స్త్రీల శుభాశుభ లక్షణాలు
మెడ మీద రేఖ ఉండి, కనుకొలుకులలో ఎరుపు జీర గల స్త్రీ ఏ యింటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే వుంటుంది.
లలాటంపై త్రిశూలరేఖ ఉన్న లలన వేలాదిమంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనై సమముగానున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు.
హంస వలె మృదువచనము, తేనె వలె శరీర వర్ణము గల తెఱవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ ఎనిమిదిమంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందరనాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలననుభవిస్తుంది.
మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన, కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుస గల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలనూ ప్రాప్తించుకోగలుగుతుంది.
విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గానీ, చెవి, గుండె, చేతులపైగానీ ఉలిపిరి కాయైనా, అంతే పరిమాణం గల పుట్టుమచ్చయినా గానీ కల మహిళ తొలికాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీల మండలతో, సుందరములై కలిసియుండే వేళ్ళతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతు రాలై అన్ని సుఖభోగాలకూ అర్హురాలవుతుంది.
పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగా నున్న చేతులు గల చేడియ దాసీదౌతుంది. పెద్ద పాదములు, వికృత వదనము, పైపెదవిపై రోమాలు వుండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు.
ఉంగరాలు తిరిగే తలవెండ్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభి గల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధి పఱస్తుంది. బంగారుమేని వర్ణము, ఎఱ్ఱ కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్టురాలు, పతివ్రత అవుతుంది. వంకరులు పోవు కేశాలూ కోల కన్నులూ గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది.
పూర్ణచంద్రుని వంటి మొగమూ, బాల సూర్య సమానమైన అరుణకాంతులు గల మేనూ, విశాలనేత్రాలూ, బింబా ఫలము వంటి క్రింది పెదవీ గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలూ అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ. తక్కువ రేఖలుంటే ధనహీనతా, దుఃఖాలూ వుంటాయి.
అలాగే రక్తవర్ణంలోవుండే రేఖలు సుఖజీవనాన్నీ నల్లగీతలు దాస్యవృత్తినీ, దూతిక బ్రతుకునీ సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్నీ, సత్పుత్ర జనయిత్రీ అవుతుంది. అలాగే ప్రాకార, తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టినా రాజపత్ని అవుతుంది.
బొడ్డు కాస్త పైకి వంగి వుండి, మండలాకారంలో కపిల వర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టినా దాసిగానే బ్రతుకీడుస్తుంది. నడిచేటపుడు రెండు కాళ్ళ అనామికలూ, చిటికెన వ్రేళ్ళూ నేలకి తగలకుండా వుండే తరుణి భర్తృవినాశినీ స్వేచ్ఛావిహారిణీ కాగలదు.
సుందర, మనోహర నయనాలున్న నారి సౌభాగ్యశాలినీ, ఉజ్జ్వలంగా మెరిసే పలువరుస గల పడతి దంత సిరి గలదీ (రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది). కోమల, స్నిగ్ధచర కోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానురాలూ అవుతారు.
మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగా నున్న ఎరుపు రంగు గోళ్ళు వుండి, మీన, అంకుశ, పద్మ, హల చిహ్నాలతో, స్వేదరహితంగా వుండే అరికాళ్ళతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు.
రోమరహిత, సుందరజంఘలూ, ఏనుగు తొండాల్లా వుండే ఊరువులూ, దక్షిణావర్త మైన గంభీరనాభి, రోమరహిత త్రివళులూ, రోమరహిత స్తన ప్రదేశం ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు.
నలబై ఏడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹