దానధర్మం – దేవతోపాసన
సత్పాత్రులకు శ్రద్ధా పూర్వకంగా సంతోషంగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానం ”ఇక్కడ” సుఖభోగాలనూ ”అక్కడ” మోక్షాన్నీ కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే, ఎవరైనా, న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం వుంటుంది.
అధ్యాపనం(చదువు చెప్పుట) యాజనం, ప్రతిగ్రహం ఈ మూడూ బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్నిగాని విద్యను గానీ సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చెయ్యాలి. దానమనేది నాలుగు ప్రకారాలు. నిత్య, నైమిత్తిక, కామ్య, విమల.
ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజూ చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదాన మంటారు.
దైవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమలదానం. ఇది కల్యాణకారి. చెఱకు లేదా యవ లేదా గోధుమ లేదా వరి పంటతో నిండి వుండి సస్యశ్యామలమైన భూమిని వేదవిదులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే వుండదు. భూదానాన్ని మించిన దానం లేదు, వుండదు.
బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినమూ శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది.
వైశాఖ పున్నమినాడు ఉపవాసముండి అయిదుగురుగాని ఏడుగురుగాని బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపరిచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రం ద్వారా పూజించినవారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్ క్షణమే నశిస్తాయి.
ప్రీయతాం ధర్మరాజేతి యథామనసి వర్తతే ||
ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే.
అలాగే కృష్ణమృగచర్మంపై బంగారంతో బాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలూ నశిస్తాయి.
వైశాఖమాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి.
ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకలపాప వినాశకుడైన విష్ణుభగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్నవారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకొని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలనుపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే భోజనాదులచే దానంచే సంతృప్తిపరిస్తే ఆయా దేవీమతల్లులు ప్రసన్నులవుతారు.
“సంతానాన్ని కోరుకొనేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మ వర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో బ్రహ్మదేవుని ఆపాదించుకొని వారిని పూజాదానాలతో తృప్తి పరచాలి. ఆరోగ్యం కావాలనుకొనేవారు. ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే ”ధనానికి అగ్నినీ, కార్యసిద్ధికి వినాయకునీ, భోగానికి చంద్రునీ, బలప్రాప్తికి వాయుదేవునీ, మోక్షానికి హరినీ పూజించాలి.
ఇంకా ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు.
వారిదస్తృప్తి మా ప్నోతి సుఖమక్షయ మన్నదః ||
తిలప్రదః ప్రజామిష్టాం దీపదశ్చక్షురుత్తమం ||
భూమిదః సర్వమాప్నోతి దీర్ఘమాయు ర్హిరణ్యదః ||
గృహదోఒ.గ్ర్యాణి వేశ్మాని రూప్యదోరూపముత్తమo||
మరికొన్ని దానాల ఫలాలిలా ఉంటాయి.
వస్త్రదానం – చంద్రలోకం
అశ్వదానం – అశ్వనీ కుమారలోకం,
అనదుహదానం(ఎద్దు) – విపులసంపత్తి
గోదానం – సూర్య లోకం,
వాహనం, శయ్య – భార్య, అభయం,
ధాన్యదానం – శాశ్వతసుఖం,
వేదదానం (చదివించడం) – బ్రహ్మసాన్నిధ్యం,
జ్ఞానోపదేశం – స్వర్గలోకం,
అగ్నికోసం కట్టెల దానం – గొప్ప తేజస్సు,
రోగపీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వతారోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. అసిపత్రవనం నరకానికి వెళ్ళే మార్గంలో వున్న ముళ్ళ అడవి. ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులూ, గొడుగులూ విరాళంగా దానం చేసినవారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధా కలగదు.
‘ఉత్తరాయణం,’ దక్షిణాయనం మహావిషువత్కాలం, సూర్య చంద్ర గ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినపుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుభాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది.
దానధర్మము కంటే శ్రేష్ఠమైన ధర్మము లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకొనేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరవు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ, తన దగ్గర అన్నీ పుష్కలంగా వున్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది.
ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹