ఉద్యోగం – వృత్తి
ఉద్యోగం పురుషలక్షణం
అన్నారు. ఇక్కడ ఉద్యోగమంటే ప్రయత్నము అని నిఘంటుపరమైన అర్థం. భారతంలో ఉద్యోగపర్వం అని ఒక పర్వం ఉంది. పురుషలక్షణ మంటే జనసామాన్యుల కర్తవ్యమని అర్థం. అంతేకానీ స్త్రీలు కానివారని కాదు. ప్రతివ్యక్తీ కర్మశీలి కావాలి. అకర్మణ్యత పనికిరాదు. ఐతరేయ బ్రాహ్మణం
”పాపోనృషద్వరోజసః”
అని సోమరితనం పాపంగా చెప్తోంది. ఇలా వేదం
”నానా శ్రాంతాయ శ్రీరస్తి”
పరిశ్రమ చేసేవానికే సంపద చేకూరుతుందని,
”ఇంద్ర ఇచ్చరత స్సఖా”
అంటే పురుషార్థపరునకే దైవం తోడ్పడుతుందని చెప్పింది. భగవద్గీతలో కృష్ణపరమాత్మకూడా
”నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్ (3-5)
అని ఎవడూ ఒక్కక్షణం కూడా కర్మ చేయకుండా ఉండడంటాడు. కాబట్టి మన వేదశాస్త్ర పురాణాదులు పనిని ప్రోత్సహించేవే తప్ప కొందరు విమర్శించినట్లు సోమరితనాన్ని ప్రోత్సహించేవి కావు. కాబట్టి ప్రతివ్యక్తీ కుటుంబపోషణకు కానీ, సమాజశ్రేయస్సునకు కాని, కర్తవ్యపాలనకు కాని ఏదో ఒక వృత్తినో, ఉద్యోగాన్నో ఆశ్రయించాలి. చతుర్విధ పురుషార్ధాలలో రెండవదయిన అర్ధాన్ని అలా సాధించాలి.
విక్రమచరితంలో ఆరుగుణములు ఉన్నచోటనే దైవం ఉండి సహాయం చేస్తాడని చెప్పబడింది. ఆ ఆరు
”ఉద్యమః సాహసం ధైర్యం – బుద్ధిః శక్తిః పరాక్రమః”
అని. ఆ ఆరింట మొదటిది ఉద్యమమే ప్రయత్నమే చెప్పబడింది.
”సంసర్గజా దోష గుణా భవన్తి”
అని మంచివారితో సహవాసం, సత్సంగం మన దోషాలను కూడా గుణాలుగా మారుస్తాయి. అలాగే హితోపదేశంలో ప్రయత్నం చేస్తేనే కార్యములు నెరవేరుతాయి తప్ప కేవలం మనస్సులో కోరిక పెట్టుకొని ఉంటే నెరవేరవని తెలుపబడింది. ఎలాగంటే సింహమయినా ప్రయత్నించి జంతువులను వేటాడవలసినదే తప్ప నోరు తెరుచుకొని పడుకొని ఉంటే జంతువులు తమంతట వచ్చి దాని నోటిలో ప్రవేశించవు. కాబట్టి దేనికైనా ప్రయత్నము, కృషి, ఉద్యోగము అవసరము. అందుకే హితోపదేశము ” ప్రయత్నం చేసేవానికే లక్ష్మి చేకూరుతుందని, దేవుడిస్తాడులే అని సోమరిలాగా ఉండటం చెడ్డ లక్షణమని దైవాన్ని ప్రక్కన పెట్టి నీప్రయత్నం నీవు చేయు”మని ఉపదేశించింది. తన శక్తిని, బలాన్ని, తెలివిని, ధైర్యాన్ని, సాహస, పరాక్రమాలను ఎవడైతే ఋజుమార్గంలో కార్యసాధనకై వినియోగిస్తాడో వాడే నిజమయిన సాధకుడు. కాబట్టి ప్రతివ్యక్తీ తనకు అర్హమయిన వృత్తిసాధనలో పగటి జీవితాన్ని సద్వినియోగం చేసికొనాలి. అది మంచి వృత్తి కావాలి.
”త్యజే దవృత్తికాం భూమిం, వృత్తిం సోపద్రవాం త్యజేత్”
అని ఆపస్తంబశాస్త్రం వృత్తి దొరకని చోటును వదలాలని, కష్టాలు తెచ్చేదయితే ఆ వృత్తిని వీడాలని చెప్పింది.
సరిగా ఆలోచిస్తే సదాచారం ఉద్యోగవృత్తులకు ఇబ్బందికరం కాకపోగా మేలుచేసేది. అలాగే ఉద్యోగ నియమం కోసం స్నానభోజనాదులు సక్రమంగా నిర్వహించటం సదాచారానికి మేలు. ఉద్యోగం జీతాని కవసరమయితే సదాచారం జీవితాని కవసరం.
”ఉత్తమం స్వార్జితం విత్తం”
అన్నారు కాబట్టి తాను కష్టపడి సంపాదించటానికే యత్నించాలి. కులవృత్తి ఉత్తమంగాను, కృషి కర్మ వ్యాపారాదికం మధ్యమంగాను, రాజసేవ కొంత తక్కువగాను, యాచన ఎప్పుడూ మంచిది కాదని ఆర్షవాక్కు కాబట్టి ఉత్తమమార్గాలలో అర్జన చేయాలి.
సంసారమును గడుపుటకు కాని, వ్యవహారము నడుపుటకు కాని, ధనము ముఖ్యమయిన అవసరం. కాబట్టి అట్టి ధనసంపాదనకై ప్రతివ్యక్తీ మంచిమార్గంలో వృత్తిని ఆశ్రయించాలి. న్యాయంగా ఆర్జించిన సంపాదనతో తనను పోషించుకొనుటకు మార్గం చూచుకొనాలి.
”వృత్యర్థం నాతిచేష్టేత”
అని వృత్తికొరకు, పొట్టకూటికొరకు చెడు చేయకూడదని పెద్దలు చెప్పారు. కేవలం తన ఉదరపోషణకే కాక పదిమందికీ మేలు జరుగునట్లు కృషి చేయాలి. వర్షాకాలం నాల్గు నెలలకోసం మిగిలిన ఎనిమిది నెలలూ కష్టపడినట్లు, వార్థక్యంలో సుఖంగా బ్రతకగల్గటంకోసం వయసులో ఉండగానే సంపాదించాలి. అయినంత మాత్రాన తృప్తిలేక వేలయేండ్లు బ్రతికేవానిలా కూడబెట్టడం, అందుకే వంచన, అన్యాయము చేయటం తగదు. వ్యాపారము, వ్యవసాయము, ప్రభుత్వోద్యోగములలో అనుకూల వృత్తి చేపట్టి జీవించాలి తప్ప భిక్షాటనం, ఇతరులపై ఆధారపడి బ్రతకటము నీచము. కులవృత్తి అన్నిట శ్రేష్ఠమయినది. కాళిదాసు శాకుంతలలో
”సహజం కిల య ద్వినిందితం నఖలు తత్కర్మ వివర్జనీయం”
అని తక్కువ రకమయినదైనా సహజవృత్తిని నిందింపరాదు అన్నాడు. ”మాంసం అమ్మే వృత్తి తన కులవృత్తి కాన వీడరాదు” అని భారతంలో ధర్మవ్యాధుడు చెప్పటం వింటాం. అదే విషయం భగవద్గీతలో కూడ
”సహజం కర్మ కౌంతేయ స దోషమపి న త్యజేత్”
జన్మసిద్ధమైన కర్మ దోషయుక్తమయినా వదిలి పెట్టరాదని కృష్ణు డన్నాడు.
”సర్వేషా మేవ శౌచానాం అర్ధశౌచం పరం స్మృతం”
అని అన్ని శౌచములకంటె అర్ధశౌచం అంటే మంచిగా సంపాదించిన ధనం గొప్పది. మంచి ధనంతో పోషించిన పిల్లలు మంచివారవుతారు. అన్యాయార్జనతో వారిని పోషించటంవల్ల అటువంటి అన్యాయపు జీవితాలనే వారు పొందుతారు. అన్యాయార్జితం దానధర్మాలకు కూడా అర్హంకాదు. సంపాదనకు ధర్మశాస్త్రం పదిమార్గాలు చెప్పింది. వైద్యము, శిల్పము, జీతమునకు కుదరటం, సేవ, పశుపోషణ, వ్యాపారము, వ్యవసాయము, భిక్షాటనం, వడ్డీవ్యాపారము, ఉన్నది తింటూ బ్రతకటం ఇలా జీవనమునకు ఉపాధులు చెప్పబడ్డాయి. ధనము లేదా ఆస్తి సంపాదించుకొనటానికి ఏడు మార్గాలు చెప్పబడ్డాయి.
అవి 1. వారసత్వంగా వచ్చిన బంధుధనం 2. తన స్థలంలో గనులు పడటం, మిత్రులవలన ధనం 3. కొనుగోలు ద్వారా లాభం 4. శత్రురాజులను జయించుట ద్వారా వచ్చినది 5. వడ్డీ 6. వాణిజ్య వ్యవసాయాలు 7. న్యాయమయిన దానం స్వీకరించటం. అంతేకాక కులవృత్తులద్వారా ధర్మబద్దంగా ఆర్జించిన దంతయు విలువయినదే. పూర్వము జీవితంలో సంపాదన ఒకభాగము. కాని నేడు సంపాదన మాత్రమే జీవితలక్ష్యమయినది. అది అన్యాయంగా సంపాదించేదయినా ఘనతగా చెప్పబడుతున్నది.
వానికేమండీ! జీతం పదివేలయితేయేం? నెలతిరిగేసరికి ఏభైవేలు సంపాదిస్తాడంటారు. ఆ నలుబదివేలూ అక్రమార్జనయే. ఇద్దరు ఉద్యోగస్థులు మధ్యాహ్న విరామ సమయంలో బయటకు వచ్చి వేరుసెనగకాయలు కొనుక్కున్నారు. ఒకడు పదికాయలు ప్రక్కనున్న కుక్కకు వేశాడు. అదేమిటిరా? దానిపై ప్రేమ పుట్టింది అని స్నేహితు డంటే ఇలా సమాధానం చెప్పాడు. ”ఇంత ఘోరంగా లంచాలు మెక్కుతున్న మనకు వచ్చే జన్మ ఎటూ కుక్క జన్మే. అపుడు మనకూ ఇలా ఎవరయినా వేస్తారని దానికి వేశా” అన్నాడు. అంటే తాను చేసేది పాపమని తెలిసి కూడా అటువంటి నీచవృత్తిని మానలేకపోతున్నాడు. తృప్తి అనేది లేకపోవటంవల్ల ఎందరికి అన్యాయం చేసి అయినా సంపాదించటానికి వెనుకాడటం లేదు.
”అన్యాయార్జితం విత్తం దశవర్షాణి తిష్ఠతి”
అని అన్యాయార్జితం శాశ్వతం కాదు. దారులు కొట్టి సంపాదించే రత్నాకరుడు అలా తనకు వచ్చే పాపాన్ని భార్యాబిడ్డలు పంచుకోరని, ఆ పాప ఫలం తానే అనుభవించాలని తెలియగానే మంచిమార్గంలోకి వచ్చి వాల్మీకిగా మారిపోయాడు. కాబట్టి తగిన వృత్తి నాశ్రయించి న్యాయముగా ధనం సంపాదించి సుఖ శాంతులతో జీవించాలి. అన్యాయార్జనచే పాపాలు, వానివలన రోగాలు అలా సుఖశాంతులు లేని బ్రతుకును కోరుకోకూడదు. వృత్తిలో చేతివాటంవల్ల వచ్చే అనర్థం కర్మ విపాకం చెప్తోంది. వెండి, బంగారాలు దొంగిలించేవాడు కుష్ఠరోగి అవుతాడని శంఖుడు చెప్తే, నూనెదొంగ గబ్బిలంగా పుడతాడని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. కంచు దొంగిలించేవాడు హంసగా, నూలు దొంగిలించేవాడు క్రౌంచపక్షిగా, పెరుగు దొంగిలించేవాడు కొక్కెరగా, నీటిదొంగ చాతకపక్షిగా పుడతారని చెప్పబడింది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹