Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – ప్రదక్షిణం – 12

ప్రదక్షిణం

పూజాంతంలో మంత్రపుష్పం అయాక ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ప్రదక్షిణం రెండు విధాల ఉంటుంది. 1) దేవాలయానికి చేసేది. 2) పూజాంతంలో చేసే ఆత్మ ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే

“ప్రచ్ఛినత్తి భయం సర్వం దకారో మోక్ష సిద్ధిదః;

క్షికారాత్ క్షీయతే రోగః ణకార శ్రీప్రదాయకః”

అని

”ప్ర” అనే అక్షరం భయాలన్నింటినీ పోగొట్టగలది. “దకారం” మోక్షాన్నిచ్చేది. “కారంవల్ల” రోగాలు తొలగిపోతాయి. “ణకారం” సంపదల నిస్తుంది అని భావం. అలా మనం కోరుకునే ప్రయోజనాలన్నీ ప్రదక్షిణంవల్ల చేకూరుతాయి. మంత్రపుష్పంలో ఏది భావనారూపంలో చేశామో అట్టి భగవంతునితో తాదాత్మ్యం ఆచరణలో చూపేది ప్రదక్షిణం”.

దేవతలలో ప్రదక్షిణాలు ఇష్టమైనవాడు హనుమంతుడు. ఆయనకు చేసే ప్రదక్షిణాల ద్వారా భక్తులు పై శ్లోకంలో చెప్పబడిన రోగక్షయం, సంపద చేకూరడం, భయాలు తొలగడం, మోక్షం కలగడం అనే ప్రయోజనాలను సాధించుకుంటున్నారు. ప్రదక్షిణాలను చేయడంలో నాలుగు అంగాలను శ్రద్ధగా వినియోగించుకోవాలి. అవి పాద, హస్త, వాక్, హృదయాలు. పాదాన్ని ముందు ఉంచుతూ, చేతులు ఊరికే కదల్పక నమస్కారాది ముద్రలో కదలకుండా ఉంచి, వాక్కు ద్వారా భగవంతుని స్తుతిస్తూ, హృదయంలో దైవాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దీనినే ”చతురంగ ప్రదక్షిణం” అంటారు. అలా నాలుగు అవయవాలతో ప్రదక్షిణం చేయాలి. అది కూడా ఎలా చేయాలో ఇంకా స్పష్టంగా చెప్పబడింది. నవమాసాలు నిండిన స్త్రీ నిండా నీటితో నింపిన బిందెను రొండిన ధరించి, అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అంత జాగ్రత్తగా భక్తితో ప్రదక్షిణం చేయాలి. అలా చేస్తూ..

“ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం;

సంసార సాగరా న్మా త్వం ఉద్ధరస్వ మహాప్రభో!”

అని చదువుకుంటూ ఉండాలి. లేదా ఆయాదేవతలకు నియమంగా చదువుకోవలసిన శ్లోకాలుంటే అవి చదువుకుంటూ చేయాలి. రావి చెట్టుకు ఆది, శుక్ర, మంగళవారాలలో ప్రదక్షిణం చేయరాదు. హనుమంతునికి ప్రత్యేకంగా ప్రదక్షిణధ్యానం ఉంది. మంత్రపుష్పం తరువాత చేసేది ఆత్మ ప్రదక్షిణం. అప్పుడు

“యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే”

అనే శ్లోకాన్ని చదువుకోవాలి. తరువాత

“పాపోహం పాప కర్మాహం”

అనే శ్లోకాన్ని చదవడం కూడా ఉంది. కానీ “నేను పాతకుండను” అనే విధానం భారతీయమైనది కాదు. “ఓ పాపాత్ములారా!” అని భగవంతుడు మనలను సంబోధింపడు. “అమృతస్య పుత్రాః” అని ఉపనిషద్వాక్కుతో వివేకానందుడు సంబోధిస్తాడు మన విధానంలో..

“అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష పరాత్పర!”

అని నమస్కారాన్ని సమర్పించడం ఉంది. అలా చేసే ప్రదక్షిణం సర్వ పాపహరంగా, సర్వదాన ఫలప్రదంగా, సర్వరోగ ప్రశమనంగా చెప్పబడింది. ఆత్మ ప్రదక్షిణ రూపంలో భగవంతునకు పృష్ఠభాగాన్ని చూపకూడదు. ఆత్మ ప్రదక్షిణం చేసి, ప్రదక్షిణం చేయడంలో చాలా విజ్ఞాన శాస్త్రాంశం ఇమిడి ఉంది. సృష్టిలో చైతన్యశక్తి అనుక్షణం పరిభ్రమిస్తూనే ఉంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడం ప్రతి పరమాణువులోనూ జరుగుతోంది. అలాగే భూమి, ఇతర గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఆ ప్రదక్షిణం ద్వారా శక్తి సంపన్న మవుతున్నాయి. అలాగే మనం దేవుని చుట్టూ తిరగడం ద్వారా ఆత్మశక్తిని పెంచుకోగలుగుతాము. విశ్వంలోని ప్రతి అణువూ ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. గ్రహాలన్నీ సుస్థిరంగా ఉండడానికీ, శక్తిసంపన్నం కావడానికి కూడా కారణం పరిభ్రమణమే. ఆ విధంగా మనకు కూడా ఆత్మప్రదక్షిణాలూ, ఆలయ ప్రదక్షిణాలూ శక్తిప్రదాయకాలుగా ఉపకరిస్తాయి. గ్రహాలు కోడిగుడ్డు ఆకారం (పారాబోలా)లో ప్రదక్షిణం చేస్తాయి. ధ్వజస్థంభంతో సహా ఆలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం కూడా ఆ ఆకారంలోనే ప్రదక్షిణాలు చేస్తాము.

“ధ్వజస్థానం తు త్యక్త్వావై

హరే ర్థామప్రదక్షిణం

నత్వేతే శుభదాః ప్రోక్తాః”

అని ధ్వజం వదలి కేవలం గుడికి ప్రదక్షిణాలు చేయటం శుభప్రదం కాదు.

విశ్వశక్తికి కేంద్రబిందువు ఆలయ దైవశక్తి. విశ్వానికి మనం ప్రదక్షిణం చేయలేము కానీ, ఆలయ ప్రదక్షిణం చేయడంలో తత్సమత్వాన్ని సాధిస్తాము. జననమరణాల పరిభ్రమణానికి కారణమైన కర్మ దుష్ఫలితాలను మనం ఆత్మప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణాల ద్వారా తొలగించుకుంటాము. మంత్రపుష్పంలో

”నీవార శూక వత్తన్వీ పీతా భాస్వ త్యణూపమా”

అని అప్పుడే చెప్పి ఉన్నాము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా..

ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశేర్జునతిష్ఠతి

భ్రామయన్ సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా”

అని భగవంతుని ఉనికిని చెప్పడం జరిగింది.

”స బ్రహ్మ స శివ స్సహరి స్సేంద్రః ”

అని అన్ని దైవాలకూ అది స్థానమైనప్పుడు వారందరికీ ప్రదక్షిణం చేసిన ఫలం ఆత్మప్రదక్షిణంలో జరుగుతోందని గ్రహించాలి. ఆత్మప్రదక్షిణం ఇంట్లో తప్ప గుడిలో కొందరు చేయరు. అందుకు కారణం భగవంతునికి పృష్ఠభాగం చూపినట్లవుతుందని. ఎదురుగా కాక, ప్రక్కగా ఉండి, ఆత్మప్రదక్షిణం చేయవచ్చునన్నది దీనికి సవరణ. గర్భాలయంలో అసలు ఏ ప్రదక్షిణమూ చేయకూడదు.

ప్రతిష్ఠిత మవటం ద్వారా విగ్రహంలో చేరిన దివ్యశక్తి విగ్రహంనుండి ప్రసరిస్తూ వృత్తాకారంగా విస్తరించి ఉంటుంది. ఆ విస్తరణ తరంగాలప్రభావం మూలవిరాట్టుకు సమీపంలో ప్రగాఢంగా, దూరం విస్తరించినకొద్దీ క్రమంగా బలహీనంగా ఉంటుంది. కాన గర్భాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాము. అది ఎటో అటూ తిరగటం కాక సవ్యంగానే చేయాలి. ఎందుకంటే మనకు కుడివైపు దేవ, గురు స్థానం. కాబట్టి స్వామి మనకు కుడిచేతివైపు వచ్చేటట్లే, సవ్యంగా చేయాలి. మంత్రపుష్పంలో

”అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య”

అని లోపల, బయట పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని చెప్తాము. హృదయంలో

”నీవార సూక వత్”

అని నీవార ధాన్యపు కొన అంత సూక్ష్మంగా ఉన్నట్లు చెప్తాము. అలా లోపల ఉన్నవానికి జరిగే ప్రదక్షిణంగా ఆత్మప్రదక్షిణం చేసి బహిర్గతుడయినవానికై ఆలయానికి ప్రదక్షిణం చేస్తాము. ఆత్మ ప్రదక్షిణం సహజంగా పూజానంతరం మంత్రపుష్పం సమర్పించాకే చేయటంలో అదే పరమార్ధం ప్రదక్షిణాలు.

1. పాదప్రదక్షిణం : – నడుస్తూ మామూలుగా చుట్టూ తిరిగేది.

2. దండ ప్రదక్షిణం : – పునః పునః దండ ప్రణామం చేస్తూ చేసేది.

3. అంగప్రదక్షిణం :- శరీరావయవాలు నేలకు తాకునట్లు పొర్లుడు దండాలు పెడుతూ చేసేది.

4. మిశ్రమ ప్రదక్షిణం :- కొంతదూరం నడక, పిదప దండప్రణామం, ఆపిదప పొర్లుట ఇలా మిశ్రంగా చేసేది.

5. ఆత్మ ప్రదక్షిణం : – తనచుట్టూ తాను తిరిగేది అని ఐదు విధాలుగా చెప్పబడ్డాయి.

నమస్కారం

పూజావిధిలో ప్రదక్షిణం చేశాక నమస్కారం చేయడం కర్తవ్యం. అదీ సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలైతే పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. నవవిధ భక్తులలో ”వందనం” అని చెప్పబడే ఆరవ భక్తి నమస్కారం. ”అక్రూర స్వభివందనే.” అని నమస్కార భక్తిద్వారా జన్మను చరితార్థం చేసుకున్నవాడు అక్రూరుడు. నమనము అంటే వంగటం. వినమిత గాత్రు డవటం. నమస్కారమునకు అర్థం

“త్వత్తోహమ్ అపకృష్టః, మత్తస్త్వమ్ ఉత్కృష్టః”

అని అంటే నేను నీ కంటె తక్కువవాడను. నీవు నాకంటె గొప్పవాడవు అని భావం. ఈ నమస్కారం ఆరువిధాలుగా చెప్పబడింది.

1. సంపుటి నమస్కారం : – చేతులు జోడించి హృదయమున పెట్టుకుని చేయడం.

2. సమస్తిష్క నమస్కారం :- చేతులు జోడించి శిరస్సున ఉంచి, వంగి చేయడం.

3. ప్రహ్వాంగ నమస్కారం :- దేహం వంచి హృదయమున చేతులు జోడించి చేయడం.

4. పంచాంగ నమస్కారం : – ఇది స్త్రీలు ఆచరింపవలసినది. కాళ్ళు, చేతులు, శిరస్సు మాత్రం నేలకు ఆనేది.

5. సాష్టాంగ నమస్కారం: – పురుషులు పూజానంతరం చేయవలసినది. ఈ నమస్కార విధానాన్ని శాస్త్రం ఇలా తెలిపింది.

”ఉరసా శిరసా దృష్ట్యా వచసా మనసా తథా
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే”

అనగా వక్షఃస్థలము, శిరస్సు, దృష్టి, వాక్కు, మనస్సు, పాదాలు, చేతులు, మోకాళ్లు అనే ఎనిమిది అవయవాలతో చేసేది సాష్టాంగ నమస్కారం. ఈ నమస్కారం గొప్పది. ఇందు జానుభ్యాం అనేదానికి బదులు కర్ణాభ్యాం అనే పాఠం ఉన్నది. అందుకే కొందరు తల ప్రక్కకు పెట్టి చెవులు నేలకు ఆనిస్తారు. ఇలా సరిగా నమస్కరించడం ద్వారా నూరు యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతామని తెలుపబడింది. ఇది మంచి వ్యాయామం కూడా. దీనిలో శవాసన, భుజంగాసన, అథోముఖ శ్వాసాసనాలు ఇమిడి ఉన్నాయి. శవాసనంవల్ల శరీరావయవా లన్నింటికీ విశ్రాంతి లభిస్తుంది. భుజంగాసనంవల్ల వీపు నొప్పి పోతుంది. మలబద్దకం తొలగుతుంది. థైరాయిడ్ అవిపోతాయి. అధోముఖశ్వాసాసనం వల్ల పొత్తికడుపులో అవయవా లన్నింటికీ మంచిది.

6. ప్రదక్షిణ నమస్కారం:- ప్రదక్షిణం చేస్తూ చేతులు జోడించడం.

చేతి వేళ్లు ఐదు కర్మేంద్రియాలకు, ఐదు జ్ఞానేంద్రియాలకు ప్రతీకలు. వానిని ఏకం చేసి, మనస్సు నిలిపి శిరస్సు, లేదా హృదయాన ఉంచడం నమస్కారం. అంతేతప్ప ఒంటిచేత్తో నమస్కారం చేయరాదు. ఆయుధధారులు కాన మిలిటరీ వారు, పోలీసులు, అదేవిధంగా ఒక క్రమశిక్షణా విధానాన్ని రూపొందించుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, స్కౌటు వంటి సంస్థలవారు ఒంటి చేతితో నమస్కరించడంలో దోషం లేదు. నిత్యమూ తల్లితండ్రులకు నమస్కరించేవారి జన్మ ధన్యముగా తెలుపబడింది. నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత, వేదాంతి, సహస్రమాసజీవి, నిత్యోపవాసి అనగా ఏకాదశులందు ఉపవసించేవారు, పతివ్రతలు – ఈ ఆరుగురూ తనకు వందనీయులని రాముడు తెలియజేశాడు. అశుచియై కాని, దేవపితృకార్యాలు చేస్తూ కాని నమస్కరింపరాదని శంఖుని మాట. పుత్రుడు, శిష్యుడు ఎంత గొప్పవారయినా వారికి నమస్కారం చేయరాదు. జప, హోమాదులు చేస్తూ ఉన్నవారికి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే వారి ఏకాగ్రతకు భంగకరం. అంతేకాదు. వారు ప్రతినమస్కారం చేయటానికికాని, దీవించటానికికాని అది సమయం కాదు. క్రొత్తవానికి, చిన్నవానికి, అల్పునకు నమస్కారం చేయరాదు. పిచ్చివానికి, మూర్ఖునికి, జూదరికి, పరుగెత్తుతున్నవానికి నమస్కరింపకూడదని లిఖితుడు చెప్పాడు. మేలు మరిచేవానికి, అతికోపశీలికి, జారిణికి, ముట్టుతకు, పురిటాలికి నమస్కరింపకూడదు.

మన నమస్కార విధానాన్ని అనుసరిస్తూ బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నకాలంలో తన చైనా పర్యటన (జులై 6) లో తన రెండుచేతులు జోడించి అందరకూ నమస్కరించాడు. అలా ఎందుకు చేస్తున్నాడో ఆయన తన ట్విట్టర్లో వివరిస్తూ గత జనవరిలో నేను, నా భార్య భారతదేశం పర్యటించి తిరిగి అమెరికాకు వెళ్తున్నప్పుడు విమానద్వారం దగ్గర వీడ్కోలు పల్కిన వారందరికీ మేమిద్దరమూ చేతులు జోడించి నమస్కరించాం. ఆ ఫొటో నాకు బాగా నచ్చింది. భారతీయులు చేతులు జోడించి ఎందుకు నమస్కరిస్తారో ఆలోచించాను. భారతీయులు చేతులు జోడించి నమస్కార్, నమస్తే, వణక్కం అని వివిధభాషలలో సంబోధిస్తారు. ఇలా చెప్పటంవల్ల ఇతరులపట్ల మనకున్న గౌరవం, నమ్రత, వినయము ప్రతిబింబిస్తాయి. భారతీయులకున్న ఈ మంచి లక్షణం కరచాలనమనే అలవాటుని నెట్టివేసి త్వరలో విశ్వవ్యాప్తమౌతుంది. యోగా తరువాత భారతీయులు ఈ ప్రపంచాని కిచ్చిన రెండవ అమూల్యకానుక ఇది. కరచాలనం (shake hand) ఈ ప్రపంచానికి ఎప్పుడు అలవాటైందో తెలియదు. దానివల్ల అనేక రోగాలు ఒకరినుండి మరియొకరికి వ్యాప్తి చెందుతాయి. అమెరికాలోని అనేక హాస్పిటళ్ళు ఇప్పటికే కరచాలనాన్ని బహిష్కరించాయి.

(American Journal of infuction) అనే మ్యాగజైన్ కరచాలనం అత్యంత అనారోగ్యకరం అన్న ఒక వ్యాసం జలై 2014 వ ప్రచురించింది. ) పెద్దలకు నమస్కరించేవానికి ఆయురారోగ్య యశోధనాలు చేకూరుతాయి. దంతధావనం, శౌచక్రియ, దేవపూజ సమయాలలో ప్రయాణంలో పరుగెత్తుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు. సమిధలు, దర్భలు, పుష్పాలు తెచ్చేవానికి నమస్కారం చేయకూడదు. అలా వాటిని తెచ్చే వ్యక్తి నమస్కారం చేస్తే అవి నిర్మాల్యం అయిపోతాయి. ప్రదక్షిణ నమస్కారాల అనంతరం, ఛత్ర చామరాద్యుపచారాలు చేసి,

”యస్య స్మృత్యాచ..”

అనే శ్లోకాలు చెప్పి,

”అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక, సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు”

అని చేతిలో అక్షతలు, నీరు (ఈ నీరుభార్య వేయాలి) వేసుకుని, నీటిని పళ్లెంలో వదిలి, అక్షతలను దేవుని పాదాలవద్ద వేసి, వాటిని తీసి తన శిరస్సున ధరించాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment