రాహుగ్రహ జననం
కశ్యప పత్నులు – అదితీ , దితి , దనూ , వినత , కద్రువ , సింహిక , కాల మొదలైన వాళ్ళు ఆశ్రమంలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు.
“మనందరం తల్లులమయ్యాం కానీ , సింహిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు !” అంది దను.
“ఎలా కలుగుతారు దనూ , దానికి పిల్లలు ? మన సింహిక మరీ నెమ్మది ! సంతానం. కరుణించమని మన అదితిలాగా దేవుణ్ణి అడగదు ! మనలాగా పతి దేవుణ్ణి అడగదు !” దితి నవ్వుతూ అంది.
దితి మాటలకు అందరూ నవ్వారు.
“సరే ! ఆ మాత్రం నేనూ అడగగలను. ఎవర్ని అడగాలో చెప్పండి. అడిగి పిల్లల్ని కని , నా శక్తి చూపిస్తాను !” సింహిక ఆవేశంగా అంది. “చెప్పండి ! ఎవర్ని అడగాలి ? దేవుణ్ణా ? లేక పతి దేవుణ్ణా ?”
“ఆ దేవుణ్ణి ప్రార్థించినా , ‘పతి దేవుణ్ణి ప్రార్థించు సాధ్వీ’ అంటాడు. కాబట్టి కనిపించే దేవుడూ , కరుణించే దేవుడూ పతి దేవుడు ఉన్నారుగా ! ఆయన్నే అడుగు !” కాల నవ్వుతూ అంది.
అందరూ నవ్వారు. చిరునవ్వు నవ్వుతూ అదితి సింహికతో ఇలా అంది. “మన పతిదేవుడు మహా తపశ్శక్తి సంపన్నులు. భగవంతుడిని ప్రార్థించే అవసరం ఉంటే ఆయనే చెప్తారు. ఆయననే అర్థించు , సింహికా ! నీకు మాతృత్వం సిద్ధిస్తుంది !”.
కశ్యప ప్రజాపతి నదీతీరంలో చెట్టు క్రింద ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. సింహిక వచ్చి , ఆయన ముందు కూర్చుంది. కశ్యప ప్రజాపతి నిమీలిత నేత్రాలతో సమాధిలో ఉన్నాడు.
సింహిక కొన్నిక్షణాల పాటు ఆయన ధ్యానం ముగించడం కోసం నిరీక్షిస్తూ కూర్చుంది.
“స్వామీ !” అంది , ఇంకా వేచి చూసే ఓపిక నశించిన సింహిక.
కశ్యప మహర్షి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. సింహికను ప్రశ్నార్థకంగా చూశాయి.
“సింహికా ! ఏమిటి ఇలా వచ్చావు ?” కశ్యపుడు అడిగాడు.
“మిమ్మల్ని… మిమ్మల్ని…వరం కోరటానికి వచ్చాను…” అంది సింహిక కొద్దిగా తడబడుతూ.
“వరమా ?” కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు.
“ఇవ్వాలి , తప్పకుండా ! ఇస్తారా ?” .
“ఇస్తాను , సింహికా అడుగు !” కశ్యపుడు నవ్వాడు.
“నాకు… నాకు… పుత్రుడు కావాలి…”
“కోరదగిన కోరికే !” కశ్యపుడు నవ్వాడు.
“నా పుత్రుడు మహాశక్తిమంతుడై ఉండాలి ! మహా బలశాలి అయి ఉండాలి ! చూడగానే అందరూ భయపడేలా భీకరంగా ఉండాలి !” సింహిక ఉత్సాహంగా అంది.
“భీకరంగా ఉండాలా ? ఎందుకు సింహికా ? మళ్ళీ ఆలోచించుకొని , అడుగు !”
కశ్యపుడు సూచించాడు. “మళ్ళీ ఆలోచించను ! మళ్ళీ అడగను ! నాకు భయం గొలిపే భీకరాకారుడైన పుత్రుణ్ణి ఇవ్వండి !” సింహిక మొండిగా అంది.
“సరే… ఇలా దగ్గరగా రా !” అన్నాడు కశ్యపుడు. సింహిక అతని దగ్గరగా జరిగింది.
కశ్యపుడు తన హస్తాన్ని ఆమె శిరస్సు మీద ఉంచాడు. “వరమిస్తున్నాను ! నువ్వు కోరిన పుత్రుడు త్వరలో నీ ఒడిలో ఆడుకుంటాడు !”
సింహిక గర్భవతి అయింది. ఆ శుభవార్తని ఆనందంగా అక్కచెల్లెళ్లందరికీ చెప్పింది.
“సింహిక తల్లికాబోతోంది , స్వామీ !” అంది అదితి కశ్యప ప్రజాపతితో. “సంతానం కోసం తహతహలాడిపోయింది. పాపం ! చక్కటి కొడుకు కలగాలని దీవించారు కదా !”
కశ్యపుడు నవ్వాడు. “నీ చెల్లెలు చూడచక్కని కొడుకు కావాలనలేదు. చూడగానే భయం కలిగించే వికారరూపుడు కావాలంది. అడగరాని వరాన్ని అడగరాని సమయంలో అడిగింది , సింహిక , మండే అగ్నిలాంటి ముఖంతో , భయభ్రాంతుల్ని చేసే బాలుడు ఆమెకు జన్మిస్తాడు !”
“అయ్యో… అలాగా…” అదితి నిరుత్సాహంతో అంది.
“సింహిక కోరికకు మూలకారణం దైవేచ్ఛ అని నాకు అనిపిస్తోంది ! విచారించాల్సిన అవసరం లేదు !” అన్నాడు కశ్యపుడు తేలిగ్గా.
సింహికకు నవమాసాలు నిండాయి. సకాలంలో ఆమె ఎర్రటి దేహకాంతితో ధగధగలాడే బాలుణ్ణి ప్రసవించింది.
సింహికా తనయుడి బారసాలకు దక్ష దంపతులతో బాటు , ఇంద్రాదులూ , నారదుడూ , బ్రహ్మ దేవుడూ విచ్చేశారు.
బాలుడి ఆవిర్భావ కారణాన్ని బ్రహ్మ కశ్యపుడికి వివరించాడు. నవగ్రహాలలో ”ఒకడుగా నెలకొనడానికీ , పూజలు అందుకుని , ప్రాణుల మీద తన ప్రభావం చూపడానికీ జన్మించాడనీ , సుశిక్షితుడిగా రూపొందించమనీ చెప్పాడు.
“భవిష్యత్తులో బాలకుడు పరిగ్రహిస్తాడు ; పరిత్యజిస్తాడు. త్యజించడం అతని లక్షణంగా ప్రాచుర్యం పొందుతాడు. ఆ కారణంగా బాలుడికి ”రాహువు” అని నామకరణం చేయి !” అన్నాడు బ్రహ్మ.
బ్రహ్మదేవుడి ఆనతిని పాటిస్తూ కశ్యప ప్రజాపతి సింహిక కుమారుడికి ”రాహువు’’ అని పేరు పెట్టాడు.
కశ్యపాశ్రమంలో , తల్లి సింహిక పోషణలో , మిగిలిన పండ్రెండుగురు తల్లుల పాలనలో రాహువు వృద్ధి చెందుతున్నాడు. కశ్యపుడు సకాలంలో రాహువుకు విద్యాబోధన ప్రారంభించాడు.
“ఇప్పటి దాకా మీరు ఎనిమిది గ్రహాల జన్మ గాథలు విన్నారు. ఇక , తొమ్మిదవ గ్రహమైన కేతువు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం…” నిర్వికల్పానంద ఉపోద్ఘాతం. రూపంలో అన్నాడు.
“గురువుగారూ , రాహువు గురించీ , కేతువు గురించీ ఎవరు ఏది చెప్పినా – ఆ ఇద్దరికీ అతి సమీప సంబంధం ఉన్నట్టుగా తోస్తూ ఉంటుంది. రాహువు లాగే కేతువు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడేనా ?” విమలానందుడు అడిగాడు.
“అడగాల్సిన ప్రశ్నే అడిగావు విమలానందా ! అయితే దీనికి ఇదమిత్థంగా అవునని కానీ , కాదని గానీ సమాధానం చెప్పలేం. ఎందుకంటే కేతుజననం గురించి పురాణాల్లో , ఇతిహాసాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కశ్యప ప్రజాపతి కుమారుడుగా ఆయన పత్ని దనూదేవికి ”కేతుమంతుడు” అనే కుమారుడు జన్మించాడు. మహాభారత కాలంలో ఆ కేతుమంతుడే ”అమితౌజుడు”గా జన్మించాడని చెప్పబడింది. దనూ కశ్యప దంపతుల పుత్రుడైన కేతుమందుడే ”కేతుగ్రహం” అనే భావన కూడా ఉంది. అందుకే రాహు కేతువులు సోదరులుగా కలిసి మెలిసి ఉండేవారనీ అనుకోవడం జరిగింది.
“అయితే అష్టాదశ పురాణాలలో ఒకటైన విష్ణు ధర్మోత్తర పురాణంలో కేతువు గురించి ఐతిహ్యం మరొక విధంగా ఉంది. ఆ పురాణం ప్రకారం – బ్రహ్మదేవుడు మృత్యు దేవతను సృష్టించాడు. భూభారం తగ్గడానికి వీలుగా ప్రాణుల్ని సంహరించ మంటాడు. ఆమె తిరస్కరించి రోదిస్తుంది. వేడిగా నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు పతాకాకారంలో అగ్నికీలగా వెలువడుతుంది. తద్వారా కేతువు పుట్టాడు. కేతువుగా , ధూమకేతువుగా ఉంటాడని బ్రహ్మ శాసిస్తాడు…”.
నిర్వికల్పానంద శిష్యులకు అర్ధం కావడానికన్నట్టు ఆగాడు.
“కేతువు జన్మ వృత్తాంతంలో మరొక అంశాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. అది క్షీరసాగర మథనం తర్వాత మోహిని ద్వారా దేవ దానవులకు జరిగిన అమృత వితరణ సన్నివేశం. ఆ సన్నివేశంలో రాహువు ఒక్కడే దేవతగా మారు వేషంలో అమృతం స్వీకరించినట్టు వర్ణించబడింది.
“స్కంద మహాపురాణంలో మరో విధంగా ఉంది.
‘తదా రాహుశ్చ కేతుశ్చ ద్వావేత దైత్య పుంగవౌ ,
దేవానాం రూపమాస్థాయ అమృతార్ధం త్వరాన్వితా
ఉపవిష్ణా తదా పంక్త్యాం దేవానామమృతార్ధినౌ”
అంటే రాహువు , కేతువూ అనే దైత్యపుంగవులు అమృతం కోసం దేవతల రూపాలు ధరించి , దేవతల పంక్తిలో కూర్చున్నారు – అని అర్థం…”
“అలా అయితే ఏ అభిప్రాయాన్ని మనం స్వీకరించాలి, గురువు గారూ ?” చిదానందుడు అడిగాడు.
“ఏదైనా తీసుకోవచ్చు !” శివానందుడు తేలిగ్గా అన్నాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. “ఆ అభిప్రాయం సరైంది కాదు , శివానందా ! – నీకు నచ్చిన ప్రతిపాదనను నువ్వూ , చిదానందుడికి నచ్చింది అతనూ స్వీకరిస్తే – విషయంలో అభిప్రాయభేదం శాశ్వతంగా ఉండిపోతుంది. సూక్ష్మంగా ఆలోచించి , పురాణాలలోని భిన్నమైన ప్రతిపాదనల మధ్య సమన్వయం సాధించి , ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించాలి. ఆ ప్రతిపాదన యుగయుగాలుగా వేళ్ళు తన్నిన విశ్వాసానికి విఘాతం కలిగించకుండా ఉండాలి. మనం ”కేతువు” జన్మవృత్తాంతంలో ఆ సమన్వయ పద్ధతిని పాటించి , రెండు అభిప్రాయాలనూ కలిపి , ఒక్కటిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం !”.
“బాగుంది గురువుగారూ… మీరన్న ఆ సమన్వయాన్ని ఎలా సాధిస్తారు ?” విమలానందుడు అడిగాడు.
“ఎలా సాధించగలమో ప్రత్యేకంగా వివరించకుండా కేతువుకు అటు కశ్యప ప్రజాపతితోనూ , ఇటు మృత్యువుతోనూ సంబంధం కొనసాగిస్తూ ఆయన జన్మ – వృత్తాంతం చెప్పుకుందాం… వినండి. ఒకప్పుడు ప్రాణులకు మరణాలు లేని కారణంగా భూభారం అమితంగా పెరిగిపోయింది. భూదేవి ప్రమాదాన్ని శంకించింది…” నిర్వికల్పానందం ప్రారంభించాడు.
రేపటి నుండి కేతుగ్రహ జననం ప్రారంభం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹