Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – భోజనం – 13

భోజనం

కోటి విద్యలు కూటికొరకే

అని తెలుగులో మంచి సామెత ఉంది. మనం పడే కష్టాలు, చేసే ఉద్యోగాలు అన్నింటి లక్ష్యం కడుపు నిండుగా భోజనం చేయాలనియే. అలా జీవితమంతా లోటులేకుండా జరగాలని కూడా. కాబట్టి, అంత కష్టపడి సంపాదించికూడా తినకుండా ఉంటే ప్రయోజన మేముంది? అందుకే

శతం విహాయ భోక్తవ్యం

అని పెద్దలు చెప్పారు. అంటే వంద పనులున్నా వాటిని పక్కన పెట్టి సకాలంలో భోజనం చేయాలని. ఆ వాక్యాన్ని మరోవిధంగా కూడా వివరిస్తారు. అదేమంటే భోజనం చేస్తూ వందమెతుకులు పక్కన పెట్టి, అంటే భూతబలిగా వదలి, భోజనం చేయాలని అర్థం. ఎటూ విస్తట్లో వదులుతున్నాంకదా! మళ్లీ ఇలా వదలడం ఎందుకు ? అని కొందరు ప్రశ్నిస్తారు. ఆ వదలడంలో త్యాగం లేదు. భూతబలి పేర ప్రత్యేకంగా త్యాగం చేయడం దీనిలో ఉంది కాబట్టి ఇది పుణ్యకర్మ. వ్యర్ధంగా పదార్థాలను పారవేయడం ఈ పుణ్యకర్మలో చేరకపోగా, అది పాపకర్మ కూడా.

పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని నిర్లక్ష్యం చేసిన పాపం సంప్రాప్తిస్తుంది. కాబట్టి, కావలసినంతే పెట్టించుకోవాలి. పారవేయకుండా పెట్టినదంతా తినాలి. ఈ విషయంలో 1వ శతాబ్దం నాటి తిరువళ్ళువరును గుర్తుపెట్టుకోవాలి. ఆయన భార్య వాసుకికి ఒక ఆదేశం చేశారు. అదేమంటే రోజూ అన్నం పెట్టే సమయంలో విస్తరి పక్కన ఒక కప్పులో నీరు, ఒక సూది ఉంచమని. ఆమె తన జీవితమంతా అలాగే చేసింది. వృద్ధురాలయ్యాక “నాథా! రోజూ ఇలా చేయిస్తున్నా రెందుకు?” అని ఒక్క మాటు అడిగిందామె. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. వడ్డనలో మెతుకు కిందపడితే సూదితో దానిని తీసి, కప్పునీటిలో ముంచి, కడిగి, మరల విస్తరిలో వేసుకుందామని అలా నీతో చెప్పాను. కానీ, పొందికైన నీ వడ్డనతో నాకు అలాంటి అవకాశమే ఇవ్వలేదు” అని ఆయన బదులిచ్చారు. కాబట్టి, అవసరమైనవి అవసరమైనంతే వడ్డించుకుని, ఏమీ వదలకుండా భుజించి, భూతబలి మాత్రం సమర్పించాలి. భోజనం ఎలా చేయాలి? ఎటువంటి ఆహారం స్వీకరించాలి? – అనే విషయంలో గీతాచార్యుడు కృష్ణపరమాత్మ కూడా మార్గదర్శనం చేశాడు.

తైర్దత్తా యైః ప్రదాయేభ్యో – యో భుంక్తే స్తేన ఏవ సః

దేవతలవలన అనుగ్రహింపబడిన ఈ ఆహారాది భోగాలను ఆ దేవతలకు నివేదన చేయక, తానే అనుభవించువాడు నిజంగా దొంగే అన్నాడు. అంతేకాక,

“యజ్ఞ శిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః

భుంజంతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్

(3-13)

యజ్ఞంద్వారా, పూజద్వారా మన ఆహారాన్ని భగవంతునికి అర్పణ చేసి, ఆ శేషాన్ని భుజించడంవలన సమస్త పాపాలనుండి బయటపడతాము. అలాకాక, కేవలం మనం తినడానికే వండుకుని తింటే, అది పాపాన్ని తిన్నట్లే అని చెప్పాడు. కాబట్టి, ఉత్తమ భోజనమంటే భగవంతున కర్పించి తినేదే అని గ్రహించాలి. ఆ లక్ష్యం ఉంటే శుచిగా తయారుచేయడం కూడా జరుగుతుంది.

సాత్త్వికాహారం స్వీకరించడం సర్వదా శ్రేయస్కరం. స్తత్వగుణం అటువంటి ఆహారాన్ని స్వీకరించేవారికే పెంపొందుతుంది.

”సత్త్వాత్ సంజాయతే జ్ఞానం”

సత్త్వంవల్లనే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లౌకికమైతే లౌకికంగా ఉత్తమ జీవితాన్ని సాధింపజేస్తుంది.

అలౌకిక జ్ఞానమైతే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఉత్తమమైన జీవితాన్ని కాంక్షించేవారు, జీవితాన్ని ధన్యం చేసుకోదలచినవారు సాత్త్వికాహారాన్నే తీసుకోవాలి. సాత్త్విక ఆహారం, రాజస ఆహారం, తామస ఆహారం అని ఆహారం మూడు విధాలుగా ఉంటుందనీ, వాటి ప్రభావాలతో సహా కృష్ణపరమాత్మ భగవద్గీతలో వివరించాడు.

ఆయుః సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ।

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్వికప్రియాః ॥

అని సాత్వికుల ఆహారాన్ని చెప్పారు. ఆయుర్దాయము, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మొదలైనవాటిని వృద్ధిచేసేవి, పాలవంటి రసపదార్థాలు, వెన్న, నెయ్యివంటి స్నిగ్ధ పదార్థాలు, ఓజస్సును స్థిరపరిచేటటువంటివి, సాత్త్విక స్వభావాన్ని పెంచేటటువంటివి సాత్వికులకు సముచితమైన ఆహారం. అలాగే

‘కట్వామ్ల లవణాత్యుష్ణ’

అంటూ చేదు,పులుపు, ఉప్పు, కారం, మిక్కిలివేడిగా ఉన్న పదార్థాలు, తీక్షత కలిగించేవి, స్నిగ్ధత లేనివి, దాహం కలిగించేవి, దుఃఖం, చింత, రోగాలను కలిగించేవి అయిన ఆహారపదార్ధాలు రాజసస్వభావులకు ఉచితమైన ఆహారం. అలాగే

”యాతయామం గతరసం”

అన్నారు. అంటే సరిగా పండనివి, సరిగా వండనివి, రసహీనమైనవి, దుర్గంధాన్నిస్తున్నవి, పాసిపోయినవి, ఎంగిలివి, అపవిత్ర పదార్థాలు తామసస్వభావులకు తగినవి అని మన స్వభావానికి అనుగుణమైన ఆహారాన్ని శ్రీకృష్ణుడు వివరించాడు. వాటిలో జ్ఞాని కానెంచినవాడు స్వీకరించదగినది సాత్త్వికాహారమే.

బలవంతులం కావాలంటే మాంసాహారం స్వీకరించాలని, తామసాహారం తీసుకోవాలని కొందరు భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. సృష్టిలో బాగా బలం కలిగిన జంతువు ఏనుగు. అది సాత్త్వికాహారం తీసుకునేదే. సింహం కేవలం ఒడుపుతో మాత్రమే దానిని చంపగలదుతప్ప, ఏనుగు కంటే బలమైనది మాత్రం కాదు. ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైనది సాత్త్వికాహారం. కాబట్టి శ్రీకృష్ణుడు తెలియజేసిన మూడు విధాలైన ఆహారాలలో సాత్త్వికాహారానికే ప్రాధాన్యమివ్వాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపమని వేదం చెబుతోంది.

“అన్నం న నింద్యాత్, తద్వ్రతమ్ (తై. ఉ. 3-2)”

అని వేదం అన్నమును నిందింపరాదని అన్నము పూజనీయమైనదని చెపుతోంది. పదార్థాలు బాగుండనంత మాత్రాన తిట్టుకుంటూ అన్నం తినటం తగదు. మనది పశుపక్ష్యాదులు ఆహారం తీసుకోవడం వంటిది కాదు. కాబట్టే దీనికి ఎన్నో నియమాలు తెలుపబడ్డాయి. ఆహారాన్ని బట్టే మన తీరుతెన్నులు కూడా ఉంటాయి. మన ప్రవృత్తిపైన, ఆరోగ్యంపైన మన ఆహార ప్రభావం ఎంతగానో ఉంటుంది. అన్నం అనేది

”అదే భక్షణే”

అనే ధాతువునుండి వచ్చింది. అన్నం అంటే తినేది అని అర్థం. అంటే మనం తినేది అనే కాదు. మనల్ని తినేది అని కూడా అర్థం.

దానిని సక్రమంగా తింటే అది అమృతం. అక్రమంగా తింటే అదే మనలను తినే విషమవుతుంది. వండిన పదార్థాలు ఉన్న పాత్రలు మున్నగు వాటిని మన పెద్దలు అంటు అనేవారు. తాకితే చేయి కడుక్కోవాలనేవారు. నిల్వ ఉన్న ఆ పదార్థాలు విషతుల్యాలవుతాయి. కాబట్టి కూడా అంటు ముట్టుకుంటే దోషంగా పరిగణించి ఉంటారని గ్రహించవచ్చు.

”ఆహారశుదౌ సత్త్వశుద్ధిః”

అంటూ ఛాందోగ్యోపనిషత్తు ఆహారశుద్ధి సత్త్వశుద్ధికి హేతువని చెప్పింది. సత్త్వంనుండి జ్ఞానం, ఆ జ్ఞానంనుండి మోక్షం ప్రాప్తిస్తాయి. కాబట్టి సదాచారంతో భోజనం చేయడం అమృతత్వ హేతువు. అసలు ఆచార శబ్దంలోని చరధాతువుకి

”చరగతి భక్షణయోః”

అని భోజనం నియమబద్ధంగా చేయటమనే అర్థం కూడా ఉంది. కాబట్టి సదాచారంలో భోజనవిధి అంత ముఖ్యం.

మనం తినడంకోసం బ్రతకడం కాక బ్రతకడంకోసమే తినాలి. భోజన నియమాలను పాటించి భోజనం యొక్క పూర్తి ప్రయోజనం పొందాలి.పంచార్డుడై భుజించాలని శాస్త్రం చెప్పింది. అంటే రెండు కాళ్లు, రెండు చేతులు, ముఖం కడుక్కొని భోజనం చేయాలి. తడి కాళ్లతో భుజించాలని, పొడి కాళ్లతో శయనించాలని కూడా ఆర్షవాక్యం ఉంది. ఆకలి కలిగినప్పుడే హితంగా, మితంగా భుజించాలి.

”అజీర్ణే భోజనం విషం”

అని హితోపదేశం చెప్పింది. అజీర్ణంగా ఉన్నప్పుడు భోజనం చేస్తే ఆ పదార్థమంతా విషతుల్యమై అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

పుత్రవంతుడు ఉత్తరముఖంగా కూర్చుని తినకూడదు. తల్లితండ్రులు ఉన్నవాడు దక్షిణముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శుభ్రమైన ప్రదేశంలో గోమయం, లేదా నీటితో తుడిచి భోజన పాత్రను ఉంచాలి. బంగారు, వెండి పాత్రలలో, తామరాకు, మోదుగ ఆకు విస్తళ్లలో భోజనం చేయాలి. కంచుపాత్రలో భోజనం ఆయుర్వృద్ధికరం. రాతిపైన, దోసిలిలో పెట్టుకుని అన్నం తినకూడదు. విపరీతపు ఆకలి కలిగేదాకా ఉండి అన్నం తినకూడదు. శ్మశానంలోనూ, దేవాలయంలోను, శయనంలోను, తడిగుడ్డతోను, తడి తలతోను, కాళ్లు చాచుకుని, తలకు గుడ్డ చుట్టుకుని, తొడలమధ్య భోజనపాత్ర నుంచుకుని, ఒంటిబట్టతోను, పాదరక్షలతోను భుజింపకూడదు.

ఆధునిక కాలంలో ఈ నియమాలన్నీ వదలివేయబడుతున్నాయి. శుభాశుభ కార్యాలలో సామూహిక భోజనాలు టేబుల్ మీద జరుగుతున్నాయి. పాదరక్షలు వీడడం కానీ, కాళ్లు కడుక్కోవడం కాని, ఇలా ఏ నియమాలూ లేక, తిరిగి తిరిగి వచ్చిన వస్త్రాలతోనే భోజనం చేయడం జరుగుతోంది. ఆ స్థితి కూడా దాటి ఎక్కువగా బఫే సిస్టంలో సామూహిక భోజనాలు జరుగుతున్నాయి. అందులో నిలబడి, నడుస్తూ కూడా తినడం జరుగుతోంది. తింటూ నడవరాదని”

“ఖాదన్న గచ్చే దధ్వానం”

అని ఆర్షధర్మం చెబుతోంది. అది చాలా పాపహేతువు. అనారోగ్యకారకము కూడా. అప్పటికప్పుడు కనబడని అనారోగ్యం, పాపాలను ఈనాటివారు పరిగణించరు. వడ్డన చేసేశ్రమ, వృథాగా పారవేయడం ఇందులో ఉండవని చెప్పుకుంటారు. పోటీపడి యాభై, అరవై రకాల పదార్థాలు పెంచడంలోని వ్యయాన్ని మళ్లీ గమనించరు.

భోజన నియమాలింకా ఎన్నో చెప్పబడ్డాయి. భోజనం చేసేవారి మధ్యలో వచ్చి చేరటం, అలాగే ఇతరులు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో లేచిపోవడం తగదు. దానివలన ఉచ్ఛిష్ట దోషం ఏర్పడుతుంది. భోజనం చేస్తుండగా మధ్యలో నమస్కారాలు చేయడం, ఆశీస్సులందించడం తగవు. పలువురు చూస్తూ ఉండగా ఒకడు తినడం, ఒకడిని వీడి పలువురు తినడం తగదు. సామూహిక భోజనాలలో కాక ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఇతరులు చూసేటట్లు తినడం మంచిది కాదు. ఇది కులభేద దృష్టిలో చెప్పడం కాదు. దృష్టిదోషాదులను దృష్టిలో పెట్టుకుని చెప్పినది. మోకాలి బయట చేయి పెట్టుకుని తినకూడదు. రెండో జాములోగా తప్పక భుజించాలి. జాము అంటే 7 1/2 గడియ అంటే మూడు గంటలు. అది దాటాక భుజించడం బలాన్ని క్షయింపజేస్తుంది. భోజనానికి ముందు అల్లం, సైంధవలవణం కలిపి నమలడంవలన జీర్ణశక్తి పెరుగుతుంది. గొంతు, నాలుకలను శుద్ధిపరచి రుచి కలిగిస్తుంది. కడుపును నాల్గు భాగాలుగా అనుకొని రెండు భాగాలే అంటే సగమే భోజనంతో నింపాలి. మూడవ భాగం నీటితో నింపి, నాల్గవ భాగం గాలికై ఖాళీగా ఉంచాలి. అది ఆరోగ్యకరమయిన భోజన విధానం.

“అభుక్త్వా ఆమలకం శ్రేష్ఠం భుక్త్వా చ బదరీఫలం”

అంటూ భోజనానికి ముందు పెద్ద ఉసిరికాయ తినడం, భోజనానంతరం రేగిపండు తినడం మంచిదని, వెలగపండు భోజనానికి ముందైనా, అనంతరమైనా మేలని, అరటి పండు రెండు సమయాలలోనూ మంచిది కాదని చెప్పబడింది. కామక్రోధాదులు మనసులో పెట్టుకుని భోజనం చేయడం విషతుల్యమని ఆపస్తంబ మహర్షి చెప్పాడు. ఈ కాలంలో టీవీలలో కార్యక్రమాలు చూస్తూ భోజనం చేయడం మంచిది కాదని విజ్ఞానశాస్త్రవేత్తలు చెప్పడంలో ఉద్దేశ్యంకూడా అదే. మనం చూస్తున్న కార్యక్రమాల ప్రభావానికి గురి అయి, మనకు తెలియకుండానే కామక్రోధాదులకు వశమవడం జరుగుతోంది. దానివలన జీర్ణాశయంలో అవసరమైన గ్రంధులు పనిచేయకపోవడం, అనవసరపు గ్రంధులు పనిచేయడం వంటివాటిద్వారా ఆపస్తంబమహర్షి చెప్పిన ప్రమాదానికి గురిఅవుతాము. కాబట్టి, ప్రశాంత చిత్తంతో భోజనం చేయడం అవసరం.

భోజనం నియమాలు

ఆహారము, నిద్ర, భయము, సంతానం కనటం అన్ని ప్రాణులతోబాటు మనుష్యునకూ సమానమే. కాని మనుష్యునిలోని విశేష మేమంటే జ్ఞానం కల్గిఉండి వివేచనతో ఆహారాదులు స్వీకరించటం. అది లేకపోతే పశుపక్ష్యాదులతో సమానమే. కాబట్టి అన్ని విధాలా ఆలోచించి మంచిఆహారం మంచిపద్ధతిలో తీసికొంటూ ప్రయోజనం సాధించుకోవాలి. మన సుఖదుఃఖాలకు మనస్సే కారణం. అట్టి మనస్సు శుద్ధిగా ఉండటం మనం తీసికొనే ఆహారం బట్టే ఉంటుంది. అన్నమును బట్టి సౌమ్యమయిన మనస్సు ఏర్పడుతుందని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. అంతేకాదు మనం తినే అన్నంలోని మిక్కిలి స్థూలభాగం మలముగా ఏర్పడుతుందని, మధ్యస్థితిలో ఉన్నది రక్తమాంసాలుగా పరిణమిస్తుందని, సూక్ష్మభాగం మనస్సుగా పరిణమిస్తుందని చెప్పింది. మనం తినే ఆహారంలోని సాత్త్విక రాజస తామస పదార్ధాల ననుసరించి మనస్సులో ఆయాగుణాలు విస్తరిల్లుతాయి. కాబట్టే భోజన విషయంలో మహర్షులు అనేక విధినిషేధాలు తెల్పారు.

“యాచయే చోత్రియస్యాన్నం

తదభావే జలం పిబేత్”

అన్నారు. అడుక్కునయినా మంచివారి అన్నం తినండి. అలా దొరకకుంటే మంచినీళ్ళు త్రాగయినా గడపండి కాని నీచుల అన్నం తినవద్దని శాస్త్రం చెప్పింది. ఒక గ్రామాధికారి ఒక సన్యాసిని భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చేస్తూంటేఆ సన్యాసి దృష్టి ఆ గ్రామాధికారి మనుమని మెడలో గొలుసుపైన పడుతుంది. దానిని కాజేయాలనిపిస్తోంది. తనకిటువంటి ఆలోచన వచ్చిందేమా! అని విచారించి తనకు పెట్టిన పదార్ధాలు ఎక్కడ తెచ్చారని అడిగాడు. తన స్నేహితు డిచ్చాడని చెప్పాడు. అతడు ఎలా సంపాదించాడు? అంటే కాస్త వెనకాడుతూనే దొంగతనాలు చేస్తూ ఉంటాడని చెప్పాడు. కాబట్టి దుష్టుల భోజనంవల్ల దుష్టబుద్ధి, లంచాలు తెచ్చి పెట్టినందువలన అదేబుద్ధి, హత్యలతో సంపాదించినది పెట్టటంవల్ల హంతకుల బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టే మంచిగా సంపాదించి తన సంతానానికి పెట్టటం ద్వారా వారిని మంచి వారినిగా చేయాలని పెద్దలు చెప్తారు.

వండి వడ్డించేవారు కూడా శుచి, శ్రద్దలు కలవారుగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రభావం కూడా మన ఆరోగ్యము, మనస్సులపై పడుతుంది. భోజ్యపాత్రలు కూడ పద్ధతిగా ఏర్పరచాలి. ఆకులలో భోజనం చేయటం పూర్వ విధానం. అందుక్కూడా నియమా లున్నాయి. ఆకులలో భోజనం చేయటానికి అర్హమైనవి, శ్రేష్ఠమైనవి, మోదుగ, అరటి, నేరేడు, పనస, మామిడి, తామర, మేడి అనేవి. అలాగే బాదము, అడ్డాకులు, మర్రి, మొగలి, అరటిపట్ట వంటివి కూడా వినియోగిస్తారు. అరటిఆకు భోజనం బలవర్ధకం, దేహకాంతి, సంభోగశక్తి పెంచేది. పైత్యవికారాలు తగ్గించి ఆకలి పుట్టిస్తుంది. రావిఆకు భోజనం శ్లేష్మ, పిత్త దోషాలు, జననేంద్రియదోషాలు పోగొట్టి జ్ఞాపకశక్తిని, జఠరశక్తిని పెంచుతుంది. తామరాకు భోజనం విషహరం. మోదుగ రక్తసంబంధ వ్యాధులు, మహోదరవ్యాధిని పోగొట్టుతుంది. పనస పిత్తదోషాలు తొలగిస్తుంది. మర్రిఆకు కుష్ఠము, పైత్యము, నేత్రరోగాలు హరిస్తుంది. అరటిఆకు కొసగల ఆకు శ్రేష్ఠం. ఆ కొస భోజనం చేయువానికి ఎడమవైపు ఉండాలి. ఆకులు వేసేముందు నేల బాగుచేయటం, మండలం గీయటం చేసి విస్తరి వేసే పద్దతి మన పెద్దలయందు ఉండేది. విస్తరి నీటితో కడిగిన అనంతరం నేతితో పాత్రాభికరణ చేయాలి. వడ్డన పూర్తి అయ్యాక మరల పదార్ధాలపై నేతితో అభికరణ చేయాలి. ఆకుల పిదప రెండవ పక్షం కంచాలలో భుజించటం. ఎందుకంటే ఆకులు ఎప్పటికప్పుడు పారవేయటం జరుగుతుంది. కాని కంచాలు మరల మరల పెట్టుకొనటం, ఒకరి వొకరు పెట్టుకొనటం వంటివి జరుగుతాయి. కాబట్టి అవి రెండవపక్షము. సువర్ణం అమృతస్వరూపం. కాని వానిలో తినటం అసాధ్యం. కాబట్టి వెండికంచంలోనే బంగారు పువ్వు వేయించుకొనటం జరుగుతుంది. అన్నప్రాసన బంగారంతో చేయటంలో కూడా పరమార్థ మదియే. ఆద్యంతాల ద్రవపదార్థం మధ్యలో కఠినపదార్థం తినాలి. మొదట మధురపదార్ధము, మధ్యన ఉప్పు, పులుపు పదార్ధాలు, చివర వగరు పదార్థం తినటం మేలు. వడ్డనకు కూడా శాస్త్రం ఒక పద్ధతి చెప్పింది.

”శాకాది పురత స్థాప్యం”

అని కూరలు వంటివి ముందు వడ్డించాలి. అన్నం కంటె ముందు వడ్డించటం అనే కాక విస్తట్లో ముందుభాగంలో కూరలు వడ్డించాలి అని కూడా గ్రహించాలి. తద్దినాలలో అన్నిటికంటే ముందు అన్నం వడ్డించి పాయస భక్ష్యా లయాక కూరలు, మిగిలినవి వడ్డించాలి. మధ్యలో అన్నం ఉంచాలి. విస్తరియందు కుడివైపు పాయసము, పప్పు, ఎడమవైపు పచ్చళ్ళు, భక్ష్యాలు వడ్డించాలి. భగవన్నివేదన కాకుండా ఉప్పు వడ్డించకూడదు. నివేదన అయాక మజ్జిగతో కల్పియే ఉప్పు వడ్డించాలి. భోజనం చేసేముందు భగవద్గీతలోని

“ఆహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః

ప్రాణాపాన సమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్”

అనే శ్లోకం చదువుకొనటం వలన అన్నదోషాలు ఉండవు. నాల్గు విధములయిన అన్నమూ సరిగా అరుగుతుంది. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు చతుర్విధాన్నములు. భక్ష్యములంటే గారెలువంటి పిండివంటలు. భోజ్యములంటే అన్నము, కూరలు. చోష్యములనగా పులుసు, మజ్జిగ. లేహ్యములనగా నాకుటకు వీలయిన పచ్చడి పాయసము వంటివి. ఇతరులకంటె విశిష్టమయినది, షడ్రసోపేతమయినది తెలుగువారి భోజనం.ఉప్పు, పులుపు, తీపి, కారము, చేదు, వగరు అనే ఆరూ షడ్రసములు. బ్రతుకుటకొరకు మాత్రమే తినేవాడు యోగి తినటంకోసమే బ్రతికేవాడు ముందుగా భోగిగా చెప్పబడి తరువాత రోగిగా చెప్పబడతాడు. భోజనం కూడా జీవితంలో ఒక ముఖ్యమైన అంశమే తప్ప భోజనమే జీవితం కాదు. భగవద్గీతలో కృష్ణుడు ఎక్కువగా తినేవారికి, అసలు భుజించనివారికి ఇద్దరికీ ధ్యానయోగం కుదరదని చెప్పాడు.

పూజ్యభావంతో స్వీకరించే అన్నం బలము, సామర్థ్యము ఇస్తుంది. నిందించుకొంటూ తింటే ఆరెంటినీ పోగొట్టుతుంది. అతిభోజనం ఆయురారోగ్య భంగకరం, స్వర్గ ప్రాప్తికి భంగకరం, పాపము, లోకనింద్యము కూడ. అన్నము పంది వాసనచూడటంవల్ల, కోడిరెక్కల గాలి తగలటంవల్ల, కుక్క చూపు పడటంవల్ల చెడిపోతుంది. కాబట్టి భోజనంపై వాని ప్రభావం పడనీయకూడదు.

”సోపానహత్కశ్చ యద్బుంక్తే”

అని పాదరక్షలతో భోజనంచేయటం చాల దోషంగా చెప్పబడింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment