Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నలబై మూడవ అధ్యాయం

గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం

(ఈ పురాణంలో నీయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడాకనబడుటలేదు)

మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహాదశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది, బుధునిది పదిహేడు, శనిది పది, గురువుది పందొమ్మిది, రాహువుది పన్నెండు, శుక్రునిది ఇరవై ఒక్కటి.

సూర్యదశ (అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం) దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది.

చంద్రదశ ఐశ్వర్యాన్నిస్తుంది, సుఖాలను సృష్టించి ప్రసాదిస్తుంది, ఇష్టమైన, మనసుకి అనుకూలమైన అన్నాదులనిస్తుంది.

మంగళుని దశ దుఃఖాన్నే ఎక్కువగా ఇస్తుంది. రాజ్యాదులు నశిస్తాయి. బుధ మహాదశ చాలా మంచిది. ఈ దశలో దివ్యమై స్త్రీ లాభము, రాజ్యప్రాప్తి, కోశవృద్ధి వంటివి ఒనగూడుతాయి. శని మహాదశలో రాజ్యనాశం, బంధు బాంధవాదికష్టం జరుగుతాయి. (అంటే బంధువులకూ బాంధవులకూ కష్టాలొస్తాయని తాత్పర్యం) గురు మహాదశలో రాజ్యలాభం, సుఖసమృద్ధి కలుగుతాయి. ధర్మోద్ధరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో రాజ్యనాశనము, రోగములు పెరుగుట, దుఃఖాలూ సృష్టింపబడుట జరుగుతాయి. శుక్రమహాదశలో రాజ్య, గజ, అశ్వ, స్త్రీ లాభాలుంటాయి.

మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున కర్కాటకాలు క్షేత్రాలు.

ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ తులారాశులు క్షేత్రాలు. మంగళునికి, వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధను, మీనాలు శనికి మకర, కుంభాలు క్షేత్రాలు. సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్ళినపుడు విష్ణువు శయనిస్తాడు. అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట, నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలనూ, ఉంగరాలు మున్నగు వాటిని ధరిస్తే మంచిది.

యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ, పక్షి, ముంగిస కనిపిస్తే మంచిదే.

ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదమవుతుంది. బ్రాహ్మణకన్య ఎదురుగా వచ్చినా, శంఖ మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి, శ్రీమంతుడునగు వ్యక్తి కనిపించినా కూడా మంచిదే. వేణువు, మంచి స్త్రీ, నీటి కుండ ఎదురుగా రావడం శుభసూచకం.

యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కాని పత్తి, మందులు, నూనె, రగులుతున్న అగ్ని జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్న వాడు, నగ్నంగా నున్న పెద్దవారు కనిపించడం అశుభసూచకం; మంచిది కాదు.

తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి వుంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది.

ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక, సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరృత్యం ఆగ్నేయం వలెనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం; మరణసమానమైన కష్టాలు కలుగుతాయి.

సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో వున్నాడో చూసుకొని దాని నుండి మూడు తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు వున్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటిని ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే అయిదు నక్షత్రాలనూ ప్రతిమ హృదయంపై లిఖించి, తరువాతి దానిని నాభి మండలం లోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్యా లిఖించాలి. తరువాత రెండు తారలను మోకాళ్ళపైనా, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైననూ లిఖించాలి.

ఇక సూర్య చక్రం వివరాలను వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడౌతాడు. మోకాళ్ళపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానం పై పడితే స్త్రీలతో నెక్కువగా సుఖించే వాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు.

జన్మనక్షత్రం సూర్యదేవుని హృదయ స్థానంపై పడ్డవాడు. మహేశ్వరుని యంతవాడు కాగలడు. చేతులలోపడితే దొంగవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడూ, కంధాలపైనైతే (కుబేరునంత) ధనికుడూ, ముఖంపైనేతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడూ. కాగలరు.

మహేశా! ఏ మనిషి జన్మనక్షత్రమైతే సూర్యుని మస్తకంపై నున్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు.

నలబై మూడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment