Skip to content Skip to footer

సదాచారము – వైజ్ఞానిక విలువలు – మానవత్వంనుండి దివ్యత్వంవైపుకు – 22

మానవత్వంనుండి దివ్యత్వంవైపుకు


ఆహార, నిద్ర, భయ, మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే. అయితే జ్ఞాన విజ్ఞాన గ్రాహ్య యోచనాశక్తి మనిషిని జంతువులనుండి వేరుచేసి అత్యున్నత స్థానానికి చేరవేస్తున్నాయి. ఈ సృష్టిలోనే అత్యంత గొప్పదైన మానవజన్మను పొందిన తరువాత దానిని సార్థకం చేసుకోవాలేకాని వృధాచేసుకోకూడదు.

మానవజన్మ సార్థక్యానికి రెండు సాధనాలున్నాయి. అవి 1) భగవత్సేవ 2) భాగవతసేవ. మాధవసేవ చేస్తూనే మానవసేవ కూడా చేయాలి. వృక్షాలు తన ఫలాలను, నదులు తమ నీటిని, గోసంతతి తమ పాలను ఎలా పరోపకారము కొరకు ఉపయోగిస్తున్నాయో అలాగే మానవులు కూడా పరోపకారం కొరకు కృషి చేయాలి. మనచుట్టూ ఉన్న సమాజాన్నే దైవంగా భావించి మానవత్వంతో వారి అభివృద్ధికి కృషిచేయాలి. మానవత్వం లేకుండా కేవలం భక్తి ఉంటే అది భగవంతుడు స్వీకరించడని మన పురాణాలు చెపుతున్నాయి. శ్రీకృష్ణుడంతటివాడు కూడా సమాజోద్ధరణకు పరోపకార పరాయణత్వంతో అనేక లీలలు చేశాడు. విశేషించి మానవ జీవన విధానాన్ని భగవద్గీత రూపంలో అందించాడు. మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు మానవ జీవనమార్గం సాగాలి.

84 లక్షల రకాల జీవరాసుల్లో మానవుడే శ్రేష్ఠుడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసినా ఆ మానవత్వాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నించడంలేదు. తక్కిన జీవజాలం నుంచి మానవుడ్ని వేరు చేసి చూపేది, అతని ఆలోచనావిధాన అతని ఆచరణ విధానమూను. మానవజన్మ పొందిన ప్రతివారూ మానవులే అని అనుకోవడానికి వీల్లేదు. మానవత్వ లక్షణాలను ఒంటబట్టించుకొని నిరంతరం మానవులుగా మసలుకునేవారే మానవులు అనబడతారు. మానవ చైతన్యంలోనూ మూడురకాలు కన్పిస్తాయి.

  1. అథ శ్చైతన్యం
  2. సహజ చైతన్యం
  3. ఊర్ధ్వచైతన్యం

ప్రతిఒక్కరు వారు ఏస్థాయిలోవున్నామో తెలుసుకొని పైస్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి.

    మన స్యేకం వచ స్యేకం కర్మ ణ్యేకం మహాత్మనామ్

    మనస్యన్యద్ వచస్యన్యత్ కర్మణ్యన్యద్ దురాత్మానామ్

    ఆలోచన, మాట, పని ఒకటిగా ఉంటే అతడే మహాత్ముడు. ఆలోచించేది ఒకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి అయితే వారు దురాత్ములు. మహాత్ముల జీవన ప్రయాణం. మానవత్వం నుండి దివ్యత్వం వైపు సాగుతుంది. దురాత్ముల ప్రయాణం మానవత్వం నుండి రాక్షసత్వం వైపు సాగుతుంది. లోకంలో అనేక ధార్మికసంస్థలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఆశ్రమాలు, గురుకులాలు, మఠాలు, పీఠాలు, మందిరాలు వున్నాయి. వదాన్యులు, మహానుభావులు ఎందరోవున్నారు. అందరూ ప్రధానంగా మానవత్వపు విలువలను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మానవత్వపు విలువలను ఎవరు చక్కగా పాటిస్తారో వారు ఉన్నతులు, దైవాంశ సంభూతులు అవుతారు. వారి జీవన గమనం ప్రశాంతంగా సాగుతుంది. తాత్కాలికమైన కష్టనష్టాలు వారిని చలింప జేయలేవు. ఈనాటి కాలంలో కొందరు మానవత్వపు విలువలకు దూరంగా తాత్కాలిక సుఖాలకు ఆకర్షింపబడి బ్రతుకుబండిని లాగించాలని భావిస్తున్నారు. వారు శాశ్వత సుఖాన్ని, ప్రశాంతతను కోల్పోతున్నారు.

    భారతభూమిని కర్మభూమి అంటారు. కర్మ నిర్వహించకపోతే శరీరయాత్రగూడ జరగదని గీతా వచనం. కర్మలు రెండురకాలు. సత్కర్మలు, దుష్కర్మలు. కొందరికి దుష్కర్మలు జీవనోపాయాలు కావచ్చు. వారిది రాక్షస మనస్తత్వమని చెప్పకతప్పదు. సత్కర్మలు ఆచరించే వారిది ఉత్తమ మనస్తత్వం అవుతుంది. క్రమంగా వారి పయనం దివ్యత్వం వైపు సాగుతుంది. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు.

    కర్తవ్య మేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతై రపి

    అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠగతై రపి

    కంఠంలో ప్రాణమున్నంత వరకు చేయవలసిన కర్మను చేసి తీరాలి. ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడినా చేయరాని పనులు చేయరాదు. చేయవలసిన పనులు తప్పక చేయడం మానవత్వం. కారణాలు ఏవైనా చేయరాని పనులు చేయడం రాక్షసత్వం. మానవత్వపు విలువలు కాపాడడమే దివ్యత్వం. మానవుడు తాను శాశ్వతమని, సుఖాలు అనుభవించడమే జీవితమని భావించితే అతని ప్రయాణం దివ్యత్వంవైపు సాగదు. అందుకే అనుభవం కలిగిన పెద్దలు

    ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠి

    నారీ గృహద్వారి, జనః శ్మశానే

    దేహ శ్చితాయాం పరలోకమార్గే

    ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః

    అని తెలియ జేసారు. సంపాదించిన ధనం, భూమిలో కలిపిసోతుంది. పశు సంపద పశువుల కొట్టాలలోనే ఉండిపోతుంది. ఇల్లాలు గృహద్వారం దగ్గర నిలిచిపోతుంది. బంధు జనాదులు శ్మశానంలో ఆగిపోతారు. దేహంకూడా అగ్గిలో పడిపోతుంది. ఏదీ జీవితో పాటు పరలోకానికి రావు. పరలోకానికి జీవితో వచ్చేది అతడు ఆచరించిన ధర్మం మాత్రమే వెంట వస్తుండగా జీవుడొక్కడే పరలోకానికి పయనిస్తాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి జీవించేవారు మానవత్వం నుండి దివ్యత్వం వైపు పయనిస్తారు.

    మానవుడు ఆలోచనా జీవి. అన్వేషణాశీలి. మాట్లాడే ప్రాణి. పుట్టిన నాటి నుండి శరీరాన్ని వదిలే వరకూ కూడ తనను గూర్చి, జగత్తుకు గల మూలకారణాల్ని గూర్చి యాదృచ్ఛికంగా ఆలోచిస్తూ, అన్వేషిస్తూనే ఉంటాడు.

    ఎవ్వనిచే జనించు జగము? ఎవ్వని లోపల నుండు? లీనమై ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూలకారణంబెవ్వడు?

    అనే విషయంపై అతి ప్రాచీన కాలం నుండి పరిశోధనలు చేస్తూనే, తర్కిస్తూనే, అన్వేషిస్తూనే ఉన్నాడు. దేహానికి, అహంకార మమకారాలకు లోనయ్యే మనస్సుకు అతీతంగా, అంతర్లీనంగా ఉన్నతోన్నతంగా మనిషిలో ఈ ఆలోచన, అన్వేషణ ఉంటుంది.

    అయితే మనిషికి దాన్ని గుర్తించే పరిస్థితి నేడు పూర్తిగా శూన్యమై పోయింది. తద్వారా నేటిసమాజం విలువలను పూర్తిగా కోల్పోయింది. ఈ పరిస్థితులు మారాలి. ప్రతి వ్యక్తి విలువలతో కూడుకున్న జీవనాన్ని కొనసాగించాలి. నీతి, నిజాయితి కల వారిలో శరీరాన్ని మించిన శక్తి ప్రకటితమౌతుంది. ఇదే మనిషినీ మనిషినీ సన్నిహితం చేస్తుంది. ప్రకృతితోనూ సమాజంతోనూ బాంధవ్యం ఏర్పరచుకొని పరిశుద్ధమైన బుద్ధితో అంతరంగంలోకి సూటిగా చొచ్చుకుపోతుంది. అప్పుడేం జరుగుతుంది? మానవునిలోని బీజరూపంలో ఉన్న ఆధ్యాత్మికత పూర్తిగా వికసిస్తుంది. వ్యక్తి తన స్థూల, సూక్ష్మ శరీరాలు తెలుసుకొని ఆత్మతత్త్వాన్ని సాక్షాత్కరించుకుంటాడు. ఇది జ్ఞానాన్వేషణలో ప్రథమ దశ. తరువాత నెమ్మదిగా అనుభవ జ్ఞానంతో తానూ, సర్వవ్యాపకమైన చైతన్యమూ ఒక్కటే అని గ్రహిస్తాడు.”నువ్వు భగవంతుడికై వెదకుచున్నావా? అలా అయితే మానవుడి లోనే వెదుకు. దివ్యత్వం మానవునిలోనే ప్రకటితమవుతుంది. ఈ లోకంలో మానవ శరీరమే ఉత్తమమైన శరీరం. మనిషే ఉత్తమోత్తమైన జీవి. జంతువులన్నిటి కంటె, దేవతలందరి కంటె మనిషే గొప్పవాడు. దేవతలు సహితం మరల క్రిందికి వచ్చి మనుష్య శరీరం ద్వారా ముక్తి పొందుతారు.”

    (వివేకానంద సంపూర్ణ గ్రంథావళి, 2:26)

    జీవితం అంటే జీవించడం. జీవంతో ఉండటం. చైతన్యంతో ఉండటం. మన జీవిత కాలమెంత? అంటే మనం పుట్టినప్పటి నుండి గిట్టినప్పటి వరకు అని. కాని వాటి మధ్యలో మనం నిజంగా జీవించిన కాలమెంత? అని ప్రశ్నించుకుంటే ఎంత కాలం మనం అనవసరమైన ఆలోచనలతో, కార్యక్రమాలతో గడిపామో లెక్కలు వేసుకోవాలి. ఎంత కాలం మనకోసం, మనతోనే, మనలోనే నిక్షిప్తమై ఉన్న దైవశక్తితో (అంతరాత్మ) సంభాషించాం. ఎంతకాలం మనం ఆ అంతరాత్మ పిలుపుతో సామాజిక శ్రేయస్సుకు కంకణబద్ధులయ్యామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే పరమాణువు మొదలుకొని పరమాత్మ దాకా కూడా మనం ఆలోచించగల్గాలి. ప్రతి అణువులోనూ భగవంతుని స్వరూపాన్ని అంటే మన స్వరూపాన్ని మనమే చూసుకోవాలి.

    మానవుడు ఆత్మ స్వరూపుడే అయినా జీవిత గమ్యం మోక్షమే అయినా మనకొక దేహముంది. మనస్సుంది, జీవితముంది. ఇవి లేకుంటే అసలు మనిషే లేడు. మానవ లోకమే లేదు. అందువల్ల వీటిని కూడా విస్మరించడానికి వీల్లేదు. ఎంతటి తాత్త్వికులైనా

    ”శరీర మాద్యం ఖలు ధర్మసాధనం”

    అనే మాట మరువకూడదు. అలా అని మనిషి కేవలం దేహం మాత్రమే కాదు, మహెూన్నతమైన ఆత్మ స్వరూపుడు. మనిషికి వీటిపట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ స్పష్టమైన తాత్త్విక దృష్టి కొరవడినందు వల్లనే మానవులు యాంత్రిక జీవితానికి, ప్రాపంచిక జీవితానికి అలవాటుపడిపోయి నానాటికీ పతనమైపోతున్నారు. మహోత్కృష్టమైన మానవజన్మను వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ దుస్థితినుంచి మనం రక్షణపొందాలంటే ఇహపర జ్ఞానాన్ని సమన్వయం చేసుకోవాలి. అప్పుడే ఏకత్వాన్ని సాధిచగలం. ఇది జగత్తు విషయమే కాదు, మనిషి విషయమే కాదు, కుటుంబ విషయమైనా, సమాజ విషయమైనా ఇంతే. సమన్వయం లోపిస్తే సంఘర్షణ తప్పదు. సుఖశాంతులు ఉండవు. ఆ సమన్వయాన్ని సాధించుకోవడానికి ఈ గ్రంథం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే నిరాడంబరమైన జీవనం, అమూల్యమైన ఆలోచనా విధానం నాటి సంస్కృతి. అయితే ఆడంబర జీవితం, అనాలోచిత విధానం నేటి వికృతి. ఈ వికృత రూపమే నేడు ప్రపంచంలో ప్రళయ తాండవం చేస్తూ యావత్ ప్రపంచాన్ని అంధకారంలో ముంచబోతోంది.

    మానవులు (మనం) జీవితపు మొదటిదశలో డబ్బు పిచ్చిలోపడి జబ్బులు తెచ్చుకొని రోగపీడితులౌతారు. రెండవదశలో ఆ జబ్బుని నయం చేసుకోవడానికి ఉన్న సంపాదనంతా పెట్టుబడులుగా పెడ్తుంటారు. ఈ వివేకబీజం మనిషిలో మొలకెత్తితే తన జీవిత గమ్యాన్ని గురించి ఆలోచిస్తారు. లేకపోతే గమ్యం తెలియని జీవితాన్ని గడుపుతారు.

    మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి, కాని నేడు మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ప్రాణంలేని ఇనుప ఖనిజాన్ని, వస్తువుల్ని అనేక రూపాలుగా మలచుకొని వాడుకుంటున్నాం కదా! అలా అచేతన పదార్థాల్నే సంస్కరించుకుంటున్నప్పుడు, ప్రాణ చైతన్యంతో కూడిన మనల్ని మనం సంస్కరించుకోలేమా!? అనే ఆలోచనను కలిగించడమే కాక మనల్ని మనం సంస్కరించుకోవడానికి కావలసిన మార్గాలు, దానికి తగిన సూత్రాలు, పద్ధతులు, విధానాలు మొ|| వాటి గురించి ఆలోచింపజేయడమే ప్రధాన ఉద్దేశం.

    “ద్రష్ట అయిన వాడు సృష్టి రహస్యాన్ని అవగాహన చేసుకొని సంపూర్ణత్వాన్ని నింపుకొని పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. కనుక ప్రతీ ఒక్కరూ ద్రష్టకావాలి. ప్రతి క్షణం ప్రతి విషయాన్ని మనో దృష్టితో, జ్ఞాన దృష్టితో గమనించగల్గాలి. ప్రాపంచికతను పటాపంచలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలి. వాస్తవాల్ని అవగాహన చేసుకొని మన ధర్మాల్ని విస్మరించకుండా సత్యాచరణ గావించడానికి సాధన చేస్తూ జీవితాన్ని కొనసాగించాలి. దార్శనిక అనుభూతుల ద్వారా జ్ఞాన సముపార్జనను కొనసాగించాలి. విశ్వమానవులుగా విరాజిల్లాలి.”

    మానవుడిలో నైతిక ప్రవర్తన అధికమైతే అతడిలోని సహజమైన ఆధ్యాత్మికతత్త్వం జాగృతమవుతున్నదని గుర్తు. ఆధ్యాత్మికత మనిషి శారీరక ప్రవృత్తులపైన, కోరికలపైన ఆధిక్యం సంపాదిస్తుంది. నదులెన్ని పోకడలు పోయినా చివరికి సముద్రంలోనే సంగమించేటట్టు ఈజీవన గమనంలో జన్మల ప్రయాణంలో దారితెలియక మనం ఎన్నివిధాలుగా జీవించినా ఏదో ఒకజన్మలో సరైన మార్గం చూసుకోవాలి, వెతుక్కోవాలి. అదే మానవుని అంతిమ లక్ష్యం.

    సమాప్తం

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    Leave a comment