కూర్మావతార వర్ణనం అగ్ని ఉవాచ
పాపములనుతొలిగించు కూర్మావతారమును గూర్చి మొదట నేను ప్రతిజ్ఞ చేసిన విధమున చెప్పెదను.పూర్వము దేవాసుర యుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి.అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీ రహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువునుస్తుతించి “మమ్ములను అసురుల నుండి రక్షింపుము” అని వేడి కొనిరి.
శ్రీమహా విష్ణువుబహ్మాది దేవతలతో ఇట్లనెను, “సురలారా!క్షీరాబ్దిని మథించి అమృతమును లక్ష్మిని సంపాదించుటకై అసురులతో సంధి చేసికొనుడు.పని వడినపుడు శత్రువులతో కూడ సంధి చేసి కొనవలెను గదా! అమృతము మీకే దక్కునట్లును, దానవులకు దక్కకుండు నట్లును చేసెదను. మందరపర్వతమును కవ్వముగ చేసి, వాసుకుని కవ్వపు త్రాడుగా చేసి, నా సహాయముతో మధింపుడు. మాంద్యము వలదు.
విష్ణువు ఇట్లు పలుకగా దేవతలు దైత్యులతో ఒప్పందము చేసికొని క్షీరాబ్ధికి వచ్చి మథింప ప్రారంభించిరి. వాసుకి తోక వైపు దేవత లుండిరి.
సర్పమువిడచు నిట్టూర్పుల వేడికి బాధ పడుచున్న దేవతలను హరి సేదదీర్చెను. సముద్రమును మథించుచుండగా ఆ పర్వతము క్రింద ఆధార మేదియు లేక పోవుటచే నీటిలో మునిగి పోయేను.
అంత శ్రీ మహా విష్ణువు కూర్మ రూపము ధరించి మందర పర్వతమును తన వీపుపై ఉంచుకొని ఆ పర్వతమును పైకి లేపగా దేవతలు దైత్యులు మళ్ళీ మధించుట ప్రారంభించిరి.
అట్లు మధించుచుండగా భయంకరమైన విషపు వాయువులు ఆ ప్రదేశమంతా కమ్ముకొనెను. దేవతలు కుయ్యో, మొర్రో అనుచు పరమేశ్వరుని వేడుకొనిరి.
శివుడు ఆవిషమును కంఠము నందు ధరించెను. అందుచే అతడు నీలకంఠు డయ్యెను. పిమ్మట వారుణీ దేవియు(సురయు), పారిజాతము, కౌస్తుభము, గోవులు , దివ్యలగు అప్సరసలు పుట్టిరి. లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును చేరినది. దేవత లందరును ఆమెను చూచుచు స్తోత్రము చేయుటచే శ్రీమంతులైరి.
పిమ్మట ఆయుర్వేదమును ప్రచారము లోనికి తీసికొని వచ్చిన ధన్వంతరి రూపుడైన విష్ణువు అమృత పూర్ణమగు కమండలువును చేత ధరించి ఆవిర్బవించెను.
జంభుడుమొదలగు దైత్యులు ఆతని చేతి నుండి అమృతమును గ్రహించి, సగము దేవతల కిచ్చి, వెళ్లిపోయిరి. పిమ్మట విష్ణువు స్త్రీ రూపమును ధరించెను.
మంచిసౌందర్యము గల ఆమెను చూచిన దైత్యులు మోహము చెంది, “ఓ వరాననా! మాకు భార్యవు కమ్ము, ఈ ఆమృతమును తీసికొని మాకు(త్రాగించుము) పంచి పెట్టుము” అనిపలికిరి.
అట్లే అనిపలికి హరి వారి చేతి నుండి అమృతమును గ్రహంచి దేవతలచే త్రాగించెను. రాహువు చంద్ర రూపమును ధరించి అమృతము త్రాగు చుండగా సూర్య చంద్రు లాతనిని పట్టి చూపిరి.
అప్పుడువిష్ణువు రాహు శిరస్సును చక్రముచే ఖండించి వేరు చేసి దయతో దానికి మరణము లేకుండునట్లు చేసెను. రాహువు, వరము నిచ్చు హరితో ఇట్లు పలికెను “చంద్ర సూర్యులు నాచే పట్టుబడు చుందురు. అది గ్రహణ మగును. ఆకాలము నందు ఇచ్చు దానము ఆక్షయ మగుగాక”.
“అటులనే ఆగుగాక” అని విష్ణువు ఆతనితో పలికెను. పిమ్మట స్త్రీరూపమును త్యజించి దేవతలతో కలిసి యుండగా శివుడు “ ఆ స్త్రీ రూపమును చూపుము” అని హరితో అనెను.
భగవంతుడైనశ్రీమహా విష్ణువు రుద్రునకు స్త్రీ రూపమును చూపెను. శివుడు విష్ణు మాయచే మోహితుడై పార్వతిని విడచి ఆ స్త్రీని వెంబడించెను.
శివుడు ఉన్మత్తుడై, దిగంబరుడై ఆమె కేశ పాశమును పట్టుకొనెను. ఆమెజుట్టు విడిపించుకొని వెళ్లి పోయెను. ఇతడు ఆమె వెంట పరుగెత్తెను.
ఈశ్వరుని వీర్యము స్ఖలితమై భూమిపై పడిన చోటులలో నెల్ల బంగారు లింగముల క్షేత్ర మయ్యెను.
ఇది యంతయు మాయయని గ్రహించి శివుడు స్వస్థచిత్తు డాయెను. అపుడు విష్ణువు శివునితో ఇట్లనెను, “రుద్రా! నీవు నా మాయను జయించితివి. ఈలోకములో నీవు తప్ప మరెవ్వరును నా మాయను జయింప జాలరు.”
అమృతమును పొందజాలని ఆ దైత్యులను దేవతలు యుద్ధములో జయించిరి. దేవతలు స్వర్గములో నివసించిరి. దైత్యులు పాతాళలోక నివాసులయిరి. ఈ దేవవిజయ కథను పఠించు వాడు స్వర్గమును పొందును.
శ్రీ అగ్ని మహా పురాణములో కూర్మావతారమనెడు తృతీయాధ్యయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹