యుద్దకాండవర్ణనము
నారద ఉవాచ
రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. “వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు”.
యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. “దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు” అని రామునితో చెప్పెను.
ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ – పనస – వినత – రంభ – శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర – గవయ – గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.
వానర రాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నున్న సైన్యము చంపబడెను.
హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షుని పర్వతశిఖరముతో చంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చంపెను.
గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధమునుండి విముక్తులైన రామలక్ష్మణులు బాణములతో రాక్షససైన్యమును సంహరించిరి.
రణరంగమున రాముడు బాణములచే రావణుని జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.
నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.
నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కాన యుద్ధమునకు వెళ్ళి వానర సహితుడైన రాముని సంహరించెదను.
కుంభకర్ణుడీ విధముగ పలికి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని శిరస్సు నేలపై పడవేసెను.
పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష – మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.
మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.
నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్ ను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.
ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.
రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.
రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును “నీవు రాక్షససంహారివైన విష్ణువే” అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను.
ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.
సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను.
వసిష్ఠాదులకు నమస్కరించి, కౌసల్య-కైకేయి సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రాహ్మణులను పూజించెను.
పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులవలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను.
రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందనవాడెవ్వడును లేకుండెను.
అగ్ని మహాపురాణమున రామాయణమునందలి యుద్దకాండ వర్ణన అను దశమాధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹