స్నానవిధి కథనము
నారద ఉవాచ
యాగ వూజాదిక్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహ మంత్రమును ఉచ్చరించుచు మృత్తికను గ్రహించి, దానినిరెండు భాగములు చేసి ఒక దానిచే మల స్నానము చేయ వలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహ మంత్రముచే న్యాసము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామ పూర్వకముగా విధి స్నానము చేయవలెను.
అష్టాక్షర మంత్రమును జపించుచు, శ్రీమహా విష్ణువును హృదయములో ధ్యానించుచు అరచేతిలో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరవాత నృసింహ మంత్రము జంపిచుచు దిగ్బంధము చేయ వలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థమును స్పృశించ వలెను. వేదాది మంత్రములచే గాత్రమును తుడిచికొని మూర్తిలో ఉన్న దేవుని ఆరాధించి, స్మరించుచు, వస్త్రము ధరించి అఘమర్షణము చేయవలెను (అఘమర్షణ మంత్రములను పఠించ వలెను). మంత్రములచే విన్యాసము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్జనముచేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయామము చేసి, జలమును వాసన చూచి విడిచి పెట్టవలెను. హరిని ధ్యానించుచు అర్ఘ్యము నిచ్చి, ద్వాదశాక్షరిని జపించి, యోగ పీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడా తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, ఋషులకును. పితృగణములకును, మనుష్యులకును స్థావరాంతములగు సమస్త భూతములకును తర్పణము చేసి, పిమ్మట ఉపవిష్టుడై అంగన్యాసము చేసి, మంత్రోపసంహారము చేసి, యాగ గృహమును ప్రవేశించవలెను, ఇతర పూజలలో ఇట్లే మూల మంత్రాదులచే స్నానముచేయ వలెను.
అగ్ని మహాపురాణములో స్నానవిధి నిరూపించు ఇరువది ఒకటవ అధ్యాయము సమప్తము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹