నిర్మాణం 1895లో జరిగిందని రికార్డుల్లో వ్రాసి ఉంది. రవీంద్రనాథ్ టాగోర్ తమ పర్యటనలో ఆంగ్లేయ పరివారంతో కొన్నాళ్లు గడపాల్సివచ్చింది. టాగూర్ నియమబద్ధంగా స్నానం చేయడం వారికి అత్యంత ఆశ్చర్యం కలిగించిందట. చేతులను, ముఖాన్ని సబ్బుతో కడుక్కోవడం తప్ప వారికి శరీర శుభ్రత విలువ తెలియదు. రెండుసార్లు స్పాంజిబాత్ మాత్రం చేస్తారని వ్రాశారు. స్వామి వివేకానంద 1895లో ప్యారిన్ వెళ్లినప్పుడు హెూటల్లో స్నానాలగదే లేకపోయింది. పాశ్చాత్యదేశాలలో దైనందిన స్నానం ఇప్పుడిప్పుడే వస్తోంది. మన స్నాన సదాచారమే ప్రపంచదేశాలకు ఆదర్శమయింది. మన మహర్షులు ఏ సదాశయంతో స్నానవిధానాన్ని ఆదేశించారో ఆకాల దేశ పాత్ర నియమాలన్నీ తెలుసుకుని సమస్త సత్కార్యాలకు మూలమైన స్నానాన్ని నిర్వహించుకోవాలి.
స్నాన భేదాలు
స్నానం చేయవలసిన సమయం, జలభేదం వంటివానిని బట్టి స్నానవిధానంలో భేదా లున్నాయి. తెల్లవారుఝామున 4 గంటల నుండి 5 గంటల లోపున చేసే స్నానాన్ని ఋషిస్నానం అంటారు. 5-6 గంటల మధ్య చేసే స్నానం దేవస్నానం. అంటే మనం ఋషిస్నానం చేసి, దైవానికిస్నానం చేయించాలి. స్నపన కార్యక్రమం లేదా అభిషేకం నిర్వహించాలి. ఉదయం 6-7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానమంటారు. 7 గంటల తరువాత చేసేది రాక్షసస్నాన మంటారు.
స్నానాన్ని కొందరు తమకోసం కాక, ఉద్యోగం కోసం చేస్తారు. ఆఫీసు 7 గంటలకైతే ఏ 6 గంటలకో స్నానం చేస్తారు. అదే 10 గంటలకైతే దానికి కాస్త ముందు ఏ 9 గంటలకో. ఆరోజు ఆఫీసుకి సెలవైతే. ఎప్పటికో సాయంత్రం వేళకి స్నానం చేయటం. అలా కాకుండా నియమబద్ధంగా స్నానం చేయడం కర్తవ్యం. అలాగే ఉత్తమ, మధ్యమ, సామాన్యాది భేదాలు కూడా స్నానవిధానంలో ఉన్నాయి.
ఉత్తమం తు నదీ స్నానం – తటాకోక్తం తు మధ్యమం
కూపస్నానం తు సామాన్యం – భాండస్నానం వృథావృథా
అంటే నదిలో స్నానం చేయడం ఉత్తమం. చెరువులో చేసే స్నానం మధ్యమం. బావిలో నీరు తోడుకుంటూ స్నానం చేయడం సామాన్యం. కుండ, తొట్టె, బిందె లాంటి వాటిలో నీరు నిల్వచేసి స్నానం చేయడం వ్యర్థం. అంటే ఆధ్యాత్మికంగా, ఆధిభౌతికంగా కూడా ఆ స్నానంవల్ల మంచి ప్రయోజనం సాధింపబడదనే భావం. గర్గమహర్షి స్నానం రెండు రకాలని చెప్పాడు. 1. ముఖ్య స్నానం 2. గౌణ స్నానం. ముఖ్యస్నానమంటే మామూలుగా చేసే స్నానం. గౌణ స్నానం తిరిగి ఆరు రకాలు. 1. దివ్యస్నానం 2. వాయవ్యస్నానం 3. ఆగ్నేయస్నానం 4. బ్రాహ్మస్నానం 5. సారస్వతస్నానం 6. మానసస్నానం. యాజ్ఞవల్క్యుడు స్నానాలను ఏడు విధాలుగా చెప్పాడు. అవి 1. మంత్రస్నానం 2. భౌమస్నానం 3. దివ్య స్నానం 4. వాయవ్యస్నానం 5. వారుణస్నానం 6. మానసస్నానం 7, యోగస్నానం.
1. మంత్రస్నానమంటే.. “ఆపోహిష్టామయో భువః” వంటి మంత్రాలు చెప్పుకుంటూ చేసే స్నానం. గర్గుని బ్రాహ్మస్నానం ఇదే..
2. భౌమస్నానం.. దీనినే పార్థివస్నానమని కూడా అంటారు. శాంతికలాపాలలో జరిపే మృత్తికాస్నానం ఇదే.
3. దివ్యస్నానం.. ఎండ వానల కలయిక సమయంలో ఆ వానలో చేసే స్నానం.
4. వాయవ్యస్నానం.. గోధూళి లేపనంతో చేసేది.
5. వారుణస్నానం.. జలాలలో మునుగుతూ చేసే మామూలు స్నానం.
6. మానసస్నానం.. ఇది భగవచ్చింతన రూపంలో చేసేది.
7. యోగస్నానం.. భావన ద్వారా చేసేది. ఆకాశాన భగవత్పాదాలనుండి అనుగ్రహ రూపమైన తేజస్సు తన పైకి ప్రసరిస్తున్నట్లుగా భావించడం. అలాగే ఆగ్నేయస్నానాన్ని కూడా మహర్షులు చెప్పారు. ఒంటికి విభూది రాసుకోవడం ద్వారా చేసేది. జ్వరాదులలో విభూదిస్నానం చేసి నిత్యానుష్ఠానం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో ప్రత్యేకంగా ఐదు విధాల స్నానాలను చెప్పారు. అవి యోగమయ, తపోమయ, జ్ఞానమయ, బోధమయ, ధ్యానమయ స్నానాలు.
1. యోగమయస్నానం :- ఆకాశంలో భగవంతుని పాదాంగుష్ఠంనుండి గంగాధార మన శిరస్సున బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి, ఆత్మను పవిత్రం చేసినట్లు భావన చేయడం.
2. తపోమయస్నానం శమదమాదులతో గాయత్రీ మంత్రం వంటివాటిద్వారా చేసే తపస్సు.
3. జ్ఞానమయస్నానం – ఆత్మను గురించి విచారణ చేయడం.
4. బోధమయస్నానం – బుద్ధి ద్వారా దానికి పరమైన ఆత్మను గ్రహించడం. ”మనసస్తు పరా బుద్ధిః యో బుద్దేః పరతస్తు సః” – గీత.
5. ధ్యానమయస్నానం స్వరూపమెరిగిన దైవాన్ని ధ్యానిస్తూ స్థితప్రజ్ఞుడై, సమాధిస్థితిలో ఉండడం.
శీతోదక స్నానం, ఉష్ణోదక స్నానం అని కూడా స్నానం రెండు రకాలు. ప్రాతఃకాలంలో శీతోదక స్నానం, సాయంత్రాలలో ఉష్ణోదక స్నానం చేయడం శ్రేయస్కరం. శిరస్నానం చన్నీటితో, కంఠస్నానం వేడినీళ్లతో చేయాలి.
ఆరోగ్య పుత్ర విత్తార్థీ – న స్నాయా దుష్టవారిణా
అని వృద్ధమనుస్మృతి చెబుతోంది. వేడి నీటి స్నానం సంప్రదాయ కార్యాలకు శ్రేయస్కరం కాదని గ్రహించాలి. పిండని తడిబట్ట భుజాన వేసికొంటే వైదికకర్మఫలం శూన్యం. మరల స్నానం చేయాలని జాబాలి చెప్పాడు.
అమావాస్య, సంక్రమణం, గ్రహణం, పితృకార్యం, మైలస్నానం వంటివి చన్నీటితోనే చేయాలి. కార్తికస్నాన, మాఘస్నానాదులు, ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసే స్నానాలు చన్నీటితోనే చేయాలి. అనారోగ్య కారణంగా చన్నీటి స్నానం చేయకూడనివారు చన్నీటిలో అవసరమాత్రంగా వేడినీరు కలిపి స్నానం చేయాలి. వేడినీళ్ళలో సరిపడ చన్నీళ్ళు కల్పుకొని స్నానం చేస్తే వేడినీళ్ళ స్నానమే అవుతుంది. అలాగే ముందు చన్నీళ్ళు పట్టుకొని అందులో శరీరారోగ్యం కోసం కొద్ది వేడినీళ్ళు కల్పుకొని చేయటం చన్నీటి స్నానమే అవుతుంది. పర్వదినాలలో సుఖస్నానం కోసమని వేడినీటి స్నానం చేయరాదు. అభ్యంగ స్నానానికి మాత్రం వేడినీటినే వాడాలి.
ఆధ్యాత్మిక సాధనలో యతులు వంటివారు త్రిషవణ స్నానం చేయాలి. ప్రాతఃకాలాన, మధ్యాహ్న సమయాన, సాయంకాలంలో మూడు వేళలా నియమపూర్వకంగా చేసే స్నానం త్రిషవణ స్నానం. సన్యాసాశ్రమ యతులు ఈ స్నానం తప్పక చేయాలి. నిత్య స్నానానికి ఐదు అంగాలను తెలిపారు.
1. సంకల్పం 2. సూక్తపఠనం 3. మార్జనం 4. అఘమర్షణం 5. తర్పణం అనేవి అవి. స్నాన సంప్రదాయాన్ని పాటించేవారు పైనచెప్పిన ఐదు అంగాలను అనుసరిస్తారు.విశేష స్నానాలు వైద్యశాస్త్రంలో చరకుడు
గజవత్ స్నాన మాచరేత్
అని చెప్పాడు. ఏనుగు తొండంతో నీళ్లు లాగుకొని శరీరంపై బాగా చిమ్ముకుంటూ స్నానం చేస్తుంది. అలా తృప్తిగా ఒంటిపై నీరు పోసుకోవాలని అభిప్రాయం. దానిని గజస్నానం అంటారు. గజచ్ఛాయ అని మరోవిధమైన స్నానాన్ని శాస్త్రం చెబుతోంది.
అశ్వత్థ యోదకే స్నాయాత్ – గజచ్ఛాయేతి సోచ్యతే
అని రావిచెట్టు నీడపడే జలాశయంలో స్నానం చేయడం గజచ్ఛాయ స్నానమని చెప్పబడుతుంది. కార్తికమాసంలో అయితే ఉసిరిచెట్టు నీడ పడే జలాశయంలో స్నానం చేయాలి. మాఘమాసంలో నువ్వులు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇవన్నీ ఆయా కాలాలలో మన ఆరోగ్యంకోసం చెప్పిన విధానాలే అని గ్రహించాలి. పాపహరము, రోగహరము అయిన మరో ముఖ్యమైన స్నానం మృత్తికాస్నానం. ఆర్ష సంప్రదాయ విధానంలో ఉగ్రరథ శాంతి (షష్టిపూర్తి), భీమరథ శాంతి (71వ ఏడు), సహస్ర చంద్ర దర్శనోత్సవం (81 వ ఏడు) వంటి వాటిలో ఈ స్నానం ఉంటుంది. ఆరోగ్య శాస్త్రపరంగా కేరళవైద్యం వంటి ప్రకృతి చికిత్సలలోనూ ఈ మృత్తికా స్నానం ఉంటుంది.
మృత్తికాస్నాన మంటే ఒంటికి మట్టి రాసుకుని చేసే స్నానం. మృత్తికా స్నానంలో ముందు శుద్ధమైన మట్టిని తీసుకుని
అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా,
శిరసా ధారయిష్యామి రక్షస్స్వ మాం పదేపదే,
భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ
ఉదృతాసి వరాహేన కృష్టేన శతబాహునా,
మృత్తికే హర మే పాపం
ఇత్యాదిమంత్రాలచే అభిమంత్రించి శరీరావయవాలు శిరస్సు, కంఠం, బాహువులు, హృదయం, బొడ్డు ప్రాంతాలలో కుడిచేతితోనూ, బొడ్డు క్రింది అవయవాలలో ఎడమ చేతితోనూ మట్టిని రాసుకుని, భగవన్నామ స్మరణ చేస్తూ స్నానానికి నీటిలో దిగాలి. లేదా నీళ్లు పోసుకోవాలి. దహన సంస్కారం నిర్వహించినవారు కూడా దోషపరిహారార్థం మృత్తికతో స్నానం చేస్తారు. స్నానానంతరం
”యన్మయా దూషితం తోయం”
అని పఠించి పరిహారం చెప్పుకుంటారు.
నదీస్నానం ఉత్తమస్నాన మని చెప్పబడింది. ఆ నదీస్నాన విషయంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను చెప్పింది. నదీస్నాన ఫలాన్ని మనం పూర్తిగా పొందాలంటే నాలుగు దోసిళ్ల మట్టి తీసి, బయట వేయాలి. అప్పుడు మనం పూడిక తీసినట్లే కాబట్టి పుణ్యఫలం త్రవ్వించినవారికి పోకుండా మనకే దక్కుతుంది. బావి వద్ద స్నానం చేసేటప్పుడు కూడా రెండు చేదలు తోడి బావిలోనే పోసేవారు. అలా చేస్తే ఆ స్నాన పుణ్యం బావి త్రవ్వించినవారికి పోక, పూర్తిగా మనకే దక్కుతుంది. అలాగే ఎంత సంపన్నుడైనా నదిదాకా వాహనం మీదే పోవడం తగదు. అశక్తులు, వికలాంగులు తప్ప మిగిలినవారు ఒకింత దూరంనుండే పవిత్ర భావంతో పాదచారియై నదీమతల్లిని చేరాలి. మిక్కిలి వేగప్రవాహంలో దిగరాదని, దిగినా ప్రవాహానికి అభిముఖంగానే స్నానం చేయాలని వీరమిత్రుని మాట. అలా కాకపోతే ప్రమాదం కాబట్టి హారీతుడు కూడా అదే జాగ్రత్తను చెప్పాడు. సూర్యాస్తమయం తర్వాత నదీస్నానం తగదు. స్నానసమయమున దేహాన్ని పైనుండి క్రిందకు రుద్దుకొనటంవల్ల కామేచ్ఛ పెరుగుతుందని, అడ్డంగా రుద్దుకొనటం వల్ల కామేచ్ఛ నశిస్తుందని చెప్పబడింది. వరదనీటి స్నానం తగదని పద్మపురాణం చెప్తోంది. వరదనీటికి రజస్వలా దోషం ఉంటుందని, శ్రావణ, భాద్రపద మాసాలలో నదీ స్నానం తగదని, అప్పుడు వాటికి పురిటి దోషం ఉంటుందని కాత్యాయనుని మాట. అప్పుడే పుట్టిన వరదనీరు మురికితో ఉండి అనారోగ్యం కాబట్టి అలా నిషేధించారు. ఒక నదిలో స్నానం చేస్తూ మరో నదిని స్మరించకూడదు. విడిగా చెరువులో బక్కెట నీటితో స్నానం చేసేటప్పుడు మాత్రం
గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు
అని ఆ జలాల్లో గంగాది నదులను ఆవాహన చేసుకుని స్నానం చేస్తాము. అలా నదీజలాలలో స్నానం చేసిన పుణ్యం కొంత లభిస్తుందని విశ్వాసం.
తాను స్నానం చేసే ఇతర జలాలలో స్వామి పుష్కరిణిని స్మరిస్తూ శ్రీనివాసుని ధ్యానం చేసినవాడు అతిపాతకములనుండి విముక్తి పొందుతాడనిగౌతమ మహర్షి చెప్పాడు. బొడ్డులోతు నీటిలో శిఖ, జడ విప్పి, ముక్కుని చిటికెన వ్రేళ్ళతోనూ, చెవులను బొటన వ్రేళ్లతోనూ కళ్ళను ఉంగ్రపు వ్రేళ్ళతోను మూసుకుని మూడుసార్లు మునగాలి. మహానదులలో స్నానం చేస్తే పితృదేవతలకు తర్పణలివ్వాలి. తుడుచుకోకుండానే తర్పణ లివ్వాలి.
ఏకే చాస్మత్ కులే జాతాః
అంటూ జందెం పిండడం మాత్రం ఒడ్డుననే చేయాలి.
అమాయాం చ నదీస్నానం కులకోటిం సముద్ధరేత్.
అనగా అమావాస్యనాడు చేసే నదీస్నానం వంశమందలివారి నందరినీ ఉద్దరిస్తుందని యాజ్ఞవల్క్యుని మాట. సూర్య చంద్రుల కిరణస్పర్శ ఉండడం నదీ జలాల విశేషం. అలాగే కొండలపై కురిసిన వర్షం అడవులగుండా ప్రవహిస్తూ అనేక ఔషధ గుణాలను తనలో నింపుకొనిరావడం కారణంగా నదీజలాలకు అంతటి శ్రేష్ఠత్వం ఏర్పడింది. సంకల్పం చెప్పుకుని స్నానం చేయడంవలన పుణ్యఫలం పూర్తిగా చేకూరుతుంది. పుష్కర స్నానం మరీ విశేషం. ఏ నదికి పుష్కరాలు ఉంటాయో ఆ నదిలో పుష్కరుడు సార్థత్రికోటి అంటే మూడున్నర కోట్ల తీర్థాలతో సన్నిహితుడై స్నానం చేసేవారి పాపాలన్నింటినీ పోగొడుతాడు కాబట్టి పుష్కరస్నానం విశిష్టమయినది. అర్ధోదయ మహోదయాలు, కుంభమేళ, అర్థకుంభమేళ వంటివానియందు స్నానం బహుపుణ్యప్రదము. వేడినీటిలో పన్నీరు వంటివి వేసుకుని చేసేది భోగస్నానం. సంకల్ప విధానంతో చేసేది అఘమర్షణ స్నానం. అంటే పాపాలు పోగొట్టేస్నానం. కార్తికమాసంలో తులాలగ్నంలో సూర్యుడుండగా స్నానం చేయడం, మాఘమాసంలో మకరలగ్నంలో సూర్యుడుండగా స్నానం చేయడం బహుపుణ్యప్రదం. ఆరోగ్యప్రదం. చితి, యూపం, శ్మశానం, ఎముక వంటివాటి స్పర్శ తగదు. అట్టి అస్పృశ్య వస్తువులను తాకితే స్నానం చేయాలి.ఆ స్నానం చన్నీటితోనే చేయాలి తప్ప వేడినీటితో తగదని మనుస్మృతి చెప్పింది. అనారోగ్యంతో ఉన్నవారికి ఈ నియమం లేదు.
శ్రుత్వా జాతం పితా పుత్రం సచేల స్నానమాచరేత్
అని పుత్రుడు పుట్టినట్లు వినగానే ఉన్నపళంగా కట్టుగుడ్డలతోనే స్నానం చేయాలి. అదేసచేలస్నానం. మరికొన్ని సమయాలలో కూడా సచేల స్నానం విధింపబడింది. అశుచితో చేసే స్నానం మౌనంగా చేయాలని పరాశరుని మాట. యాగాదులలో చేసే స్నానాన్ని కామ్యస్నాన మంటారు. పుణ్యక్షేత్రాలలో చేసే స్నానాన్ని క్రియాస్నాన మంటారు. ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలలో చేసే స్నానాన్ని సంక్రమణ స్నాన మంటారు. రథసప్తమినాడు జిల్లేడు ఆకులు, రేగుపళ్లు శిరస్సుమీద, భుజాలమీద పెట్టుకుని స్నానం చేయాలి. గ్రహణ సమయాలలో పట్టుస్నానం, విడుపు స్నానం చేయాలి. అనుష్ఠానపరులు, శిష్టాచారులు పట్టు స్నానం కూడా చేయాలి. విడుపు స్నానం మాత్రం అందరూ చేయాలి. గ్రహణ సమయాలలో వాతావరణమంతా ఒక విధమైన బాక్టీరియా వ్యాపించి ఉంటుందని, కాబట్టి గ్రహణానంతరం ప్రతివారూ స్నానం చేయడం, ఇళ్లు కడుక్కోవడం అవసరమనే సంగతిని ఆధునిక పరిశోధకులు కూడా తెలిపారు. మనదేశంలో 16-2-1980న పెద్దసూర్యగ్రహణం ఏర్పడింది. ఆనాడు పరిశోధనలు గావించిన శాస్త్రజ్ఞులు తెల్పిన విషయాలు మరుసటి రోజు దినపత్రికలో వచ్చాయి. గ్రహణ సమయంలో ఒకవిధమయిన బాక్టీరియా ప్రకృతిఅంతా వ్యాపించిందని చెప్పారు. కాబట్టి గ్రహణానంతరం అందరూ స్నానం చేయాలని, ఇళ్ళు కడుగుకొనాలని మన పెద్దలు ఆదేశించటం ఎంతో విజ్ఞతతో కూడినది. గ్రహణ సమయంలో జీర్ణకోశంలో ఒక విధమైన రసం ద్రవించి వ్యాపిస్తుందని, ఆ సమయంలో జీర్ణకోశంలో మిగిలిఉన్న ఎటువంటి పదార్థాన్నైనా అది విషతుల్యం చేస్తుందని అందేకే దానికి ముందుగాని, ఆ సమయంలోగాని ఏమీ తినరాదని చెప్పారు. ఆ సమయంలో స్నానం చేయటం ఆ రసంయొక్క ఉద్రేకాన్ని తగ్గిస్తుదని పాశ్చాత్య పరిశోధకులు చెప్పిన విషయం. కాబట్టి గ్రహణ స్నానం చాలా ముఖ్యమైనది.
పౌర్ణమాస్యాం తథా దర్శే – న స్నాయా దుష్టవారిణా
మృతే జన్మని సంక్రాంతౌ – న స్నాయా దుష్టవారిణా
అని మనువు చెప్పడంవలన పౌర్ణమి, అమావాస్యలలో వేడినీళ్ల స్నానం చేయకూడదు. మైల, పురిటి స్నానాలు, సంక్రాంతి స్నానం వేడినీళ్లతోచేయకూడదు. అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు ముందుగా చన్నీటిని పాత్రలో పోసుకుని, దానిలో అవసరం మేరకు మాత్రం వేడి నీరు కలుపుకుని, స్నానం చేయవచ్చు. ఇలా ఆరోగ్యం, పాపపరిహారాలను దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అనేక రీతులలో స్నాన నియమాలను తెలియజేశారు.
నైమిత్తికస్నానాలు అనేకవిధాలున్నాయి. నిత్యస్నానం మామూలుగా చేశాకే తీర్థస్నానం చేయాలి. అఘమర్షణ స్నానాలలోని మృత్తికాస్నానం శాంతికర్మలందు చెప్పబడింది. మంత్రం కల స్నానం అఘమర్షణమైతే మంత్రంలేని స్నానమే అనేక వ్యాధులకు పరిష్కారంగా ప్రకృతి చికిత్సయందు చెప్పబడే మట్టిస్నానం, తొట్టిస్నానం. యజ్ఞదీక్షావిరమణయందు చేసేదాన్ని అవబృథస్నానమంటారు. అది యజ్ఞం యొక్క సంపూర్ణ ఫలితాన్ని కల్గిస్తుంది. నైమిత్తిక స్నానాలలో రథసప్తమినాడు జిల్లేడు ఆకులు, రేగుపండ్లు శిరస్సున ధరించి స్నానంచేయటం ఒకటి. ఇందుకు కారణం వేదంలోకూడా చెప్పబడింది. వాటి ఔషధశక్తులే అందుకు కారణం.
గ్రహణస్నానంకూడా శాస్త్రంచే చెప్పబడింది. గ్రహణస్నానం ఆరోగ్యదృష్ట్యా కూడా అవసరం. శాస్త్రంచెప్పే స్నానాలకు సంకల్పంకూడా ఉంటుంది. సూర్యగ్రహణం పట్టేసమయంలో “కేతుగ్రస్త సూర్యోపరాగ గ్రహణసమయే సకలదోష పరిహారార్థం గ్రహణస్నాన మహం కరిష్యే ” అని, విడిచాక “కేతు గ్రస్త సూర్య శుద్ధమోక్షసమయే సకలదోష పరిహారార్థం స్నానమ్ అహం కరిష్యే” అని, చంద్రగ్రహణం పట్టునప్పుడు “రాహుగ్రస్త సోమోపరాగ సమయే సకల దోష పరిహారార్థం స్నాన మహం కరిష్యే” అని, విడిచినపుడు “రాహుగ్రస్త చంద్రోపరాగ శుద్ధ మోక్షసమయే సకల దోష పరిహారార్థం స్నాన మహం కరిష్యే” అని సంకల్పం చెప్పాలి. అలాగే సముద్రస్నానం చేసేటప్పుడు “మహాపర్వణి పుణ్యకాలే సింధుస్నాన మహం కరిష్యే” అని చెప్పాలి. నిత్యస్నానంలోకూడా “సర్వకర్మాధికార సిద్ధ్యర్థం నిత్యస్నాన మహం కరిష్యే” అని సమస్త పాపక్షయార్థం కృష్ణానదీ స్నానమ్ అహం కరిష్యే” అని అలాసులభంగా ఆయా స్నానాలందు “సంకల్పం” చెప్పుకొనటం ద్వారా వాటిని పవిత్ర స్నానాలు గావించుకొనవచ్చు.
నైమిత్తిక స్నానాలలో అభ్యంగ స్నానం ముఖ్యమైనది. “అభ్యంగ మాచరే న్నిత్యం” అని అష్టాంగహృదయం చెప్తోంది. దీనికి నువ్వులనూనె అన్నివిధాల శ్రేయస్కరం. కొబ్బరినూనెవంటి వానితోనూ చేయవచ్చు. అభ్యంగంవలన గజ్జి, చిడుము, సర్పి, దద్దుర్లు మొదలైన చర్మరోగాలు; దుస్స్వప్నాలు, మలినాలు, దుర్గంధం తొలగుతాయి. సుఖనిద్ర, తేలికదనం, దేహపుష్టి, కాంతి, మృదుత్వం, కండ్లకుచలువ కల్గుతాయి. కాళ్ళు, చేతులు, గోళ్ళు, శిరస్సులందు పుట్టే మంట, తాపాలు పోతాయి. ఆముదంతో తలంటుకొనటం నేత్రరోగాలు హరిస్తుంది. మాడున చమురు మర్దించుట చెవులకు బలం, తలవెంట్రుకలకు వృద్ధి, మృదుత్వం, బలాలు చేకూరుస్తుంది. చెవిలో చమురు వేసికొనటంవలన శిరః, కర్ణ, పార్శ్వ శూలలు పోతాయి. అరికాళ్ళకు చమురు మర్దించటంవలన నేత్రాలకు చలువ, సుఖనిద్ర, దృష్టినిర్మలత, దంతపటుత్వం కల్గుతాయి. కళ్ళల్లో చమురు వేసికొనటంవలన దంతరోగాలు పోయి దంతాలు దృఢపడతాయి. తనకు తాను తలంటుకోరాదు. గృహస్థులకు షష్ఠి, ఏకాదశి, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమలందు తైలమర్దనం తగదని జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ధర్మశాస్త్రం సోమ, శనివారాలే తైలమర్దనానికి తగినవని చెప్తోంది. ఆదివారము పుష్పం, గురువారం గరిక, మంగళవారం మట్టి, శుక్రవారం ఆవుపేడ నూనెయం దుంచిన వారదోషం పోతుంది. బ్రహ్మచర్యంలో తైలమర్దనం తగదు. ఈ స్నానం “ఉద్వర్తనం” అంటే నలుగుపెట్టుకొని చేయటంవలన అభ్యంజనస్నానం అని చెప్పబడింది. ఇది సున్నిపిండితో చేస్తారు. దీనివలన శరీరానికి కాంతి, మార్దవం వంటివి చేకూరటమేకాక ఎన్నో వ్యాధులు తొలగుతాయి. దీని ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొనే మన ఆచారాలలో ప్రతిశుభకార్యానికి తలంట్లు చెప్పటమేకాక పెండ్లివంటి శుభకార్యా లారంభించటం పసుపు కొట్టి సున్నిపిండి విసరటంతోచేస్తారు. వట్టివేరు, ఖర్జురాలు వంటివానితో సున్నిపిండి పరిమళ భరితంగా, ఆరోగ్యకరంగా, మంగళకరంగా చేయబడుతుంది. పెండ్లిలో నలుగుపాటలు కూడా ఈ సదాచారాన్ని నిల్పటానికే.
స్నానంలో విధి నిషేధాలు
మన సంప్రదాయ విషయాలు ఎన్నో ఇటీవలి పరిశోధనలలో విలువైనవిగా నిరూపిత మవుతున్నాయి. ఆచరణలో సాధ్యాసాధ్యాలు ఎలాగో తెలుసుకోవడం కనీస కర్తవ్యం. స్నానం చేసే సమయంలో తన నీడను నీటిలో చూసుకోరాదు. అందుకు కారణం
“న చోదకే నిరీక్షేత స్వంరూప మితి ధారణా”
అని మనువు చెప్పాడు. కొందరు జలాలలో, బక్కెట నీటిలో కూడా తన ప్రతిబింబం చూసుకుంటూ, నీళ్ల కదలికచే ముఖబింబం కదులుతూ ఉంటే చూసి, వినోదిస్తూ ఉంటారు. అటువంటి చేష్టలు
“శక్రస్యాపి శ్రియం హరేత్”
అని ఇంద్రుడంతటివాడిని కూడా దరిద్రునిగా చేస్తుందట. అలాగే వైద్యశాస్త్ర కర్త చరకుడు “న కేశాగ్రా ణ్యభిహన్యాత్” అని చెబుతారు. అంటే స్నానం చేశాక జుట్టు విదల్చరాదు అని అర్ధం. చాలా మంది తల తుడుచుకోవడం కాకుండా, చేతితో విదిలిస్తూ, కొడుతూ ఉంటారు. అది తగదు. అంతే కాదు. “వాసశ్చైవ” అని జుట్టును, బట్టను విదల్చరాదని చెప్పారు. స్నానానంతరం వస్త్రంతో కాక, చేతితో శరీరాన్ని తుడవడం, అద్దడం తగదు. పిండని తడిబట్ట భుజాన వేసికొంటే వైదికకర్మఫలం శూన్యం. మరల స్నానం చేయాలని జాబాలి చెప్పాడు. రాత్రులలో రెండో జాము, మూడో జాములలో అంటే 10 గంటల తరువాత స్నానం చేయటం తగదు. గ్రహణాదులలో మాత్రం ఈ నిషేధం లేదు. మొదటి జామున లేదా నాలుగో జామున అనగా రాత్రి మొదట్లో, తెల్లవారుజామున స్నానం చేయడం మేలు.
నెత్తి తడుపనిదే స్నానం కాదని ధర్మశాస్త్రం చెబుతోంది. బడలిక తీరక, ముఖం కడగక స్నానం చేయరాదని చరకుడు చెప్పాడు. ప్రాతఃస్నానం చేసే విషయంలో అశక్తులు కాపిలస్నానం చేయాలని వ్యాసుడు చెప్పాడు.కాపిలస్నాన మంటే బొడ్డు క్రిందిభాగం కడిగి, పై భాగాన్ని తడిగుడ్డతో తుడవడం. పగలు సూర్యాభిముఖంగాను, రాత్రిపూట తూర్పు లేదా ఉత్తరానికి తిరిగి స్నానం చేయాలని ఆపస్తంబమహర్షి చెప్పాడు. స్నానం చేశాక ఆ తడిబట్టతో మూత్రించడం తగదనీ, అలా చేస్తే మూడు ప్రాణాయామాలు చేసి, మరల స్నానం చేయాలని జాబాలి చెప్పారు. స్నానం చేసిన బట్టతో తుడుచుకోరాదనీ, అలా తుడిస్తే మళ్లీ స్నానంతోనే శుద్ధి అని చెప్పబడింది. సూర్యకిరణ స్పర్శతోనే కట్టుబట్టకు శుద్ధి. బ్రహ్మచారి రోజు కొక్కసారి, గృహస్థు రెండుసార్లు, సన్యాసి రోజుకు మూడుసార్లు స్నానం చేయాలి. నైష్ఠికులైన గృహస్థులు కూడా త్రిషవణస్నానం అనగా ముమ్మారు స్నానం చేస్తారు. దుస్స్వప్న దోషంలో, వాంతి చేసుకొన్నప్పుడు, శ్మశానం వద్దకు వెళ్ళినప్పుడు సచేలస్నానం అంటే కట్టుబట్టలతోనే స్నానం చేయటం కర్తవ్యం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹