శ్రీరామావతార వర్ణనము
అగ్ని ఉవాచ :-
దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నారదుడు వాల్మీకికి చెప్పన విధమున చెప్పెదను.
విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వైవస్వతమనువును అతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కాకుత్సుడు పుట్టెను. కాకుత్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను.
శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్యయందు రాముడుగను కైకేయి యందు భరతుడుగను, సుమిత్ర యందు లక్ష్మణ శత్రుఘ్నలుగను జనించెను. బుష్యశృంగుని సహాయముచే యజ్ఞమునందు లభించిన పాయసమును కౌసల్యాదుల కీయగా, వారు దానిని భుజింపగా, తండ్రితో సమానులైన రామాదులు జనించిరి.
విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిఘ్నములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను.
తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందును. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను.
సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.
శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.
రాముడు ధనస్సును ఎక్కుపెట్టి దానిని సునాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, ఆమోనిజయు అగు తన కన్యయైన సీతను రామునకిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ, శృతకీర్తులను భరత శత్రఘ్నులు వివాహమాడిరి.
ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే రామాయణ బాలకాండ వర్ణనం నామ పంచమాధ్యాయః
ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వశిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి ఆయోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.
శ్రీ అగ్ని మహాపురాణమునందు రామాయణ బాలకాండ వర్ణన పంచమాధ్యయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹