ఉపచారాలు
నిత్య పూజలో ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతా పూజకు గానీ, ఆ దేవతా పూజకు ముందు చేసే మహాగణాధిపతి పూజకు గానీ ఆయా ఉపచారాలు చేయాలి. సాధారణంగా గావించే షోడశోపచారాలు చేయడానికి ఆ దేవతకు ప్రాణప్రతిష్ఠ చేయాలి. అప్పుడే ఆ పసుపుముద్దకైనా, విగ్రహానికైనా, ఏ రూపంలో ఉన్న దేవతకైనా మన ఉపచారాలను స్వీకరించడానికి, మనలను అనుగ్రహించడానికి తగిన స్థితి, శక్తి ఏర్పడుతుంది. కనీసంగా పూజకు పంచోపచారాలు అనగా ఐదు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములు సమర్పించాలి.
సంపూర్ణ పూజకు షోడశోపచారాలు అనగా 16 ఉపచారాలు చేయాలి. ఇంకా విశేషంగా చేయాలంటే మధుపర్క, నృత్య గీతాదులతో 32 ఉపచారాలు చేయాలి.
“చతుష్షష్ట్యుపచారాస్స్యుః ఉత్తమోత్తమ పూజనే”
అనటంవల్ల ఉత్తమోత్తమపూజలో 64 ఉపచారాలుంటాయని చెప్పబడింది. కలశంలోని పుష్పం లేదా పత్రంతో ఆ దేవతను తాకుతూ
“ఓం అసునీతే పునరస్మాసు చక్షుః ప్రాణ మిహనో ధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి,
అమృతం వై ప్రాణా అమృత మాపః
ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే”
అనే మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలి. సాధారణ పూజలో అలా ప్రాణప్రతిష్ఠ చేయకున్నా పూజ చేయవచ్చు. ప్రాణప్రతిష్ఠ చేతకాదని పూజను ఆపనవసరం లేదు.
“హే స్వామిన్! స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు”
అంటూ ఆ దేవతపై అక్షతలు వేయడం ద్వారా పూజ పూర్తి అయేదాకా స్థిరంగా ఉండుమని కోరాలి.అనంతరం మనం పూజించే దేవతను ధ్యానం చేయాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని ఆ దేవతకు సంబంధించిన ముఖ్యమైన శ్లోకంతో ధ్యానం చేసిన పిదప, ఆవాహయామి అని ఆ దేవత వద్ద ఒక పువ్వుకానీ, అక్షతలు కానీ ఉంచి ఆహ్వానం చేయాలి, ఆవాహనమంటే ఆహ్వానించడమే. ఆహ్వానించిన దేవతకు ఆసనం సమర్పించి, కూర్చుండబెట్టాలి కాబట్టి
”రత్న సింహాసనం సమర్పయామి”
అని నిర్ణీత శ్లోకంతో కానీ, పురుష దేవత అయితే పురుష సూక్తమంత్ర వాక్యంతో, స్త్రీ దేవత అయితే శ్రీసూక్త మంత్రవాక్యంతో ఉపచారాలన్నీ చేయాలి.
అవి చదువుతూ అక్షతలు, లేదా పుష్పం ఆసనస్థానంలో సమర్పించాలి. పాద్యమంటే కాళ్లు కడగడానికి నీటిని సమర్పించడం.
“పాదయోః పాద్యం సమర్పయామి”
అంటూ నిర్ణీతమైన శ్లోక, మంత్రాలు చదువుతూ కలశంలోని నీటిని అందలి పుష్పం లేదా ఆకుతో పాదాలపై చల్లాలి. ఇక చేసే ఉపచారాలన్నిటికీ కలశంలోని జలం వాడాలి తప్ప, ఆచమనం చేసిన పాత్రలోని నీటిని ఉపయోగించకూడదు. పాద్యము నిచ్చాక
”హస్తయోః అర్ఘ్యం సమర్పయామి”
అంటూ నిర్ణీత శ్లోక మంత్రాలతో అర్ఘ్యం ఇవ్వాలి. అంటే కలశంలోని నీటిని చేతులలో సమర్పించాలి.
“ముఖే ఆచమనీయం సమర్పయామి”
అని ఉద్ధరిణతో జలాన్ని ముఖం వద్ద చూపి, పళ్ళెంలో సమర్పించాలి. పిదప
”స్నానం సమర్పయామి”
అని,”ఆపోహిష్ఠామయో భువః”
వంటి మంత్రాలతో నీటిని ప్రోక్షిస్తూ, అనగాచల్లుతూ స్నానం చేయించాలి. పంచామృత మంత్రాలతో పంచామృతాభిషేకం చేయాలి. పంచామృతస్నానం చెప్పినప్పుడు ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదారలను ప్రోక్షించవచ్చు. ఫలోదక స్నానం చెప్పినప్పుడు కొబ్బరికాయ కొట్టి, ఆ నీటితో స్నానం చేయించే పక్షంలో ఆ కొబ్బరిచిప్పలను నివేదనకు వాడకూడదు. అలాగే నివేదన కొరకై కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ నీటిని వినియోగించటం కూడదు. అనంతరం శుద్దోదకాలతో స్నానం పూర్తిచేయాలి. విగ్రహాలకైతే నమక చమకాదులతో అభిషేకం కూడా జరుపవచ్చు. స్నానానంతరం వస్త్రయుగ్మం అనగా కట్టుబట్ట, ఉత్తరీయాలు సమర్పించాలి.
హనుమంతునికైతే బ్రహ్మచారిగా కటిసూత్ర, కౌపీనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇలా కొద్ది భేదంతో ఉపచారాలుంటాయి. నిత్యపూజలో వస్త్రయుగ్మం బదులు పత్తితో వస్త్రాలు చేసి సమర్పించడం ఆచారం. అనగా ప్రత్తిని పసుపులో, కుంకుమలో ముంచి, వాటిని సమర్పించడం. అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా ప్రత్తిని దారంగా చేసి కుంకుమను అలంకరించి సమర్పించడం జరుగుతుంది. స్నాన వస్త్ర ధారణముల అనంతరం ఆచమనీయం సమర్పించడం ఉంటుంది.
పిదప “శ్రీ గంధం ధారయామి”
అని గంధం ధరింపజేయాలి. ముఖ్యమైన పంచోపచారాలలో మొదటిది గంధం కాబట్టి దానిని తప్పక సిద్ధం చేసి ఉంచుకుని సమర్పించాలి. భగవంతునకు గంధం సమర్పించడం మనకు చాలా మేలు. గంధ శబ్దార్థం..
“గంభీరాపార దౌర్భాగ్య – క్లేశ నాశన కారణాత్;
ధర్మ జ్ఞాన ప్రదానా చ్చ – గంధ ఇత్యభిధీయతే!!”
”గం” అనగా గంభీరమైనట్టి, అపారమైనట్టి అనగా అంతులేనటువంటి దురదృష్టాలను, కష్టాలను నశింపజేస్తుంది కాబట్టి, ”ధ” అనగా ధార్మికమైన జ్ఞానాన్ని, లేదా ధర్మజ్ఞానాలను ఇస్తుంది కాబట్టి, గంధం అని చెప్పబడుతోంది.అందువల్ల గంధాన్ని తప్పక సమర్పించాలి తప్ప, దానికి బదులు అక్షతలతో సరిపెట్టడం పద్ధతి కాదు. ఆ గంధం కూడా సానపై గంధపుచెక్కను అరగదీసి తీసిన గంధం చాలా శ్రేష్ఠమైనది, పవిత్రమైనది.
మంచిగంధపు చెక్కనే సంపాదించి, వినియోగించాలి. గంధం చెట్ల సమీపంలోని ఇతర వృక్షాలకు కూడా కొద్దిగా గంధపు లక్షణం ఉంటుంది కాబట్టి, ఆ చెక్కలు తీసుకుని వచ్చి కొంతమంది అమ్ముతారు. జాగ్రత్తగా గ్రహించి అసలైన గంధపు చెక్కను తీసుకోవాలి. నిజానికి
”సత్సంగ పరిపూతానుస్మరణం గంధః”
సజ్జనుల మైత్రితో తాను పవిత్రుడనైనట్లు భావించడమే గంధం అని గంధ సమర్పణలోని రహస్యాన్ని శాస్త్రం చెబుతోంది.
శివునికి సమర్పించవలసిన గంధాన్ని వట్టివేళ్లను, కుంకుమపువ్వు, జటామాంసి, గంధపు పొడి, తక్కోలం, అగరుచెక్క, పచ్చకర్పూరం, భూరసపుగడ్డ అనే వాటిని నూరి తయారుచేస్తారు.
మంచిగంధం తెల్లగా ఉంటుంది. గంధం ఎంతో పవిత్రమైనదీ, పుణ్యప్రదమైనదీ. దేవతలకు గంధం సమర్పించాక,
”అక్షతాన్ సమర్పయామి”
అని ఆయాదేవతలకు ఇష్టమైనరీతిగా ఆయా వర్ణాల అక్షతలను సమర్పించాలి. శివునకు శ్వేతాక్షతలు ఇష్టమైనట్లుగా అమ్మవారికి కుంకుమ అక్షతలు, హనుమంతునకు సిందూర అక్షతలు అందరకూ పసుపు అక్షతలు, శనికి నల్ల అక్షతలు ఇష్టం. కాబట్టి బియ్యానికి కాటుక కలిపి ఆ అక్షతలను శనీశ్వరునికి అర్పించాలి.
అనంతరం పుష్ప పూజ. ముందుగా అంగపూజ చేయాలి. వర్ణన కానీ, పూజ కానీ మనుష్యులకు శిరస్సునుండి పాదాలవరకూ, దేవతలకు పాదం మొదలుకొని శిరస్సువరకూ చేయాలి. కాబట్టి
“మారుతయే నమః పాదౌ పూజయామి, సుగ్రీవ సఖాయ నమః గుల్ఫౌ పూజయామి..” అని ఇలా శిరః పూజయామి
అనునంతవరకూ చేసి, అష్టోత్తర శతనామ పూజ చేయాలి. 108 అంటే 1+8 అనగా 9 పూర్ణ సంఖ్య. అందుకే ఏ దేవతకైనా పూజను 108 నామాలతోనే చేస్తాము. దేవునివద్ద నామాలు, వేదమంత్రాలు అతివేగంగాను, మిక్కిలి నెమ్మదిగాను, మిక్కిలి బిగ్గరగాను కూడా చెప్పరాదు.
సమస్థితిలో ఉండాలి. పూజలో ద్రవ్యం కంటే నామం ప్రధానం. పుష్పాలు ఎన్నైనా వేయవచ్చు. తక్కువైతే అక్షతలు సమర్పించవచ్చు. అంతే కానీ నామాలు ఎక్కువ తక్కువలు కారాదు. ద్రవ్యం లెక్కకాదనడానికి నిదర్శనం సింధూరార్చన, కుంకుమార్చన వంటివి. వాటిని రేణువులతో లెక్కించలేముకదా! కాబట్టి అక్కడ కూడా 108 నామాలను చదువుతూ, ద్రవ్యాన్ని అనుబంధంగా సమర్పించడమే కర్తవ్యం.
”పుష్పైః పూజయామి”
అని పూలతో పూజించాలి. అసలు పూవులతో చేసేదే పూజ. పుష్ప సేకరణలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. పూలలో వాడిన పూలు, రేకులు ఊడిన పూలు పూజకు తగవు. కానీ, పారిజాతం, పొగడపూలు రాలినవి కూడా ఏరి, వాటితో పూజించవచ్చు. వానికి తొడిమలు ఉండనవసరం లేదు.
“వృంతహీనం ద్రోణపుష్పం – సర్వే వృక్ష సమన్వితాః
కింజల్క హీన మర్కం చ – సర్వే కింజల్క సంయుతా: !”
అని శాస్త్రం చెబుతోంది. అంటే తుమ్మిపువ్వును తొడిమ లేకుండగనే వాడాలి. మిగిలిన పూలన్నీ తొడిమతోనే వాడాలి అనీ, జిల్లేడు పూవు కేసరములు లేకున్నా పనికివస్తుందని చెప్పారు.
పారిజాతం, పొగడ కూడా తొడిమలతో ఉండవు. మిగిలిన వాటిని తొడిమలతో పూజించవచ్చు కానీ, కొందరు మందారం, మల్లె, నిత్యమల్లి వంటి పూలన్నింటికీ తొడిమలు తీసివేస్తూ ఉంటారు. అలా అవసరం లేదని గ్రహించాలి.
పూజవలన మన పాపాలు తొలగిపోతాయి. ఏ పుష్పంతో చేసే పూజవల్ల ఏ పాపం తొలగిపోతుందో కూడా శాస్త్రం చెప్పింది. పరస్త్రీని చూసిన పాపాన్ని జిల్లేడు పూల పూజ తొలగిస్తుంది. పరనింద, పరుషవాక్కు వలని పాపాలు నల్లఉమ్మెత్త పూల పూజవలన, తండ్రిని నిందించిన పాపం శివమల్లె పూలవలన, అన్హరులకు దానం చేసిన పాపం బంగారు మారేడు దళాల పూజవలన, అన్యాయార్జిత ధనంవలన కలిగిన పాపం గన్నేరుపూల పూజవలన, వేదనింద చేసిన పాపం జమ్మి ఆకుల పూజవలన, మిత్రద్రోహం చేసిన పాపం తుమ్మిపూల పూజవలన, అసత్యమాడిన పాపం దర్భపుష్పాల పూజవలన, పంచపాతకాలు చేసిన దోషం నల్లకలువల పూజవలన, స్త్రీ హింస, బాలహింస, గో హింస చేసిన పాపం మారేడు దళాల పూజవలన, సమస్త పాపాలూ సహస్ర కమలాల పూజవలన తొలగిపోతాయని చెప్పబడింది.
ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అజ్ఞానం కారణంగా జరిగిపోయిన పాపంపై పశ్చాత్తాపం కలిగినప్పుడు పరిహారంగా ఆయా పూజలు పనికివస్తాయి తప్ప, పాపాలను కావాలని చేస్తూ, పుష్పాలతో ఆ పాపాన్ని కడిగివేసుకోవచ్చుననే పథకాలు వేస్తే మాత్రం పాపాలు తొలగకపోగా, ఇంతకింతా బాధాకరములవుతాయి. కొన్ని కొన్ని పుష్పాలలో కొందరు దేవతలు నిత్యసన్నిహితులై ఉంటారు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలలో పార్వతీదేవి, తెల్లకలువలలో కుమారస్వామి, కమలంలో ఈశ్వరుడు, తెల్లజిల్లేడులో బ్రహ్మ, కొండగోగులలో సరస్వతి, కరవీర పుష్పాలలో గణపతి, శివమల్లికలో నారాయణుడు, సువాసన గల పూలలో పార్వతీ దేవి ఉంటారని తెలుపబడింది.
కాబట్టి అట్టి పుష్పాలను దేవసమంగానే చూడాలి. పూజ ఏ విధంగా చేస్తే ఏం ? అని అనుకోకుండా, విషయాన్నెరిగి, శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించాలి. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన
“పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి”
అన్నమాట సార్థకమవుతుంది.
ధూపదీప సేవ
భగవంతుని పూజలో భాగంగా పుష్పాలతో అర్చించడం పూర్తి అయాక
”ధూప మాఘ్రాపయామి”
అని ధూపం చూపించాలి. ధూపోపచారంలో కూడా ఘంటానాదం చేయాలి. అది కూడా ఏకపార్శ్వం అంటే ఒకే పక్క మోగించాలి. నియమపూర్వకంగా పూజ చేసేవారు గుగ్గిలం వంటి ధూపద్రవ్యాలు పొడికొట్టి ఉంచుకొని, దానితో ధూపం సమర్పిస్తారు. అదిశ్రేష్ఠ విధానం. ధూపం శ్వాసకోశాలకు ఉపకారకము, క్రిమినాశకము కూడ. నేడు ఎక్కువగా అగరువత్తులు అంటే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ధూపం ఇవ్వడం లేదా ధూప్ స్టిక్కుల పేరుతో అమ్ముతున్న వాటిని తెచ్చి ధూపమివ్వడం జరుగుతోంది. అలా వెలిగించి దేవుని వద్ద తిప్పి చూపడం చేస్తారు. ధర్మసింధువు
“ధూపస్య వ్యజనేనైవ ధూపనాంగం విధూపయేత్”
అని చెప్పింది. అంటే వెలిగించిన ధూపం దేవునికి బాగా వ్యాపించడం కోసం విసనకర్రతో విసరమని చెప్పింది. బజార్లలో కొట్లలో ధూపం వేసేవారు నెమలి కన్నుల విసనకర్రలతో విసరడం చూడవచ్చు. తాటాకు విసనకర్రలతో అలా ధూపం వ్యాపింపజేయాలి.అనంతరం
”దీపం దర్శయామి”
అని దీపం చూపాలి. దీపారాధన చేసే పూజను ఆరంభిస్తాం కాబట్టి దాన్నే చూపిస్తూ
”ప్రత్యక్ష దీపం దర్శయామి”
అనడం ఉంది. శ్రద్ధతో పూజ చేసేవారు ఏ ఏకహారతిలోనో, స్పూనులోనో నేతిలో తడిపిన వత్తిని వెలిగించి చూపడం కూడా ఉంది. దీపం లేకుండా నైవేద్యం పెట్టకూడదు. కాబట్టి ఆ రీతిగా దీపాన్ని పునఃపరిశీలించి జాగ్రత్త పడడం జరుగుతుంది. ఆరంభంలో దీపారాధన చేయాలి కాబట్టి దీపం కొండెక్కకుండా జాగ్రత్త వహించాలి.
“దీర్ఘాజ్ఞాన మహాధ్వాన్త – సంఘాత పరివర్ణనాత్
పరతత్వ ప్రకాశాచ్చ – దీప ఇత్యభిధీయతే” ॥
అని దీప శబ్దానికి నిర్వచనం చెప్పారు. అంటే, మిక్కిలిగా ఉన్న అజ్ఞానమనే కటికచీకటిని పోగొట్టేది గనుక, పరతత్వజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది గనుక ”దీపం.” అటువంటి దీపాన్ని భగవంతునికి చూపడం అంటే ఆయన చీకటిని పోగొట్టడం కాదు. మన అజ్ఞానపు చీకట్లను పోగొట్టుకోవడం. పూజారంభంలో దీపం వెలిగించడమే కాదు. ధూపానంతరం, నైవేద్యానికి ముందు దీపం చూపాలి. అందుకే పూజాక్రమంలో ధూప, దీప, నైవేద్య తాంబూలాలని చెబుతారు.
”అగ్నిముఖా వై దేవాః”
అంటే దేవతలకు అగ్నియే ముఖం. కాబట్టి దేవతలకు ఏది సమర్పించినా అగ్నిముఖంగానే సమర్పించాలి. అదే యజ్ఞకార్యంలో చూస్తాము. ఏ దేవత పేరు చెప్పి అయినా
”ఇంద్రాయ స్వాహా, రామాయ స్వాహా”
అని ఇలా చెబుతూ అగ్నిహెూత్రంలో సమర్పిస్తేనే అది ఆ దేవతకు చేరుతుంది. అలౌకిక సమర్పణ యజ్ఞకార్యంలో జరిగినట్లు లౌకికపూజలలో కూడా నైవేద్యం అగ్నిముఖంగానే సమర్పించాలి. అదే దీపారాధనలోని రహస్యం. కాబట్టి దేవతలకు అగ్నిముఖంగా సమర్పించడాన్ని దీపారాధన ద్వారా నిర్వహిస్తాము. ఆవునేతిని మంటల్లో వేసిన దాని ప్రభావంచే వాతావరణంలోని రేడియేషన్ ప్రభావం తగ్గిపోతుందని రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ శిరోవిచ్ తన పరిశోధనతో గ్రహించి తెల్పారు. ఆవునేతి దీపారాధనలో ఆ ప్రయోజనం ఉన్నదని గ్రహించాలి. దీపం చూపితే సరిపోతుంది కానీ కొన్ని గ్రంథాలలో హారతిని తిప్పినట్లు దీపాన్ని తిప్పడం కూడా చెప్పబడింది.
“నేత్రాది పాదపర్యంతం – వృత్తాకారేణ భ్రామయేత్;
త్రివృత్తం పంచవృత్తం చ నవవృత్తం తథైవ చ!”
దేవుని నేత్రాలనుండి పాదాలదాకా దీపాన్ని గుండ్రంగా తిప్పాలి. అలా మూడు సార్లు లేదా ఐదు, తొమ్మిది సార్లు తిప్పాలని చెప్పబడింది.
ఆదౌ మధ్యే భిషేకాంతే ధూపే దీపే తథైవ చ |
నీరాజనే చ శయనే – ఘంటానాదం సమాచరేత్ ॥
అని చెప్పబడినందువల్ల దీపం చూపే సమయంలో కూడా ఘంటానాదం చేయాలి. అలాగే
”ఏకపార్శ్వంతు తాడయేత్”
అన్నందున గంటను ఒక పక్కనే మోగించాలి. ధూపదీపానంతరం
”శుద్ధ ఆచమనీయం సమర్పయామి”
అని నీటిని కూడా సమర్పించాలి. ధూపదీపాలను. భగవంతునకు సమర్పిస్తున్నప్పటికీ, వాటివలన మన జ్ఞానేంద్రియాలకు ప్రయోజనం చేకూరుతుంది. అట్టి పూర్తి ప్రయోజనాన్ని సాధించడంకోసం శాస్త్రోక్తవిధానంగానే వాటిని సమర్పించాలి. నైవేద్యం పెట్టడానికి ముందు ధూపదీపాలను తప్పక సమర్పించాలని శాస్త్రం చెబుతోంది.ధూపదీపాది సేవల ఫలం శాస్త్రంలో ఇలా చెప్పబడింది.
‘దీపాత్ జ్ఞానమవాప్నోతి”
అని దీపంవల్ల జ్ఞానము
“ధూపా దర్థ మవాప్స్యతే”
అని ధూపంవల్ల సంపద,
”గంధా త్పుణ్య మవాప్నోతి”
అని గంధంచే పుణ్యం,
”తాంబూలాత్ భోగ మాప్నుయత్”
అని తాంబూలంచే భోగము,
”ఆయుఃతృప్తిశ్చ నైవేద్యాత్”
అని నైవేద్యంవల్ల ఆయువు,తృప్తి,
”అభిషేకా దాత్మశుద్ధిం చ”
అని అభిషేకంవలన ఆత్మశుద్ధి లభిస్తాయి. ఆ అభిషేకంతో కూడా జలంచే ముక్తి, క్షీరంచే దుఃఖనాశం, తేనెవలన ధనం, చక్కెర పాలవల్ల మేధావిత్వం, చెఱకు రసంచే సంతృప్తి, పన్నీరువల్ల సుఖప్రాప్తి జరుగుతుంది. వస్త్రంచే దేహాత్మ భావనాశం, కర్పూరంచే అజ్ఞాననాశం, దక్షిణచే పాపనాశం జరుగుతాయని చెప్పబడింది. భక్తిశ్రద్ధలను బట్టి పూజ కుండలినిని జాగృత మొనర్చటంలో కూడా దోహదపడుతుంది. ధూపం మూలాధారాన్ని, పాద్యం స్వాధిష్ఠానాన్ని, దీపహారతులు మణిపూరకాన్ని, ఘంటానాదం అనాహతాన్ని,నైవేద్యం విశుద్ధి చక్రాన్ని, గంధం, అభిషేకాలు ఆజ్ఞా చక్రాన్ని చైతన్య పరుస్తాయని తెలుపబడింది.
అవసర నివేదన
భగవంతుడు నిత్యతృప్తుడు. నిత్యతృప్తునకు నివేదన ఎందుకు? అని కొందరి ప్రశ్న. వస్తువులన్నీ ఆయనవే. ఆయనకు చెప్పకుండా, అంటే నివేదించకుండా ఆయనవి స్వీకరించడం తగదుకదా! కాబట్టి ఆయనకు నివేదించుకునే, తెలియజేసే తినాలి. అలా నివేదింపక, (చెప్పక) తింటే దొంగతనమే అవుతుంది.
”తే త్వఘం భుంజతే పాపా యే పచం త్యాత్మకారణాత్”
అని భగవద్గీతలో చెప్పినది అదే. ఎవడైతే భగవంతునకు కాక, తనకొఱకే వండుకుని తింటాడో అతడు పాపాన్ని వండుకుని తిన్నట్లే.
“అప్రదాయ తు యో భుంక్తే సేన ఏవ సః”
అంటే, భగవంతునకు నివేదించక తినినవాడు దొంగయే అని చెప్పబడింది.
”అనివేద్య న భుంజీత”
అంటే, భగవంతునికి నివేదించకుండా తినవద్దని ఆర్ష సంప్రదాయం చెబుతోంది. నివేదన అంటే నైవేద్యం పెట్టడం.
”సమస్త యాతాయాత వర్జనమ్ నైవేద్యం”
అని శాస్త్రం నైవేద్యాన్ని నిర్వచించింది. అన్ని సంకల్పాల రాకపోకలను అడ్డగించడమే నైవేద్యమని భావనోపనిషత్తు చెప్పింది. సంకల్పం కర్మకు కారణమైతే కర్మ జన్మకు హేతువవుతోంది. అట్టి సంకల్పాన్ని అడ్డుకోగలది నైవేద్యం. అది మానసిక నివేదన లౌకిక పూజలో గావించే నివేదన రెండు విధాలుగా ఉంటుంది. 1. అవసరనివేదన. 2. మహానివేదన. అవే అవసరనైవేద్యం, మహానైవేద్యంగా చెప్పబడతాయి. ఫలాదిక సమర్పణను అవసరనివేదనగానూ, అన్న నివేదనను మహానివేదనగానూ చెప్పారు.
పూజకాగానే ముందు అవసరనివేదన పెట్టాలి. ఆ సమయంలో ఆయా దేవతలకు ఇష్టమైనవి పెట్టడం శ్రేష్ఠం. అవి పక్వాలు (వండినవి), అపక్వాలు (వండనివి) అని రెండు రూపాలలో ఉంటాయి. ఆయాదేవతలకు ఇష్టపదార్థాలను ఇలా చెప్పారు. హనుమంతునకు అరటిపండు (అపక్వం), అప్పాలు (పక్వం) ఇష్టం. గణపతికి బెల్లం, ఉండ్రాళ్లు. సుబ్రహ్మణ్యస్వామికి గుడపిష్ఠం (చలిమిడి), క్షీరం (పాలు). అమ్మవారికి దాడిమీఫలం (దానిమ్మ). దుర్గామాతకు మాషచక్రాలు (గారెలు). బగళాదేవికి చిత్రాన్నం (పులిహోర). శ్రీరామునికి ఆర్ద్రముద్గ శకలం (వడపప్పు), గుడోదకం లేదా రసాయనం (పానకం), నరసింహస్వామికి కూడా పానకమే ఇష్టం. సత్యనారాయణస్వామికి గోధుమపిష్ఠం (గోధుమ రవ్వ, పంచదార కలిపినది). సూర్యనారాయణునికి పొంగలి (క్షీరాన్నం). కార్తిక దామోదరునికి చిత్రాన్నం (పులిహోర) ఇష్టమైనవి. విశేషించి వారాన్ని బట్టి కూడా అమ్మవారికి ఆదివారం పాయసం. సోమవారం పాలు. మంగళవారం అరటిపళ్లు. బుధవారం వెన్న. గురువారం ఖండశర్కర. శుక్రవారం చక్కెర. శనివారం ఆవునెయ్యి అవసరనివేదనగా తెలుపబడింది.అందరికీ ఏకబీజఫలాలుగా కొబ్బరికాయ, ఖర్జూరపుకాయ శ్రేష్ఠం. అవి కొంతకాలం నిల్వ ఉండే ఫలాలు కూడా. అందరు దేవతలకూ పూర్ణాహుతికి వినియోగించేది, అందరు దేవతలకూ కలశానికి వినియోగించేది, పూర్ణ కుంభానికి వినియోగించేది కూడా కొబ్బరికాయే. కొబ్బరికాయ సమర్పణలో చాలా విశేషా లున్నాయి. ఆరంభ కాలంలో బలిసంప్రదాయం ఎక్కువగా ఉండేది.
జంతుబలి తామసకార్యం కాగా, సాత్విక విధి కొబ్బరికాయ కొట్టడం. జంతువధకి ప్రత్యామ్నాయంగా కూడా కొబ్బరికాయ కొట్టడాన్ని వర్ణించారు. ఉదాహరణకు కొబ్బరికాయ చర్మం జంతుచర్మ సమానం. పీచు మాంసంతో సమానం. పెంకు ఎముకలతో సమానం. కొబ్బరి మజ్జతో సమానం. కొబ్బరి నీరు జంతురక్తంతో సమానం. పీచు జుట్టుకూడా. కళ్లు మూడూ ఇడ, పింగళ, సుషుమ్న నాడులతో సమానం. కొబ్బరికాయ కొట్టడంలో ఆత్మసమర్పణ ప్రక్రియను కూడా చూసుకోవచ్చు. ఆధ్యాత్మిక దృష్టిలో పెంకు మన అహంభావానికి ప్రతీక. దానిని పగలగొట్టడం అహంభావాన్ని బద్దలుకొట్టడమే. నీళ్లు మనలోని జన్మజన్మల వాసనలు. కొబ్బరి మన మనస్సు. అహంకారాన్ని ఛేదించి, మనస్సును అర్పణ గావించడం కొబ్బరికాయను కొట్టడంలోని అంతరార్థం. కొబ్బరికాయ కుళ్లినా మంచిదేనని కొందరు సమర్థిస్తారు. కానీ, అది నివేదించడానికి మాత్రం పనికిరాదు. కుళ్లు మనస్సును సమర్పించడం మంచిదని అనలేముకదా! ముందే కాయను జాగ్రత్తగా పరిశీలించాలి. గోటితో కొట్టి మోతను బట్టి దాని మంచిచెడులను గ్రహించవచ్చు. నీటిని మోగించి, ఆ శబ్దాన్ని బట్టే మంచి చెడులను గ్రహించవచ్చు.
కొబ్బరికాయ నీళ్లు కూడా భగవంతునికి వినియోగమయ్యేవే.
“ఫలోదకేన స్నపయామి”
అని నీటిని అభిషేకానికి వాడతాము.
”నారికేళ శకలాన్ నివేదయామి”
అని చెప్పి, కొబ్బరి చెక్కలను నివేదిస్తాము. కానీ ఆ వినియోగంలో కూడా నియమం ఉంది.
”నివేదనే జలం త్యాజ్యం – అభిషేకే ఫలం తథా”
అంటే రెండూ ఏకకాలంలో వినియోగించకూడదు. అభిషేకానికివాడిన నీటికి సంబంధించిన కొబ్బరి తాలూకు చిప్పలు నివేదన చేయడానికి పనికిరావు. అలాగే పూజ తదుపరి నివేదనకోసం కొట్టిన కొబ్బరికాయలోని నీటిని అభిషేకానికో, మరి దేనికో వినియోగించకుండా వదిలేయాలి. కొబ్బరికాయ కొట్టడానికి ముందు పిలకను పూర్తిగా తీయకూడదు. పిలక పూర్తిగా ఊడిపోయిన కాయను కొట్టడానికి వాడము. కాయను కొట్టిన తరువాత పిలకను తీసేస్తాము. పిలకను తీసేసి కాయను కొట్టే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది.
”అలంకృత్య శిరచ్చేద:”
అని బలి ఇచ్చే ముందు జంతువును అలంకరిస్తారు. అలాగే కొబ్బరి చిప్పలను నివేదించే ముందు బొట్లు పెట్టే అలవాటు కొందరి కుంది. కానీ, అవసర నివేదన పెట్టేదానిని అలంకరించం.
”అర్చిత మర్చితాయ దద్యాత్”
అంటే అర్చింపబడే భగవంతునకు ఇచ్చేదానిని కూడా అర్చించి ఇవ్వడమనే సంప్రదాయం. అందువల్ల కొబ్బరికాయను ముందు అర్చించి, తరువాత నివేదించడం దాని అర్థంగా భావించి, కొబ్బరి చిప్పలకు బొట్లు పెడతారు. భావనను బట్టే ఆచరణ. మొత్తం మీద అలంకారం చేసినా, చేయకున్నా దోషం లేదు. నేడు ఆలయాలలో నీళ్లు పడి బండలు దెబ్బతింటాయని, దూరంగా నిర్ణయించిన చోట కొబ్బరి కాయలను భక్తులే కొట్టి తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. ఫలితంగా ప్యాంటు, షర్టులలో వచ్చినవారు, స్నానం చేయకుండా వచ్చినవారు కూడా కాయలను బయట కొట్టి, దేవునికి నివేదించడానికి ఇవ్వడం జరుగుతోంది. కాలప్రవాహాన్ని అడ్డుకోలేని స్థితి. కొసలు దేవుని వైపు సమర్పించాలి. కనుక కళ్లున్న, పిలక ఉన్న భాగం భక్తులకు ఇస్తున్నారు. ఇలా కొబ్బరికాయ కొట్టడంలో అనేక పరమార్థాలున్నాయి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹