Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం🌹🌹🌹 – పదిహేడవ అధ్యాయం

స్వాయంభువ వంశ వర్ణనము

స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలినియగు శతరూపయను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను.

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తముడను పుత్రుడును, సునీతయందు ధ్రువుడను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను.

ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ”ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని ఉన్నారు కదా!

ధ్రువునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి.

ఊరునివలన ఆగ్నేయ అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను.

అంగునకు సునీథుని కుమార్తెయందు వేనుడను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను.

మును లందరును ఆతనిని చూచి ”మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు” అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వేనుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు ధనస్సును, కవచమును ధరించి ప్రజలందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమునకుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని పిదికెను.

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆయా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత్తలైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రియగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను.

యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ”ప్రాచీన బర్హిస్సు” అను పేరు వచ్చెను.

సముద్రుని కుమార్తెయైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతనులనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పదివేలసంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.

వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములైయుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి– ”కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలియగు కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదను . ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్యయగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది ఏడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి.

యమధర్మరాజునకు తన పదిమంది భార్యలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను. విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకి ఇద్దరు మరుత్వంవతులు, వసువునకు వసువులు భానువుకు బానువలు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివీ సంబద్దమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఎనమండుగురు వసువులను జనించిరి.

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయందు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తికేయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశఃశాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.

అగ్ని మహాపురాణములో స్వాయంభువ మనువంశవర్ణనమను పదిహేడవ అధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment