Skip to content Skip to footer

🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం 🌹🌹 – ఎనిమిదవ అధ్యాయము

కిష్కిందా కాండ వర్ణనము

నారద ఉవాచ

రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రునిగా చేసికొనెను.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను.

ఆతని సోదరుడును, వైరము చేయుటచే శత్రవు ఆగు వాలిని చంపి ఋశ్యమూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానరరాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. సుగ్రీవుడు ఇట్లు పలికెను. ”రామా! నీకు సీత లభించు నట్లు చేసెదను.

రాముడు ఆ మాటలు విని మాల్య పర్వతముపై వర్షాకాలము నాలుగు మానములను గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా లక్ష్మణుడు రాముడు చెప్పిన విధమున ఆతనితో ఇట్లు చెప్పెను. ”నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వారి మార్గమును అనుసరించకుము”.

వానరాధిపతి యైన సుగ్రీవుడు ”కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించ జాలకపోతిని” అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు పలికెను.

వానురరులనందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణమ నిమిత్తమై పంపగలను. వారు తూర్పుదిక్కు మొదలైన దిక్కులందు సీతను మానములోపున అన్వేషించవలెను. మాసము దాటినచో వారిని చంపెదను.

ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.


హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానరసమేతుడై దక్షిణ దిక్కునందు సూర్యప్రభ గుహ సమీపమున అన్వేషించెను.

మాసము దాటిన తరువాత కూడ వింధ్యపర్వతమునందు ఉండి సీతను చూడజాలని ఆ వానరులు ఇట్లు అనుకొనిరి. ”మనమందరము వ్యర్థముగా మరణించనున్నాము. యుద్దమునందు రావణునిచే చంపబడి, సీత నిమత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!”

ఆ మాటలు విని సంపాతి వానరులును భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నాసోదరుడు , నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. అతనిని నేను సూర్యుని వేడిమినుండి రక్షించగా భూమి పై పడెను. ఆకాశముపైనున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రమున,. త్రికూట పర్వతముపై నున్న లంకాపట్టణమునందు అశోకవనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు.

అగ్ని మహాపురాణమునందు రామాయణ కథలో కిష్కింద కాండ వర్ణనమును అష్టమాధ్యమాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment