దేవప్రతిష్ఠ – సామాన్య విధి
విష్ణువు శివాది దేవతలకూ, సూతుడు శౌనకాది మహామునులకూ విగ్రహప్రతిష్ఠను ఎలా చేయాలో చెప్పసాగారు.
ప్రశస్తమైన తిథులనూ నక్షత్రాలనూ ఎంచుకొని ఈ పుణ్యకార్యాన్ని మొదలు పెట్టాలి. ముందుగా యజమాని తన వైదిక శాఖలో విధించబడిన బీజాక్షరాన్ని గానీ ఓంకారాన్ని గానీ వీలైనంత సేపు ఉచ్ఛరించి అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఋత్విజులను ఎంచుకొని తెచ్చి ఆదరంగా ఆసీనులను చేసి వేరొక మహానుభావుని ఆచార్యునిగా వరించి తెచ్చి వారి మధ్యలో కూర్చుండబెట్టాలి.
తరువాత పాద్య, అర్ఘ్య, ముద్రిక, వస్త్ర, గంధ, మాల్య, అనులేపనీయద్రవ్యాలతో వారందరినీ సాదరంగా పూజించాలి. అప్పుడు ఆచార్యదేవులు మంత్రన్యాసపూర్వకంగా ప్రతిష్టాకర్మను సమారంభం గావించాలి.
మందిరం (లేదా దేవప్రాసాదం) అగ్రభాగంలో (అనగా ముందుభాగంలో) పది లేదా పన్నెండు హస్తాల పరిమాణంలో నొక మండపాన్ని నిర్మించి దానిపై పదహారు స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో ఎనిమిది మూలల్లో ఎనిమిది (నాలుగు దిక్కులు, నాలుగు మూలలు అని అర్థము) ధ్వజాలను ప్రతిష్టించాలి.
తరువాత ఆ మండప మధ్యంలో నాలుగు హస్తాల పరిమాణంలో ఒక వేదిని నిర్మించాలి. ఆ వేదిపై నదుల సంగమస్థానం తీరం నుండి తెచ్చిన ఇసుకను నెఱపాలి. ప్రధానకుండాన్ని నిర్మింపజేసి దానికి తూర్పున చతురస్రాకారంలోనూ, దక్షిణంలోనూ ధనురాకారంలోనూ, పశ్చిమంలో గుండ్రంగానూ, ఉత్తరంలో పద్మాకారంలోనూ మొత్తం నాలుగు కుండాలను నిర్మించాలి.
కుండనిర్మాణం తరువాత ఇష్టసిద్ధికై ఆచార్యుని చేతా, శాంతి కర్మకై ఇతరుల చేతా హవనం చేయించాలి. సాధారణంగా దీనికి ఈశానకోణంలోనున్న భూమిని ఆవుపేడతో అలికిన స్థలాన్ని వాడతారు.
మండపం పూర్వాది దిశలలో నాలుగు ద్వారాలతో శోభిల్లాలి. తోరణ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవి అయిదేసి హస్తాల పరిమాణంలో వుండాలి. న్యగ్రోధ (మట్టి) ఉదుంబర, అశ్వత్థ (రావి) బిల్వ, పలాశ, ఖదిర చెట్లలో ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క కర్రను తయారు చేసి వాటిని వస్త్రపుష్పాదులతో అలంకరించి తోరణ స్తంభాలుగా మార్చి భూమిలోకి, ఒక హస్తం మేర లోతుకు పాతాలి. ఈ స్తంభాలు మండపము యొక్క అన్ని దిశల్లోనూ కనబడాలి.
మండపానికి తూర్పువైపు ద్వారంపై మృగేంద్ర, దక్షిణంపై హయరాజ, పశ్చిమంపై గోపతి, ఉత్తరీ ద్వారంపై దేవశార్దూల ప్రతిరూపాలనుంచాలి. క్రమంగా అగ్నిమీలే… ఈషేత్వేతి… అగ్న ఆయాహి…, శంనోదేవీ… అనే మంత్రాలతో ఆయా దిక్కుల్లో ఈయీ సింహ, గజ, వృషభ, శార్దూల మూర్తులను న్యాసం చేయాలి.
ఇక పతాకల వర్ణాలీ విధంగా వుండాలి.
తూర్పు – మేఘ
ఆగ్నేయ – ధూమ్ర
దక్షిణ – శ్యామల
నైరుత్య- దూసర
పశ్చిమ – పాండుర
వాయువ్య – సీత
ఉత్తర – రక్త
ఈశాన్య – శుక్ల
మండప మధ్యభాగంలో అన్ని రంగులు జెండాలూ రెపరెపలాడుతుండాలి.
ఇంద్రవిద్యోతి… అనే మంత్రంతో తూర్పులో ఇంద్రునీ
సంసుప్తి…. అనే మంత్రంతో ఆగ్నేయంలో అగ్నినీ,
యమోనాగ… అనే మంత్రంతో దక్షిణంలో యమునీ
రక్షోహణావేతి…. అనే మంత్రంతో పశ్చిమంలో వరుణునీ,
ఓం వాతేతి… అనే మంత్రంతో వాయవ్యంలో వాయుదేవునీ అభిషేకించి ఉత్తర దిశలో ఓం ఆప్యాయస్వేతి…. అనే మంత్రంతో కుబేరుని పూజించాలి. తరువాత ఓం తమీశాన… అనే మంత్రంతో ఈశాన్యంలో ఈశానునీ, మండప మధ్యభాగంలో ఓం విష్ణోర్లోకేతి… అనే మంత్రంతో విష్ణు దేవునీ పూజించాలి.
ప్రతి తోరణ సమీపంలోనూ రెండేసి కలశలను స్థాపించి, వస్త్ర, ఉపవస్త్రాలతో వాటిని కప్పి, చందనాది సుగంధిత పదార్థాలతో అలంకరించి ఈ క్రింది మంత్రాలతో
వాటిపై పుష్ప వితానాది ఉపచారాల నుంచుతూ దిక్పాలకులను పూజించాలి.
ఓం త్రాతార మింద్ర…. తో ఇంద్రునీ
ఓం అగ్నిర్ళూరా….తో అగ్నినీ,
ఓం అస్మిన్ వృక్ష….తో నిరృతినీ,
ఓం కిం చే దధాతు…. తో వరుణునీ,
ఓం ఆచత్వా… తో కుబేరునీ,
ఓం ఇమారుద్రేతి….తో రుద్రునీ,
ఇతర దిక్పతులనూ పూజించి ఆచార్య దేవుడు హోమద్రవ్యాలనూ, అన్య పూజా సామాగ్రినీ వాయవ్యకోణంలో స్థాపించి వుంచాలి. తరువాత అక్కడున్న శ్వేత శంఖాది శాస్త్రవిహిత సమస్త వస్తువులనూ ఆయనొకమారు దీక్షగా చూడాలి. వెంటనే ఆ నిశ్చిత ద్రవ్యాలన్నీ సంపూర్ణంగా శుద్ధాలయిపోతాయి.
అప్పుడు షడంగ న్యాసాన్నీ ప్రణవ, వ్యాహృతి సంయుక్తంగా ఇలా చేయాలి.
ఓం హృదయాయ నమః,
ఓం భూః శిరసే స్వాహా,
ఓం భువః శిఖాయై వషట్,
ఓం స్వః కవచాయ హుం,
ఓం భూర్భువః స్వః నేత్రత్రయాయ వౌషట్,
ఓం భూర్భువః స్వః కరతల కరపృష్టాభ్యాం ఫట్
అనే మంత్రాలను చదువుతూ క్రమంగా గుండె, తల, పిలక, కవచం, కనులు, అరచేయి, మండలను స్పృశించాలి. తరువాత ఓం అస్త్రాయఫట్ మంత్రంతో అస్త్రాలను (అంటే చేతులనే) న్యాసం చేసుకోవాలి. ఈ మొత్తం న్యాసకర్మ సమస్త వాంఛలనూ తీర్చగలదు.
అస్త్రమంత్రం ద్వారా అక్షతలనూ, విష్టరాలనూ (విష్టరాన్నీ) అభిమంత్రితము చేసి ఆ విష్టర ద్వారా యజ్ఞమండలంలోనొక చోట నుంచబడిన సమస్త ద్రవ్యాలనూ స్పృశించాలి.
తరువాత అస్త్రమంత్ర పూత అక్షతలను మండపమంతటా వెదజల్లాలి. తరువాత తూర్పుతో మొదలెట్టి అష్టదిక్కులలోనూ ఈ అక్షతలను నిక్షేపించి సంపూర్ణ యజ్ఞమండలాన్నీ లేపనంతో తుడవాలి.
తరువాత యజ్ఞగురువు ఒక అర్హ్యపాత్రలో గంధాదియుక్త జలాన్ని నింపి దాన్ని మంత్ర సమూహంతో అభిమంత్రించి ఆ జలాన్ని యజ్ఞమండపమంతటా జల్లాలి. తరువాత ఆ రోజు ప్రతిష్టితమవుతున్న దేవతామూర్తి పేర మండప ఈశాన కోణంలో నొక కలశను స్థాపించి దాని దక్షిణభాగంలో అస్త్రమంత్రాలతో అభిమంత్రింపబడిన “వర్ధిని”ని స్థాపించాలి. తరువాత దానినీ, కలశనూ, గ్రహాలనూ, వాస్తోష్పత్తినీ ఆచార్యులు యథావిహిత ఆసనాలపై ప్రతిష్ఠించి పూజించి పలుమార్లు ప్రణవమంత్రాన్ని జపించాలి.
తరువాత ఆ కలశను పంచరత్నాలు అడ్డబడిన రెండు వస్త్రాలతో ఆచ్ఛాదించి, అన్ని ప్రకారాల సుగంధాల పొడినీ, ఔషధాల ముద్దనీ దానికి పూసి మరల ఆ కలశను ఆ రోజు ప్రతిష్ఠింపబడు దేవత యొక్క చిన్న ప్రతిమను అందులో స్థాపించి ఆ మూర్తినీ పూజించాలి.
తరువాత వర్దినిని వస్త్రాలతో కప్పి దానిని కలశతో బాటు అటూ ఇటూ తిప్పాలి.. తరువాత దానిలోని నీటితో కలశను తడిపి ఆ కలశకు ముందరి స్థలంలో దానిని స్థాపించాలి. స్థండిలము పై వీటిని పెట్టి మూలదేవతను కూడా వుంచి పూజించాలి.
వాయవ్యకోణంలో నొక కుండను స్థాపించి గణపతినందులోకి ఆవాహన చేసి ఓం గణానాం త్వేతి…అనే మంత్రంతో ఆయనను పూజించాలి. ఈశాన కోణంలో మరొకఘటాన్ని పెట్టి అందులో ఓం వాస్తోష్పతే… అనే మంత్రంతో ఆయనను రావించి పూజించాలి.
కుంభానికి (కలశ మొదలగు వాటికి) తూర్పువైపున భూతాలకూ గణదేవులకూ బలులిచ్చి వేదిని ”ఆలంభనం” చేయాలి. ఆకుపచ్చని దర్భలను ఓం యోగేయోగేతి… అనే మంత్రంతో సిద్ధం చేసి ఒక స్నానపీఠంపై నుంచి ఆచార్యుడూ, ఋత్విజులూ, యజమానీ కలిసి ప్రతిష్ఠింపబోయే దేవమూర్తిని దానిపై ప్రతిష్ఠించాలి. ఆ సమయంలో ఆ ప్రాంతం వైదిక మంత్రోచ్ఛాటనలతో జయ జయధ్వానాలతో, వైదికమంత్ర ధ్వనులతో మార్మోగిపోవాలి.
స్నానార్థం ఆ దేవతామూర్తిని పీఠసహితంగా బ్రహ్మరథంపై మండపానికి ఈశాన్య కోణంలో అవస్థితం చేయాలి. తరువాత ఓం భద్రం కర్ణేతి… అనే మంత్రం పూర్తిగా పఠిస్తూ స్నానం చేయించి ఆ మూర్తిని యజ్ఞ సూత్రంతోగాని వల్కల వస్త్రంతోగాని శుభ్రంగా తుడిచి తూర్యాది వాద్య యంత్రాలను మ్రోయిస్తూ ఆ దేవతామూర్తికి ”లక్షణోద్ధారం” అనగా నామకరణం చేయాలి..
ఒక కంచు లేదా రాగిపాత్రలో తేనె, నెయ్యిల మిశ్రమాన్ని తయారుచేయించి, అంజనంగా చేసి దానిని బంగరు ముక్క (రేకు) తో తెచ్చి ఆ ప్రతిమ కనులకు పలుమార్లు అంజనమును పూయాలి. ఇలా కాటుక నిడుతున్నపుడు ఓం అగ్నిజ్యోతీతి… అనే మంత్రంతో దేవుని లేదా దేవత నేత్రాలను తుడుస్తుండాలి.
నామకరణాన్ని యజమానియే చేయాలి. ఓం ఇమంమేగాంగేతి… అనే మంత్రంతో మూర్తి నేత్రాలను చల్లబరచి, ఓం అగ్నిర్మూర్ ద్ధతి… అనే మంత్రంతో పుట్ట వంటి శాస్త్రోక్త ప్రదేశాల నుండి తెచ్చి కలిపి వుంచిన మట్టిని దేవతామూర్తికి సమర్పించి మారేడు, చెఱకు, రావి, మట్టి, మోదుగల నుండి తయారుచేయబడిన పంచకషాయమును తెచ్చి దానితో ఓం యజ్ఞా యజ్ఞేతి…. అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి.
పిమ్మట పంచగవ్యాలతో స్నానం చేయించి సహదేవీ, బలా, శతమూలీ, శతావరీ, ఘృత కుమారీ, గుడూచీ, సింహీ, వ్యాఘ్ర అను పేర్లు గల ఔషధులను కలిపిన నీటితో ఓం యా ఓషధీతి… అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. ఆపై ఓం యాః ఫలినీతి… అనే మంత్రం ద్వారా ఫలస్నానం చేయించాలి.
తరువాత ఓం ద్రుపదాదివేతి.. అనే మంత్రంతో విద్వాంసులకు అభ్యంగన చేయించాలి. ఉత్తరాది దిశలలోనాలుగు కలశల నుంచి వాటిలో వివిధ రత్నాలను, సప్తధాన్యాలను, శతపుష్పిక (సోంపు వంటిది) యను పేరు గల ఔషధినీ నిక్షేపించాలి. ఆ పై నాలుగు సముద్రాలనూ, నలుదిక్కుల అధిష్టాన దేవతలనూ వాటిలోకి ఆవాహనం చేయాలి.
నాలుగు కలశలనూ విడివిడిగా, పాలు, పెరుగు, నీళ్ళపాలు, నెయ్యిలో కాస్త జలములతో నింపి ఆ కుంభాలను క్రమంగా ఆప్యాయస్వ… ధధిక్రావ్లో…, యా ఓషధీ…, తేజోసి… అనే మంత్రాలతో అభిమంత్రితం చేసి ఇవే చతుస్సముద్రాలని భావించి వాటితో దేవప్రతిమకు స్నానం చేయించాలి.
తరువాత దేవ ప్రతిమను బహుసుదర వేషభూషలతో అలంకరించి గుగ్గిల ధూపం వేయాలి. తరువాత ఇందాకటి కుంభాలను మంత్రించి వాటిలోకి భూమిపైనున్న సమస్త తీర్థ, నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసి ఓం యా ఓషధీతి… ద్వారా అభిమంత్రించి మరల దేవప్రతిమను అభిషేకించాలి. ఈ అభిషేకావశిష్ట (మిగిలిన జలాలతో స్నానం చేసిన వారికి సర్వపాప విముక్తి లభిస్తుంది.
సర్వసాగరస్నానాన్ని ప్రతిమకు గావించిన తరువాత అర్హ్య ప్రదానం చేసి ఓం గంధద్వారేతి… అనే మంత్రం ద్వారా సుగంధిత చందనాది పదార్థాలతో ప్రతిమను అనులేపితం చేయాలి. శాస్త్రవిహితంగా దేవమూర్తిని న్యాసం చేయాలి.
ఓం ఇమం వస్త్రతి… అనే మంత్రం చదువుతూ మూర్తికి బట్టలు కట్టి ఓం కవి హావితి… అనే మంత్రాన్నుచ్చరిస్తూ దానిని మండపం మీదికి గొని వచ్చి ఓం శంభవాయేతి… మంత్రంతో శయ్యపై స్థాపించాలి. ఓం విశ్వతశ్చక్షు… మంత్రాన్నుచ్చరిస్తూ మొత్తం పూజా విధానాన్ని పరీక్షించుకొని సరి చూసుకోవాలి.
మూల దేవత శిరోభాగంలో రెండు వస్త్రాలచే కప్పబడిన, స్వర్ణయుక్తమైన, ఓంకారముచే పవిత్రీకరింపబడిన కలశను స్థాపించాలి.
తరువాత కలశకు దగ్గరలోనే కూర్చుని, ఆచార్యుడు, వేదమంత్రోచ్చారణ గావిస్తూ అగ్నిని స్థాపించాలి. ఋగ్వేదవేత్తయగు ఆచార్యానుచరుడొకడు (ఋత్విక్కు) తూర్పు వైపున్న కుండ సమీపంలో కూర్చుని శ్రీసూక్తం, పవమానసూక్తం చదవాలి.
కుండం దక్షిణం వైపున్న అథ్వర్యుడు, యజుర్వేదవేత్త, ఆచార్యుడు రుద్రసూక్తాన్నీ పురుషసూక్తాన్నీ పారాయణం చేయాలి. కుండానికి పశ్చిమ వైపున్న సామవేదీయాచార్యుడు వేదవ్రత, వామదేవ్య జ్యేష్ఠ సామ, రథంతర, భేరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికుత్తరం వైపున్న అథర్వవేదవేత్త, అథర్వశిరస్, కుంభసూక్త, నీలరుద్రసూక్త, మైత్ర సూక్తాలను పారాయణం చేయాలి.
అప్పుడాచార్యుడు అస్త్రమంత్రం ద్వారా కుండాన్ని బాగా ప్రోక్షించి స్వశక్తి మేరకు రాగి లేదా ఏ ఇతర ధాతు నిర్మిత పాత్రలో అగ్నిని గ్రహించి దేవతామూర్తి కెదురుగా వుంచాలి. ఆపై అమృతీకరణం చేయాలి. అనగా కవచమంత్రాలతో అగ్నిని రగుల్కొల్పాలి. తరువాత దానిని వేదమంత్రాలు చదువుతూ పాత్రతో సహా కుండానికి నాలుగు వైపులా తిప్పి ఈ మారు వైష్ణవ యోగంతో మరింత రగుల్కొల్పి ఆ పాత్రతో సహా అగ్నిని కుండం మధ్యలో స్థాపించాలి.దక్షిణం వైపు బ్రహ్మనీ, ఉత్తరంలో ప్రణీతాన్ని స్థాపించి నాలుగు దిక్కులలోనూ కుశ విష్టరాలను వెదజల్లి ఒక పరిధి నేర్పాటు చేయాలి.
అప్పుడు గురువు త్రిమూర్తులను పూజించి దర్భలపై అగ్నిని కొంతవుంచి, దర్భజలంతోనే ప్రోక్షణం చేయాలి. ఎందుకంటే దర్భలతో, మంత్ర సహాయం అవసరం లేకుండానే దేనినైనా పవిత్రీకరించవచ్చు. అగ్నిలో వుంచి తీసిపెట్టిన దర్భలపై దేవతలు స్వయంగా వచ్చి కూర్చుంటారు. అగ్నిని ఈలాగున పవిత్రీకరించిన పిమ్మట ఆచార్యుడు ఆజ్య సంస్కారాన్ని చేపట్టాలి.
ముందుగా నేతిని ఆహవయోగ్యం చేసుకోవాలి. అనగా దశల వారీగా ఆవేక్షణ, నిరీక్షణ, నీరాజన, అభిమంత్రణలను చేసి హవనానికి ముందే ”అభిఘారం” అనే యజ్ఞకార్యాన్ని ముగించాలి. తరువాత నేతితో అయిదేసి ఆహుతులను రెండు మార్లివ్వాలి. ఇపుడు అన్ని అగ్ని సంస్కారాలనూ, గర్భాదానం నుండి గోదాన పర్యంతమూ, చేసి ఆచార్యుడు తన వేదశాఖా విహితమంత్రాలతో గాని ప్రణవంతోగాని ఆహుతి ప్రదానం చేయాలి.చివరగా ఆచార్యుడే పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. పూర్ణాహుతి వల్లనే యజమాని కోరికలన్నీ ఈడేరుతాయి.
ఈ విధంగా వేదవిహితంగా ఉత్పన్నమైన అగ్ని అన్ని కార్యాలనూ సిద్ధింపజేయగలదు.
అందువల్ల దానిని మరల పూజించి అన్ని కుండాలలోనూ ప్రతిష్ఠితంచేయాలి. ప్రతి కుండము వద్ద ఋత్విక్కులు వారి వారి శాఖా మంత్రాలతో ఇంద్రాది దేవతలందరికీ నూరేసి ఆహుతులను ప్రదానం చేయాలి. పూర్ణాహుతిని సమర్పించి మరల ఆ దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతినివ్వాలి.
ప్రతిహోత తాను అనుష్టించిన ఆజ్యాహుతుల శేషభాగాన్ని యథావిధిగా కలశలలో సమర్పించాలి. అప్పుడు ఆచార్యుడు దేవతా, మంత్ర, అగ్నిసహితంగా తాదాత్మ్య భావనా పూర్తిగా మరల పూర్ణాహుతినిప్పించాలి.
ఆచార్యుడు యజ్ఞమండలము నుండి పైకి వచ్చి సర్వదేవతలకూ బలులివ్వాలి. భూతాలకూ నాగులకూ కూడా బలులివ్వాలి. నిజానికి తిలలూ, సమిధలూ ఈ రెండింటినే విహిత హోమపదార్థాలంటారు. నెయ్యి ఆ రెండిటికీ సహయోగం చేస్తుంది. దాని ప్రాముఖ్యానికి కారణం అది లేనిదే హవనీయ ద్రవ్యం అక్షయం (సంపూర్ణం) కాలేకపోవడం.
ఈ హవనకృత్యంలో పురుష సూక్తం, రుద్రసూక్తం, జ్యేష్ఠసామం, ”తన్నయామి” మంత్రయుక్త భరుండ సూక్తం, మహామంత్ర రూపంగా ప్రసిద్ధమైన నీలరుద్ర సూక్తం, అథర్వకుంభ సూక్తం యథాక్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ దిక్కులలో ఆసీనులైన ఋత్విజుల చేత పారాయణం చేయబడాలి. ఈ హవనకర్మలో ఒక్కొక్కదానికి సహస్రాహుతులనివ్వాలి.
ఈ ఆహుతులలో వేదమంత్రాలు, దేవతా మంత్రాలు, వేదశాఖల మంత్రాలు, గాయత్రీమంత్రం అన్ని వ్యాహృతులతో ప్రణవ సహితంగా ఘోషింప బడాలి. ఆయా దేవతల యొక్క శిరో, మధ్య, పాద భాగాలకు ఈ ఆహుతులు చేరుతున్నట్టు, కనిపిస్తున్నట్టే భావించుకొని మిక్కిలి ఉత్సాహంతో ఈ కర్మను గావించాలి. చివరగా హోత తానే దేవుడననుకోవాలి.
ఆచార్యుడీ క్రింది మంత్రాలతో దేవ విగ్రహన్యాసాన్ని చేయాలి.
ఓం అగ్నిమీలే (డే)…. ఇరుపాలములు
ఓం ఇషేత్వేతి …..చీలమండలు
ఓం అగ్నఆయాహి ….జంఘలు
ఓం శం నో దేవీ …. మోకాళ్ళు
ఓం బృహద్రథంతర …. తొడలు
ఓం దీర్ఘాయుష్టాయ….. హృదయం
ఓం శ్రీశ్చతే ….. కంఠము
ఓం త్రాతారమింద్ర …. వక్షస్థలం
ఓం త్ర్యంబక….. కన్నులు
ఓం మూర్ ద్ధాభవ… మస్తకం
ఆ మంత్రాలను పూర్తిగా చదువుతున్నంత సేపూ భగవానుని ఈ అంగాలను న్యాసం చేయాలని అర్ధము. ఇక లగ్న ముహూర్తంలో హవనంచేయాలి. తరువాత ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే… అనే మంత్రం చదువుతూ. విగ్రహాన్ని లేపి మంత్రవేత్తయైన ఆచార్యుడు దేవస్యత్వా… అనే మంత్రాన్ని పఠిస్తూ దేవతామూర్తిని పట్టుకొని వేదోక్త పుణ్యాహవాచనాలను ఘోషిస్తూ దేవప్రాసాదానికి అంటే కోవెల చుట్టూ ప్రదక్షిణ చేయాలి.
అపుడు వివిధ రత్న, వివిధ ధాతు, తాలౌహద్రవ్య, యథావిధానంగా అనేక ప్రకారాలు సిద్ధబీజములతో దిక్పాలురకూ అనేక ఇతర దేవతలకూ (ఈ సామగ్రిని చేత బట్టుకొని) ప్రదక్షిణ చేయాలి. అంతట దేవ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలి.
విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గర్భగుడి మధ్యలో అనగా గర్భంలోనే పూర్తిగా ప్రతిష్ఠించ కూడదు. అలాగని గర్భానికి దూరంగానూ కారాదు. నువ్వుగింజంత మొగ్గు ఉత్తరం పుండాలి.
ఓం స్థిరోభవ, శివోభవ, ప్రజాభ్యశ్చనమో నమః, దేవస్యత్వా సవితు:…
మున్నగు మంత్రాలతో ఆచార్యుడు యథావిధిగా విన్యాసాలనూ అభిమంత్రణాన్నీ చేయాలి. శాస్త్ర ప్రకారం సంపాత కలశనేర్పాటు చేసి దాని నుండి పడే జలాలతోనే దేవ ప్రతిమకు నిత్య స్నానం చేయించాలి. ప్రతిష్ట జరిగిన వెంటనే స్నానం చేయించి ధూప దీపాలతో పరిమళ భరిత సుగంధిత ద్రవ్యాలతో ఆ విగ్రహాన్ని పూజించి అర్ఘ్య ప్రదానం చేసి ప్రణామం చేసి నైవేద్యాన్ని పెట్టి క్షమాపన కోరుకోవాలి.
యజమానుడప్పుడు తన శక్తి మేరకు ఋత్విజులందరికీ పాత్రలను, వస్త్రాలను, ఉపవస్త్రాలను, గొడుగులను, విలువైన అందమైన ఉంగరాలను, దక్షిణలను ఇచ్చి సంతుష్ట పఱచాలి. తరువాత సావధానంగా చతుర్థీహోమాన్ని చేయాలి. నూరు ఆహుతులనిచ్చి ఆపై పూర్ణాహుతిని కూడా సమర్పించాలి.
అంతట ఆచార్యుడు మండపం నుండి వెలుపలికి వచ్చి దిక్పాలకులకు బలులిచ్చి పుష్పాలను చేత ధరించి క్షమస్వ అని దేవతలకు విన్నవించుకుంటూ దీక్షా విసర్జన చేయాలి.
ఈ విధంగా యజ్ఞం పూర్తి కాగానే ఆచార్యునికి కపిలధేనువు, ముకుటం, కుండలం, ఛత్రం, కేయూరం, కటి సూత్రం, వ్యజనం (పంఖా), వస్త్రాది వస్తువులు, గ్రామం, అలంకృత భవనం వీటన్నిటినీ దానం చేయాలి. ఆనాడు అక్కడున్న వారందరికీ మంచి భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన యజమాని కృతార్థుడౌతాడు. వాస్తుదేవుని ప్రసన్నత వల్ల ఆయనకు ముక్తి కూడా ప్రాప్తిస్తుంది.
ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹