సృష్టివర్ణనం
ఇపుడు విష్ణువుయొక్క జగత్ సృష్టిలో మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆదియైనవాడు ఆతడు, గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.
ప్రారంభమున సద్రూపమైన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బాహ్య ) ప్రకృతి, పురుషు డైన విష్ణువున ప్రవేశించి క్షోభింపచేసెను.
సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహతత్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణమైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.
ఆహంకారము నుండి శబ్దతన్మాత్రరూపమైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్టెను కదా . పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణుడని చెప్పబడెను.
ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభువైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.
భగవంతుడైన హిరణ్యగర్భుడు ఆ అండమునందు పరివత్సరము కాలముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను ఆ రెండు వ్రక్కల మధ్మయందు ఆకాశమును సృజించెను. ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టినిపైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.
మెఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.
ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధములగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.
తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుషుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.
అగ్ని మహాపురాణమునందు జగత్ సృష్టి వర్ణన అను పదహారవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹