Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ముప్పై ఎనిమిదవ అధ్యాయం

భరతవర్ష వర్ణన

శివశంకరా! జంబూ ద్వీప మధ్యభాగంలో ఇలావృత దేశముంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వ వర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్ అను దేశమూ వున్నాయి.

మేరు పర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతోంది. దానికి దక్షిణంలోనున్న ప్రాంతం భరతవర్షం లేదా భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భరతవర్షానికి తూర్పున కిరాత, పడమట యవన దేశాలున్నాయి. దక్షిణంలో ఆంధ్ర, ఉత్తరంలో తురుష్కది దేశాలున్నాయి. ఈ భరతవర్షంలోనే నాలుగు వర్ణాల ప్రజలుంటారు.

ఇక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్ష, వింధ్య, పారియాత్రములనే ఏడు కులపర్వతాలున్నాయి. ఈ భరతవర్షంలోనే వేదస్మృతి, నర్మద, వరద, సురస, శివా, తాపీ, పయోష్టి, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరధి, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపర్ణి, చంద్రభాగ, సరస్వతి, ఋషికుల్య, మత్తగంగ, పయస్విని, విదర్భ, శతద్రు మున్నగు మంగళ ప్రదములూ పాపవినాశినులూ అగు నదులు నిత్యం ప్రవహిస్తుంటాయి.

పాంచాల, కురు, మత్స్య, యౌధేయ, పటచ్చర, కుంత, శూరసేన దేశాలలో నివసించే వారిని మధ్య దేశీయులంటారు. పాద్మ, సూత, మాగధ, చేది, కాశీయ, విదేహ ప్రాంతాలు తూర్పులో ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు, వింధ్య ప్రాంతంలో నున్న ప్రదేశాలూ పూర్వ-దక్షిణాల తటవర్తి భూభాగంలో వున్నాయి.

పుళింద, అశ్మక, జీమూత, నయ రాష్ట్రాలవారూ, కర్ణాటక, కంభోజ, ఘణ దేశాలవాసులూ దాక్షిణాత్యులన బడతారు. ఇక అంబ, ద్రవిడ, లాట, కంభోజ, స్త్రీముఖ, శక, ఆనర్తవాసులు దక్షిణ పశ్చిమ దేశీయులు.

స్త్రీ రాజ్య, సైంధవ మే. నాస్తిక, యవన, మధుర, నిషధ ప్రాంత నివాసులంతా పడమటివారి క్రింద పరిగణింప బడుతున్నారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, ఖశ, మహాకేశ, మహానాస దేశాలు ఉత్తర పశ్చిమాల్లో వున్నాయి.

లంబక, స్తననాగ, మాద్ర, గాంధార బాహ్లిక, మ్లేచ్ఛ దేశాలు హిమాలయానికి ఉత్తర తటంలో వున్నాయి. త్రిగర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సటంకణ, అభీషాహ, కశ్మీరదేశాలు ఉత్తర పూర్వ దిశలలో వున్నాయి.

ఇదీ భరతవర్ష భౌగోళికత,

ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment