Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ముప్పై ఏడవ అధ్యాయం

నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు

నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహభాషణం (శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే) కొనసాగుతోంది.

“మునులారా! విష్ణుభగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము.

పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద (నంద), నీల, శంఖ అనేవి అఫ్ఘనిధులు. మిశ్ర అను తొమ్మిదవ నిధితో కలసి ఇవి నవనిధులైనాయి.

మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి వున్న వానికెటువంటి లక్షణాలుంటాయో చూద్దాం..

పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడూ, దయగలవాడూ, అయివుంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువ గల ధాతువులను సంపాదించి యతులకూ, దేవతలకూ, యాజ్ఞికులకూ వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్వికులు.

మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లపుడూ యుద్ధతత్పరులై వుంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు.

కచ్ఛపనిధి లక్షణాలున్న వ్యక్తి తామసగుణాలను కలిగివుంటాడు. ఎవరినీ నమ్మడు. సంపద బాగానే వున్నా తానూ అనుభవించడు. ఎవరికీ దానమూ చేయడు.

ఏ రహస్య ప్రదేశంలోకో ఏకాంతంగా పోయి తన సంపదనంతటినీ భూమిలో పాతి వుంచుతాడు.

ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై వుంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగివుంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులనూ, వేశ్యాదులను పోషిస్తుంటాడు.

నందనిధీశునికి రాజస తామస గుణాలు రెండూ వుంటాయి. తన వర్ణం వారికి ఆధార భూతుడై వుంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై వుంటాడు. .మిత్రులను మార్చేస్తూ వుంటాడు.

నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర, ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద మూడు తరాల వఱకూ నిలబడుతుంది. (నందనిధీశుని సంపద ఒక తరందాకానే వుంటుంది‌‌

శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్నిభోగాలనూ అనుభవిస్తాడు. కాని ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ, భోగాలే చూసుకుంటాడు. వీని సంపద ఒక తరమే నిలబడుతుంది.

మిశ్ర (కలగాపులగపు) నిధులు వారి లక్షణాలు వైవిధ్యభరితాలు.

మునులారా! విష్ణుభగవానుడు శంకరాది దేవతలకు నిధుల, అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు..

ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment