Skip to content Skip to footer

🌹🌹 శ్రీ అగ్ని మహాపురాణం 🌹🌹 – పద్దెనిమిదవ అధ్యాయం

కశ్యప వంశ వర్ణనము

ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదులయందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరమునందు తుషితదేవతలుగా ఉన్నవారే మరల వైవస్వతమన్వంతరమునందు – విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.

విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్తమానముల వలె, వీరి ఉదయాస్తమానములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.

దితికి కశ్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సింహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.

హిరణ్యకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్రులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, శిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.

స్వర్భానువునకు సుప్రభ అను కన్యయు, పులోమునకు శచియు జనించిరి. ఉపదనువు కుమార్తె హయశిరస్సు- వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, పులోమ కాలక అను ఇరువురును వైశ్వానరుని కుమార్తెలు. వారిద్దరును కశ్యపుని భార్యలు వారికి కోట్లకొలది పుత్రులు జనించిరి.

ప్రహ్రాదుని కులమునందు నాలుగు కోట్ల నివాతకవచులు పుట్టిరి. కశ్యపుని భార్యయైన తామ్రకు ఆరుగురు కుమారులును కాకి, శ్యేని, బాసి, గృధ్రిక, శుచిగ్రీవ అను భార్యలకు కాకులు మొదలగునవి జనించినవి. తామ్రవలననే అశ్వములను. ఒంటెలను జనించినవి. వినతవలన అరుణుడును, గరుడుడును పుట్టిరి. సురసనుండి వేయిసర్పములు పుట్టినవి. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన వేయిమంది కద్రువకు పుత్రులు. వీరందరును కోరలుకలిగినవారు. చాల కోపము కలవారు. భూమిపై నివసించువారు. జలములో వీరు రెక్కలు కలిగియుందరు. సురభి (కామధేనువునందు) గోవులు, మహిష్యాదులును పుట్టెను. ఇరనుండి తృణాదులు పుట్టెను. ఆ కశ్యపమునివలననే ఖసయను అప్సరస యందు యక్షులు, రాక్షసులను, అరిష్టయందు గంధర్వులును జనించిరి. ఈ విధముగ కశ్యపుని నుండి చరాచర జగత్తు జనించినది. వీరి పుత్రాదులు అసంఖ్యాకులు ఒకప్పుడు దేవతలు దానవులను జయించిరి.

ఈ విధముగా పుత్రులు నశించగా దితి ఇంద్రుని సంహరింపగల కుమారుడు కావలెనని కోరుచు కశ్యపుని అనుగ్రహింపచేసికొని అట్టి వానిని పొందెను.

ఆమె పాదప్రక్షాళనము చేసికొనకుండగనే నిద్రించెను. ఇంద్రుడు ఆ అవకాశమును చూచుకొని ఆమె గర్భమును ఛేదించెను. వారు (గర్భఖండములు) గొప్ప తేజస్సు గలవారును, ఇంద్రునికి సహాయము చేయువారును అగు నలుబది తొమ్మండుగురు మరుత్తులను దేవతలుగా అయిరి (నవి)

హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీనినంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగా ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.

బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు, జలములకు కరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు, ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు, గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి, వనస్పతులకు ప్లక్షము, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవము ప్రభువలు తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము ) చెప్పబడినది

అగ్ని మహాపురాణమున ప్రతి సర్గవర్ణనమను పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment