పురుష సదాచారము
సాధారణ సదాచారము స్త్రీ పురుషులకు ఉభయులకూ చెందినదే అయినా స్త్రీలకు ప్రత్యేక సదాచారం ఉన్నట్లు పురుషులకు కూడా ప్రత్యేక సదాచారం ఉంది. తాను కుటుంబమునకు యజమాని. ఏదోవిధంగా తాను సంపాదించుకొని వచ్చి ఇంట్లో పడేయటమే కర్తవ్యంగా తలచి మరేమీ పట్టించుకోకుండా ఉండే వైఖరి తగదు. తాను అజాగ్రత్తగా ఉంటే కుటుంబ సభ్యులంతా స్వేచ్ఛా ప్రవృత్తి లో పడిపోవచ్చు. కాబట్టి నిరంతర జాగరూకత అవసరం. కుటుంబ సమన్వయం అవసరం, పిల్లల బయటి వ్యవహారాలు తల్లి గమనింపలేదు. ఆ బాధ్యత తండ్రి వహించాలి. పిల్లలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు? వారిని ఎవరైనా చెడుమార్గంలో నడపుతున్నారా అనేది ప్రమాదకర సిద్ధాంతాలలోకి పోతున్నారా అనేది గమనించి వారిని ఎప్పటికప్పుడు మంచిత్రోవలో పెట్టాలి. రాక్షసుడైన హిరణ్యకశిపుడు కూడా కుమారుని ప్రహ్లాదుని ఒడిలో కూర్చో బెట్టుకొని గురువులు ఏమి నేర్పారు? ఏ విద్యలు తాను నేర్చుకున్నాడో అడిగేవాడట. నేటి తండ్రులకు అంత తీరిక కూడా లేకపోతుంది. నేటి విద్యలు అనేక కారణాలవల్ల మార్కులు, ఉద్యోగాలు ఇప్పించగలవే తప్ప సంస్కారాలను పెంచగలవిగా లేవు. కాబట్టి ఆ లోటు తాను తీరుస్తూ పిల్లలకు సంస్కారాన్నందించే ప్రయత్నం చేయాలి.
కుటుంబమంటే తన తల్లిదండ్రులు, భార్య, తన పిల్లలతో కూడినది. భార్య వేరొక ఇంటి నుండి వచ్చినవి కాబట్టి తనవలె తల్లిదండ్రులతో సంబంధంలేనిది కాబట్టి తాను సమన్వయంకర్తగా కుటుంబ సభ్యులందరూ కలిసి పంపివేయటం, భార్యమాటవిని తల్లిదండ్రులను నెట్టివేయటం సరియైన విధానం కాదు. తనను కనిపెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల నెలా చూస్తాడో అనంతర కాలంలో తన బిడ్డలు తనను అలాగే చూస్తారు అని గ్రహించాలి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చి, పిల్లల్ని హాస్టళ్ళలో చేర్చి హాయిగా భార్యాభర్తలం ఉన్నామనుకొనటం మంచి మనిషి లక్షణం కాదు. భారతంలోని ధర్మవ్యాధోపాఖ్యానంలో మాంసం అమ్ముకొని బ్రతికే వ్యక్తి బ్రాహ్మణునకు ధర్మోపదేశం చేస్తాడు. ”నీకింత జ్ఞానం ఎలా కల్గింది?” అంటే తలిదండ్రులను సేవించటం వల్లనే అని ”ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వేదవేదాంగాలు నేర్చి తపస్సులో ఏదో సాధించాననుకొంటున్నావు కాని నీ తల్లిదండ్రులను వృద్ధులను ఒంటరిగా వదలి నీవు వారి సేవ చేసికొనకుండా ఏవో సాధించాననుకొనేవి అన్నీ వ్యర్థములే. నీయందు తీరని పాపం ఒకటున్నది. అది నీ తల్లిదండ్రులను సేవింపక వదలటం” అంటాడు ధర్మవ్యాధుడు.
తల్లిదండ్రులను పూజిస్తూ ఉత్తమ పుత్రునిగా, భార్యను చక్కగా ప్రేమిస్తూ ఉత్తమ భర్తగా, పిల్లలను ఆనందంగా పాలించి పోషిస్తూ ఉత్తముడైన తండ్రిగా మనుగడ సాగించాలి. పెద్దలను గౌరవించటం, వారికి నమస్కరించటం కర్తవ్యం, ధర్మశాస్త్రం.
అభివాదన శీలస్య, నిత్యం వృద్ధోపసేవినః ।
చత్వారి పరివర్ధంతే ఆయుర్విద్యాయశో బలమ్ ॥
అని చెప్పింది. అంటే ఎల్లప్పుడూ పెద్దలగువారికి నమస్కరిస్తూ వారికి సేవచేస్తూ ఉండేవారికి ఆయుష్షు, విద్య, కీర్తి, బలము వృద్ధి చెందుతాయి. అలా కాక పెద్దల సేవింపక వారిని దూరం చేసుకొనే వారికి ఆ నాల్గూ క్షీణిస్తాయి అని గ్రహించాలి. ఆసుపత్రులు పెరుగుతున్నాయంటే వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని అర్థం. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే తలిదండ్రుల నాదరించని వారు పెరుగుతున్నారని అర్థం. అవి రెండూ సమాజానికి అనర్ధదాయకాలే.
పుత్రుడు అనే వానికి శాస్త్రం మూడు కర్తవ్యాలు చెప్పింది. ఆ మూడూ ఆచరిస్తేనే నిజమైన పుత్రుడనిపించుకొంటాడు.
“జీవతో వాక్యకరణాత్ – ప్రత్యబ్దే భూరిభోజనాత్ |
గయాయాం పిండదానాచ్చ – త్రిభిః పుత్రస్య పుత్రతా ||”
అని. అంటే 1. తండ్రి బ్రతికి ఉన్నంతవరకూ ఆయన చెప్పినది చేయటం. 2. తండ్రి చనిపోయాక ఆ తిథినాడు అంటే తద్దినం నాడు ఎక్కువమందికి భోజనం పెట్టడం. 3. గయలో పిండప్రదానం చనిపోయిన తల్లిదండ్రులకోసం చేయటం అనేవి పుత్రుడు అనే మాటకు అర్హత కల్గించేవి. కాబట్టి ఆ మూడు పనులు తప్పక చేయాలి. బ్రతికి ఉన్నంతవరకు తండ్రిమాటను జవదాటని శ్రీరాముడు ఈ విషయంలో మనకు ఆదర్శమైతే ఆ రామునకు పరశురాముడు ఆదర్శం. తండ్రి చెప్పిన మాటపై మంచి చెడు పరమార్శ కూడా చేయకూడదు. అలా నిర్విచారంగా తండ్రిమాటను పాటించటమే పితృవాక్యపాలనగా చెప్పబడింది. తండ్రి చనిపోయిన తిథినాడు ఎక్కువమందికి భోజనం పెట్టాలి. తన ఇంటి కాహ్వానించి పెట్టగల్గితే మంచిది. లేకుంటే నిత్యాన్నదాన పథాకాలున్న దేవాలయాలలో తల్లిదండ్రుల తిథినాటికి డబ్బుకడితే శాశ్వతంగా వారిపేర అన్నదానం వారి తిథినాడు జరుగుతూ ఉంటుంది. అక్కడ డబ్బుకట్టి చేతులు దులుపుకొనటంకాదు. తప్పకుండా ఇంటివద్ద ఆత్మీయులను పిలిచి కూడ పితృకార్యం జరిపి తీరాలి. మూడవది గయలో పిండప్రదానం చేయటం, ఇంటిదగ్గర పితృకార్యం చేస్తూ కూడా ”గయాయాం దత్తమస్తు” అని గయను స్మరిస్తారు. అటువంటిది గయలోనే జరిపితే ఎంత విశేషమో చెప్పవలసిన పనిలేదు. గయలు శిరోగయ, నాభిగయ, పాదగయ అని మూడున్నాయి. శిరోగయ బీహారులో, నాభిగయ ఒరిస్సాలో, పాదగయ ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో ఉన్నాయి. విశేషంగా మాతృగయ మధ్యప్రదేశ్లో ఉంది. అన్నిటా చేయగల్గితే మంచిది. కనీసం ఒక్కగయలోనయినా పిండప్రదానం జరిపి తీరాలి. అలాగే పుష్కరాలు, కాశీ మొదలైన తీర్థయాత్రలలో కూడ పితృకార్యాలు నిర్వహించి పితృఋణం తీర్చుకోవాలి. పితృశబ్దంలో మాతృశబ్దం కూడా ఉంది. కాబట్టి పితృసేవ అంటే తలిదండ్రులిర్వురి సేవ అనే అర్థం.ఇంతగా పితృసేవ గూర్చి చెప్పటం ఎందుకంటే స్త్రీకి పాతివ్రత్యం ఎంతముఖ్యమో పురుషునకు పితృవ్రతం అంత ముఖ్యం. పురుషుడు తలిదండ్రుల సేవచేయాలి, స్త్రీ పతి సేవ చేయాలి. దురదృష్టవశాత్తు పరిస్థితులు తారుమారయ్యాయి. పురుషుడు భార్యాసేవ చేస్తున్నాడు, స్త్రీ తన తల్లిదండ్రుల సేవ చేస్తోంది. ఎలా అయితే ఏమి? అనుకొనటం తగదు. మన మహర్షులు ఎవరి కర్తవ్యాలు ఏవిగా చెప్పారో అవే శ్రేయస్కరాలు. మన ధర్మం, సంస్కృతులను విస్మరిస్తే మానవత్వపు విలువలు పోగొట్టుకొంటాము. పెద్దలను దగ్గరుంచుకొని సేవిస్తూ వారి ఆశీస్సులందుకొంటూ ఉండటం మనకు సర్వదా సర్వదా శ్రేయస్కరం. తల్లిదండ్రుల శారీరక మానసిక స్థితులకతీతంగా వారిలో దైవత్వాన్ని చూడగలవాడే ధన్యుడు. తల్లిదండ్రులు ప్రత్యక్షదైవాలు. వారి మాటలతో, చేష్టలతో పట్టించుకొని వారిని ద్వేషిస్తూ వారిలో దైవత్వాన్ని చూడలేకపోతే అదే దురదృష్టం. బృహద్ధర్మపురాణంలో పితృస్తోత్ర, మాతృస్తోత్రాలున్నాయి. తల్లిదండ్రులకు నమస్కరిస్తూ చదువుకొనవలసిన పితృవందనం
మమార్హకం నరజననం పోషణం పరిపాలనం
ప్రాపయతోత్ర వైసర్వం- పితృదేవ! నమోస్తుతే ॥
మాతృవందనం
సర్వమంగళ సంపన్నే సర్వశోక హరాత్మికే
కరుణా స్నేహ సంపన్నే – మాతృదేవి! నమోస్తుతే॥
అనేవి నిత్యమూ పఠించి తల్లిదండ్రులకు నమస్కరించాలి. మనలను కనటం, పెంచి పెద్దచేయటం వల్లనే వారు మనకు పూజార్హులు. ఆ కాలంలో వారు మనకై ఎన్ని కష్టాలు భరించారో ఊహించలేము. కాబట్టి పెద్దయ్యాక వారి ఋణం తీర్చుకోవాలి. ఈ సత్సంప్రదాయం పరంపరగా కొనసాగాలి. దేవతలలాగే పితృదేవతలు కూడా వరాలు ప్రసాదిస్తారు. పితృశాపానికి గురి అయితే వంశవృద్ధి జరుగదు, సంతానం కలుగదు. కాబట్టి క్రింది తరాలకోసం పై తరాలను సేవించుకొనటమే ధర్మం.
పరిపూర్ణ మానవావతారం శ్రీరామచంద్రుడు. మనుష్యులు ఎలా బ్రతకాలో చెప్పటంకోసమే శ్రీమన్నారాయణుడు మనుష్యావతారం ఎత్తాడు. కాబట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసికొని ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరిని ఎలా చూడాలో అలా చూడాలి. ఆదర్శవంతంగా జీవించాలి. సంస్కృతి సభ్యతలను కాపాడాలి. ఉద్యోగకాలంలో లౌకిక జీవితంలో నియమాలు పాటింపలేకపోయినా కనీసం ఉద్యోగవిరమణ చేసాక అయినా పూర్తి సదాచార నియమాలు పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించాలి. దుర్లభమైన మనుష్యజన్మ లభించినందుకు దానిని సద్వినియోగం చేసుకొవాలి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹