శనిగ్రహ జననం మూడవ భాగము
“ఛాయా ! నువ్వు నా ప్రతిబింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన – అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి ! రక్తగతం కావాలి !” అంది సంజ్ఞ.
“ఒక్కసారి వింటే చాలు… అవి నాకు రక్తగతం అయిపోతాయి !” ఛాయ నవ్వుతూ అంది.
తనలాగే తక్షణం ప్రతిస్పందిస్తూ , సూటిగా మాట్లాడుతున్న ఛాయను తృప్తిగా చూస్తూ ఇలా అంది సంజ్ఞ.
“నేను విశ్వకర్మ కుమార్తెను. ఆయన వసుపుత్రుడు , దేవశిల్పి…” సంజ్ఞ పరిచయ ప్రసంగం ప్రారంభించింది.
“నువ్వు కాదు , సంజ్ఞ నేను !” ఛాయ అడ్డు తగుల్తూ, చిరునవ్వుతో అంది. “నేను విశ్వకర్మ పుత్రికను ! నాకు సంబంధించిన విషయాలు చెప్పు !”
సంజ్ఞ అర్థం చేసుకున్నట్లు నవ్వింది. “నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతీ , అది దంపతుల పుత్రుడు సూర్యునికి కన్యాదానం చేశారు. నీకు , నీ భర్త సూర్యుడి వల్ల వైవస్వతుడూ , యముడూ అనే ఇద్దరు కుమారులూ , ”యమి” అనే కుమార్తె కలిగారు. నీ భర్త శరీరం నుండి నిరంతరం వెలువడే వేడినీ , వెల్తురునీ భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్ధమవుతోంది కదా !”
ఛాయ నవ్వింది. “సందేహానికి అవకాశం లేకుండా ! అంటే నువ్వు వెళ్ళావని భావం. సరే… చెప్పు !”
“ఆయన వేడిమినీ , వెలుగునూ తట్టుకోవడానికి అవసరమైన మానసిక శక్తినీ , శారీరక సంసిద్ధతనూ సమకూర్చుకుని , సూర్యమందిరానికి తిరిగి వెళ్తున్నావు !”
“వెళ్ళి , నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ , నీ బిడ్డలను నా బిడ్డలలాగే చూసుకుంటాను !” ఛాయ నవ్వింది.
“ఏకాంతంలో ఆయనతో ఏ విధంగా మసలుకోవాలో నీకు వివరిస్తాను ! తదనంతరం నువ్వు సూర్య మందిరానికి వెళ్ళు !” అంటూ చెప్పసాగింది సంజ్ఞ….
“సంజ్ఞా !” ద్వారం ముందు నిలుచున్న ఛాయను చూడగానే ఆశ్చర్యానందాలతో అన్నాడు సూర్యుడు.
“స్వామీ !” ఛాయ అప్రయత్నంగా అంది , సంజ్ఞ బోధించిన నటనావిన్యాసాన్ని గుర్తుచేసుకుంటూ.
“నువ్వు వెళ్ళిపోయాక మందిరం కాంతి విహీనం అయిపోయింది , సంజ్ఞా !” సూర్యుడు ఆమె వైపు అడుగులు వేస్తూ అన్నాడు.
ఛాయ చిరునవ్వుని బలవంతాన ఆపుకుంది. నిజంగా సూర్యుడు అమాయకుడే ! కాంతి ఆయన ఆస్తి ! సంజ్ఞ వెళ్ళిపోయాక మందిరంలో కాంతి మాయమైందట !
“మీ కోసం , నా బిడ్డల కోసం వచ్చేశాను స్వామీ…” ఛాయ భావస్ఫోరకంగా అంది. “మీ కోసం… పూర్తిగా , పూర్తిగా మారిపోయి , నూతనంగా వచ్చాను స్వామీ !”
“నిజంగా !” సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆశగా ఆమెనే చూస్తూ రెండు చేతుల్నీ ఎడంగా చాచాడు. ఛాయ వేగంగా వచ్చి , ఆయన చేతుల మధ్య ఇమిడి పోయింది. సూర్యుడిలోని అనురాగం ఆమెను దగ్గరగా తీసుకుంది. తన్మయత్వంతో ఉండిపోయాడు సూర్యుడు ! ఔను ! సంజ్ఞ తాను చెప్పినట్టు తనను పరివర్తింపజేసుకుని , సర్వసిద్ధంగా తన లోగిలిలోకి , తన కౌగిలిలోకి తిరిగి వచ్చింది. తన వేడిమినీ , వెలుగునూ భరించే శక్తిని సమీకరించుకుని వచ్చింది. అందుకే తన గాఢపరిష్వంగంలో ఆమె శరీరం కంపిస్తోంది.
“సంజ్ఞా !” సూర్యుడు తన ఛాతీ మీద ఆనిన ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు.
“స్వా… మీ…”
“ఇంక ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకూడదు !’
“…అలాగే…”
“ఇంకెప్పుడూ నాకు ‘దగ్గరగా ఉంటూ, దూరంగా ఉండకూడదు !” సూర్యుడి కంఠంలో భావోద్వేగం వణికింది.
ఛాయ సూర్యుణ్ణి చుట్టిన తన చేతులతో ఆయనకు సమాధానం చెప్పింది. “అమ్మా !” చిన్న బాలిక పిలుపు ఛాయను హెచ్చరించింది. యమి పిలుపు ఛాయా సూర్యుల్ని విడదీసి దూర దూరంగా జరిపింది.
యమి వాళ్ళ వైపు పరుగెట్టుకు వస్తోంది.
“అమ్మా !” రెండు కంఠాలు ఒకేసారి పిలిచాయి. యమిని దగ్గరకు తీసుకుంటూ , చూసింది ఛాయ. వైవస్వతుడూ , యముడూ నవ్వుతో అమ్మను చూస్తున్న ఆనందంతో , వికసిస్తున్న ముఖాలతో వేగంగా వస్తున్నారు.
“ఛాయా ! నా భర్తని నీ భర్తగా చూసుకున్నట్టే , నా బిడ్డల్ని నీ బిడ్డలుగా జాగ్రత్తగా , ప్రేమగా , భద్రంగా చూసుకోవాలేం !” సంజ్ఞ పదేపదే చెప్పిన మాట ఛాయ చెవుల్లో గింగురుమంది.
సూర్యుడి సాహచర్యమనే అదృష్టాన్ని అందిచ్చిన అక్క సంజ్ఞను తలచుకుంటూ ఛాయ ముగ్గురు పిల్లల్నీ ఒకేసారి దగ్గరగా తీసుకొని , ముగ్గురి బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.
కాలం గడిచిపోతోంది. ఛాయ సంజ్ఞ పాత్రలో పూర్తిగా లీనమైపోయింది. సూర్యుణ్ణి తన భర్తగా స్వీకరించి , అతనితో సుఖిస్తూ , సంజ్ఞ సంతానాన్ని తన సంతానంగా చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండిపోయింది. సూర్యుడు ప్రస్తుత సంజ్ఞ , సత్య సంజ్ఞ కాదనీ , ఛాయ అనీ లేశమాత్రం కూడా సందేహించకుండా ఆనందంగా ఉన్నాడు.
ఇలా ఉండగా – నారదుడు శ్రీమహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. లక్ష్మీ విష్ణువులకు వందనాలు అర్పించాడు.
“నారదా , నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. సంకల్పం కలిగింది ; సన్నిధికి వచ్చావు !” అన్నాడు శ్రీమహావిష్ణువు నవ్వుతూ.
“నారాయణ ! నేను రావాలని మీరనుకున్నారు. అందుకేనేమో రావాలని నాకు అనిపించింది !” నారదుడు నవ్వాడు.
“ఎవరికైనా , ఏదైనా వర్తమానం అందజేయాలా , స్వామీ?”
“నవగ్రహాలలో సప్తమ గ్రహం జన్మించాలి కదా ! నువ్వు కల్పించుకుంటే గానీ సంకల్పం ఫలించేలా లేదు సుమా !” విష్ణువు నవ్వుతూ అన్నాడు.
“నారాయణ ! నారాయణ ! మీరు సంకల్పిస్తే , మరొకరు కల్పించుకోవడం దేనికి ? వృధా ప్రయాస !”
“లేదు నారదా ! నువ్వు కల్పించుకోవాలి. సప్తమ గ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాలి” అన్నాడు విష్ణువు.
“సూర్య పుత్రుడిగానా ? ఇప్పటికే సూర్యుడికి ఇద్దరు పుత్రులున్నారుగా… నారాయణా !”
“ఆ ఇద్దరూ సూర్యుడికి భార్య వల్ల కలిగిన పుత్రులు నారదా ! మన ఏడవ గ్రహం భార్య కాని భార్య ద్వారా సూర్యుడికి జన్మించాలి !” శ్రీహరి వివరించాడు.
“నారాయణ ! భార్య కాని భార్యకా ?” నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు.
“సూర్యుడి శరీర ఉష్టాన్నీ , కాంతినీ భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ”ఛాయ” అనే నామధేయంతో మందిరానికి పంపింది. ఛాయ సూర్యుడికి పత్నిగా , సంజ్ఞ సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తోంది. సంజ్ఞ బిడ్డల పోషణలో పూర్తిగా లీనమై పోయిన ”ఛాయ”కు తల్లి కావాలన్న తలంపే లేదు ! నువ్వు సూర్యమందిరానికి వెళ్ళి , ఆమెకూ స్వీయ సంతతి ఉండాలని రెచ్చగొట్టు. సూర్యుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందమంటూ ప్రేరేపించు. తద్వారా మన నవగ్రహాలలోని సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు !”
“ఆజ్ఞ ! కానీ… చిన్న సందేహం. సంజ్ఞ ఏమైంది ? పుట్టినిల్లు చేరిందా ?” నారదుడు అడిగాడు.
“లేదు ! పుట్టినింటికి వెళ్తే రహస్యం బట్టబయలు కాదా ? సంజ్ఞ అరణ్యంలో తపస్సులో మునిగిపోయిందిలే ! నువ్వు వెళ్ళు – సూర్య మందిరానికి !” అన్నాడు శ్రీమహావిష్ణువు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹