Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – సత్కాలక్షేపం – 16

సత్కాలక్షేపం

సద్గ్రంథ పఠనం గూడా సదాచారంలో భాగమే. ఈ సంసారమనే విషవృక్షానికి రెండు అమృత సమానమయిన ఫలా లున్నాయట. అందు మొదటిది కావ్యామృత రసాస్వాదము, రెండవది సజ్జనులతో మాట్లాడుకొనటం అంటే సత్సంగం.

మనం ఎటూ సంసార విషవృక్షాన్ని తప్పక ఎక్కాం. కాబట్టి ఎలాగయినా ఆ అమృతఫలాలనందుకోగల్గితే జన్మ చరితార్థ మవుతుంది. కావ్యామృత రసాస్వాదమంటే చెడు రచనలు కాక ఉత్తమచరిత్రలు, పురాణాదులు పఠించటం. ఈ విషయంలో ఒక చమత్కార శ్లోకం చెప్పబడింది. దాని భావం “బుద్ధిమంతులకు ప్రాతః కాలములో ద్యూత ప్రసంగంతో, మధ్యాహ్నం స్త్రీ ప్రసంగంతో, రాత్రి చోర ప్రసంగంతో కాలం గడుస్తుంది” అని. అంటే వారు ఉదయం పూట ద్యూతంవల్ల కురుక్షేత్రయుద్దం దాకా పోయిన భారతాన్ని చదవటంద్వారా, మధ్యాహ్నం స్త్రీని అపహరించటంవల్ల రామరావణ సంగ్రామందాకా పోయిన రామాయణం చదవటం ద్వారా, రాత్రిపూట వెన్నలదొంగ శ్రీకృష్ణుని చరిత్ర భాగవతం చదవటంద్వారా కాలం గడుస్తుంది అని. అలా భారత భాగవత రామాయణాల వంటివి చదవటంద్వారా మొదటి ఫలాన్ని అందుకొనాలి. ఉద్యోగ బాధ్యతలు లేనివారికి ఇట్టివి సాధ్యం.

రెండవ ఫలం సత్సంగం. సత్సంగ మహిమ చాలా గొప్పదిగా ఆర్ష గ్రంథాలలో చెప్పబడింది.

”సత్సంగత్వే నిస్సంగత్వం”

అంటూ సత్సంగంవలన చెడువానితో సంబంధం పోతుందని, అందువలన మోహం తొలగుతుందని, దానివలన నిశ్చలతత్వ మేర్పడి అది జీవన్ముక్తికి హేతువవుతుందని శంకరభగవత్పాదులవారు చెప్పారు. నారదుడొకమారు విష్ణుమూర్తినే సత్సంగ మహిమ ఎటువంటిదో తెలుపుడని ప్రార్థించాడు. వెంటనే గ్రుడ్డునుండి వెలువడుచున్న చిలుకనుగూర్చి చెప్పి దాని నడుగమన్నాడు. అడుగగానే అది చనిపోయింది. అనంతరం ఈనుచున్న కుక్కపిల్లని, అదీ చనిపోగా,అప్పుడే పుట్టే ఆవుదూడని అడగమని విష్ణుమూర్తి చెప్పగా వాటి మరణానికి కారణమయానే అని బాధపడుతూనే అడిగాడు. ఆవుదూడ చనిపోవటంతో ఇక ఈ మహాపాపం చేయలేననగా అప్పుడే పుట్టబోయే రాజకుమారునడగమని, తప్పక చెప్పగలడని అనటంతో భయపడుచునే ఆ పసికందును నారదుడు సత్సంగ మహిమ నడిగాడు. ఆ పసివాడు నారదునకు నమస్కరించి మహానుభావా! నేను తొలి జన్మలో పక్షిగా పుట్టగానే నీ సత్సంగం కల్గి అనంతరం కుక్కపిల్లగా పుట్టాను. అప్పుడూ ఇలాగే అనుగ్రహించగా ఆవుదూడగా పుట్టాడు. అప్పుడు కూడా మీ సత్సంగ భాగ్యం కల్గి ఇలా చక్రవర్తి పుత్రుణ్ణయ్యాను. సత్సంగమహిమ ఎంతటిదో దీనిని బట్టే అవగతమవుతోంది. అనగానే నారదుడు పరమానందభరితుడయ్యాడు. అలా సత్సంగం చాలా గొప్పది. అంతటి సత్పురుషులు లభింపకున్నా తోటివారిలో మంచివారితో కొంత సమయం వేదాంత చర్చ వంటివి చేయటం ద్వారా ప్రసంగవశాన మన జన్మకు చరితార్థత కల్గించే మంచి విషయాలు బయటకు వస్తాయి. సందేహాలు తొలగుతాయి. కాబట్టి నిత్యము కొద్దిసమయము సత్సంగమునకు వినియోగించుట శ్రేయస్కరము. అందుకే ఆధ్యాత్మిక సంస్థలు ఆలయసంస్థలు, సత్సంగాల నేర్పరుస్తూ ఉంటాయి. అలాగే పురాణశ్రవణం వంటివి కూడా కర్తవ్యాలు.

దేవాలయ సందర్శనం

హిందూధర్మ మూలసూత్రాలలో ప్రతిమాసేవనం ఒకటి.

“ఆలయార్చా గృహార్చేతి చోభయం శ్రుతిచోదితమ్”

అని ఆలయార్చన, గృహార్చన అని అర్చన రెండు విధాలు. కాన దేవాలయ అర్చన, దర్శనములనుగూర్చి కూడ తెలసికొనుట సదాచారంలో భాగ మవుతుంది. నిత్యం ఆలయదర్శనం కూడా సదాచారంలో ఒక భాగం. ఆలయాలకు వచ్చేవారు లేరంటూ కొన్నిగ్రామాలలో ఆలయాలు తెరిచి ఉంచటం కూడా తక్కువవుతోంది. ఆవిధంగా వెళ్ళదలచుకొన్న వారికి కూడా అవకాశం లేకుండాపోతోంది.సమీప దేవాలయమునకు వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థనచేసికొని భగవదనుగ్రహానికి పాత్రులం కావాలి. వారమున కొకసారయినా సకుటుంబంగా వెళ్ళే అవకాశం చేసికొనాలి. దాని ప్రభావం ఆ కుటుంబముపైనే కాక సమాజంమీద కూడా మంచిగా పడి అది ఆదర్శ మవుతుంది.

సర్వాంతర్యామి అయిన భగవంతునికోసం దేవాలయాలకు, తీర్థయాత్రలకు వెళ్ళటం ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తారు. ఇదేప్రశ్న రామకృష్ణ పరమహంస నొకరు అడుగగా ”గోవునందు అంతటా గోత్వమున్నా దాని ఫలితం స్తనములందే సన్నిహితమై ఉండి లభించునట్లు అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఆలయాలలో సన్నిహితుడై ఉండి అనుగ్రహిస్తాడు” అన్నారు. కాబట్టి దేవాలయసందర్శనం చేయాలి. బజారుకు, సినిమాలకు, హోటళ్ళకు సకుటుంబముగా వెళ్ళటంలో ఉత్సాహం చూపినట్లు ఆలయ సందర్శన విషయంలోకూడా శ్రద్ధచూపాలి. వినీత వేషధారణతో, తిలకధారణతో మానసికంగానేకాక దైహికంగాకూడా పవిత్రత, భక్తి కల్గి ఉండాలి. మొక్కుకొన్న పదార్థాలు, లేదా పూజాద్రవ్యాలు తీసికొని వాహనాన్ని దూరంలో ఆపి పాదచారిగా ఆలయ సమీపానికి వెళ్ళాలి. భగవత్సన్నిధానానికి ఏదో ఒకటి తీసికొని వెళ్ళి సమర్పించాలి తప్ప వట్టి చేతులతో వెళ్ళకూడదు. ప్రాకారం బయటే చెప్పులుంచాలి. చిత్తం చెప్పులమీద ఉంచవలసిన స్థితి లేకుండా నిర్ణీతస్థలంలో ఉంచి నిశ్చింతగా ఆలయదర్శన కార్యం పూర్తిచేసికొనాలి. కాళ్ళు కడిగికొని లోపల ప్రవేశించాలి. భగవంతుని అభిముఖుని చేసికొనటంకోసం గంటకొట్టాలి. గుడిలో ఘంటానాదం చేయటంవలన వందజన్మలలో చేసిన పాపం పోతుందని స్కాందపురాణం చెప్పింది. నివేదన జరుగు సమయంలో మంత్ర, ప్రసంగాదులకు భంగకరంగా గంట కొట్టకూడదు. ఒకప్పుడు దేవాలయమే గ్రామానికి కేంద్రబిందువుగా ఉండేది. అక్కడే విద్యాభ్యాసం జరిగేది. న్యాయస్థానంలా న్యాయనిర్ణయాలు జరిగేవి. వైద్యచికిత్స, పేదలకు అన్నదానం ఇలాసమస్తమూ దేవాలయం కేంద్రంగా జరిగేవి. మరల అటువంటి మంచిరోజులు రావాలి. అనంతరం దైవ దర్శనం చేసి ప్రదక్షిణాలు చేయాలి. భిన్నభిన్న దేవాలయాలలో భిన్నభిన్న విధానా లుంటాయి.

”ఏకం చండ్యాం రవే స్సప్త”

అంటూ అమ్మవారికి ఒక్కటి, వినాయకునకు మూడు, విష్ణువుకు నాలుగు , శివునకు మూడు, హనుమంతునకు ఐదు, సూర్యునకు మూడు, ఇలా ఆలయ ప్రదక్షిణాలు చేయాలి. శివాలయంలో చండీప్రదక్షిణ విధానమని ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే శివదర్శనం కూడా నంది కొమ్ములపై ఎడమచేతి బొటనవ్రేలు, చూపుడువ్రేళ్ళను ఉంచి కుడిచేతితో వృషభ అండములు స్మృశించి వ్రేళ్ళకొమ్ముల మధ్యనుండి దర్శనం చేయాలి. నైవేద్య సమయములో దైవదర్శనం చేయకూడదు.

ఆలయనియమాలను పాటిస్తూ వ్యవహరించాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఏవీ క్రింద పడనీయరాదు. ఆలయాన కూర్చొని ధ్యానం చేయాలి. గణపతివద్ద గుంజిళ్ళు తీయటం, చండీశ్వరునివద్ద చప్పట్లు కొట్టటం వంటి ఆధ్యాత్మిక చర్యలు చేయాలి. అశుచి వంటివానివల్ల భగవద్దర్శనం చేయటానికి ఆలయంలో ప్రవేశింపలేని దశలో ఆలయ గోపురదర్శనం చేయటంవల్ల దైవదర్శన ఫలం లభిస్తుంది. ఆత్మప్రదక్షిణం భగవంతునకు ఎదురుగా చేయకూడదు. ఆలయాన ఏరీతిగానూ అశుచి చేయకూడదు. ఆలయ సత్సంగాలు, పురాణ శ్రవణాదులయందు పాల్గొంటూ ప్రోత్సహించాలి. నైమిత్తిక కార్యాలు, ఉత్సవాలందు సమాజమంతా ఏకమయి పాల్గొనాలి. దేవునకు నేరుగా ఎదురుగా నిలబడకూడదు.

ఆలయంలో కులమత విచక్షణ, అస్పృశ్యత ప్రకటించరాదు. ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా కాక పుణ్యక్షేత్రాలుగా దర్శించాలి. అక్రమ మార్గాలద్వారా కాక సక్రమంగా భక్తితో దర్శించి ఆనందించాలి. ఆలయంలోకి రాలేని దశలో

”శిఖరం శిరఉచ్యతే”

అన్నారు కాన శిఖరదర్శనం చేయాలి. ఆలయదర్శనంవల్ల, ఆలయగోపుర దర్శనంవల్ల దుష్టగ్రహబాధలు తొలగిపోతాయని పరమపురుష సంహిత చెప్పింది. నందికి, శంకరునకు మధ్యలో పోరాదు. ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించుకొనాలి. కొన్ని కొన్ని ఆలయాలకు కొన్ని ప్రత్యేక నియమాలుంటాయి. వానిని తప్పక పాటించాలి. దైవాన్ని చూచేటప్పుడు ముందుగా పాదాలనుండి ఆరంభించి క్రమంగా పూర్తి దర్శనం చేయాలి. ముందు అమ్మవారిని దర్శించి పిదప స్వామిని దర్శించటం విధానంగా పెద్దలు చెప్పారు.ఒకే ప్రదక్షిణము చేయకూడదు. ఆలయం నీడను, ధ్వజస్తంభం నీడను దాటకూడదు.

శివదర్శనం నంది కొమ్ముల మధ్యనుండే చేయాలి. ప్రదక్షిణ నమస్కారాలు, తీర్థప్రసాద స్వీకరణ అయిన అనంతరం ఆలయంలో కొద్ది సమయం కూర్చొని ధ్యానించాలి. వ్యర్థాలాపాలు తగదు. వెళ్ళిన మార్గం గుండానే తిరిగిరావాలి. ఉత్సవాదులందు ఏర్పరచిన మార్గాల ననుసరించాలి. ఇలా నియమాలు పాటిస్తూ దైవకార్యం నిర్వహించినవారు తప్పక ఆ దైవంయొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. భగవత్సేవ వలన ఫలితాలు శాస్త్రంలో ఇలా చెప్పబడ్డాయి. స్వామి సన్నిధిలో ఊడ్చటంవలన జన్మసాఫల్యం చేకూరుతుంది. ఛత్రచామరాదులు ధరించటంవల్ల అభీష్టం నెరవేరటము, స్వర్గప్రాప్తి చేకూరుతాయి. స్వామిని మోయటంవల్ల భగవత్సాయుజ్యం చేకూరుతుంది. పుష్పమాల సమర్పించటంవల్ల చాలా గొప్ప ఫలితాలు చేకూరుతాయి. ఉత్సవాలలో శాస్త్రీయ పద్ధతిలో నృత్యము, గానములు, చేయటంవలన అన్ని కోర్కెలు నెరవేరుతాయి. స్థానశుద్ధి, పాత్రశుద్ధి వలన, దీపారాధనలవలన గ్రహణస్థానఫలితం దక్కుతుంది. ఇలా ఆలయంలోని సేవలవలన సులభంగా భగవదనుగ్రహాన్ని, ముక్తిని గూడా పొందగల్గుతాము.

అట్లే అవకాశము ననుసరించి తీర్థయాత్రలు చేయటంకూడా సదాచరణమే. తీర్థయాత్రలు మనుజులకు గొప్ప మానసిక వికాసాన్ని కల్గిస్తాయి. లోకజ్ఞానమునకు, వైరాగ్య భావమునకు, అన్యచింతనల నుండి బయటపడుటకు, కొన్ని విధముల ప్రాయశ్చిత్తములకును తీర్థయాత్రలు కర్తవ్యం. తీర్థములందు ఎక్కడ ఏ చర్యలు తగినవో అవి చేయాలి. కాశీలో దండనం, గయలో పిండనం, ప్రయాగలో ముండనం కర్తవ్యాలు అంటారు. అలా కార్యక్రమాలు నిర్వహించాలి. మోక్షగామి ద్వాపరయుగంలో కురుక్షేత్రాన్ని, కలియుగంలో కాశీని ఆశ్రయించాలని విష్ణుపురాణం తెల్పింది. క్షేత్రోపవాసమని వెళ్ళినరోజు ఉపవసించటం ఉంది. శ్రీశైలంలో ధూళిదర్శనం వంటి ప్రత్యేకతలు గ్రహించి వాని నాచరించాలి. యాత్రకు బయలుదేరుటకు ముందుగా ఆ క్షేత్రమహాత్మ్యము, నియమాలు తెలిసికొని వెళ్ళాలి. తీర్ధయాత్రల ద్వారా దేశ సమైక్యతను గ్రహింపగల్గుతాము. తోటి సమాజంతో కలిసిమెలిసి వర్తించే తీరు గ్రహింపగల్గుతాము. క్షేత్రమును సందర్శించుట వలన ఎంతటి విశేష పుణ్యఫలం చేకూరుతుందో అటువంటి క్షేత్రంలో చేసే పాపం కూడా అనేక రెట్లుగా సంక్రమిస్తుందని తెలిసికొనవలసింది. కాబట్టి అకర్తవ్యములను పాటించకుండుటవల్ల, కర్తవ్యములను ఆచరించుటవలన సంపూర్ణ తీర్థయాత్రా ఫలితమును పొందగల్గుతాము.

నైమిత్తిక పూజావిశేషం వల్ల ఆలయ విగ్రహములందద్భుతశక్తి ఏర్పడుతుంది. కావున వానిని సందర్శించటంవలన ఎక్కువ ఆధ్యాత్మిక ప్రయోజనం సాధింపగల్గుతాము. విగ్రహము క్రింద ఏర్పరచెడి యంత్రములో మంత్రానుష్ఠాన శక్తిని ఉంచటం జరుగుతుంది. ఆ సాధనను బట్టి

”మంత్రాధీనం తు దైవతం”

అని దైవము అక్కడ మంత్రశక్తి కారణంగా ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఆలయదర్శనం అవసరం. అది మంచి అలవాటు. అవకాశమున్నప్పుడు వెళ్ళి సకుటుంబంగా సందర్శించుకుంటూ ఉత్సవాదులందు భాగస్వాము లవుతూ ప్రోత్సహించాలి. లేకున్న ఆలయ వ్యవస్థే దెబ్బతింటుంది.

ఆలయాలలో భగవంతుడు సన్నిహితుడయి ఉంటాడనటానికి అనేక నిదర్శనాలున్నాయి. పురి సమీపంలోని సాక్షిగోపాలుని మందిరంలో కృష్ణునికెంతో భక్తితో రాణి విలువైన బులాకీ చేయించింది. ముక్కుకి రంధ్రం లేదని, తనలక్ష్యం నెరవేరలేదని బాధపడితే స్వప్నంలో కృష్ణుడు కనపడి ”చిన్నప్పుడే మా అమ్మ ముక్కు కుట్టించిం” దన్నాడు. మరుసటి రోజు చూడగా ముక్కుకు అలాగే రంధ్రం ఉంది. హీనకులుడని ఆలయంలోకి అనుమతి పొందని కనకదాసు కోసం కృష్ణుడు కిటికీ వైపు తిరిగాడు. నేటికీ అదే దర్శన విధానం కొనసాగుతోంది. సర్ఫ్మస్ మన్రోతో రాఘవేంద్రస్వామి సమాధినుండి బయటకు వచ్చి ఆంగ్లంలో మాట్లాడాడు. ఇలా అనేక నిదర్శనాలు ఉన్నాయి.

అటువంటి ఆలయాలను దర్శించటంలో నియమాలు పాటించాలి. భక్తుల ఏకాగ్రతకు భంగం కల్గేటట్లుగా దేవాలయంలో ధ్వనులు కల్గేటట్లు అట్టహాసం చేయరాదని శాండిల్య మహర్షి చెప్పాడు. వినీత వేషధారణ చేయాలి. ప్రధాన ద్వారం నుండే లోపల ప్రవేశించాలి.

”పృష్ఠభాగం న దర్శయేత్”

అని శాస్త్రం చెప్పినందున ఆలయంనుండి తిరిగి వచ్చేటప్పుడు స్వామిని చూస్తూ వెనుకగా లేదా ప్రక్కన నడిచివెళ్ళాలి. అంతేకాని స్వామివైపు పృష్ఠం ఉంచకూడదు. బలిపీఠం, ధ్వజములకు వెనుక సాష్టాంగ నమస్కారం చేయాలి. పిదప వాహన దర్శనం చేయాలి. అలాగే ఘంటానాదం చేసి భగవంతుని అభిముఖుని చేసికొనాలి. ఆలయదర్శనంలో పంచేంద్రియ నిగ్రహం ఉంది. ఘంటానాదం శ్రోత్రేంద్రియాన్ని నిగ్రహిస్తుంది. ధూపాది పరిమళాలు ఘ్రాణేంద్రియాన్ని నిగ్రహిస్తాయి. భగవంతుని ఆపాదమస్తకం దర్శించి ఆ తరువాత కళ్ళు మూసుకొని లోచూపుతో దర్శనం చేయటం నేంత్రేంద్రియాన్ని నిగ్రహిస్తుంది. తీర్థ ప్రసాదాలు రసనేంద్రియాన్ని నిగ్రహిస్తాయి. నిర్మాల్య ధారణ త్వగింద్రియాన్ని అంటే చర్మేంద్రియాన్ని నిగ్రహిస్తుంది.

ఒంటిచేత్తో నమస్కారం చేయకూడదు. స్వామిని ఆపాదమస్తకం దర్శించాలి. కళ్ళు మూసుకోకూడదు. స్వామి ఎదుట ఆత్మప్రదక్షిణం చేయకూడదు. స్వామి ఎదురుగా నిలబడకూడదు. అశుచిగా ఆలయ ప్రవేశం చేయకూడదు. స్వామి కెదురుగా కాళ్ళు జాపి కూర్చొనటం, కాలిపై కాలు వేసికొని కూర్చొనటం, పడుకొనటం తగదు. భగవత్ప్రసాదం తప్ప వేరొకటి అక్కడ నమలరాదు. అబద్దమాడటం, బిగ్గరగా మాట్లాడటం, వ్యర్థాలాపాలు, ఇంటిమాటలు, అమంగళ, అశ్లీలవాక్యాలు, నవ్వు, ఏడ్పు, స్త్రీలతో నర్మగర్భముగా మాటలాడటం తగదు. వాజ్నిగ్రహంతో ఉండాలి. భక్తుల ఏకాగ్రతకు భంగం కల్గేటట్లుగా దేవాలయంలో ధ్వనులు కల్గేటట్లు అట్టహాసం చేయరాదని శాండిల్య మహర్షి చెప్పాడు. అపానవాయువు వీడరాదు. రొమ్ముపై వస్త్రంతో సాష్టాంగ నమస్కారం చేయరాదు. తలగుడ్డ ఉండరాదు. ఇతరులకు నమస్కారాలు చేయటం, వ్యక్తుల స్తుతులు చేయటం తగదు. గోళ్ళు, వెంట్రుకలు వదలకూడదు. తాంబూలం ఉమ్మటం, ఆలయ సమీపంలో మూత్రించటం, శరీరానికి నూనె రాసుకొని వెళ్ళటం తగదు. శ్మశాన, శవదర్శనాలు చేసినవారు స్నానం చేయకుండా ఆలయానికి రారాదు. ఫలపుష్పాదులు వాసన చూచినవి భగవంతుని కీయరాదు. కుక్క వాసన చూచినవి, స్పర్శ జరిగినవి భగవంతునకు సమర్పణకు పనికిరావు. విగ్రహాన్ని శిలామయం లేదా లోహమయంగా చూడకూడదు. తీర్థాదులు స్వీకరించి చేయి కడగటం తగదు. గోడలకు పూయరాదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment