బుద్ధ కల్కి అవతార వర్ణన
అగ్ని ఉవాచ
బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ”రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితులైన పాషండులుగా ఆయిరి.
వారునరకమును ఇచ్చు కర్మలు చేసిరి. యుగాంతమున సంకర మగుదురు. శీల రహితులైన దొంగలగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయవేదము ప్రమాణము కాగలదు.
ధర్మమను చొక్కా తొడిగి కొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మము నందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించ గలరు.)
విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞ వల్క్యుడు పురోహితుడుగా కలవాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింప జేయును.
నాలుగువర్ణము లందు తగిన కట్టుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమము లందును, సద్దర్మ మార్గము నందును నిలుప గలడు.
విష్ణువు కల్కి రూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము వలె కృతయుగమేర్పడును.
ఓ మహర్షి !వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహా విష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకములైన అవతారములెత్తుచుండును. గడచినవి, రానున్న అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించిన వాడును, వినిన వాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, స్వర్గము చేరును.విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మ వ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈవిధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళి పోయెను.
ఆగ్ని మహాపురాణమున బుద్ధ కల్కి అవతారం వర్ణన అను పదిహేనవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹