Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నలబై రెండవ అధ్యాయం

జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన

ముందుగా నక్షత్రాలకుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.

కృత్తిక – అగ్ని

రోహిణి – బ్రహ్మ

మృగశిర – చంద్రుడు

ఆర్ద్ర – రుద్రుడు

పునర్వసు – ఆదిత్య

పుష్య – తిష్యుడు

ఆశ్లేష – సర్పుడు

మాఘ – పితృ గణాలు

పూర్వాఫల్గుని – భగుడు

ఉత్తరఫల్గుని – ఆర్యముడు

హస్త – సవిత

చిత్ర – త్వష్ట

స్వాతి – వాయువు

విశాఖ – ఇంద్రాగ్నులు

అనురాధ – మిత్రుడు

జ్యేష్ఠ – ఇంద్రుడు

మూల – నిరృతి

పూర్వాషాఢ – శివుడు

ఉత్తరాషాడ – విశ్వేదేవులు

ఉత్తరాషాఢ – విశ్వేదేవులు

అభిజిత్ – బ్రహ్మ

శ్రావణ – విష్ణు

ధనిష్ట – వసువులు

శతభిష – వరుణుడు

పూర్వాభాద్ర – అజపాదుడు

ఉత్తరాభాద్ర – అహిర్బుధ్ని

రేవతి – పూష

అశ్విని – అశ్విని కుమారులు

భరణి – యమధర్మరాజు

ఇక ఏయే తిథులలో ఏయే దిశలలో ఏయే యోగినులుంటారో వినండి.

తిథులు – యోగిని పేరు – దిశ

పాడ్యమి, నవమి – బ్రహ్మణీ – తూర్పు

విదియ,దశమి – మాహేశ్వరి – ఉత్తరం

పంచమి,త్రయోదశి – వారాహి – దక్షిణం

షష్టి,చతుర్దశి – ఇంద్రాని – పశ్చిమం

సప్తమి,పూర్ణిమ – చాముండ – వాయువ్యం

అష్టమి, అమావాస్య – మహాలక్ష్మి – ఈశాన్యం

ఏకాదశి,తదియ – వైష్ణవి – ఆగ్నేయం

ద్వాదశి,చవితి – కౌమారి – నైరృత్యం

యోగిని నెదురుగా పెట్టుకొని యాత్రచేయరాదు. అనగా ఉదాహరణకి, దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్ళవచ్చును.

అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ, నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు.

హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్ఠములు.

కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వఫల్గునీ నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలనూ, సరోవరాలనూ, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులను తవ్వించుట మొదలు పెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకూ, ఖనిజాలకూ పాతిపెట్టబడిన నిధులకూ భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి.

రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్టా నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నపుడే ఏనుగు, ఒంటె, గుఱ్ఱం, ఎద్దు వంటి పశువులను వశపఱచుకొనే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి.

పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలూ చేయడం శుభకరం.

రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష (వారుణ) శ్రవణ – ఈ తొమ్మిది నక్షత్రాలనూ ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలనుచేయాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి.

చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమ తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు.

కృష్ణపాడ్యమి, బుధవారంనాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్టి, షష్టి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలసి వచ్చిన – రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే.

ద్వాదశి – ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి -మంగళవారం, నవమి -బుధవారం, అష్టమి – గురువారం, సప్తమి – శుక్రవారం, షష్టి – శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి – దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలనుమొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క వూరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు.

మేష కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్య-మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర – తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక – సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక – సింహ సంక్రాంతి దశమితో, ధను- మీన సంక్రాంతి చతుర్దశితో కలసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు.

మహాదేవాదులారా! రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్టతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర,ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలూ, శనివారంతో ఉత్తరఫల్గుని, హస్త, చిత్రలూ యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాదికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును.

ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి.

విష్కంభయోగం అయిదు గడియలూ (120 నిముషాలు) శూలయోగం ఏడు. గడియలూ, గండ, అతి గండయోగాల్లో ఆరేసి గడియలూ, వ్యాఘాత, వజ్ర యోగాల్లో తొమ్మిదేసి గడియలూ, వ్యతీపాత, వైదృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలమూ మృత్యుతుల్య ములు. మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలనూ పరిత్యజించవలసిన సమయాలివి.

ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధా నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని, యోగించినవి ఉత్తమ, శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగమూ, పాపనాశనమూ కూడా వుంటాయి. ఇవి సర్వదోషహరములు.

హే వృషభధ్వజా! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష (అంటే గురువారంతో) శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏ మాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు.

పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం.

విశాఖ ఉత్తరఫల్గునీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయముంటుంది.

నలబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment