Skip to content Skip to footer

సదాచారము వైజ్ఞానిక విలువలు – మహానివేదన – 11

మహానివేదన

దేవుడు మనం పెట్టేవి తింటాడా? తినని దేవునికోసం పెట్టడం దేనికి? పెట్టకపోతే దోషమని కూడా అనడమెందుకు? అని కొందరి ప్రశ్న. దేవుడు ఎలా తింటాడో ఈ శ్లోకంలో చెప్పారు.

“కపిత్థస్య ఫలే సారం

యథా కుంజర భక్షణే

తథా నైవేద్య సారం తు

దేవో గృష్ణతి మన్తతః”

ఏ విధంగా వెలగపండుని మింగిన ఏనుగు లోపలి సారాన్ని స్వీకరించగలుగుతుందో అలా నైవేద్య సారాన్ని మంత్రప్రభావం చేత దేవుడు గ్రహిస్తాడు. పూవులను తుమ్మెద కేవలం వాసన చూసి వాటిలోని తేనెని తాగినట్లుగా, సూర్యుని కిరణాలలోని నీటిని మబ్బు గ్రహించి వర్షించినట్లుగా మన నివేదనను మనం గ్రహించలేని రీతిలో ఆయన స్వీకరిస్తాడని కూడా చెప్పారు. నిజానికి మనం నివేదించినదానిని భగవానుడు నేత్రాలతో స్వీకరిస్తాడు. ఈ నివేదన వ్యవహారమంతా నేత్రాలకు సంబంధించిన విషయం. అందుకే ఆయనకు నివేదించే పదార్థాలను ముందుగా కానీ, నివేదన సమయంలో గానీ ఎవరినీ చూడనివ్వరు. తెరనో, తలుపులనో వేసి, ఆ తరువాతనే నివేదనపదార్ధాల మీది మూతని తీసి, నివేదన చేస్తారు. దీనిలో కుల వివక్షో, మరొకటో ఏదైనా ఉందనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. గుడులలోని గర్భాలయంలో నివేదన సమయంలో అర్చకుడు తప్ప పరిచారక, పాచకాదులు కూడా అక్కడ ఉండరాదు. ఒకరిని ఉంచి, మరొకరిని ఉంచకపోతే వివక్ష అనే ఆక్షేపణకు ఆస్కారముంది. అర్చక పరివారం అంతా కూడా ఇవతలకు వచ్చేస్తే ఆ అవకాశమే ఉండదు. భగవంతుడు కళ్లతో స్వీకరిస్తాడు కాబట్టే కర్పూర హారతిని కండ్ల చలువకోసం నేత్రాలకే ఇవ్వాలి. ఆ హారతిని మనము కళ్ళకే అద్దుకొంటాము. అలాగే ప్రసాదాన్ని కూడా మనం కళ్లకు అద్దుకొనే భుజిస్తాము. ఆ విధంగా భగవన్నివేదన వ్యవహారమంతా నేత్రాలకు సంబంధించినదేనని గ్రహించాలి. నివేదనలు కూడా ఆయా సందర్భాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి.

సుందరకాండ పారాయణ నియమాలలో ఫలానా సర్గలను పారాయణ చేసిన రోజున ఫలానా నివేదన పెట్టాలి అని కూడా నియమం ఉంది. అమ్మవారిని షట్చక్రాలలో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శక్తిగా పూజించినప్పుడు ఒక్కొక్క వస్తువును నివేదించాలి.అన్న నివేదనను మహానివేదన అంటారు.

ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయాలలో తప్పక మహానివేదన నిత్యమూ జరగాలి. అలా నివేదన జరుగకపోతే దోషం. ఒక్కరోజున నివేదన జరుగకపోయినా ప్రాయశ్చిత్తం చేయాలి. సంప్రోక్షణ జరపాలి. అవసర నివేదన, మహానివేదన పెట్టడంలో ముందుగా పదార్థంపై నీళ్లు చల్లి, గాయత్రీ మంత్రంతో అభిమంత్రించాలి.

‘సత్యం త్వర్తేన పరిషించామి’

అని చుట్టూ సవ్యంగా నీరు పోయాలి. రాత్రి అయితే

‘ఋతం త్వా సత్యేన పరిషించామి’

అని నీరు తిప్పాలి. పిదప ‘అమృతమస్తు’ అని నీరు సమర్పించి,

‘ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా’

అని పంచప్రాణాలకు ఆహుతులు సమర్పించాలి. దేవతలకు ఆహారం అమృతమే. కాబట్టే ‘అమృతమస్తు’ అంటూ మంత్రపూతంగా అమృతీకరణ చేసిన మనం, చివరలో

‘అమృతాపిధానమసి’

అని మరల ఉత్తరాపోశన సమర్పించడం ద్వారా ఆ పదార్థాన్ని దేవతలకు పనికివచ్చే అమృతంగా చేసినట్లయింది. సంప్రోక్షణ చేసిన 9 అంగుళాలు పైబడిన విగ్రహాలు ఇంటిలో ఉంటే వాటికీ, యంత్రాలకు, వ్రతాది విశేషార్చన జరిగిన మండపారాధిత దేవతలకు కూడా మహానివేదన పెట్టాలి. వాయుప్రతిష్ఠ జరిగిన దేవాలయ, మందిర దేవతలకు మహానివేదన పెట్టకున్నా దోషం లేదు. ఎవరికి ఏది ఆహారమో అదే వారు భగవంతునకు అర్పిస్తారని, ఎక్కడో ఎప్పుడో జరిగిన ఒకటి రెండు సంఘటనలను చెబుతూ మద్యమాంసాలను కూడా దేవునికి సమర్పించవచ్చునని కొందరు వాదిస్తుంటారు. తామసపూజలో జరిగే ఆ వ్యవహారాలు ఆలయాలలో, గృహాలలో జరుగరాదు. సాత్త్వికాహార సమర్పణమే కర్తవ్యం. వండిన అన్నపు గిన్నె అంతా నివేదనలో ఉంచాలి. అశౌచం ఉన్నవారికి కూడా పెట్టవలసి ఉంటే, నివేదన విడిగా తీయాలి. నివేదించినదానిని మంచివారే భుజించాలి. ఫలాదికాన్ని నివేదించేటప్పుడు కొసలను దేవునివైపు పెట్టాలి తప్ప, తొడిమవైపుభాగాన్ని భగవంతుని ముందు పెట్టకూడదు.

నివేదన సమయంలో ఘంట మోగించడం, నృత్యగీత వాద్యాదులు తగదు.

ఘంటానాదం తథా వాద్యం

నృత్యం గీతం తథైవ చ;

నైవేద్యకాలే యః కుర్యాత్

రౌరవం నరకం వ్రజేత్ ||

అనగా, నైవేద్య కాలంలో ఘంట కొట్టడం, నృత్యగీతాలు చేయడం వల్ల రౌరవాది నరకం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఘంటానాదంవలన భగవంతుని దృష్టి మనకు అభిముఖమయి, నివేదన స్వీకరణ భంగపడుతుందని అభిప్రాయం. అది శైవాగమంలో చెప్పబడింది. కాబట్టి తమకు వర్తించదని వైష్ణవులు అంటారు. అట్టి భేదభావం లేనివారు ఈ నియమాన్ని పాటించడం మంచిది. మహానివేదనను మడితో నియమంగా చేయాలి తప్ప, ఏదోవిధంగా చేయకూడదు.

విష్ణుతంత్రంలో మహానైవేద్య ప్రమాణం కూడా చెప్పారు. ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలతో నైవేద్య ప్రమాణాన్ని తెలిపారు. ఉత్తమ నైవేద్యం ద్రోణం అనే కొలతతో, మధ్యమాన్ని శివం అనే కొలతతో, అధమాన్ని ఆఢకమనే కొలతతో నిర్దేశించారు. ఆఢకం అంటే తూము లేదా మానెడు ప్రమాణమనీ, శివం అంటే రెండు తూములు లేదా అడ్డెడు ప్రమాణం, ద్రోణం అంటే నాలుగు తూములు లేదా కుంచము లేదా రెండు అడ్డల ప్రమాణమని తెలిపారు. ఈ విషయంలో అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పటికి ఇది దేవాలయ విషయమే తప్ప గృహవిషయం కాదు.

స్నానం చేయకుండా పూజ చేయడం, అశుచిగా ఉన్నవారిని తాకి పూజ చేయడం, అశుచిగా ఉండి తాకకూడని వారు విగ్రహాదులను తాకడంవంటివానికి ఆగమ గ్రంథాలు ప్రాయశ్చిత్తాన్ని చెప్పాయి. క్రిమికీటకాలు, ఎముకలు, కేశాలు, పక్షులు, వంటి వాటి శరీర భాగాలతో కూడి ఉన్నది, ఊక భస్మములతో కలసి ఉన్నవి పూజలో వినియోగించరాదు. అలా వినియోగించినట్లైతే ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంటుంది. అశుచులుతాకిన పాత్రలలో నివేదన చేయడం కూడా తగదు. పంది, గాడిద, డేగ, కాకి మొదలైనవి తాకిన అన్నాన్ని నివేదన చేయడం దోషం. దానికి ప్రాయశ్చిత్త హెూమాలు చేయాలి. పిల్లి, ఎలుక, పాము, కప్ప, క్రిమి, మిడత, మున్నగునవి తాకినవి కూడా నివేదనకు అనర్హాలు. నివేదన అనంతరం

‘మధ్యే మధ్యే పానీయం సమర్పయామి’

అని నీరు సమర్పించాలి.

సమర్పయామి పానీయం

మధ్యే మధ్యే సుధోపమం;

సచ్చిదానందరూపాయ

సృష్టి స్థిత్యంత హేతవే ॥

వంటి పరికర శ్లోకాలను కూడా అందుకోసం చెప్పారు. అనంతరం తాంబూలం సమర్పించాలి.

‘పూగీఫలై స్సమాయుక్తం…..’

వంటి శ్లోకాలు దానికోసం ఉన్నాయి. భగవంతునికి తాంబూల సమర్పణ చేయడంవలన కుటుంబలో భార్యాభర్తల మధ్య సుఖశాంతులు ఏర్పడతాయి. వాడిపోయిన తమలపాకులతో తాంబూలాన్ని సమర్పించడం దోషం.

‘తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’

అని ఆచమనం నిమిత్తం ఉద్ధరిణెడు నీరు హరివేణం పళ్ళెంలో వేయాలి. తాంబూల సమర్పణలో తమలపాకుల కొసలను భగవంతునివైపు ఉండేటట్లు పెట్టాలి తప్ప, తొడిమలను దేవునివైపు ఉంచరాదు. వక్కపొడి పొట్లాన్ని చింపి, వక్కపొడిని తాంబూలంలో సమర్పించాలి తప్ప, కాగితంతోసహా పొట్లాన్ని అలాగే ఉంచడం తగదు. భక్తితో పాటు ఇట్టి శ్రద్ధ ముఖ్యం.

విశేషాంశాలు

పురుషదేవతలకు వలెనే స్త్రీ దేవతలకు కూడా ఉపచారాలు అన్నీ ఉంటాయి. విశేషంగా కంచుకం, అనగా రెవిక, కజ్జలం అనగా కాటుక వంటి ఉపచారా లుంటాయి. పురుష దేవతలకు వలెనే స్త్రీదేవతకూ పూజాకల్పంలో యజ్ఞోపవీతం సమర్పించడం ఉంటుంది. స్త్రీలకు జందెం సమర్పించడం ఏమిటని కొందరికి సందేహం వస్తుంది. ఈ విషయంలో యమస్మృతి ఇలా చెప్పింది.

“పురాణకల్పే తు నారీణాం

మౌంజీబంధన మిష్యతే

అధ్యాపనం చ వేదానాం

సావిత్రీ వచనం తథా ॥

దాని అర్థం పురాణకాలంలో పూర్వకల్పాలలో స్త్రీలకు ఉపనయనం ఉండేది. వేదాలను చదివించడం, గాయత్రీ జపం చేయించడం కూడా ఉండేదని. కాబట్టి యజ్ఞోపవీత సమర్పణ సముచితమే. స్త్రీ దేవతల పూజలను పురుషులు కూడా చేయవచ్చు. ఒక్క తులసి పూజను మాత్రం స్త్రీలు మాత్రమే చేయడం కనబడుతుంది.

‘ఇయం సాక్షా న్మహాలక్ష్మీః’

అని పద్మపురాణంలో తులసీమాత గురించి వ్యాసముని ప్రశంసించారు. స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు తులసి మంచి ఔషధం కూడా. తులసి గాలి సోకడం ఆరోగ్యం. తులసి వద్ద పూజ నెపంతో కొంతసేపు కూర్చోవడం, తులసికి ప్రదక్షిణాలు చేయడం ఆరోగ్యాన్నిస్తాయి.

‘షట్కాలం వా త్రికాలం వా, ద్వికాలం కాల మేవ వా’

అని నిత్యార్చన గురించి చెప్పారు. షట్కాలార్చన అంటే రోజులో ఆరు సమయాలలో పూజ నిర్వహించడం. లేదా త్రికాలం అంటే మూడు పూటలా పూజ చేయడం. అదీ కాకపోతే ద్వికాలం. అంటే రెండు పూటలు పూజించడం. అది కూడా సాధ్యం కాకపోతే రోజులో ఒక్క మారైనా పూజచేయాలని శాస్త్రం విధించింది. షట్కాల పూజ ఫలితాలను ఈ విధంగా చెప్పారు. 1. ‘ప్రాతః కాలార్చనం చైవ జప హెూమాదివృద్ధయే’. ప్రాతః కాల పూజ జపం, హెూమం మొదలైన వాటి అభివృద్ధికి సూచకం. 2. మధ్యాహ్నకాల అర్చనం రాజ్యాభివృద్ధికి దోహదపడుతుంది. 3. సాయంకాల అర్చనం సర్వ సస్యముల పంటల అభివృద్ధికి తోడ్పడుతుంది. 4. ఉషఃకాలపు అర్చనం నరుల, స్త్రీల, శిశువుల అభివృద్ధికి తోడ్పడుతుంది. 5. అపరాహ్లంలో చేసే అర్చన, అంటే మధ్యాహ్నం దాటిన పిదప చేసే అర్చన రాక్షస ప్రవృత్తుల వినాశానికి దోహదకారి అవుతుంది. 6. అర్థరాత్రి సమయంలో చేసే అర్చన జంతువుల, అంటే నాలుగు కాళ్లు కలిగిన వాటి అభివృద్ధికి దోహదపడుతుంది.

ఆరువేళలలో భగవదర్చనం చేయడంవల్ల ఐహిక ప్రయోజనాలు, ఆముష్మిక ఫలితాలు కూడా చేకూరుతాయని చెప్పారు. దేవాలయాలలో ఇలా తప్పక జరగాలి. త్రికాల అర్చనతో సరిపెట్టుకునేవారు దేవతామూర్తిని మూడు విధాలుగా అర్చించాలని శాస్త్రం చెప్పింది. ప్రాతఃకాలంలో బాల్యమనీ, మధ్యాహ్నం వేళ యౌవనమనీ, సాయంవేళలో వార్ధక బింబమనీ చెప్పారు. వీటిలో ప్రాతఃకాల పూజ పుష్టికరం, మధ్యాహ్న పూజ శ్రీకరం, లక్ష్మీప్రదం, సాయంకాలపూజ మోక్షప్రదం.

నీరాజనం

భగవంతునికి నివేదన, తాంబూల సమర్పణ అయ్యాక నీరాజనం ఇవ్వాలి. అందుకు ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ కర్పూరం వెలిగించి, హారతి ఇస్తాము. ఈ విషయంలో కూడా కొన్ని నియమా లున్నాయి.

‘నితరాం రాజనం నీరాజనం’

అని నీరాజన శబ్దానికి వ్యుత్పత్తి. మిక్కిలి ప్రకాశింపజేయడం అని దీని అర్థం. ఆ సమయంలో కొందరు అర్చకులు లైట్లన్నీ కూడా వేస్తూ ఉంటారు. కొందరు నీరాజనం అనడానికి బదులుగా “నీరాంజనం” అంటూ ఉంటారు. అది తగదు. దీనినే ”మంగళ హారతి” అని కూడా అంటారు. మంగళ హారతిని పుణ్యకార్యాలు, శుభకార్యాలలో మనుష్యులకు కూడా ఇస్తారు.

కర్పూరం, కాని పక్షంలో ఆవునేతితో అద్దిన దూదివత్తితో కూడా ఇస్తారు. అనేక దేవాలయాలలో ఇటీవల నేతివత్తితోనే హారతి ఇస్తున్నారు. అందుకు కారణం కర్పూరం కల్తీది కావడం. దానిని వెలిగించడంవల్ల ఆలయంలో పొగ కమ్మి గోడలు, పైకప్పు మసిపూసినట్లుగా అయిపోవడం. అలా కర్పూర నీరాజనమనే విధానాన్నే మానివేయడానికి దారితీస్తోం దని అంటే కల్తీభూతం ఎంతటి ప్రమాదకరమో మరింతగా గుర్తించాలి.

కర్పూరం అనేక రూపాలుగా వస్తుంది. శ్రేష్ఠమైన దానిని తెప్పించి వాడడం ద్వారా కల్తీప్రమాదం లేకుండా శాస్త్రోక్తంగా నీరాజనాన్ని సమర్పించవచ్చు. వృక్షాలనుండి వచ్చే కర్పూరం అనగా ముద్దకర్పూరం శ్రేష్ఠమైనది. ఇది చైనా, జపానులలో ఎక్కువగా లభిస్తుంది. చెట్టుపట్ట మీద గాట్లు పెట్టినప్పుడు పాలు స్రవించినట్లుగా దానినుండి కర్పూరం వస్తుంది. ఇలా కర్పూరంలో 18 రకాల భేదాలున్నాయి. దేవునికి నీరాజనం నేత్రద్వయానికి ఇవ్వడమే ముఖ్యం. అలాకాక చుట్టూ తిప్పితే చాలా దోషంగా విష్ణుతత్త్వసంహిత చెబుతోంది. ఆ దోషం గురించి వ్రాస్తే చాలామందికి బాధ కలుగుతుందని వ్రాయడం లేదు. భగవంతునికి మనం సమర్పించే నివేదనలను నేత్రాల ద్వారా తేజోరూపంలో స్వీకరిస్తాడు. ఆ నేత్రాలకు చలువగా కర్పూరహారతి ఇవ్వాలి. ఆ హారతిని మనం కూడా కళ్లకే అద్దుకుంటాము. అది ఆయన దృష్టి సోకినది కాబట్టి దృష్టిదోషాదికం, అంటు ముట్టు దోషాదుల పరిహారం కోసం మన శరీరంపై ఉన్న దేవునికి, యంత్రాలకు కూడా చూపుకుంటాము. అయ్యప్ప దీక్ష వంటివి చేసేవారు వారి దీక్షా మాలికలకు హారతి చూపుతారు. దాని పరమార్థం కూడా ఇదే.

ఆయన నేత్రాలతో స్వీకరించినదానిని ప్రసాదంగా మనం కూడా ముందుగా నేత్రాలతోనే స్వీకరిస్తాము. అదే కళ్లకు అద్దుకోవడం. అనంతరమే దానిని నోటితో స్వీకరిస్తాము. ప్రసాదంగా దానిని పిలుస్తాము. ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. భగవంతుని చల్లని చూపులు పడకముందు అది కేవలం పదార్థం

‘సాదం’

భగవంతుని దృష్టి సోకటంతో అది ఆయన అనుగ్రహానికి పాత్రమై, ”ప్రసాదం” అయింది. హారతి ఇవ్వడం మంగళకరం. అందుకే దానిని మంగళ హారతి అంటారు. పురాణ ప్రవచనాలు కానీ, హరికథా గానాలు కానీ మరే ఇతర పుణ్యకార్యాలు కానీ మంగళాంతంగా ఉండాలని చివరకు మంగళహారతి ఇస్తారు.

”పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు,

నీ నామ రూపములకు నిత్య జయమంగళం..’

అని పాడుతూ హారతి ఇస్తాము. ‘జయ జగదీశ హరే’ ఇత్యాదిగా అందరు దేవతలపై అన్ని భాషలలో మంగళహారతు లున్నాయి. అంటే ఈ సేవ అందరకూఅంత ముఖ్యమన్నమాట.

“కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’

అని పాత్రలో నీరు వదలిపెట్టాలి. నీరాజనం ఇచ్చే సమయంలో మాత్రం ఘంటానాదం తప్పక చేయాలి.

”నృత్యం గీతం చ వాద్యం చ కృతం గంధర్వసత్తమైః”

అని అనేక వాద్యాలను ఈ సందర్భంలో వినిపించవచ్చు. స్విచ్ వేస్తే భిన్న వాద్యాలు మోగే సేవను ఈ సమయంలో చేయాలి. మంగళ హారతి పాటలు ఈ సమయంలో పాడాలి. ఈ హారతి దేవాలయంలో విశేషంగా చేయడంవల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోయి ఆనంద సంధాయక మవుతుంది. కనులకద్దుకున్న మన చేతులు వాసన చూసుకోవడం కూడా చేయదగినదే. ఈ ప్రక్రియలన్నీ మన శ్రేయస్సుకోసం నెలకొల్పినవే.

హారతులలో ఒక్క వత్తితో వెలిగించే ఏకహారతితో పాటు 27 వత్తులు వెలిగించే నక్షత్ర హారతి, కుంభహారతి మొదలైన అనేక రకాలు ఉన్నాయి. హారతులు ఇచ్చిన తర్వాత…

రాజోపచారై స్సతతం

పురాణ పఠనాదిభిః

సంతుష్టో భవ సర్వాత్మన్ !

సర్వలింగమయాత్మక !

అని రాజోపచార దేవోపచార, సకలోపచారాలు సమర్పిస్తాము. ఛత్ర మాచ్ఛాదయామి అని గొడుగు చూపుతాము. శ్రద్ధాభక్తులు కలవారు వెండి, బంగారాలతో కూడా గొడుగులు చేయిస్తారు. లేదా తెప్పించి, ఉపయోగిస్తారు. చామరాలను దేవాలయాలలోనే కాక ఇంట్లోని పూజామందిరాలలో కూడా ఉంచి, సేవించవచ్చు. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వా నారోహయామి, గజా నారోహయామి అని ఆయా ఉపచారాలను ప్రత్యక్షంగా చేయలేనివారు కేవలం అక్షతలను భగవంతుని పాదాల వద్ద ఉంచితే సరిపోతుంది.

అనంతరం మంత్రపుష్ప సేవ ఉంటుంది. మంత్రపుష్పం అయిన పిమ్మట రాజోపచార, దేవోపచారాలు చేసే విధానమే ఎక్కువగా ఉంది. మనంఇంతకు ముందు సాధారణ పుష్పాలతో అంటే నామాలతో సేవ చేశాము. ఇప్పుడు మంత్రపుష్పాలతో సేవచేయాలి. పుష్పాలను వేదమంత్రాలతో అభిమంత్రించి, వానిని భగవంతుని పాదాలపై ఉంచాలి. పవిత్రమైన హస్తాలతోనే పుష్పాన్ని తీసుకుని మంత్రించి, సమర్పించాలి. కాబట్టి దేవాలయాన అయినా ఇంటియందైనా చేతిని కడుక్కోవడానికి నీళ్లు చేతిలో ఉంచి, అనంతరం పుష్పాన్ని ఇస్తారు. అప్పుడు

“ధాతాపురస్తాద్యముదాజహార..”

అంటూ నారాయణోపనిషత్తు చదువుతాము. పిమ్మట,

”యో పాం పుష్పం వేద”

అని చేతిలోని పుష్పాన్ని అభిమంత్రించి, భగవంతుని పాదాల చెంత ఉంచాలి.

పుష్పంవల్ల ఫలం వస్తుంది. ఈ మంత్రపుష్పంవల్ల సంపూర్ణ పూజాఫలం వస్తుంది. దీనివలన మన హృదయగతంగా అణురూపంలో ఉన్న జ్యోతిస్వరూపుని దర్శనం చేస్తాము.

”సహస్ర శీర్షా పురుషః..”

ఇత్యాదికంచే ఆ విరాట్పురుషుని అంగభూతాలుగా మనలను గ్రహిస్తాము. అలా భగవంతునితో తాదాత్మ్యభావం పొందగలుగుతాము. మంత్రపుష్పం చివరలో మంత్రగాయత్రులు చెప్పాలి.

”తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్”

“నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్”

అని సకల దేవతలకూ మంత్రగాయత్రులు ఉంటాయి. గాయత్రీ మంత్రానికి 24 అక్షరా లున్నట్లు ఈ మంత్రగాయత్రులకు కూడా 24 అక్షరాలు ఉంటాయి. వైదిక మంత్ర గాయత్రులలో ఇది నిశ్చయం. కానీ పౌరాణిక మంత్రగాయత్రులలో అక్షర సంఖ్య తేడా ఉండవచ్చు. మనకు అలవాటులో ఉన్న క్రమంలో చెప్పినా, ఏ దేవతకు ప్రధానంగా అప్పుడు పూజ జరుగుతోందో ఆ దేవత మంత్రగాయత్రిని చివరలో చెప్పాలి. కృష్ణాష్టమి పూజలో కృష్ణగాయత్రి, శ్రీరామనవమి రోజుల్లో రామగాయత్రి, హనుమజ్జయంతి వంటి హనుమత్పూజలలో హనుమ న్మంత్రగాయత్రి ఇలా అర్చన జరిగే దేవత మంత్రగాయత్రితో మంత్రపుష్పం సమర్పించాలి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment