Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ముప్పయ్యవ అధ్యాయం

వాస్తు మండల పూజావిధి

గృహనిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తుపూజకై ఎనుబది యొక్క అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి.

ఈ మండల (లేదా మండప) ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరృతిలో రెండు పాదాలూ, మిగతా రెండు మూలల్లో చేతులూ వుండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తు దేవతను స్థాపించి పూజించాలి. తరువాత ఇరువది యొక్కమంది దేవతలను మండల బాహ్యభాగంలోనూ పదముగ్గురు దేవతలను అంతర్భాగములోనూ ఉంచాలి.

బాహ్య దేవతలు వీరు :- ఈశ, శిఖి, పర్జన్య, జయంత, కులిశాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితథ, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజ, మృగ, పితృగణ, దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి – వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్నీ, ఆగ్నేయంలో సావిత్రినీ, నైరృత్యంలో జయనీ, వాయవ్యంలో రుద్రదేవుని పూజించాలి.

తరువాత తొమ్మిదడుగుల జాగాలో బ్రహ్మనీ ఆయనకు ఎనిమిది వైపులా తూర్పున మొదలెట్టి అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాధిప, మిత్ర, రాజయక్ష్మ, పృధ్వీధర, అపవత్స అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి.

లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరు వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరృత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను ”వంశీ” అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయవ్యానికున్న రేఖను ”దుర్ధర” అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితినీ, దుర్ధరయోగ బిందువుపై హిమవంతునీ, నైరృత్య కోణాంతిమ బిందువుపై జయంతుని పూజించాలి.

తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై ”నాయిక” నీ చివరలో కాళికాదేవినీ పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలందరినీ మరల పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి.

భవనానికెదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞ మండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలనూ, పూలనూ దాచుకొనే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయవ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలూ, జలాశయం, నైరృత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్ర శస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని, దీపములు, భృత్యులు, అతిథి గృహం వుండాలి.

ఇంటిమధ్యలో, అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా వుండాలి. అందులో నొక నుయ్యి, అరటి చెట్టు, అయిదు రకాలు పూల చెట్లు వుండాలి. భవన బాహ్యభాగంలో నాలుగు వైపులా అయిదేసి హస్తాల పిట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన, ఉపవనాల మధ్య విష్ణుమందిరాన్ని నిర్మించాలి.

ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో అరవై నాలుగు అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తు దేవతను విధ్యుక్తంగా పూజించాలి. అందులో మధ్యభాగంలో నాలుగడగుల మేర బ్రహ్మనూ ఆయన సమీపంలో రెండడుగుల జాగాలో ప్రత్యేకంగా అర్యమాది ఎనమండుగురు దేవులను పూజించాలి.

తరువాత కర్ణ భాగంపై కార్తికేయాదులకు పూజను గావించి, రెండు వైపులా పార్శ్వ బిందువులపై రెండేసి అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలనూ అర్చించాలి. తరువాత వాస్తుమండల ఈశానాది కోణాలలో క్రమంగా చరకీ, విదారీ, పూతనా, పాపరాక్షసీ అను పేళ్ళు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి.

హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాల, యమ, అగ్నిజిహ్వ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హైతుకాది దేవతలంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి ఆపై క్షేత్ర పాల దేవతలకూ పూజ చేయాలి.

పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. ఎనిమది చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది ”ఆయ”. ఎనిమిదితో దీన్ని గుణించి ఏడుతో భాగిస్తే వచ్చేది ఋక్షభాగం. దీనిని నాలుగు చేత గుణించి తొమ్మిదితో భాగిస్తే మిగిలేది ”వ్యయం”. దీనిని ఎనిమిదితో గుణిస్తే వచ్చేదాన్ని ”పిండ” అంటారు. దాన్ని అరవై చేత భాగిస్తే ”జీవ” మిగులుతుంది. శేషాన్ని ”మరణ”మంటారు.

వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు.

సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టినవారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించుకోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, అశ్వయుజ, కార్తిక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్నీ, ఉత్తరంలో తోకనీ, దక్షిణ దిశలో క్రోడాన్నీ, పశ్చిమంలో చరణాలనీ విస్తరింపజేసుకొని వాస్తునాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తరదిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకరరాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘమాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పుదిక్కులో వుంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవాలి.

కుంభ, మీన, మేష రాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్టం దక్షిణంలోనూ చరణాలు ఉత్తర పూర్వాలలోనూ వుంటాయి కాబట్టి ఆయా రాశులలో జన్మించినవారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరము ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ, వుంటాయి కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవడం శ్రేయస్కరం.

భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు వుండాలో కూడా వాస్తు శాస్త్రం నిర్దేశించింది. తూర్పు – పీపల, దక్షిణ – పాకడ, పశ్చిమ – బరగద, ఉత్తర – గూలర, ఈశాన్య – సేమలక. ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది..

ముప్పయ్యవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment