ప్రాయశ్చిత్తాలు
బ్రాహ్మణుని చంపుట (బ్రహ్మహత్య) , తాగుబోతూ, దొంతనం, గురుపత్నితో రమించు, ఈ నాలుగు రకాలవారూ మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు అయిదో రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసిన కర్మకాండయే ప్రాయశ్చిత్తం.
బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో పన్నెండు సంవత్సరాలుండాలి లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి.
అలా కాకుంటే అగ్నిజ్వాలలలో ప్రవేశించి గానీ అగాధ జలాల్లోకి దూకిగానీ ప్రాణ పరిత్యాగం చెయ్యాలి. గోవును గానీ బ్రాహ్మణుని గానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.
అశ్వమేధయాగాంతంలో చేసెడి అవబృథ స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిదుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్నీ దానం చేసి వనవాసానికి పోవడం వల్లనూ, త్రివేణీ సంగమంలో మూడురాత్రులు ఉపవాసముండి రోజుకి మూడుమార్లు స్నానం చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లనూ, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్ళ పాటు రోజుకి ముమ్మారు స్నానం చేయడం వల్లనూ కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింప బడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలో కూడా.
మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని గాని పాలు, నెయ్యి. గోమూత్రాలను గాని సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయడం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆపానసంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు.
రాజదండన వుంటే యమదండన వుండదంటారు కదా! ఈ నానుడి స్వర్ణచోరుని శ్రీ విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికి పోయినవాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది.
గురుపత్నీగమనం చేసినవాడు తనంత పొడవే వున్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో వుంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దాని సర్వాంగాలూ. తగిలేలాగా గాఢంగా కౌగలించుకోవాలి; లేదా బ్రహ్మహత్యా పాతకనాశక ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి; లేదా నాలుగైదుమార్లు చాంద్రాయణవ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోరపాపము నుండి విముక్తుడు కాగలడు.
మహాపాతకుల తోడి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహా పాతకానికి చెప్పబడిన సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయశ్చిత్తాన్నే వాడూ చేసుకోవాలి; లేదా తనకున్న సర్వస్వాన్నీ దానమిచ్చేయాలి; లేదా చాంద్రాయణ, అతికృచ్చవ్రతాలను చేయాలి.
గయ మున్నగు పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం, ప్రతి అమావాస్యనాడూ శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టడం ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలను నశింపజేసుకోవచ్చు..
ప్రతి కృష్ణ చతుర్దశినాడూ ఒక సంవత్సరం పాటు ఉపవాసముండి ప్రశాంతచిత్తులై పవిత్రనదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామమంత్రాలనుచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికీ ఏడేసి తిలలతో జలాంజలులతో కూడిన తర్పణలివ్వడం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు.
ఈ వ్రతాలను చేస్తున్నంత కాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసముంటూ బ్రాహ్మణులను పూజిస్తూవుండాలి.
కార్తిక శుద్ధషష్టినాడు ఉపవాసం చేసి సప్తమినాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలూ నశిస్తాయి.
ప్రతిశుద్ధ ఏకాదశినాడు. నిరాహారంగా వుండి ద్వాదశినాడు విష్ణుభగవానుని పూజ చేస్తే ఒక ఏడాదిలోపలే అన్ని మహాపాపాలూ నశిస్తాయి.
సూర్య,చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవతార్చన, బ్రాహ్మణ పూజనంలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి. ఎన్ని పాపాలు చేసినవాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్ధంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి.
(ఇక్కడ సతీసహగమనం గూర్చి చెప్పబడింది. పరిహరించబడింది)
పతివ్రతయై, పతిసేవ, శుశ్రూషలలో దత్తచిత్తయై వుండే స్త్రీని ఏ పాపమూ అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది.
సంయతచిత్తులై తీర్ధస్నానాలు చేస్తూ వ్రతాల నాచరిస్తూ, బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప ముక్తులై ఉత్తమగతులను పొందుతారు.
ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹