నవగ్రహాల రథాలు
దేవతలారా! సూర్యదేవుని రథం వైశాల్యము తొమ్మిది వేల యోజనాలు. దాని ఈషా దండానికీ అంటే కాడికీ రథ మధ్యానికీ మధ్య వుండే దూరం రథ వైశాల్యానికి రెట్టింపు వున్నది. ఇరుసు ఒక కోటీ ఎనభై యేడు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రమొకటే. దానికి మూడు నాభులు (పూర్వ, మధ్య, అపర అర్థాలు) అయిదు అరలు (పరివత్సరాదులు) ఆరునేములు (వసంతాది ఆరు ఋతువులు)..
సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రము. ఇరుసులలో రెండవది నలభై వేల యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటీ అయిదున్నరవేల యోజనాల పొడవును కలిగియున్నవి.
గాయత్రి, బృహతి, ఉష్ణక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే ఏడు ఛందాలూ సూర్యభగవానుని సప్తాశ్వాలు.
సూర్యునికి పన్నెండు పేర్లు పన్నెండు తత్త్వాలు పన్నెండు ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో వుంటాడు.
ఆ రథం వెనుకనొక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు వుంటారు.
విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహామునులు సూర్య మండలాని కెదురుగా వుండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వులాయన యశోగానాన్ని కావిస్తుంటారు. అప్సరలు నర్తిస్తుంటారు. వాలఖిల్యులను పేరు గల మునులు, యక్షరాక్షస నాగ ప్రతినిధులూ రథమును పరివేష్టించి వుండి అవసరమైన మేరకు రక్షణ కలిపించే ఉద్దేశ్యంతో వుంటారు.
చంద్రరథానికి మూడు చక్రాలుంటాయి. గుఱ్ఱాలు కుంద పుష్పం రంగులో తెల్లగా వుంటాయి. వాటి సంఖ్య పది. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరూ, నిప్పు కలిపిన ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమరంగులో ఉండి వాయువేగంతో పోగలిగిన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి.
శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై, అనుకర్ణ (రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు, అడ్డకర్రలు) తో, ఎత్తయిన శిఖరంతో పతాకంతో, మిక్కిలి బలము, వేగము గల అశ్వాలతో శోభిస్తుంటుంది.
భూమి పుత్రుడైన మంగళుని రథం అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన బంగారం రంగులో మెరిసిపోతుంటుంది. అగ్ని సంభవాలైన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి. వాటి రంగు పద్మరాగమణుల అరుణ వర్ణం.
బృహస్పతి స్వర్ణరథంపై ఏడు పాండుర వర్ణం (తెలుపు పసుపు కలిసిన) లో ప్రకాశిస్తున్న గుఱ్ఱాలను పూన్చి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ వుంటాడు.
శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలలాగే రథంపై తిరుగుతాడు. చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును సార్థకం చేసుకుంటాడు.
రాహువు రథాశ్వాలు ఎనిమిది. ఇవి ధూసరవర్ణంలో – అంటే పాండుర వర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో వుంటాయి. అవి ఒకమారు కదిలాక ఆగవు.
కేతువు రథానికుండే ఎనిమిది గుఱ్ఱాలూ లాక్షారసం వలె అరుణకాంతులను వెదజల్లుతుంటాయి. వీటి వేగం వాయువేగాన్ని మించి వుంటుంది.
ఈ విధంగా విష్ణువు యొక్క విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన ఆదేశం మేరకు ఈ రథాలలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవుల, దేవతల జాతకాలను మారుస్తూ తిరుగుతుంటాయి.
నలబయ్యవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹