Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – స్త్రీ సదాచారము -20

స్త్రీ సదాచారము

నిత్యకృత్యాలన్నీ పురుషులతోబాటు స్త్రీలకు పాటింపదగినవే కాని వారి శారీరకస్థితి గతులు, జీవన విధానములను బట్టి స్త్రీలకు ప్రత్యేకముగా గ్రహింప దగిన సదాచార మున్నది. పుణ్యస్త్రీలు నిద్దురలేవగానే తన పతికి జీవన హేతువయిన మంగళసూత్రాలను కనుల కద్దుకొంటారు. పురుషులు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించునట్లు స్త్రీలు భర్త పాదాలకు నమస్కరించాలి. శౌచవిధిలో స్త్రీలకు వేశ్మశుద్ధి అంటే ఇంటిని శుభ్రపరచుకొనుట ప్రత్యేకంగా ఉంటుంది. సదాచారమును వివరిస్తూ మహర్షులు

“పంచేంద్రియస్య దేహస్య బుద్ధేశ్చ మనస స్తథా

ద్రవ్య దేశ క్రియాణాం చ శుద్ధి రాచార ఇష్యతే॥’

అని పంచేంద్రియములతో కూడిన దేహానికి, బుద్ధికి, మనస్సుకు, ద్రవ్యములయొక్క, ప్రదేశములయొక్క పనులయొక్కయు శుద్ధియే సదాచారము. కాబట్టి గృహభాండశుద్ది కూడ అంటే ఇంటియొక్క, పాత్రలయొక్క శుద్ధికూడా శౌచములో భాగంగా గ్రహింపదగినదే.

“మార్జనాత్ వేశ్మనాం శుద్ధిః”

అని ఇంటిముందు కళ్ళాపి చల్లటంవలన గృహశుద్ధి అని చెప్పబడింది. కళ్ళాపిచల్లే ముందు చీపురుతో చిమ్మటం ద్వారా ఇంటిముందు పడిన చెత్తను తొలగించాలి. అనంతరం పేడనీళ్ళతో కళ్ళాపి చల్లాలి అని శంఖస్మృతిలో చెప్పబడింది. అపార్ట్మెంట్లయందు ఉండే నగరవాసులకు ఇటువంటివి ఎందుకు? అనిపించవచ్చు కాని ఇప్పటికీ దేశంలో ఎక్కువ గ్రామాలే అనే విషయం మరచిపోకూడదు. గోమయంతో కళ్ళాపి చల్లితే అది లక్ష్మీకరం. ఎందుకంటే లక్ష్మికి గోవు తనపేడయందు స్థానం కల్పించింది. ఆవుపేడతో అరుగులు అలకటము కూడా మంచిది. “ఈడైన సంపద ఎవరింట నుండు? అరుగు లలికేవారి అరచేతనుండు” అనే సినిమాపాట ఈ సందర్భంలో గుర్తుచేయదగినది. గోమయానికి రోగక్రిమిసంహారక శక్తి, వాతావరణ శుద్ధిశక్తి ఉంది. అది ఈగలు, దోమలను రానీయదు. ఆధునికులు దోమల బాధను తట్టుకొనటానికి అనేకవిధాల నెట్డోర్లు, టార్టాయీస్ వంటివెన్నో రకాలవి వాడుతున్నారు తప్ప గోమయం వినియోగించడం ద్వారా ఇంటికి దోమల బెడదను నివారించుకొనే ప్రయత్నం చేయడంలేదు.

అదే గోమయాన్ని ఆధునిక పద్ధతులలో అందిస్తే సమాజం స్వీకరిస్తోంది. 11.1.2008 న దినపత్రికలో ”హైటెక్ పిడకలు” అని ఒక విషయం వచ్చింది. జైపూర్ లో పిడకలు వాణిజ్యపద్ధతిలో తయారుచేసి 100 గ్రాములు 21 రూపాయలకు అమ్ముతున్నారట. ఆవుపేడలో కొంత గంగాజలం, రోజ్ వాటర్, పాలు, వెన్న, గులాబీరేకులు, తులసివంటివి కల్పి డబ్బాలలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. అవి కాలిస్తే పర్యావరణ శుద్ధి జరుగుతోంది. అప్పటికే 20 లక్షల రూపాయలమేర ఆర్డర్లున్నాయని అందులో వ్రాశారు. ఆవుపేడ ఆల్ట్రావైలెట్ కిరణాలను గ్రహిస్తుంది. కాబట్టి సూర్య రశ్మియొక్క తీవ్ర పరిణామాలు కూడా ఆవుపేడతో అలికిన ఇళ్ళకు ఉండవు. రేడియో ధార్మిక కిరణాలు, అణు వికిరణాలనుండి కూడ రక్షణనిస్తుంది. పిడకల వినియోగాన్ని ఏర్పరచటం కోసమే స్త్రీలు సంక్రాంతికి గొబ్బెమ్మలను పెట్టటం, వాటిని పిడకలుగా కొట్టటం, రథసప్తమికొరకు, విభూది వంటివానికొరకు ఆ పిడకలను పదిలపరచుకొనటం మన సదాచారంలో భాగములయ్యాయి. ఆ ఆవు పిడకల భస్మానికి కూడా ఎంతో శక్తి ఉంది. ధాన్యం నిల్వ ఉంచటానికి తగినంత పిడకల భస్మం కల్పితే ఎన్నిరోజులయినా పురుగు పట్టవు. క్రిమి సంహారక మందులు వాడి వాటివలన క్రొత్తరోగాలు తెచ్చుకునే సమస్య ఉండదు. పిడకల భస్మం ఎంత కల్పినా వచ్చే సమస్య ఉండదు సరికదా మేలే. అలా 12 ఏళ్ళు ధాన్యాన్ని ఉంచిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. పూర్వపు రాజులు కరువు కాటకాలనెదుర్కొనటానికి, సైనికావసరాలకి గోధుమలు, జొన్నలు పిడకల భస్మంతో కలిపి నిల్వచేసేవారు. వంటచెరకుగా వాడిన భస్మమే ఇంతగొప్పగా ఉపకరింపగలదు. మన పెద్దలు వెదురు గంపలను ఆవుపేడతో అలికి వాటిలో ధాన్యం పోసేవారు. అవి చెడేవికాదు. ఆరోగ్యం కూడా. అట్టి అవకాశాలన్నీ నేడు వదులుకొని కష్టనష్టాలపాలవుతున్నాము.

గోవు వెన్నున సూర్యనాడి ఉంటుంది. దాని ద్వారా సౌరశక్తి గోసంబంధమయిన అన్నిటా చేరి ఆరోగ్యా న్నిస్తుంది.

”ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్”

అని ఆరోగ్యాన్ని సూర్యుని ద్వారానే పొందాలికదా! ఆవుపేడను వాసన చూడటం ద్వారా ముక్కుకు సంబంధించిన రక్తపిత్తవ్యాధి నివారణ అవుతుంది. దానివలన చర్మవ్యాధులు, దురదలు తొలగుతాయి. గజ్జి లేచినపుడు గోరంటాకులాగా మెత్తితే తగ్గిపోతుంది. గోమయం సేవిస్తే క్షయ, మలేరియాలు కూడా అంతరిస్తాయని ఇటలీశాస్త్రవేత్త ప్రొ॥ జి. బిగోడి చెప్పారు. మలినం, దుర్గంధం, విషవాయుదోషం, ఉన్మాదం కూడా తొలగించగలది గోమయం. గోమయపు సేంద్రియ ఎరువులతో భూసారం నిలబెట్టుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త ఐన్స్టీన్ మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఒక భారతీయునిద్వారా మన దేశానికి కబురు చేస్తూ ”చాలా కాలంగా మరనాగళ్ళ ద్వారా వ్యవసాయం చేస్తూ మా భూముల సారం పోగొట్టుకొన్నాము. వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా సేంద్రియ ఎరువులవలన మీ భూములు సారవంతంగానే ఉన్నాయి. అలాగే మీరు సేంద్రియ వ్యవసాయంతో మీ భూమిని రక్షించుకోండి” అని సలహా చెప్పాడు. కాని మన ప్రభుత్వాలు గో ఆధారిత వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం ఈయకపోవటం దురదృష్టకరం. అటువంటి గోమయంతో వేశ్మశుద్ధి అంటే గృహశుద్ధి చేసికొనాలని మన పూర్వీకులు ఆచరించి చెప్పారు. స్త్రీలు అలా గోమయం ఉపయోగించటంవల్ల పరోక్షంగా వారి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.ఇంటిలో చిమ్మిన అనంతరం తప్పక నీళ్ళు చల్లాలి. చిమ్మే సమయంలో ఎగిరిన దుమ్మును వ్యాపింపకుండా చేయటానికి, చీపురు పెట్టిన చోట శుద్ధికి అలా నీరు చల్లటం అత్యవసరం. చిమ్మి నీళ్ళు చల్లిన వాకిట్లో తప్పక ముగ్గు వేయాలి. మరణించినవారి కర్మ జరిగే ఇంటిముందు ముగ్గు వేయకూడదు. ముగ్గులో కల్పే సున్నంవల్ల రోగక్రిములు నశిస్తాయి. ముగ్గులు కొన్ని దుష్టశక్తులను ఇంట్లో ప్రవేశింపకుండా చేస్తాయి. రాత్రి ఆలస్యంగా పడుకొని తెల్లవారుతూనే నిద్ర లేవని స్త్రీలు రాత్రే పాచిపని చేసి పడుకొంటారు. సంక్రాంతి ముగ్గులయితే చాలామంది రాత్రే పెట్టేస్తారు. పాచిపని ఉదయం చేయాలి. పాచిపళ్ళు ఉదయం తోముకొంటారు, కాని రాత్రే తోముకొని పడుకొని తెల్లవారాక ఇక తోముకొనక అలా ఉండిపోరుకదా! అలాగే పాచిపని కూడా

“న సించే ద్గమయై ర్గేహం రాత్రే తోయం న చా హరేత్”

అని శాండిల్యమహర్షి చెప్పాడు. అంటే రాత్రియే ఆవుపేడతో యింటిలో కళ్ళాపి చల్లటం తగదు. అలాగే రాత్రే నీళ్ళు తెచ్చుకొని ఇంటిలో ఉంచుట తగదు అని అందుకు కారణాలనేకం ఉంటాయి. ఉదయానికి జలం ఊరి మంచినీరు లభిస్తుంది. రాత్రులందు బావులు, జలాశయాలవద్ద ప్రమాదం జరుగవచ్చు. ఇటువంటివానిని దృష్టిలో ఉంచుకొని పాచివి తగదని మన మేలు కోరి మహర్షులు చెప్పారు. అలాగే పాత్రశుద్ధిని కూడా తెలియజేశారు. ముత్యములు, మణులు, పగడాలు వంటివానికి కడగటంవలననే శుద్ధి. కంచును బూడిద వేసి తోమటము, రాగిని చింతపండు పులుసుతో తోమటము శుద్ధివిధానము. వస్త్రములకు నీటితో తడిపి ఉతుకుటవలన శుద్ధి అని శంఖస్మృతియందు చెప్పబడింది. దుర్గంధమునకు మట్టితో శుద్ధి. గంధవతీ పృథివీ అని పృథివీలక్షణం బట్టి దుర్గంధం పోగొట్టగలది మట్టియే. పూర్వజ్ఞులు శౌచక్రియ అయిన పిదప మట్టి రాసుకొని చేతులు కడుగుకొనేవారు. నేడు అందుకు సబ్బును వాడుతున్నాము. చెక్క వస్తువులను చెక్కటంవలన శుద్ధి. మట్టిపాత్రలకు కాల్చటంవలన శుద్ధి. స్త్రీ సదాచారమంతా తెలిసినది కాబట్టి సీత రావణుని స్పర్శవలన తాను అశుచి అయానని, అందువలననే శ్రీరాముడు వెంటనే తాను స్వీకరించలేదని గ్రహించింది. తాను మట్టినుండి పుట్టినది భూపుత్రిక కాబట్టి కాల్చటమే శుద్ధి అని నిర్ణయించుకొని అగ్నియందు ప్రవేశించింది. సీత అగ్ని ప్రవేశం ధర్మమెరిగిన సీత నిర్ణయం తప్ప రాముని ఆదేశం ఏ మాత్రం కాదు.

స్త్రీలకు, వ్యవసాయం వంటి వృత్తులవారికి వారి నిత్యకృత్యాలే మంచివ్యాయామం. అలా కానివారందరికీ తగినంత వ్యాయామం చేయటం దేహారోగ్యానికి, శరీరసౌష్టవానికి, శక్తిసామర్థ్యాలు పెంపొందించటానికి చాలా అవసరం. విచిత్ర మేమంటే ఇంటిపనులన్నీ పనిమనిషికి అప్పగించి డైటింగ్లను, ఆరోగ్యాని కవసరమంటూ మార్నింగ్, ఈవెనింగ్ వాక్లలను ఆచరించే స్త్రీలు పెరుగుతున్నారు. అది అనేకవిధాల వ్యర్థమార్గం. వారి ఇంటిపనుల స్వభావంలోనే అన్ని అవయవాలకు పుష్టి, సౌందర్యాల నందించే వ్యాయామ విధానం ఉంది. స్త్రీకి ప్రసవం మరో జన్మవంటిది. కష్టపడి నెలలు నిండేదాకా పనులుచేసికొనే ఒకనాటికాలంలో సుఖప్రసవాలు తేలికగా పూర్తికాగా, నేడు చాలా మందికి ఆసుపత్రులలో సిజేరియన్ ఆపరేషన్లు అవసరమౌతున్నాయి. ఈ తేడాకు కారణం కొంత పని తక్కువైన వ్యాయామలోపమే.

గర్భవతులు టి.వి.లలో వచ్చే సీరియళ్ళను అదేపనిగా చూస్తే దాని ప్రభావం పిల్లలపై పడుతుందని, వారికి పుట్టే పిల్లలు రాత్రిపూట ఏడ్చి ఏడ్చి విసిగిస్తారని తమ అధ్యయనంలో వెల్లడయినట్లు తమిళనాడు ఆరోగ్యసేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్.ఇళంగో తెల్పారు.

పిల్లల పుట్టినరోజన మన సంస్కృతి సభ్యత, సదాచారములు ప్రక్కన పెట్టి పాశ్చాత్య నాగరికత ప్రభావంతో కేక్ లపై కొవ్వొత్తులను పెట్టి నోటితో ఊదిస్తున్నారు. అది అనర్థదాయకము.

“నాగ్నిం ముఖే ఆననోజ్ఞేన వాతేన”

అని ఇలా నోటితో దీపము నార్పటం చాలా దోషంగా మన శాస్త్రం చెప్పింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ హెల్త్ అండ్ మెడికల్రీసెర్చ్ కౌన్సిల్ తెలియజేసింది. ఆ విషయం తెలుగు దినపత్రికలలో ”కొవ్వొత్తులు ఊదితే కొంపకొల్లేరే” అని శీర్షిక పెట్టి వ్రాశారు. ఒక కొవ్వొత్తి వెలిగించినపుడు అది బెంజీన్, ఫార్మాల్ డీ హైడ్, అసిటాలీ డీహైడ్, అక్రోలైన్, సూట్ వంటి విషవాయువులను విడుదల చేసి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాటి ద్వారా ఆస్త్మా, చర్మవ్యాధులు, తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు వంటివి వచ్చే ప్రమాదముంది. అందువల్ల కొవ్వొత్తులతో పనులు మాని దీపారాధన చేయటం, ఆర్పటాలు మాని వెల్గించి ప్రకాశమీయటం చేయాలి.

పురుషులకు శుక్రవారం స్నానం విపత్తు. కాని స్త్రీలకు శుక్రవారము తలంటు స్నానం విధి. పండుగలు, శుభకార్యాలలో ఆ నిషేధము ఉండదు. స్నానం చేస్తూ

”హే గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే!”

అని చదువుచూ

ఆవాహయామి త్వాం దేవి! స్నానార్థ మిహ సుందరి !

అని ఆహ్వానించాలి. పుణ్యస్త్రీలు తలకు నూనె రాసుకుని పసుపుముఖాన రాసుకొని కంఠస్నానం చేయడం, శిరఃస్నానం చేయడంతో సమానంగా చెప్పబడింది.

స్త్రీలు పసుపు రాసుకుని స్నానం చేయాలి. రోజూ పసుపు రాసుకుని స్నానం చేసేవారికి ముదుసలితనం కనపడదు. చాలా సమయం నీటితో పనులు చేసుకునే ఆ స్త్రీలకు శరీరావయవాలు పూయటం, పుండ్లు పడడం వంటివి లేకుండడానికి పసుపు రాయడం అవసరం. అది స్త్రీలకు ముఖము, శరీరంపై వికారంగా ఉండే వెంట్రుకల నూగును కూడా పోగొట్టగలది. అందులో సౌందర్యం, సౌభాగ్యమే కాదు. ఆరోగ్యం కూడా ఉంది. పసుపును ఆహారపదార్థాలలో కూడా వేస్తారు. పసుపులోని కుర్కుమిన్ రసాయనాలు గొంతుక క్యాన్సర్ కణాలను సంహరించడంలో అమోఘంగా పనిచేస్తాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కోర్క్ క్యాన్సర్ పరిశోధన కేంద్రానికి చెందిన డా॥ షెరాన్ బృందం ఈ విషయాన్ని నిర్ధారించింది. కుర్కుమిన్ ని ప్రయోగించిన 24 గంటలలోపలే గొంతు క్యాన్సర్ కణాలు మృత్యువాత పడడాన్ని గుర్తించారు. కాకుంటే మనం వాడే పసుపు కల్తీది కాకుండా మంచిది అయి ఉండడం ముఖ్యం. పసుపు యాంటీబయాటిక్ అన్న విషయం అందరూ ఎరిగినదే. “ముత్తెమంతా పసుపు ముఖమంత చాయ” అని సినీ రచయిత వ్రాసినట్లుగా ముఖానికి పసుపు మంచి కాంతినిస్తుంది. సుమంగళులు నదీస్నానం చేసేటప్పుడు తమవంటి పుణ్యస్త్రీ అయిన నదీమతల్లికి పసుపు, కుంకుమ సమర్పిస్తారు. అలా జల కాలుష్యం తొలగించినవా రవుతారు. అనంతరం ముఖానికి పసుపు రాసుకుని, శిరోజాలు విప్పి ముందుగా దోసిలితో నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. తల తుడుచుకున్నాక జుట్టు ఆరబెట్టుకోడానికి కొసలు ముడి వేసి, ఆరబెట్టుకోవాలి తప్ప జుట్టు విరబోసుకుని ఆరబెట్టుకోరాదు. స్త్రీలు జుట్టు విరబోసుకోవడం చాలా దోషంగా చెప్పబడింది. జుట్టు విరబోసుకోవడం సమాజానికే అనర్థదాయకం. ఆ అనర్ధమే నేడు నాగరికతగా పరిణమించడం ఒక దురదృష్టం.

స్త్రీలు నదీస్నానానికి వెళ్తూ ఇంటివద్దే జడలు విప్పి బయలుదేరాలి.నది వద్ద విప్పరాదు. కాన ముడితో వెళ్ళాలి. విరబోసుకొని వెళ్ళరాదు.

చేతిలో పాత్ర ఉండాలి. పసుపు కుంకుమలు తీసికొని వెళ్లాలి. నదీమాతకు సమర్పించటానికి, తనకు, అవసరమయితే ప్రక్కవారికి వినియోగించాలి.

పాత్ర, పై బట్ట లేకుండుట అశుభము. ముత్తయిదువులు మునిగి స్నానంచేయరాదు. పోసుకోవాలి. జలం పై భాగాన బ్రహ్మహత్య ఉంటుంది. కాబట్టి ప్రవాహంపై నీటిని ప్రక్కను నెట్టి స్నానం చేయాలి. చాకి బండ వద్ద స్నానంచేయరాదు. నగ్నంగా స్నానం చేయరాదు. దేహం రాక్షసగ్రస్తమవుతుందంటారు. స్త్రీలు బొట్టు పెట్టుకొనేటప్పుడు

“కాశ్మీరం దధా మ్యరుణం – శోభాయమాన మాననే ॥

విష్ణుప్రియే ! సదా దేవి ! దేహి సౌభాగ్యతాం చ మే ॥

కుంకుమం శోభనం దివ్యం – సర్వదా మంగళప్రదం |

ధారణే నాస్య శుభదం – శాంతి రస్తు సదా మమ ||”

అనేవి చదువుకొనాలి. బొట్టువల్ల లౌకిక, అలౌకిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బాహ్యాభ్యంతర సౌందర్యాలున్నాయి. బొట్టు లక్ష్మీకరం. చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడాలనీ, బొట్టుపెట్టుకో అనీ సూచిస్తారు. దైవకార్యాలకు బొట్టు తప్పక ఉండాలి కాబట్టే దేవాలయాలలో బొట్టుని అందరికీ అందుబాటులో ఉంచుతారు. బొట్టు పరాక్రమ చిహ్నం. బొట్టు విజయచిహ్నం కూడా. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో స్త్రీలు వారికి వీరతిలకం దిద్దడాన్ని చూస్తాము.

పూజా కార్యక్రమములందు దీపారాధన స్త్రీలు చేయటమే విధి. విధానమును గ్రహించి దీపారాధన స్త్రీలు చేయాలి. పూజకు కూర్చొనేటపుడు స్త్రీలు లక్ష్మీదేవిలా ఉండాలని పెద్ద లంటారు. చినిగినవి కాని మాసినవికాని కట్టుకొనరాదు. పట్టుచీరెలు ధరించి తలలో పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజకు ఉపక్రమించాలి. ఆచమనము భర్తచే వేయించుకొనుట, చివరకు పరమేశ్వరార్పణలో భర్త చేతిలో నీరు తాను వేయుట స్త్రీ కర్తవ్యం. ఆచమనం కూడా భర్తకు స్త్రీయే వేయాలి అను నియమంలో కొందరు అలా చేసేవారు ఉంటారు. పురుషులు స్వయంగా ఆపోశనం, ఆసనం, శయనం వేసికొన కూడదు, కాబట్టి స్త్రీలు భర్తకు ఆసనం శయనం వేయాలి. అమ్మవారి పూజ, నోములకు సంబంధించిన పూజలు స్త్రీలే నిర్వహించుకొనాలి. అలాగే నిత్యమూ తులసీ పూజ నిర్వహించటం స్త్రీ కర్తవ్యం. అందులో ఎంతో విశేషం ఉంది. ఏ పూజకయినా ముందు దీపారాధన చేయాలి. తులసికోట ఆరుబయట ఉంటుంది. కాబట్టి గాలికి నిలవటం కష్టం. అందుకై ఇంట్లోనే దీపారాధన చేయాలి. భర్త పూజచేసే సమయములో కూడా దీపారాధన చేసే బాధ్యత స్త్రీదే. అలా దీపారాధన చేసి,

“దీపదేవి! మహాదేవి! శుభం భవతు మే సదా

యావత్ పూజా సమాప్తి స్స్యాత్ తావత్ ప్రజ్ఞ్వల సుస్థిరా”


అని ప్రార్ధించాలి. సాయం సంధ్యాసమయములో దీపారాధన చేసి

“దీపంజ్యోతిః పరంబ్రహ్మ, దీపం సర్వ తమోపహం

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం! నమోస్తుతే”

అని దీపానికి నమస్కరించాలి. అనంతరం తులసి పూజ చేయటం, అందులో భాగంగా ప్రదక్షిణాలు చేయటం, తులసి మూలంలో నీళ్ళుపోసి నెత్తిన చల్లుకొనటం వంటి వన్నీ చేస్తారు. “ఇయం సాక్షాన్మహాలక్ష్మీః” అని లక్ష్మిగా చెప్పినందున ఈ లక్ష్మీపూజ సంపత్ప్రదమే కాకుండా విశేషంగా ఆరోగ్యప్రదం. తులసి గాలివల్ల, స్పర్శవల్ల దీర్ఘకాలం జీవించవచ్చని పరిశోధకులు తెల్పారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు తులసి విశేష చికిత్స. కావుననే తులసీపూజను స్త్రీలకు విధించారు. అనేకవ్యాధులను పోగొట్టగల తులసి కాన్సరును కూడా నిరోధిస్తుందని తెల్పారు. చలిజ్వరము, జీర్ణాశయము, కాలేయ వ్యాధులకును తులసిచికిత్స ఉంది.

క్రిమిసంహారకమయిన తులసిని ఇంటింటా నాటే వ్యవస్థను మహర్షులు ఏర్పరచటం జరిగింది. అమెరికన్ శాస్త్రజ్ఞులు తులసి బాక్టీరియా వ్యాప్తిని త్వరగా అరికడుతుందని గుర్తించారు. తులసికి పరిసరాల వాయువునంతను పవిత్రం చేసే శక్తి ఉంది. తులసి విషయంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని తప్పక పాటించాలి. తులసిని కోసేటప్పుడు

“తుల స్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే !

కేశవార్థం లునామి త్వాం వరదా భవ శోభనే॥

అని చదువుతూ కోయాలి. దాని అర్థం “ఓ తులసీ! నీవు అమృతమందు పుట్టావు. విష్ణుమూర్తి భార్యవు. నిన్ను నీ పతిఅయిన విష్ణుమూర్తి సన్నిధికి చేర్చటానికే కోస్తున్నాను. నన్ను అనుగ్రహించు” అని. లక్ష్మీ స్వరూపిణి అయిన ఆమెను తుంచటం తప్పే. ఆమె పతిని చేర్చటంకోసమే కాబట్టి ఆమె సంతోషించి అనుగ్రహిస్తుంది. అలా అనిన మనం భగవంతునకు పూజ చేసి అనంతరమే మందుకొర కయినా వినియోగించాలి. కోసి నేరుగా వాడుకొనరాదు. అలాగే పూజ చేసే తులసిచెట్టునుండి దళాలు కోయకూడదు.వేరే చెట్టువే కోయాలి. తులసికి నీరు పోసి ఆనీటిని నెత్తిన చల్లుకొంటూ, అలాగే నమస్కరిస్తూ

“యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః

యదగ్రే సర్వ వేదాశ్చ తులసి! త్వాం నమా మ్యహమ్.”

అని చదువుకోవాలి. లౌకికంగా ఆరోగ్య పరంగాను, అలౌకికంగా లక్ష్మీరూపిణిగాను అనుగ్రహించే తులసిని తప్పక ఇంటింటా నాటుకొని స్త్రీలు నిత్యం పూజించాలి. తులసితో నిత్యసంబంధం కల్గిఉండాలి. పూజ అయ్యాక ప్రదక్షిణం చేసిన అనంతరం స్త్రీలు సాష్టాంగ నమస్కారం కాక పంచాంగ నమస్కారం చేయాలి. ఆ విధానం ఇలా చెప్పబడింది.

“పాదాంగుళిభ్యాం జానుభ్యాం శిరసా చావనీం స్పృశన్;

బద్ధాంజలి ర్నమస్కుర్యాత్ స పంచాంగ ఉదీరితః ॥

సాష్టాంగ నమస్కారానికి బదులు స్త్రీలు ఇలా రెండు కాళ్లవేళ్లు, రెండు మోకాళ్లు, శిరస్సు ఈ ఐదు అవయవాలు భూమికి తాకేటట్లు చేసేది పంచాంగ నమస్కారం. స్త్రీలు ఇలా ఎందుకు నమస్కారం చేయా లనేటందుకు కారణాన్ని శాస్త్రం చెప్పింది.

‘నత్తం గుదం చ విప్రాణాం నారీణాం స్తనమండలం

పవిత్ర గ్రంధి దర్భాంశ్చ సోధుం న క్షమతే క్షమా!”

అంటే శంఖంయొక్క పృష్ఠము అనగా క్రింది భాగము, బ్రాహ్మణుని పృష్ఠ భాగము, స్త్రీల స్తనములు, దర్భలతో ముడివేసిన పవిత్రము, దర్భలను కూడా భూదేవి భరించలేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే వారి స్తనములు భూమికి తగులుతాయి. కాబట్టి వారు పంచాంగ నమస్కారమే చేయాలి తప్ప సాష్టాంగం చేయరాదు. పంచాంగ నమస్కారంలో మార్జాలాసనం ఇమిడి ఉంది. దానివలన జననేంద్రీయోత్తేజం కలుగుతుంది. అది స్త్రీలకు ఆరోగ్యప్రదం కూడా.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment