Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం 🌹🌹🌹 – తొమ్మిదవ అధ్యాయము

సుందర కాండ వర్ణనము

హనుమంతుడును, అంగదాదులను నంపాతి మాటలు విని, సముద్రమును చూచి ”ఈ సముద్రమును దాటి ఎవరు మనల నందరిని జీవింప చేయగలరు?” అని అనుకొనిరి.

హనుమంతుడు కపులు జీవించుటకును, రామ కార్యము సిద్ధించుటకును నూరు యోజనముల విస్తారము గల సముద్రమును లంఘించెను.

పైకి (సముద్రమునుండి) లేచిన మైనాక పర్వతమును చూచి, సింహికను చంపి, లంకను చూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురమునందును, కుంభకర్ణ, విభీషణ, ఇంద్రజిత్ ల గృహము నందును, ఇతర రాక్షసుల గృహము లందును, పానభూమి మొదలగు ప్రదేశము లందును కూడ సీతనుచూడ జాలక పోయెను. అపుడు ఆ హనుమంతుడు చింతా క్రాంతుడై అశోక వనమునకు వెళ్ళి శింశుపా వృక్షమునెక్కి దాని క్రింద రాక్షస స్త్రీలచే రక్షింప బడుచున్న సీతను, ”నా భార్యవు కమ్ము” అని పలుకు చున్న రావణుని, అందులకు నిరాకరించు చున్న సీతను,”రావణునికి భార్య వగుము” అని చెప్పుచున్న రాక్షస స్త్రీలనుచూచెను.

రావణుడు వెళ్ళి పోయిన పిమ్మట హనుమంతుడిట్లు పలికెను. దశరథు డనెడు రాజు ఉండెను. అతనిశ్రేష్ఠు లైన పుత్రులు, రామ లక్ష్మణులు, అరణ్యమునకు వెళ్ళిరి. రాముని భార్య యైన సీతయగు నిన్ను రావణుడు బలాత్కారమున అపహరించెను. సుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పంపెను. అనవాలుతో కూడిన, రాముడిచ్చిన ఉంగరమును గ్రహింపుము.

సీత వృక్షము మీద ఉన్న వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొనిఉన్న అతనితో ఇట్లనెను “రాముడు జీవించి ఉన్నచో నన్నేల తీసికొని వెళ్ళుట లేదు?” ఈ విధముగ శంకించు చున్న ఆమెతో హనుమంతుడిట్లు పలికెను.

ఓ సీతా దేవీ! రామునికి నీ జాడ తెలియ లేదు. ఇపుడు తెలుసుకొని, సేనా సహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళ గలడు. ఓ దేవీ! విచారించకుము. ఆనవాలుతో కూడిన దేదైన నాకిమ్ము.” అపుడు సీత హనుమంతునకు చూడామణినిఇచ్చెను. “నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవునట్లు చేయుము” అని చెప్పెను. అతనికి కాకి కంటికథను కూడ చెప్పి, ”ఓ శోక వినాశకుడా! తిరిగి వెళ్ళుము” అని పలికెను.

హనుమంతుడు ఆ కథ విని, మణిని తీసికొని, ఇట్లు పలికెను. “ఓ శోభన స్వభావము గల దేవీ! నీ భర్త రాగలడు. లేదా, నీకు తొందర ఉన్నచో నా వీపు పైన ఎక్కుము.ఇపుడే నీకు సుగ్రీవ సహితుడైన రాముని చూపించెదను. ఆ మాటలు విని సీత హనుమంతునితో, “రాముడేనన్ను తీసికొని వెళ్ళుగాక” అని పలికెను.

అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యాన పాలకులను చంపి, ఆ ఉద్యాన వనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్ష కుమారునికూడ చంపెను. ఇంద్రజిత్తు నాగ పాశముచే అతనిని బంధించి రావణునికి చూపెను. “నీవెవ్వడవు?” అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.

“నేను రాముని దుతను. సీతను రామున కిచ్చి వేయుము. ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామ బాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.”

రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను.ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి సీతను చూచి నమస్కరించి, సముద్రముదాటి వచ్చి, ’’ సీతను చూచితిని’’ అని అంగదాదులుతో చెప్పెను. అంగదాదులతో కలిసి, దధి ముఖాదులను ఓడించి, మధు వనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి “సీతను చూచితిమి” అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.

“నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్ప మన్నది? మన్మథాగ్నిలో పడి ఉన్న నన్ను సీతాకథామృతముచే తడుపుము.”

హనుమంతుడు రామునితో ఇట్లు పలికెను. “రామా! సముద్రములంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన చూడామణిని తీసికొనుము. ఆ రావణుని సంహరించి సీతను పొందగలవు. దుఃఖింపకుము.

రాముడా చూడామణిని గ్రహించి, సీతా విరహముచే దుఃఖితుడై ఏడ్చెను. “మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సీత వద్దకు తీసికొని వెళ్ళుము. అమెను విడచి జీవింప జాలను” అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి. పిమ్మట సముద్ర తీరము చేరెను. “సీతను రామునకు ఇచ్చి వేయుము” అని విభీషణుడు రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు అతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రాముని వద్దకువెళ్ళెను.

రాముడు మిత్రుడైన విభీషణుని లంకా రాజ్యమునకు అభిషిక్తుని చేసెను, మార్గ మిమ్మని సముద్రునిప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అపుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకువచ్చి పలికెను.

“నాపై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా!” వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువుపై రాముడు వానరులతో సముద్రమును దాటి సువేల పర్వతముపై నిలచి, లంకనుచూచెను.

అగ్ని మహాపురాణములోని సుందరకాండ వర్ణనమను నవమాధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment