బుధగ్రహ జననం పన్నెండవ భాగము
“బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !” అంగీరసుడు లేచి , ప్రకటించాడు.
“సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను. శిశువు జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను !” అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు. “తారా ! నీ కుమారుణ్ణి తీసుకొని… ఆ కక్ష్యాంతరం లోనికి రా !”
తార లేచి , శిశువును రెండు చేతుల్తో ఎత్తుకుని , బ్రహ్మ వెంట వెళ్ళింది. అందరూ ఆసక్తిగా వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపే చూస్తున్నారు. బృహస్పతీ , చంద్రుడూ ఇద్దరూ సగర్వంగా చిరునవ్వులు నవ్వుకుంటున్నారు.
క్షణాలు గడుస్తున్నాయి. తార ముందుగా వచ్చింది. ఆమె చేతులలో బాలుడు లేడు. బాలుణ్ణి తన చేతుల్తో , ఎత్తుకుని బ్రహ్మ నామకరణ వేదిక వద్దకు వచ్చి , నిలుచుని , అందర్నీ మౌనంగా కలియజూశాడు. గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు.
“ప్రతీ శిశువుకూ తండ్రి ఎవరో సందేహరహితంగా నిరూపించబడాలి. ఆ ధర్మాన్ని తారకు వివరించాను. తన వొడిలోని శిశువు తండ్రి ఎవరో – నిర్భయంగా వెల్లడించమన్నాను. ఈ బాలకుడు ఎవరు ? బృహస్పతి తనయుడా ? చంద్రుడి తనయుడా ? చెప్పమని ఆమెను ఆజ్ఞాపించాను. ఇప్పుడు మాతృమూర్తిగా ఉన్న తార తాను ప్రసవించిన బిడ్డడి తండ్రి ఎవరో ప్రమాణపూర్వకంగా విన్నవించింది…” ఉత్కంఠతో చూస్తూన్న అందర్నీ కలియజూస్తూ బ్రహ్మ క్షణకాలం ఆగాడు.
“ఈ బాలకుడి తండ్రి చంద్రుడు!” బ్రహ్మ కంఠం అక్కడ ప్రతిధ్వనించింది. “ఈ శిశువు చంద్రునికే సంక్రమించాలి. మీ అందరి సమక్షంలో ఈ బాలుడికి ”బుధుడు” అని నేనే నామకరణం చేస్తున్నాను. జనకుడైన చంద్రుడికి అప్పగిస్తున్నాను !”
బృహస్పతి నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడు బ్రహ్మకు నమస్కరించి బాలుణ్ణి స్వీకరించాడు.
“చంద్రా ! ఈ బుధుడు నీ కుమారుడు. భవిష్యత్తులో ఇతడు నవగ్రహాలలో ఒకడుగా నియమితుడవుతాడు. తీసుకువెళ్ళి పెంచు , పోషించు ; విద్యతో పెంపొందించు !” అన్నాడు. బ్రహ్మ చంద్రుడితో.
“బుధుణ్ణి విద్యాభ్యాసం కోసం , మా జనకులు అత్రిమహర్షికి అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి” చంద్రుడు బ్రహ్మను అభ్యర్ధించాడు.
“అనుమతి లభించింది. ఇక వెళ్ళు !” బ్రహ్మ ఆజ్ఞాపించాడు.
చంద్రుడు పురిటిబిడ్డతో వెళ్తున్నాడు. తార కన్నీళ్ళతో మసకబారిన చూపుల్ని పసివాడి మీదే నాటింది.
“బృహస్పతీ !” బ్రహ్మ పిలిచాడు. “నిరాశ వద్దు ! నీ వంశం నీ సంతతితోనే వృద్ధి చెందాలి ; చెందుతుంది ! చంద్రుణ్ణి , బుధుణ్ణి మరిచిపో. తార నీకు వారసుల్ని బహూకరిస్తుంది.”
బృహస్పతి మౌనంగా నమస్కరించాడు. అప్పటి దాకా చలనం లేకుండా అందరూ అటూ ఇటూ కదిలారు.
“ఇప్పుడు.. ఆదిత్యాయచ సోమాయ…” క్రమంలోకి వెళ్ళి నవగ్రహదేవతలలో మిగిలిన ముగ్గురి జన్మ వృత్తాంతాలు శ్రవణం చేద్దాం…” శిష్యులను ఉద్దేశించి అన్నాడు. నిర్వికల్పానంద.
“గురువు గారూ , అయితే మీరిప్పుడు శని జన్మవృత్తాంతం చెప్పాలి !” సదానందుడు ఉత్సాహంగా అన్నాడు.
“ఔను ! శని నవగ్రహాలలో ఎన్నికెక్కిన ఏడవ గ్రహం. ఆయన ఆవిర్భావ నేపథ్యం చిత్రవిచిత్రంగా ఉంటుంది. అబ్బురపరిచే సంఘటనల సమాహారం అది. శని సూర్యుడి కుమారుడు. అంచేత ఒక్కసారి సూర్య చరిత్రలోకి – వెనక్కి వెళ్దాం. సూర్యుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞతో వివాహం జరిగిన కథా , ఏకాంత మందిరంలో సూర్య దంపతులు కాపురం ప్రారంభించిన సంగతీ , తనకు ఇద్దరు కుమారుల్నీ , ఒక కుమార్తెను ప్రసాదించమని సంజ్ఞ కోరిన విషయం – మనం చెప్పుకున్నాం. సంజ్ఞ కోరినట్టుగానే సూర్యుడామెకు ముగ్గురు పిల్లలను అనుగ్రహించాడు…”
“ఓహో… ఆ ముగ్గుర్లో, మన శని ఒకడన్నమాట !” శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.
నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “కాదు , శివానందా ! వాళ్ళు ముగ్గురూ ఎవరంటే జ్యేష్ఠ పుత్రుడైన వైవస్వతుడు , రెండవవాడైన యముడూ , కుమార్తె ‘యమి’ అనే వాళ్ళు ! ఆ వైవస్వతుడే వైవస్వత మనువు. సూర్యుడి ద్వాదశ నామధేయాల్లో ”వివస్వంతుడు” అనేది ఒకటి. వివస్వంతుని పుత్రుడైన కారణంతో సూర్యుడి పెద్దకొడుకు ”వైవస్వతుడు” అయ్యాడు. ఇక్ష్వాకుడూ , నగుడూ , శర్యాతీ మొదలైన సూర్యవంశ పురుషులందరూ ఆ వైవస్వతుడి సంతతే ! సూర్యవంశపాలన. ఆయనతోనే ప్రారంభం!
“ఇక – రెండవ కుమారుడు యముడు. ఆయనే మన యమధర్మరాజు. మిగిలింది కుమార్తె యమి. ఆమే యమునా నదిగా మారిపోయింది…”
“గురువుగారూ , అయితే శని వాళ్ళ తమ్ముడుగా తదనంతరం జన్మించాడా ?” విమలానందుడు అడిగాడు.
“వినిపిస్తాను , వినండి ! తల్లిదండ్రుల పోషణలో వైవస్వతుడూ , యముడూ , యమీ పెరుగుతున్నారు. మన ప్రస్తుత కథాకాలానికి వాళ్ళింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ఒకనాటి రాత్రి ఏమైందంటే…” అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద.
రేపటి నుండి శనైశ్చరుని చరిత్ర ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹