రాత్రి భోజనము
రాత్రి భోజనమునకు కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. పగటి భోజనంలో 1/4వవంతు తగ్గించి రాత్రి భోజనం చేయాలి. గురుత్వ ద్రవ్యాలు తగ్గించి తినాలి. దుంపకూరలు, పప్పు, పచ్చళ్ళు, పిండివంటలు తినకూడదు. ఆకుకూరలు, పాలు వంటివి మేలు. సంధ్యాసమయంలో తినకూడదు. దీపంతో చూడక ఉప్పు వేయకూడదు. ఉసిరికాయ రాత్రి తినరాదు. దీపం లేకుండా భుజింపరాదు. రాత్రి 9 గంటలలోపు భుజించాలి. పెరుగు వేసుకొని భోజనం చేయటం ఆయుఃక్షీణకరంగాను, పాలుపోసుకొని తినటంఆయుర్శ్వద్ధికరంగాను తెలుపబడింది. రాత్రిపూట నువ్వులతో కూడిన ఏవస్తువును తినకూడదు. ఎప్పుడయినా భోజనాత్పూర్వం అల్లం, సైంధవలవణం కల్పి నమిలి తింటే జీర్ణశక్తి వృద్ధి అవటం, గొంతు, నాలుక పరిశుద్ధమవటం, రుచి కల్గటం జరుగుతుంది. ఉదయం జాములోపల జీర్ణరసాద్యుత్పత్తి సమయం కాబట్టి భుజింపకూడదు. జాముదాటిన పిదప రెండు జాములలోపల భుజించాలి. రెండు జాములుదాటాక కూడా భుజించకపోతే బలం నశిస్తుంది. అన్నివేళ్ళతో కల్పుకొని తినటం, చప్పుడు కాకుండా తినటం, ఆకలి వేసినప్పుడే తినటం, భోజనానంతరము నూరడుగులు మించి నడవటము వంటివి కూడ భోజన నియమాలు. ఈర్ష్య, భయము, కోపము, లోభము, రోగము, దైన్యము, ద్వేషములను మనసున నుంచుకొని భుజించినచో ఆ తిన్నపదార్థం సరిగా జీర్ణం కాక విషతుల్య మవుతుంది.
మిక్కిలి వేగంగాను, చాలా నెమ్మదిగానూ, అతిగా మాట్లాడుతూనూ, నవ్వుతూను తినకూడదు. ఒక్కరుగానే కూర్చొని తినవద్దని చెప్పారు పెద్దలు. పథ్యమయిన ఆహారం, విహారం కలవానికి ఔషధంతో పనిలేదని, అపథ్యమయిన ఆహార విహారాలవారికి కూడ ఔషధం అవసరంలేదని అంటే పనిచేయదని చెప్పబడింది. నిలబడి భోజనం చేయటం, నీళ్ళు త్రాగటం కూడా తగదని మహర్షులు తెల్పారు. 18.7.2018న ఆంధ్రజ్యోతి దిన పత్రికయందు వెలువడిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో నిలబడి అన్నపానీయాలు తీసికొనటం వలన ఎన్ని అనర్ధాలు ఉన్నాయో చెప్తూ కిడ్నీలమీద కూడ దాని దుష్ప్రభావం పడుతుందని వివరించారు. కాబట్టి భోజన నియమాలు పాటిస్తూ అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనేది మన పెద్దల ఆశయం.
మధ్యాహ్న భోజనం అయాక ఆరుగంటలు వ్యవధానం ఇచ్చియే రాత్రి భోజనం చేయాలి. అయితే రాత్రి 11 గంటలు దాటాక భోజనం చేయకూడదు.
మాంసపుకృత్తులవంటి అరుగని పదార్థాలు తినకూడదు. భోజన విషయంలో బుద్ధి జీవులకు, శ్రమ జీవులకు తేడా ఉంది. శ్రమ జీవులు మూడు పూటల భోజనం చేయవచ్చు. వారయినా రాత్రి పెందలకడనే సులభ పదార్ధాలతోనే భోజనం చేయాలి.
నార్ధకారే న చాకాశే
అని రాత్రి భోజనం చీకటిలోను, ఆరుబయట చేయకూడదు, రాత్రి భోజనం చేస్తుండగా దీపం ఆరిపోతే చేతితో పాత్ర పట్టుకొని మనసార సూర్యభగవానుని స్మరించాలని చెప్పబడింది. మరల దీపం వచ్చాకే మిగులు భోజనం చేయాలి తప్ప చీకటిలో అలాగే తినటం తగదు. రాత్రి భోజనం చేస్తూ తుమ్మితే దానివలన ఆయుఃక్షీణం, దరిద్రత చెప్పబడ్డాయి. దాని పరిహారార్ధం శిరస్సున నీరు చల్లి ప్రశ్నించి వారి జన్మభూమిని, దేవతలను స్మరింపజేసేవారు.
తాంబూలము
భోజనానంతరం భోగ ఆరోగ్యములకై తీసికొనేది తాంబూలం.
నక్షత్రగుణ్యం మతం
అని తాంబూలంలో వీర్యపుష్టి, సౌగన్ధ్యం, అలంకారం, బుద్ధిబలం, వశ్యకరం, క్రిమిహరం ఇలా 27 లక్షణాలున్నాయని శాస్త్రం చెప్తోంది. తాంబూల ద్రవ్యాలన్నిటితో వేసికొనే తాంబూలం ఒక మహౌషధము, మహదానందకరము. తాంబూలానికి సాధారణ విధానం ఒక వక్క, అయిదు ఆకులు, ఆనపబద్దంత సున్నం, అందులో సగం పచ్చకర్పూరం, మూడు తక్కోలాలు, రెండు లవంగాలు, ఒక ఏలక్కాయ, శనగ గింజంత జాజికాయలతో వేసికొనటం. పురుషులు పచ్చకర్పూరానికి రెట్టింపు కస్తూరిని, స్త్రీలు కస్తూరికి రెట్టింపు పచ్చకర్పూరాన్ని వాడాలి. మనుచరిత్రలో తాంబూలం వాసనను బట్టి దూరంనుండే అది స్త్రీతాంబూలపు వాసనగా గ్రహించాడు ప్రవరుడు. ఆకులలో కూడా స్త్రీ, పుం భేదాలుంటాయని, స్త్రీజాతివి పురుషులు, పురుషజాతివి స్త్రీలు వేసికొనాలని రసికులు చెప్తారు. ఆకలి కలవారు, ఉష్ణతత్వంవారు తాంబూలం వేసికొంటే తలనొప్పి, పైత్యం కలుగుతాయి. ఒంటి వక్క ఆరోగ్యకరమని, రెండు వ్యర్థమని,మూడు మిక్కిలి శ్రేష్ఠమని, అంతకు మించి దూష్యమని భోజుడు చెప్పాడు. ఉదయపు తాంబూలంలో వక్కలు, మధ్యాహ్నం సున్నం, రాత్రి ఆకులు అధికంగా వేసికొనాలి. తాంబూలం నమిలేటప్పుడు మొదట వచ్చిన రసం విషతుల్యం. కాన దానిని ఉమ్మేయాలి. రెండవది నీరస, విరేచనకారి. మూడవది అమృతతుల్యం. తమలపాకు తొడిమ, ఈనెలు, కొసలు తీయటం మన పద్ధతి. ఇటీవలి కాలంలో పాశ్చాత్యులొకరు ఆ మూడింట మూడు విధాల విషాలున్నాయని పరిశోధనలో తేల్చారు. సంభోగంవలన క్షీణించిన శక్తిని తిరిగి చేకూర్చే సామర్థ్యం కల ఒక పదార్థంకూడా తాంబూలంలో ఉన్నట్లు ఆ పాశ్చాత్యులు గ్రహించారు. తొడిమ మూలవ్యాధిని, ఈనెలు బుద్ధినాశాన్ని, కొసలు అనారోగ్యాన్ని కల్గిస్తాయని మన పెద్ద లంటారు. మన సదాచారం ఎంత విశిష్టమయినది! విరేచనాల రోగి, ఆకలితో ఉన్నవాడు తాంబూలం వేసికోకూడదు. ఎండిన, పండిన ఆకులవలన ఆయుః క్షీణము చెప్పబడినది.
“పంచసప్తాష్ట పర్ణాని దశద్వాదశ ఏవవా”
అని 5,7,8,10,12, ఆకులను పుచ్చుకొనుట కాని, ఇచ్చుటకాని చేయాలి. 4 లేదా 3 తగదు. మధ్యవ్రేలు లేదా బొటన వేలితో సున్నం వ్రాయాలి.
”చూర్ణపర్ణం వర్ణయిత్వా”
అని సున్నం ఉంచిన ఆకును తాంబూలంలో వాడుకోరాదని భోజుని మాట. శ్రాద్ధకర్మ, మాసికం, ఆబ్దికాదులు జరిపిన రోజు కర్త, భోక్తలు కూడా తాంబూలం వేసికొనకూడదు. అందువలననే తాంబూలం ఈయ అవసరంలేదంటారు. పురుడు, మైల, ఉపవాస దినాలలో పగలుకాని, రాత్రికాని తాంబూలం వేసికొనరాదు. పాలు, వెలగపండు, పనసపండు, మామిడి పండు, అరటిపండు, చెఱకు, మద్యము, కట్టు, రసాయనము, నేయి, తేనె, కొబ్బరినీళ్ళు పుచ్చుకొనిన అనంతరం తాంబూలం విషం అవుతుంది. కాబట్టి అవి తీసికొనిన పిదప ఒక అరగంట వ్యవధానం ఉంచే తాంబూలం వేసికొనాలి. వ్యసనం కానీయకుండా తీసికొంటే తాంబూలము భోగకరి, ఆరోగ్యకారి కూడా.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹