Skip to content Skip to footer

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – నలబై ఏడవ అధ్యాయం

బుధగ్రహ జననం పదవ భాగము

రాక్షసరాజు వృషపర్వుడి కొలువుకూటం. రాక్షస ప్రముఖులు , వాళ్ళ గురువు ఉశనుడు ఉన్నారు. రాక్షసచారుడు తిమిరాసురుడు వచ్చి , వృషపర్వుడికి నమస్కరించాడు.

“తిమిరా ! వినదగిన వార్త తెచ్చావా ?” వృషపర్వుడు ప్రశ్నించాడు..

“మన కులానికి మహదానందం కలిగించే వార్త తెచ్చాను దేవరా ! చిత్తగించండి !” తిమిరాసురుడు ఉత్సాహంగా అన్నాడు. అందరూ చెవులు రిక్కించారు.

“దేవతల గురువు బృహస్పతి భార్య తారను ఆయన శిష్యుడు ”చంద్రుడు” అనే కుర్రవాడు అపహరించి తీసుకెళ్ళి , తన మందిరంలో పగలూ రేయీ ఆ వగలాడితో కులుకుతున్నాడు. తన భార్యను తిరిగి తన వద్దకు పంపమంటూ ఆ దేవగురువు పంపిన రాయబారాలు ఫలించలేదు. ఆ చంద్రుడు అడ్డం తిరిగాడు. గురువుకోసం ఇప్పుడు దేవేంద్రుడు రంగంలోకి దిగాడు. చంద్రుడితో యుద్ధం చేసి అయినా సరే గురుపత్నిని తెచ్చి అప్పగిస్తానన్నాడు…”

“చాలు !” వృషపర్వుడు విసుగ్గా అన్నాడు. ఎవడో శిష్యుడు గురువు భార్యను చంకనెట్టుకుపోతే మనకేమిటిరా ? ఇతర వార్తలుంటే విన్నవించుకో !”

“ఆగు వృషపర్వా ! ఒక్క క్షణం ఆగు” ప్రక్కనే ఉన్న ఉశనుడు అన్నాడు. “ఇది. మనం అతి జాగరూకతతో గమనించవలసిన కీలక సమాచారం. తిమిరా , విషయం పూర్తిగా విన్నవించు ! ఇంద్రుడు ఏం చేయబోతున్నాడు ?”

“చిత్తం గురూ ! దేవదూతను ఆ చంద్రుడి వద్దకు రాయబారం పంపిచారని అంటూంటే విని , పరుగెట్టుకొచ్చాను ?”

ఉశనుడు తటాలున ఆసనం మీద నుంచి లేచాడు. “వృషపర్వా , నేను వెళ్ళాలి.”

“ఎక్కడికి గురుదేవా ?” వృషపర్వుడు ఆశ్చర్యంగా అడిగాడు. “చంద్రుడి మందిరానికి !” ఉశనుడు ముక్తసరిగా అన్నాడు.

“చంద్రుడి మందిరానికా ? మీరా ?!” వృషపర్వుడు ఆశ్చర్యంగా అడిగాడు.

“ఎందుకు ? ఎందుకు గురుదేవా ?”.

“ఇంద్రుడి దౌత్యానికి చంద్రుడు లోబడకుండా చేయడానికి…”

“ఎందుకు ?” వృషపర్వుడు కళ్ళు చిట్లించాడు..

“చంద్రుడు తిరగబడితే, తన మాట వినకపోతే – ఇంద్రుడు ఏం చేస్తాడు ?”. ఉశనుడు ప్రశ్నించాడు.

“ఏం చేస్తాడు ? ఆ చంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్తాడు.”

“ఆ సందర్భంలో మనం చంద్రుడికి బాసటగా నిలబడితే ?” ఉశనుడు చిరునవ్వుతో అడిగాడు.

వృషపర్వుడు మాట్లాడకుండా కనుబొమలు ముడివేశాడు.

“ఇంద్ర , చంద్రుల యుద్ధం – ఒక్కసారిగా దేవదానవ యుద్ధంగా మారిపోతుంది ! దేవతలకూ , మనకూ యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది వృషపర్వా ?”

“దేవతలు ఛిన్నాభిన్నమైపోతారు !” వృషపర్వుడు సగర్వంగా అన్నాడు.

“ఫలితంగా ఆ ”సురవైభవం” అసురవైభవంగా , ఇంద్రభోగం వృషపర్వభోగంగా పరిణమిస్తాయి” అంటూ ఉశనుడు ఠీవిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. రాక్షసులందరూ ఆయనను ఆశ్చర్యంగా చూస్తున్నారు.

“మీరు… ఎవరు ?” తన ముందు ఠీవిగా నిలుచున్న వ్యక్తిని చూస్తూ ప్రశ్నించాడు. చంద్రుడు.

“అసుర గురువు ఉశనాచార్యులను నువ్వు దర్శిస్తున్నావు , చంద్రా !”

చంద్రుడి చేతులు అసంకల్పితంగా కదిలి , కలిసి , ఉశనుడికి వందనం చేశాయి. “నాతో పని ఉండి దయచేశారా ?”

“ఆపద నుండి నిన్ను రక్షించడానికి వచ్చాను , చంద్రా !” ఉశనుడు గంభీరంగా అన్నాడు..

“ఆచార్య… ఆపదా ?!” చంద్రుడు ఆందోళనగా అన్నాడు.

“ఔను. నీకూ , నీ ప్రియురాలు తారకూ… ఏకాంతంలో మీ ఇద్దరికీ అంతా చెప్తాను. ఏదీ ఆ సాహస వనిత ?” ఉశనుడు చొరవగా దారితీస్తూ అన్నాడు..

“మీ ఇద్దర్నీ దుర్మార్గంగా విడదీసే ప్రయత్నం జరుగుతోంది…” తన ఎదురుగా జంట పక్షుల్లా కూర్చున్న తారాచంద్రుల్ని చూస్తూ అన్నాడు ఉశనుడు.

ఇద్దరి ముఖాల్లోనూ ఆందోళన జంట అద్దాల్లో ప్రతిబింబంలా ప్రత్యక్షమైంది.

“గురుదక్షిణగా తారను బృహస్పతికి అప్పగించడానికి ఇంద్రుడు ప్రతిజ్ఞ చేశాడు. మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేయడానికి త్వరలో ఒక దూతను పంపుతాడు…” అంటూ చంద్రుడి వైపు ప్రత్యేకంగా చూశాడు ఉశనుడు.

“మాట విని మర్యాదగా తారను అప్పగించకపోతే , దైవసైన్యం నీ మందిరం మీద దాడి చేసి , సర్వనాశనం చేస్తుందని హెచ్చరిస్తాడు దూత…”

చంద్రుడు ఆందోళనగా తార వైపు చూస్తూ , ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు.

“చంద్రా ! ఆ హెచ్చరికలకూ , బెదిరింపులకూ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆశించి , అపహరించుకు వచ్చిన ఈ అందాలరాశిని ఆ సురగురువుకు అప్పగించాల్సిన అవసరం లేదు. ”

“ఆచార్యా… దేవ సైన్యాన్ని నేను…”

“ఎదిరించవలసిన పనిలేదు ! ఆ పనిని , నీ కోసం – నా ప్రియశిష్యుడూ , రాక్షసరాజు అయిన వృషపర్వుడి ఆధ్వర్యవంలో అశేష అసురసైన్యం చేస్తుంది ! తారాచంద్రుల వైపు కన్నెత్తి చూడనివ్వకుండా సురసైన్యాన్ని తరిమికొడుతుంది ! భవిష్యత్తులో కూడా , నా ఆధ్వర్యవంలో రాక్షసబలగం మీకు వెన్నుకాపుగా ఉంటుంది !”

తారాచంద్రులు ఉత్సాహంగా , ధైర్యంగా చూశారు. అప్రయత్నంగా చేతులు జోడించారు.

” ఆచార్యా ! మా ప్రేయసీ ప్రియుల మీద మీ ప్రేమ మమ్మల్ని కదిలించి వేస్తోంది ! మేం ధన్యులం !” చంద్రుడు ఆవేశంగా అన్నాడు.

“ఈ ఉశనుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు , ఆత్రేయా ! సమస్త దానవ సైన్యమూ నీ పక్షాన నిలవడానికి కారణం – మీమీద మమకారం కాదు. దేవతల మీద పగ !” అంటూ ఉశనుడు పైకి లేచాడు.

తారాచంద్రులూ లేచారు. ఉశనుడు చంద్రుడి కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. “చంద్రా ! ఇంద్రుడి మాటలకు లోబడకు. బెదిరింపులకు భయపడకు. చేవ ఉంటే యుద్ధం చేసుకొమ్మను. నిన్ను నమ్మి వచ్చిన ఈ కళ్యాణికి అన్యాయం చేయకు. విజయోస్తు !” అంటూ మందిరంలోంచి నిష్క్రమించాడు.

ఉశనుడి మంత్రాంగం తారాచంద్రుల మీద వశీకరణ మంత్రంలా పనిచేసింది. ఇంద్రుడి దూత వచ్చాడు. చంద్రుడి చేత అవమానింపబడి , తల వాల్చుకుని వెళ్ళాడు. గురువుకు వాగ్దానం చేసిన విధంగానే ఇంద్రుడు సైన్యాన్ని సమాయత్త పరచి , చంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. మాతలి సారధ్యంలోని తన రథం మీద బృహస్పతిని తీసుకుని , స్వయంగా చంద్రమందిరం వైపు బయలుదేరాడు. దేవేంద్రుని వెనక దేవసైన్యం సమరోత్సాహంతో ఉరకలు వేసింది.

చంద్ర మందిరాన్ని సమీపిస్తున్న ఇంద్రుడిని , ఆయన సైన్యాన్నీ అక్కడి దృశ్యం నిలువెత్తు ఆశ్చర్యంలో ముంచి వేసింది. తారాచంద్రులు విడిది చేసిన మందిరానికి చుట్టూ కట్టని గోడలా , పెట్టని కోటలా వేల సంఖ్యలో రాక్షస సేన మోహరించి ఉంది. భయం కలిగించే ఆ సైన్యం ముందు రాక్షసరాజు వృషపర్వుడూ , రాక్షసాచార్యుడు ఉశనుడూ ఉన్నారు.

దేవతల సైన్యం గోచరించగానే రాక్షసుల చేతులలోని రకరకాల మారణాయుధాలు ఒక్కసారిగా పైకి లేచాయి. వేలాది కంఠాలు ఒక్కసారిగా చేసిన యుద్ధనాదం… ఆకాశమంతటా గొలుసు ఉరుముల ధ్వనిలా మారు మ్రోగింది.

సరిగ్గా ఆ సమయానికి ఆకాశమార్గంలో వెళ్తున్న నారదుడు అదిరిపడి , చేస్తున్న నారాయణ నామగానాన్ని ఆపి , కిందికి సారించాడు , తన చూపుల్ని , దేవదానవ సైన్యాన్నీ , దానవ సైన్యం రక్షణలో ఉన్న చంద్ర మందిరాన్ని చూడగానే ఆయనకు అంతా అర్థమైపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతర్థానమై పోయాడు నారదుడు.

ఆకాశంలో అంతర్థానమైన నారదుడు మరుక్షణం బ్రహ్మదేవుడి ముందు నిలుచున్నాడు. తారాచంద్రులు కేంద్రబిందువుగా జరగబోతున్న దేవ దానవ యుద్ధమనే అవాంతరాన్ని వివరించాడు. బ్రహ్మ ఆందోళనతో తన పద్మాసనం మీంచి దిగాడు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment