వరాహాద్యవతార వర్ణనము
అగ్ని ఉవాచ :-
పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను.
యజ్ఞస్వరూపుడగు విష్ణువును దేవతలందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకుడైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకరమగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను
హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను
విష్ణువు దేవతాసమేతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.
పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.
విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడుగా జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను.
బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు వరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో ” నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను ” అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను, ”మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను”. బలి ”అట్లె ఇచ్చెదను” అని పలికెను.
దానజలము చేతిలో పడగానే వామనుడు ఆ వామనుడు (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని రసాతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితుడగు ఇంద్రుడు హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.
ఓ బ్రాహ్మడా ! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్దతులుగా ఉన్నారని తలచి, భూభారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతిని నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్ర విద్యాపారంగతుడైన భార్గవుడుగా (పరశురాముడుగా) ఆవతరించినాడు.
కార్తవీర్యుడను రాజు దత్తత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.
అరణ్యములో అలసిన సేనాసమేతుడైన ఆ రాజును జమదగ్ని మహర్షి నిమంత్రించి కామధేనవు ప్రభావముచేత భోజనము పెట్టెను.
కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తనకిమ్మని కోరెను. జమదగ్ని ఈయనిరాకరించెను. ఆపుడాతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్దములో పరశువుచే అతని శిరస్సు ఛేదించి సంహరించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.
పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరమువలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతముపై నివసించెను.
కూర్మ, వరాహ, నరసింహ, వామన పరశురామావతార గాథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును.
అగ్ని మహా పురాణములో వరాహ నృసింహా వామన పరశురామ అవతార మనెడు చతుర్థాధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹