సామాన్య దేవపూజా నిరూపణము
విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను. సకల పరివార సమేతుడైన అచ్యుతునికి నమస్కరించి పూజించ వలెను.
విష్ణు పూజాంగముగా ద్వార దక్షిణ భాగమున ధాతను, విధాతను, వామ భాగమును గంగను, యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తు పురుషుని, శక్తిని, కుర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, అధర్మాదులను, పద్మభావన చేసి దాని కందమును, నాళమును, పద్మ కేసరములను పద్మ వర్ణిక (మధ్య భాగము)ను, ఋగ్వేదాదులను, కృత యుగాదులను, సత్త్వాదిగుణములను, సూర్యాది మండలమును, పూజించ వలెను విమల, ఉత్కర్షిణీ, జ్ఞానా, క్రియా, యోగాది శక్తులను పూజించ వలెను. ప్రహ్వి, సత్య, ఈశ, అనుగ్రహి, అమల మూర్తి యగు దుర్గ, గీర్దేవి, గణము, గణాధిపతి క్షేత్రము, క్షేత్రపాలుడు వాసుదేవాదులు వీరిని కూడ పూజింప వలెను. హృదయమును, శిరస్సును, కేశ శిఖను, కవచమును, అస్త్రమును, శంఖమును, చక్రమును గదను, పద్మమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వనమాలను, లక్ష్మిని, పుష్టిని, గరుత్మంతుని, గురువును, ఇంద్రుని, అగ్నిని యముని, రాక్షసుని, జలమును, వాయువును, కుబేరుని, ఈశ్వరుని, బ్రహ్మను, అస్త్రమును, వహనమును, కుముదాదులను విష్వక్సేనుని పూజింప వలెను.ఈ విధముగా పూజ మండలాదులలో చేసినచో సిద్ది లభించును.
ఇపుడు సామాన్య శివపూజ చెప్ప బడుచున్నది. ప్రారంభమున నందిని పూజించ వలెను. మహాకాలుని, గంగను, యమునను, గణాదులను, గీర్దేవిని, లక్ష్మిని, గురువును, వాస్తు పురుషుని, ఆధార శక్త్యాదులను, ధర్మాదులను పూజించవలెను.
వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాలి, కలవికరిణి, బల వికరిణి, బలప్రమథని, సర్వ భూతదమని, మనోన్మని, శివ అను తొమ్మండుగురు శక్తులను పూజింపవలెను.
“హాం. హూం. హాం శివ మూర్తయే నమః” అను మంత్రముతో ఆయా అవయవములను, ముఖములను పూజించుచు శివుని పూజించ వలెను. “హౌం శివాయ హౌం” అని శివుని, ‘‘హాం’’ అను బీజాక్షరముతో ఈశాన ముఖమును పూజింపవలెను. “హ్రీం” అను బీజాక్షరముతో గౌరిని “గం” అను బీజాక్షరముతోగణమును (గణాధిపతిని) పూజింప వలెను. ఇంద్రుడు మొదలగు వారిని చండుని, హృదయము మొదలగు వాటిని క్రమముగ పూజించ వలెను.ఇపుడు సూర్యార్చన మంత్రములు చెప్ప బడుచున్నవి. ముందుగా దండిని పిదప పింగళుని పూజించవలెను.
ఉచ్చైఃశ్రవస్సును, అరుణుని పూజించి ప్రభూతుని, విమలుని, సోముని, సంధ్యలను, పరసుఖుని, స్కందాదులను మధ్య యందు పూజింప వలెను.
దీప్తా, సూక్ష్మా, జయా, భద్రా, విభూతి, విమలా, అమోఘా, విద్యుతా, సర్వతోముఖీ అను నవ శక్తులను పూజింప వలెను.
“హం” “ఖం” “ఖం” అను బీజాక్షరములచే అర్కాసనమును “సోత్కాయనమః అని మూర్తిని “హాం హ్రీం సః సూర్యాయ నమః” అని సూర్యుని, “ఆం నమో హృదయాయ” అని హృదయమును పూజింప వలెను.
“ఓం అర్కాయ నమః అని శిరస్సున పూజించ వలెనుఅట్లే అగ్ని, ఈశ, అసుర, వాయువులను అధిష్ఠించి యున్న సూర్యుని పూజింప వలెను. “భూః” భువః స్వః జ్వాలిన్యై శిఖాయై నమః అనిశిఖయు. “హుం” అని కవచమును “భాం” అని నేత్రములను, హ్రః, అని అర్కాస్రమును పూజించ వలెను. రాజ్ఞి యను సూర్య శక్తిని, దాని నుండి ప్రకటితయగు ఛాయాదేవిని పూజించ వలెను. పిమ్మట సోమ,అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులను, తేజశ్చండుని పూజించవలెను పిమ్మట సంక్షేపముగ పూజ చెప్ప బడుచున్నది.ఆసనము, మూర్తులు, మూలము, హృదయాదులు పరిచారకులు వీరి పూజ చేయవలెను విష్ణ్వాసనమును పూజించ వలెను. విష్ణువు యొక్క మూర్తిని పూజింప వలెను. “రాం శ్రీం శ్రీం శ్రీధరాయ హరయే నమః” అని మంత్రము. “హ్రీం” అనునది సర్వమూర్తులకును సంబంధించిన త్రైలోక్య మోహన మంత్రము. “క్లీం” హృషీకేశాయనమః” “హూం విష్ణవే నమః” అను మంత్రము లుచ్చరించ వలెను. అన్ని ధీర్ఘ స్వరములచే హృదయాదికమును పూజించ వలెను. ఈ పంచమ పూజ యుద్ధాదులలో జయము నిచ్చును.
చక్ర, గదా,శంఖ, ముసల, ఖడ్గ, శార్ఙ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, వనమాలలను పూజించ వలెను. “శ్రీం” అను బీజాక్షరమతో శ్రీదేవిని, మహాలక్ష్మిని, తార్క్ష్యుని, గురువును, ఇంద్రాదులను పూజించ వలెను.
సరస్వతీపూజ యందు ఆసనమును, మూర్తిని పూజించ వలెను. “రౌం హ్రీం దేవ్యై సరస్వత్యై నమః” అని మంత్రము, హృదయాదులను పూజించ వలెను. లక్ష్మి, మేధ, కల, తుష్టి, ప్రష్టి, గౌరి, ప్రభావతి దుర్గ, గణము, గురువుక్షేత్ర పాలుడు, వీరి నందరిని పూజించ వలెను.
“గం గణపతయే నమః” “హ్రీం గౌర్యై నమః”, ” శ్రీం శ్రియై నమః”, “హ్రీంత్వరితాయై నమః”, “ఏం క్లీం సౌం త్రిపురాయై నమః” అని మంత్రములు. వీటికి ప్రారంభమున ప్రణవమునుచేర్చి పేరాలోని మొదటి అక్షరమునకు బిందువు చేర్చ వలెను. లేదా పూజా జపము లందు అన్నిమంత్రములను “ఓం” కారముతో ప్రారంభింపవలెను.
ఈ మంత్రములతో నువ్వులు, నెయ్యి, మొదలైనవి హోమము చేసినచో ధర్మార్థ కామ మోక్షములు లభించును. పూజా మంత్రములను పఠించువాడు భోగములనన్నియు అనుభవించి స్వర్గమునకు వెళ్ళును.
అగ్ని మహాపురాణములో విష్ణ్వాది దేవతా సామాన్య పూజానిరూపణము అను ఇరువయ్యవ అధ్యాయము సమాప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹