Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – దంతధావనం – 2

దంతధావనం

రాత్రి నిద్రాసమయం అంతా నోరు మూసుకుని ఉండడంవల్ల నోటిలో పాచి ఏర్పడుతుంది. అట్టి చెడుని పోగొట్టి నోటిని శుద్ధి చేసుకునే కార్యక్రమమే దంతధావనం. దంతధావనమంటే పళ్లు తోముకోవడం. పళ్లను సరిగా తోముకోనివారికి పళ్ళ సందులలో పదార్థాలు మిగిలిపోయి, కుళ్లి, రోగకారణా లవుతాయి. దానితో పళ్లు దెబ్బతింటాయి. పంటి పోటు, పుప్పిపళ్లు తయారు కావడం, పళ్లు వదులై ఊడిపోవడం జరుగుతాయి. ఇంకా వాటి ప్రభావం లాలాజలాది గ్రంథులమీద, తద్వారా జీర్ణవ్యవస్థమీద కూడా పడుతుంది. కాబట్టే దంతధావనం నిత్యకృత్యము, అత్యవసరము అయింది.

మహర్షులు మన జీవిత విధానంలోని ప్రతి ఒక్క అంశాన్నీ సునిశిత దృష్టితో చూసి, పరిశోధన విధానంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిఫలితాలను సశాస్త్రీయంగా విశ్లేషించి, జాతికి మార్గదర్శనం చేశారు. అలాగే దంతధావనానికి సంబంధించి కూడా అనేక విషయాలు చెప్పారు.

ఉషఃకాలే సముత్థాయ

కృతశౌచో యథావిధి

ముఖే పర్యుషితే నిత్యం

భవ త్యప్రయతో నరః

అని ఉషః కాలంలో లేచి, కాలకృత్యాలలో భాగంగా శౌచవిధి కాగానే దంతధావనం గావించాలని చెప్పారు. పడమర, దక్షిణం దిక్కులకు తిరిగి దంతధావనం చేయరాదని భోజుడు చెప్పాడు. మధ్యాహ్నం సాయంకాలం సమయాల్లో దంతధావనం చేయరాదని యమస్మృతి చెప్పింది.

“భానా వభ్యుదితే దంతధావనం న కుర్యాత్”

సూర్యుడు ఉదయించక ముందే దంతధావనం చేయాలి అని గౌతముడు చెప్పాడు. సూర్యోదయమైన తర్వాత పళ్లు తోమడం చాలా దోషమని చాలామంది చెప్పారు. సూర్యోదయానికి ముందు తూర్పు లేదా ఉత్తర దిక్కుకి తిరిగి రెండుమార్లు నోటిని నీళ్లతో పుక్కిలించి, ఉమిసి, నిర్ణయింపబడిన దంతకష్టాలతో అంటే పళ్ళు తోముకొనే పుల్లలతో పళ్లు తోముకోవాలని ఆచారేందు గ్రంథం తెలిపింది.

ఈ కాలంలో కూడా గ్రామాల్లోలాగా పుల్లలతో పళ్లు తోముకోవడం ఏమిటని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే గణాంకాల ద్వారా తెలుస్తున్న సంగతి ఏమంటే దేశంలో పట్టణాలు 5,400 మాత్రమే ఉంటే, గ్రామాలు 6,38,000 ఉన్నాయి. నగరాలు ఎంత పెరిగినా గ్రామాల సంఖ్యను మించవు. రైలుస్టేషన్లు, బస్టాండ్లలో నేటికీ పళ్లు తోము పుల్లలు అమ్మటం జరుగుతోంది. దానిని బట్టి, పుల్లలతో పళ్లు తోముకునేవారు గణనీయంగా ఉన్నారన్నది స్పష్టమవుతోంది.

ఆధునిక అధ్యయనాల సంగతికి వస్తే, పళ్లు తోముకోవడానికి టూత్ పేస్టు, బ్రష్షు కన్నా వేపపుల్లను వాడడమే ఉత్తమం అని కామన్ వెల్త్ డెంటల్ అసోసియేషన్ (సి.డి.ఏ) సమావేశం తేల్చి చెప్పినట్లుగా 2000 ఫిబ్రవరి ఒకటో తేదీ దినపత్రికలో వార్త వచ్చింది. కాబట్టి, కాల పరిభ్రమణంలోమనం పుల్లతో పళ్లు తోముకునే రోజులు తిరిగి రావని చెప్పలేము. టూత్పేస్ట్లవలన అనర్థాలు కూడా ఆసంస్థ వివరించింది. వాడి వదిలే (Use & Throw) పద్ధతిలో కలాలు, బ్యాటరీలు, కొన్నిదేశాలలో షర్టులుకూడా రావటం చూస్తున్నాం కదా! దంతకాష్టాలనూ అలా వాడటం మేలు. పుల్లలు వాడలేనివారు దంత చూర్ణం (పండ్లపొడి) వాడాలి. మంచివి కొనియైనా త్రిఫలా, త్రికటుక, జాజికాయ, జాపత్రి, పిప్పరమెంటు పువ్వు వంటివానితో తయారుచేసుకొనైనా పండ్లపొడి వాడవచ్చు. బ్రష్షులు వాడటాన్ని విమర్శించటం లక్ష్యంకాదుగాని ఒకేబ్రష్షు చాలాకాలం అలసస్వభావంతో పిల్లలు సరిగాతోమక వాడటం హితకరం కాదు. నోటిలో ఏ పాచి ఉండరా దనుకొంటామో అది బ్రష్షుల అడుగుభాగాన పేరుకొనిఉడటం చూస్తాం. అడుగున ఆ బ్రష్షులరంగు కనబడదు. నాగరికమైనందున ఇవన్నీ పరిగణింపబడటం లేదు. నడుస్తూ పండ్లుతోమటంకూడా నిషిద్ధం. 60 యేండ్లవరకు గట్టి పదార్థాలను, ధాన్యములను పటపటలాడించెడి శక్తిని దంతకాష్టాలు వాడిన మనపెద్దలు సాధించగా నవీనులయందు ఆ పటిమ కానరాదు.

నాలుక, లాలాజల గ్రంథులు బాగా పనిచేయటం, నోటి అరుచి తొలగడం వంటివి దంతధావనంవల్ల ప్రయోజనాలలో కొన్ని. అందుకుగానూ కటు తిక్త కషాయాలతో అనగా కారం, చేదు, వగరు మొదలైన రుచులతో దంతధావనం జరగాలనీ బోధించారు. తీపి, పులుపు వల్ల జిహ్వ శక్తి తగ్గిపోతుందనీ, నురుగు వచ్చేవి, దుర్గంధం వచ్చేవి, తీపివి వాడకూడదనీ స్పష్టం చేశారు. నేడు వాడే పేస్టులన్నీ తీపి కలవి, నురుగు వచ్చేవే. పుల్లలకు వస్తే వేప, మామిడి, సురపొన్న, బిల్వం, ఉత్తరేణి, వాడగన్నేరు పుల్లలు వాడదగినవని ఆంగీరసాదులు చెప్పారు. వేపవలన అరుచి, దుర్వాసన, రోగకారక క్రిములు తొలగిపోవడమే కాక, వేపపుల్ల వాడేవారికి విషాలు ఎక్కవు. ఉత్తరేణి చాలా శ్రేష్ఠమైనది.

అపామార్గే ధృతి ర్మేథా

ప్రజ్ఞా శక్తిర్వపు శ్శుచిః;

ఆయు శ్మీలం యశో లక్ష్మీః

సౌభాగ్యం చోపజాయతే

అని వ్యాసులవారు చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి ఉత్తరేణి చూర్ణాన్ని ఉపయోగించి పళ్లపొడులు తయారుచేస్తున్నారంటే అందుకు కారణం ప్రాచీన భారతీయ విజ్ఞానమే.

దంతధావన కార్యాన్ని ఒక సత్కార్యంగా భావనచేసి, వనస్పతి ప్రార్థన చేసి, అనంతరం దంతధావనానికి ఉపక్రమించాలని మన మునులు తెలిపారు. చెట్లను ఇష్టం వచ్చినట్లు విరవరాదని కూడా హితవు చెప్పారు.

కనిష్ఠికాగ్రవత్ స్థూలం

అనగా చిటికెన వేలు పరిమాణంలో పుల్లను ఉపయోగించాలని తెలియచేశారు. వేలితో పళ్లు తోముకునే విధానంపైన కూడా మన ఋషులు మార్గదర్శనం చేశారు.

ఇష్టికా లోష్ఠ పాషాణైః న కుర్యా ద్దంతధావనం

ఇటుకపొడి, మట్టి, పాషాణపు చూర్ణం వంటివానితో పళ్లు తోముకోవడం తగదు. ఉప్పు, మిరియాల పొడి కల్పుకొని దంతముల మెరుపుకై పండ్లు తోమేవారు. దంతవ్యాధుల నుండి రక్షణకోసం ఆవుపిడకల బూడిదలో ఉప్పు, ఉత్తరేణిచూర్ణం కలుపుకొని పండ్లు తోముకొనేవారు. నేడు ఉత్తరేణిపొడి పండ్లపొడిగా అమ్మటం జరుగుతోంది. మీ పేస్టులో ఉప్పు ఉందా? అని ఉప్పు ఉన్న పేస్టుని ఘనంగా చెప్పటం జరుగుతోంది. అంటే మన పూర్వజుల విజ్ఞానాన్ని అర్థం చేసికొనవచ్చు. మధ్యవేలు, ఉంగరపు వేలు, బొటన వేళ్లతో మాత్రమే పళ్లు తోముకోవచ్చుననీ,

“తర్జనీం పరివర్జయేత్”

అనగా చూపుడువేలుతో తోమరాదనీ స్మృత్యర్ధసారం అనే గ్రంథం చెప్పింది.

బాహూ జాన్వంతరం కృత్వా – కుక్కుటాసన సంస్థితః

తర్పణాచమనోల్లేఖ్య – దంతధావన మాచరేత్

కుక్కుటాసనంలో అంటే గొంతిక కూర్చుని, మోకాళ్ల మధ్యచేతి నుంచుకుని, మౌనంగా పళ్లు తోముకోవాలని వివరించింది.

జిహ్వెల్లేఖనంకుర్యాత్

అని నాలుక గీసుకునే విధానాన్ని చెప్పింది. పదును లేకుండా బంగారం, వెండి, రాగి, ఇత్తడి లోహాలతో నాలుకబద్దలను చేసి పూర్వజులు ఉపయోగించేవారు. అవి పలుచగా ఉండేవి. భూగర్భం తవ్వకాలలో అట్టివి దొరికాయి. నాలుక గీసుకోవడంలోని ప్రాధాన్యాన్ని అమెరికన్ ప్రొఫెసర్ డ్రిన్నన్ తెలిపారు.

తరువాత పుక్కిలించి ఉమ్మివేయడం చేయాలి. దీనిని మన స్మృతికర్తలు గండూషం అన్నారు. గండూష విధికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. నోటి శుభ్రానికే కాదు. గండూష విధి మొత్తం ఆరోగ్యానికే ఎంతో మేలు చేస్తుంది.

అపాం ద్వాదశ గండూషైః ముఖశుద్ధిం తు కారయేత్

అన్నాడు. ఆపస్తంబుడు. దంతధావనం కుదరని సమయంలో వేలితో పళ్లు తోముకుని, పన్నెండుసార్లు పుక్కిలించాలని ఆ వాక్యానికి అర్థం.

ఆశీన ఏవ గండూషాన్ వామపార్వే వినిక్షిపేత్-

కూర్చొని, పుక్కిలించి, ఎడమవైపు ఉమియాలని చరకుడు చెప్పాడు. చన్నీటితో పుక్కిలింత మేలని చెప్పాడు. కుడివైపు, ఎదుట దేవ గురు స్థానాలు. కాబట్టి ఎడమవైపు మాత్రమే ఉమియాలని నిర్ణయం. పదేళ్ల వయస్సువరకు పలుదోము పుల్లలు వాడరాదని వాగ్భటుడు వ్రాశాడు. అంటే వాటి బదులు బ్రష్ వాడమని కాదు. లేత చిగుళ్ళు పుల్లలతో దెబ్బతినటం, పిల్లలకు పుల్లలతో చేతకాక గుచ్చుకొనటం జరుగుతుంది. ఆ కాలంలో వేలితో తోమాలి.

జిల్లేడు వేరువలన వీర్యం, మర్రిపుల్లవలన కాంతి, గానుగపుల్లవలన విజయం, జువ్విపుల్లవలన ధనప్రాప్తి, మారేడువలన మంచి కంఠస్వరం, చండ్రపుల్లవలన నోటి సువాసన, మేడివలన వాక్సిద్ధి, మామిడివలన ఆరోగ్యం, ఉత్తరేణివలన ధైర్యం, బుద్ధి, వీర్యవృద్ధి, సంపంగివలన మతి స్థైర్యం, దానిమ్మవలన సౌందర్యం, దిరిసెన పుల్లవలన ఆయురారోగ్యాలు చేకూరుతాయని మహర్షులు చెప్పారు. దంతధావన మయ్యాక మన పూర్వజులు శిరసు మీద నీళ్లు చల్లుకుంటూ,

“శ్రీరామ దాసి, బహుపుణ్యరాశి,

ప్రొద్దున్నే లేచి, పోదాము కాశి”

అని కాశీస్మరణ చేసేవారు. కాశీకి వెళ్తానని అనుకున్నా చాలు కొంతవరకు పుణ్యమే. ఇలాంటి ఎన్నో నియమాలతో దంతధావనం చేసిన కారణంవల్ల ఆనాటివారు అరవై ఏళ్లకు కూడా పోకచెక్కను పళ్లతో నలగకొట్టగలిగేవారు. నియమాలను పాటించని కారణంవల్లనే నేడు వీధివీధికీ డెంటల్ ఆసుపత్రులు అవసరమవుతున్నాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment