ప్లక్ష పుష్కరాది ద్వీపాలు, పాతాళం
ప్లక్ష ద్వీపాధీశుడైన మేధాతిథికి ఏడుగురుపుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుభోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు.
ఈ ద్వీపంలో గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజమను పేర్లు గల సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త శిఖి విపాశా, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి.
పుష్మాన్ (లేదా వపుష్మంతుడు) శాల్మక ద్వీపానికి రాజు, అతనికి ఏడుగురు కొడుకులు, శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనే వారి పేర్లతో వర్షాలు అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్ష ద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేర్లు గల ఏడు పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ణ, చంద్ర, శుక్ల, విమోచని, విధృతి నామకములైన సప్తనదులు కూడా వున్నాయి. ఇవన్నీ పాపనాశకాలే.
కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మాన్ (జ్యోతిష్మంతుడు) ఆయనకూ ఏడుగురు కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హేమశైల, ద్యుమాన్, పుష్పవాన్, కుశేశయ, హరి, మందరాచలము అను పేర్లు గల ఏడు వర్ష పర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివా, పవిత్ర, సన్మతి, విద్యుదభ్ర, మహీ, కాశాయను సప్త పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి.
మహాదేవా! క్రౌంచద్వీపానికి రాజు మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనకు కూడా ఏడుగురు కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పివరుడు, అంధకారకుడు. ముని, దుందుభి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత్, మహాశైల, దుందుభి, పుండరీకవాన్ నామక సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి పుండరీక నామములు గల నదులు ప్రవహిస్తున్నాయి.
శాకద్వీపరాజైన భవ్యునికి కూడా జలద, కుమార్, సుకుమార, అరుణీబక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన ఏడుగురు కొడుకులున్నారు. ఇక్కడ నలిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అను పేర్లుగల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి.
పుష్కర ద్వీపాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన ఇద్దరుకొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, ధాతకి. వారి పేర్లతోనే ఇక్కడ రెండు వర్షాలేర్పడ్డాయి.
ఈ రెండిటి మధ్య మానసోత్తరమను పేరు గల మహాపర్వతముంది. ఇది యాభైవేల యోజనాల ఎత్తుతో, అంతే విస్తీర్ణంలో పఱచుకొని వుంది. ఈ పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రముంది.
ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తుంటుంది. అక్కడ పదివేల యోజనాల విస్తీర్ణంలో పఱచుకొని లోకాలోకమను పేరు గల పర్వతముంది. అది ఎల్లప్పుడూ చీకటి చేత కప్పబడి ఉంటుంది. ఎంత కష్టపడి దానిని చూడడానికి ప్రయత్నించినా, సామాన్య మానవులకి అదేదో అండకటాహంచే ఆవరింపబడినట్లు అనగా నల్లటి గుడ్డు పెళ్ళ చేతనో తాబేటి చిప్పతోనో మూయబడినట్టు మాత్రమే కనిపిస్తుంది.
కపర్ద్యాది దేవతలారా! ఈ భూమి ఎత్తు డెబ్బది వేల యోజనాలు. ఇందులో పదేసి వేల యోజనాల దూరంలో పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గభస్తిమాన్, మహాతల, సుతల, పాతాళ లోకాలని వ్యవహరిస్తారు.
ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర సదృశ, శైల, స్వర్ణ వర్ణాలలో వుంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి దారుణ పుష్కర ద్వీపంలోనే నరకాలుంటాయి.
గౌరవ, సూకర్, రోధ, తాళ, విశసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ నానాభక్ష (లాలాభక్ష), దారుణ పూయవశ, పాపవహ్నిజ్వాల, అధఃశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, శ్వభోజన, అప్రతిష్ట. ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు.
ఈ లోకాలన్నిటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశ లోకాలున్నాయి. ఇంతవఱకు చెప్పబడిన దానిని బ్రహ్మాండమంటారు. దీనికి బాగాపైన దీనికి పదింతల పరిమాణంలో మరొక లోకముంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు.
ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹